సమాధులు చెప్పే చరిత్ర!

ఆ రోజు మేము తొందరగానే నిద్ర లేచాము, అన్నీ కానిచ్చి రెడీ గా వున్నా ట్యాక్సీ పట్టుకునే సరికి పది గంటలయింది, మా గైడు ముందుగా మమ్మల్ని ‘శ్మశానానికి’ తీసుకు పోతానని చెప్పింది. దాంతో మేము కొద్దిగా కంగారు పడ్డాము. ఆమె నవ్వుతూ భయపడకండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే అక్కడినుండి బయటికి రావ్దానికి ఇష్టపడరు అంటూ బయల్దేరదీసింది.

దారిలో మళ్ళీ ఆమె తన రష్యన్ భాష క్లాసు మొదలెట్టింది, ఇంతకు ముందు చెప్పిన పదాలను మాతో వల్లే వేయిస్తూ ఉండగానే ఒక చోటికి వచ్చాం. అక్కడ ట్యాక్సీ ఆపించి మమ్మల్ని దిగి కాసేపు నడవమన్నది. అలా ఒక అర కిలోమీటర్ దూరం ఆ విశాలమైన ఆ రోడ్డు వెంట నడిచాం, వాతావరణం వేడిగా వుంది, మానవ సంచారం అంతగా లేదు. నెమ్మదిగా ఆ స్మశానం దగ్గరకు వెళ్ళాం. ఎంట్రెన్స్ ఎదో ఒక కోట ముఖద్వారం లాగా వుంది. వెళ్లి టిక్కెట్లు తీసుకున్నాం, తలకు మూడు వందల రూబుల్స్ తీసుకున్నారు. లోపలకు వెళ్ళగానే ఒక మ్యూజియం లోకి వచ్చినంత ఆనందం కలిగింది.

గొగోల్‍ సమాధి వద్ద…

లోపలికి వెళ్లేముందే ఆ సిమెట్రీ మ్యాప్ కావాలా అని అడిగారు. మాకు తెలియక వద్దన్నాం. లోపలికి వెళ్ళింతర్వాత తెలిసింది అది 11 డివిజన్లుగా ఉంది. అనేక మంది ప్రఖ్యాత వ్యక్తుల సమాధులను అక్కడ ఎంతో కళాత్మకం గా నిర్మించారు. 1898 లో నిర్మించిన ఈ స్మశానం లో అనేక రష్యన్ ప్రముఖుల సమాధులు ఉన్నాయి.

ప్రముఖులైన లెనిన్, స్టాలిన్, యురీ గగారిన్, వంటి వారివే కాక ‘ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిరోజులు ‘ పుస్తక రచయిత, అమెరికన్ జర్నలిస్ట్ జాన్ రీడ్ సమాధి కూడా క్రెమ్లిన్ లో ఉంది. ఇక్కడ మాత్రం కృశ్చెవ్, బోరిస్ ఎల్త్సిన్ వంటి రష్యా అధ్యక్షులవే కాక అనేక మంది ప్రముఖ కవులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, నటులు, యోధుల సమాధులు చూడొచ్చు.

ప్రశాంత వాతావరణంలో కళాత్మకం గా నిర్మించిన ఆ సమాధులను చూస్తుంటే చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నట్టే ఉంది. దాదాపు 27000 మందికి పైగా ప్రముఖుల పార్థివ దేహాలను అక్కడ పూడ్చి వాటిపై అద్భుత నైపుణ్యం తో వారి శిల్పాలను, వారి ప్రాముఖ్యతను తెలియజేసే విధం గా సమాధులు  నిర్మించారు.

