వూరేగింపు దేవతలు

పొద్దున్నే చింత చెట్టు కింద మంచం మీద ముసుగుతన్ని పడుకున్న  భూషయ్య మీద ఎండ తన్నుకొస్తుంది. వాడి గురక అవతలదూరంగా ఉన్న పూరి ఇంట్లోని కాశవ్వకి వినిపిస్తోంది.  ‘యీడి జిమ్మడ ఇంత బద్దకస్తుడ్ని ఈ భూ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’అనుకుంటూ  కసువూడ్చి అవతల గుంజకు కట్టేసిన ఆవు పేడతెచ్చి కళ్ళాపి చల్లి కుడితి కలిపి ఆవుముందు పెట్టి దాని తలని గంగడోలుని ప్రేమగా నిమిరింది.  బక్క చిక్కిన ఆవు. కరుణతో చూసే పశువు.

కాశవ్వను ఎన్నో సార్లు కౌగలించుకుందామనుకున్న ఆవు. కాశవ్వ కన్నీళ్ళకు మూగ సాక్షిగా నిలిచే ఆవు. కళ్ళు అరమోడ్పు చేసి కాశవ్వదగ్గరకు జరిగి నుంచుంది.

కాశవ్వ గబాల్న స్నానం చేసి దేముడి పటాల దగ్గర దీపంపెట్టి రెండు చేతులెత్తి మొక్కబోయింది. కుడి రెక్క పైకి లేవలేదు. రాత్రి భూషయ్య కర్రతో కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది. సన్నాయి మీద కొత్తగా పాట పాడలేదని ఎగతాళి చేసినందుకు ఉక్రోషంతో కొట్టిన దెబ్బ. దేముడిపటాల సాక్షిగా లెక్కలేనన్నో సారి తగిలిన దెబ్బ. కుడి భుజాన్నుంచీ వీపు మీదకి అడ్డంగా. పరిగెత్తిపోయింది కానీ లేకుంటే తల పగిలుండేది. ఆవును కూడా కొట్టిన సంగతి గుర్తొచ్చింది. పరిగెత్తి పోయి ఆవును చూసింది. వీపు చీరుకుని రక్తపు చారిక కట్టిన పెద్దదెబ్బ. దాని పక్కనుంచీ వేలాడే ఐదో కాలి మీదుగా రక్తం చారిక కట్టింది. దీని ఐదో కాలు చూపించే కదా డబ్బులడుక్కునేది. కటికోడు. మూర్ఖుడు. రోడ్డుపాలు చేయలేదనే కానీ రోజూ మరణయాతనే.

భూషయ్య మంచం దగ్గరకెళ్ళి ‘ఓ భూషయ్య దొరసామీ. లెగు. పొద్దు ముంచుకొస్తోంది. వూరేగింపు టయం.’ అంటూ పొడవాటి కర్ర తీసుకుమెల్లగా కొట్టి అదిలించింది. ‘ఎకిలి మొకమా నిద్ర కూడా పోనీవు.’ అని విసుక్కుంటూ లేచి ముఖం కడిగి తయారయాడు. పాతకోటు వేసితలపాగా పెట్టి అద్దం ముందు నిలిచి మీసం దువ్వి సన్నాయి బూరదీశాడు. కాశవ్వ ఆవును ముస్తాబు చేసింది. దెబ్బలు సలుపుతున్నాభూషయ్య వెనకే కాశవ్వ,  ఆమె వెనకే ఐదో కాలు వేలాడుతున్న ఆవు.

బక్కచిక్కి కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్న ఐదు కాళ్ళ ఆవును ప్రతి ఇంటి ముందూ నిలిపి ‘అమ్మా ఆవు మా లచ్చి. దానం చెయ్యండి. దర్మ ప్రబువులు. మా ఇంటి మాలచ్చికి ఓ కోక.  మా కొక దోతి తలపాగా’ అంటున్న భూషయ్యని చూసి ‘ ఇత్తారిత్తారు దొరగారొచ్చారని’ అంటూ గొణుగుతున్న కాశవ్వను వురిమి చూసి సన్నాయి మీద ‘ఏరువాకా సాగారో’ అందుకున్నాడు. ఇచ్చిన వారిని పొగిడి ఇవ్వని వారిని లోపలే తిట్టుకుని కదులుతున్నాడు. వూరి చివరికొచ్చాక ‘ ముప్పై రూపాయలన్నా వచ్చాయా?’ అడిగింది. ‘ఆ వచ్చింది మారాణి లెక్కలు కట్టేందుకు’ అంటూ బ్రిడ్జి పక్కన దుకాణం లోకి దూరాడు. బయటకు రాగానే  ‘తిరిగి తిరిగి పోగేసిందంతా దీనికే సరి రేపటికి గంజి నీళ్ళకి నూకలు లేవు ఆవు మాలచ్చికి గడ్డీ లేదు.’ అంటుండగానే ఎగిరి ఓ తన్ను తన్నాడు. కిందపడ్డ కాశవ్వను చూసి అరిచిన ఆవును వీపు మీద చరిచాడు. ఎర్రటి కళ్ళతో అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. కిందపడిన కాశవ్వను చూసి కన్నీరు పెడుతున్న ఆవును చూసి ‘నీకు మాట్లాడాలనిపించినా చేతకాదు. విని మాట్లాడగలిగినా వాడు చేయడు. ఎదిరించి పోవాలనున్నా నాకు రాదు. మనమింతే. మళ్ళీ పొద్దున వూరేగింపుకు బయలెల్లినప్పుడే నువు గోవు మా లచ్చి. నేను ఇంటి మాలచ్చి’ అంటూ నడిపించింది కాశవ్వ.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.