అసాధారణ రచయిత ఆంద్రీ బెలి, ( పీటర్స్బర్గ్ నవలా రచయిత ), సోవియట్ ప్రధానిగా, రక్షణ మంత్రిగా, రెడ్ ఆర్మీ చీఫ్ గా పని చేసిన బుల్గానిన్, మాస్టర్ అండ్ మార్గరీటా నవలా రచయిత బుల్గాకోవ్ వంటి వారి సమాధులతో పాటు ప్రసిద్ద సోవియట్ రచయిత అంటన్ చెహోవ్, నికోలోయ్ గోగోల్, ప్రసిద్దకవి మయకోవ్స్కీ సమాధులను చూశాము.

ఒకప్పుడు కృశ్చెవ్ తీవ్రంగా నిరసించిన ప్రసిద్ద యువ ఆర్కిటెక్ట్   నైజ్ వేస్త్నీ అతని సమాధిని చక్కగా నిర్మించాడు. స్టాలిన్ బ్రతికిన రోజుల్లో ఆయనకు అత్యంత విధేయుడుగా ఉండి ఆయన చని పోగానే డీ స్టాలినైజేషన్ పేరుతో రకరకాలు గా నాటక మాడి, సోవియట్ పతనానికి నాంది పలికిన కృశ్చెవ్ సమాధి చూడ బుద్ది  కాలేదు.

మయకోవ్‍ స్కీ సమాది వ‍ద్ద…

ముందుకు నడిచిన మాకు జోయా విగ్రహం కనబడింది. ఆమె సమాధి చూడగానే ఒక రకమైన గగుర్పాటు లాటిది కలిగింది, ఆనాటి యువత చేసిన త్యాగాలను తలుచుకుంటే ఒక ఉత్తేజం కలుగుతుంది. కాలేజీలో చదువుతున్న పద్దెనిమిదేళ్ళ  ‘జోయా కోస్మో దేమ్యాన్స్కాయా’ రెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ లు మాస్కో ను చుట్టుముట్టినప్పుడు యువ గెరిల్లాగా యుద్ధం లోకి అడుగు పెట్టింది. ఒక గ్రామం లో నాజీసైన్యం విడిది చేసి ఉండడాన్ని గమనించిన జోయా సహచరులతో కలిసి మెరుపు దాడి చేసింది. చాలా మందిని మట్టుబెట్టింది. ఏమరుపాటులో నాజీ దుర్మార్గులకు దొరికి పోయింది. ఆ యువతిని చిత్రహింసలు పెట్టిన నాజీ లు ఆమెను గ్రామస్తులను ఎదురుగా నిలబెట్టి ఆమెను 21 నవంబర్ 1941 న బహిరంగంగా ఉరితీశారు. “మీరు నన్నిప్పుడు ఉరి తీస్తారు కానీ నేను ఒంటరిగా లేను. ఇరవై లక్షలమంది నాతో ఉన్నారు, అంతమందిని మీరు ఉరి తీయలేరు, ఇంతకింత పగ తీర్చుకుంటారు, సమయం మించి పోలేదు లొంగి పొండి,  విజయం మాదే” ఇవి ఆ యువతి ఉరి కొయ్య ముందు పలికిన చివరి పలుకులు. ఆమె సమాధిని  అలా చూస్తూ భారంగా ముందుకు కదిలాం. కొంచెం ముందుకు వెళ్ళిన మాకు అలెక్జాండ్రా కొల్లన్తాయ్ సమాధి కనబడింది, సోవియట్ కమ్యునిస్ట్ పార్టీలో ప్రముఖం గా పనిచేసిన కొల్లన్తాయ్ స్త్రీ స్వేచ్చ గురించి అనేక రచనలు చేసింది, మార్క్సిస్ట్ ఫెమినిజాన్ని తన రాతల ద్వారా లోకానికి తెలియ చెప్పింది. ఆమె రాసిన ‘రెడ్ లవ్’, కమ్యునిజం అండ్ ఫ్యామిలీ, సెక్సువల్ రిలేషన్స్ అండ్ క్లాస్ స్ట్రగుల్ వంటివి ప్రఖ్యాతి పొందిన రచనలు, ఆమె సమాధిని చూసి , అలా తిరుగుతున్న మాకు రష్యాకు ఒక రకం గా చరమ గీతం లాంటిది పాడిన అధ్యక్షుడు ‘బోరిస్ ఎల్త్సిన్’ సమాధి కనిపించింది. అది చాలా సింబాలిక్ గా ఆయన ఆలోచనలకు అనుగుణం గానే అవకతవకగా ఉంది.

అక్కడి నుండి ఇక బయటికి కదిలాం. అక్కడి నుండి మాస్కో యూనివర్సిటీని చూద్దామని బయల్దేరాం. దారిలో గగారిన్ స్క్వేర్ లో నిలబడి ఉన్న యూరి గగారిన్ విగ్రహం ఆకాశం లోకి దూసుకు పోతున్నట్టు కనబడింది, దాదాపు నలభై మూడు మీటర్ల ఎత్తు తో పోత ఇనుముతో నిర్మించిన ఆ విగ్రహ నిర్మాణాన్ని 1980 ఒలింపిక్స్ అప్పుడు నిర్మించారట.  భూగోళం పై నిల్చుని ఆకాశం లోకి దూసుకొని పోతున్నట్టు నిర్మించిన ఆ కట్టడం భూమి పై నుండి అంతరిక్షం లోకి దూసుకు వెళ్ళిన మొదటి మానవుని చిహ్నం. ముందుకు వెళ్ళిన మాకు మాస్కో యూనివర్సిటీ ముందు పెద్ద సంఖ్యలో యువత మోటార్ సైకిల్ రేసిన్గులతో, ప్రదర్శనలతో కోలా హలంగా ఉంది. దాంతో మాకు యూనివర్సిటీ చూడటం వీలు కాలేదు కానీ మాస్కో యువత ఎలా ఉందొ చూడటానికి కుదిరింది., రకరకాల మోటార్ సైకిళ్ళపై కేరింతలు కొడుతూ విన్యాసాలు చేస్తూ వారి లోకంలో వారున్నారు. కొద్ది సేపు అక్కడ ఉండి మేము క్రెమ్లిన్ వైపు వచ్చాము. అక్కడ లోపల ఉన్న వజ్రాల మ్యుజియం చూసేందుకు అవకాశం ఇచ్చారు. అది అంత ఉత్సాహకరం గా లేక పోయినా ఒక పెద్ద వజ్రం విశేషంగా ఆకట్టుకుంది. కారణమేమంటే అది గుంటూరు జిల్లా పల్నాడులో దొరికిన వజ్రమట. అక్కడి నుండి కొద్ది సేపు షాపింగ్ చేసి మా బసకు వచ్చాము.      

(వ్యాసంలో మొదటి ఫోటో:  నాజీలు వురితీసిన విప్లవకారిణి జోయా సమాధి).

వేణుగోపాల రెడ్డి

వేణు గోపాల రెడ్డి: కర్నూల్ జిల్లా వడ్ల రామాపురంలో జన్మించారు. వృత్తి రిత్యా హై కోర్ట్ లో న్యాయవాది. ప్రవృత్తి వామపక్ష సాహిత్య అధ్యయనం, ప్రచారం. రెండు దశాబ్దాల కింద కర్నూల్ కేంద్రంగా పని చేసిన LEAP (లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిడ్ పర్ పూర్) వ్యవస్థాపకుడు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మొదట కర్నూల్ లో ఇప్పుడు హైదరాబాద్ లో అనేక సాహిత్య సాంస్కృతిక వ్యాపకాలలో ఉన్నారు. ‘ప్రజ్వలిత’అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వామపక్ష సైద్దాంతిక అంశాల మీద పలు జాతీయ దిన పత్రికలలో వ్యాసాలూ సమీక్షలూ రాశారు.  ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి​,​ వ్యాఖ్యానించడానికీ, మార్చడానికీ వామపక్ష రాజకీయాలు మినహా మరేదీ లేదనే అచంచల విశ్వాసం.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.