అమృతం చిలికిన అనిసెట్టి కల‍ం

‘వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తి పోతుంది మనసు’అన్నాడు శ్రీశ్రీ.

ఒకప్పటి తెలుగు సినిమాలో వెన్నెలపాట ఒక బాక్సాఫీసు సూత్రం.  తొలి, మలి తరాల కవుల కలాల నుండి లెక్కకు మిక్కిలిగా జాలువారిన వెన్నెల పాటలలో ఎక్కువ భాగం మధురమైనవీ మరపురానివీ కావటం మన అదృష్టం.

ఈ మనోజ్ఞ చంద్రికాయామినీ గేయాలలో సంగీత సాహిత్య గాన పరంగా  అత్యుత్తమ స్థాయిలో రూపొందిన పాట సాధనా వారి ‘సంతానం’ సినిమా కోసం అనిసెట్టి సుబ్బారావు వ్రాసిన ‘చల్లని వెన్నెలలో’ గీతం.

 

చల్లని వెన్నెలలో

చక్కని కన్నె సమీపములో…

అందమే నాలో లీనమాయెనే

ఆనందమే నా గానమాయెనే

 

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి

తేలియాడెనే ముద్దులలో

గాలి పెదవులే మెల్లగ సోకిన

పూలు నవ్వెనే నిద్దురలో

 

కలకలలాడే కన్నె వదనమే

కనిపించును ఆ తారలలో

కలకాలము నీ కమ్మని రూపము

కలవరింతులే నా మదిలో..

 

ఆ వెన్నెల చందం, సమీపములోని కన్నె చక్కదనం, ఆ అందమంతా తనలో కూడా కలిసిపోయి ఆ అనందమే పాటగా పల్లవించింది.  ఈ మనోహరమైన ఊహను పల్లవిలో ఎంతో కవిత్వవంతంగా చెప్పారు అనిసెట్టి.

 

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి

తేలియాడెనే ముద్దులలో

 

మబ్బులు, చందమామ ప్రసక్తి వచ్చినప్పుడల్లా మేఘాల్ని తెరగానో, చంద్రుణ్ణి మసకబారేలా చేసిన పరదాలాగానో వర్ణించడం పరిపాటి.  మబ్బులు జాబిలిని కౌగలించి ముద్దాడుతున్నాయని ఆ ముద్దులలో చంద్రుడు తేలియాడుతున్నాడని వర్ణించడం అపురూపమైన ఊహ.  అంత అపురూపంగానూ ఆ ఊహ అక్షరరూపాన్ని సంతరించుకుంది.

 

గాలి పెదవులే మెల్లగ సోకిన

పూలు నవ్వెనే నిద్దురలో

 

అక్కడ ఆకాశంలో జాబిలి మబ్బుల ముద్దులలో తేల్తూ ఉంటే ఇక్కడ నేలమీద గాలి పూలను ముద్దాడుతోంది.  పూలు రాత్రివేళ రేకులు ముకుళించుకుని నిద్రపోతున్నాయి.  అంత నిద్రలోనూ గాలి పెదవుల స్పర్శకు నవ్వుతున్నాయట పుష్పాలు.

పల్లవికి, మొదటి చరణానికి దీటుగా రెండో చరణం కూడా సాగుతుంది.

కలకలలాడే కన్నె వదనమే

కనిపించును ఆ తారలలో

కలకాలము నీ కమ్మని రూపము

కలవరింతులే నా మదిలో…

 

నక్షత్రపు మిలమిల లో కన్నెమోము కలకల కానవచ్చింది.  ఆ కనబడే రూపాన్ని కలకాలం మనసులో కలవరిస్తానని మాట ఇస్తూ పాట ముగుస్తుంది.

అద్భుతమైన ఈ పద చిత్రాలకు అంతే చక్కని పదలాలిత్యం తోడైన ఈ చరణాలలో లకారం మొదటి చరణం ద్వితీయాక్షర ప్రాసగానే కాక అనుప్రాసగా, అంత్యప్రాసగా రావటం, రెండో చరణంలో ఆది ప్రాస, యతులు మొదలైనవి అందంగా వచ్చి కూర్చున్నాయి.

శబ్ద సౌందర్యమే కాక స్వతంత్రమైన భావాలు, అరుదైన ప్రయోగాలు (ఉదా: కమ్మని రూపం – అలాగే చెలి, సఖి, ప్రియ అనకుండా కన్నె అని పాటంతా సంబోధించటం) ఈ పాట ప్రాశస్త్యాన్ని మరింత పెంచాయి.

సుసర్ల దక్షిణామూర్తి స్వరరచన, కల్యాణిరాగ ప్రియుడైన ఘంటసాల కమనీయ గానం, వెన్నెలలో సావిత్రి విలాసం ఇవన్నీ ఒక మధురానుభూతి.

అగ్నివీణ మీటిన అభ్యుదయకవి అనిసెట్టి కలం అమృతం చిలికించిన అద్భుత సందర్భం.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

4 comments

 • యతులేమీ లేవు గానీ, మతులు పోగొట్టే రమణీయ కావ్య లక్షణాలున్న అక్షర సౌందర్యమున్న పాట. బాగా చెప్తున్నారు. ఇంకాస్త రీసెర్చ్ చేయొచ్చునేమో. సంధర్భమూ, సన్నివేశ బలమూ, సంగీత సాహిత్యాల మధ్య పోటీ, ప్రేక్షాదరణ లో వ్యత్యాసాలేమన్నా పొడసూపిన వివరాలూ, పోలికలూ….శీర్షిక బాగుంది సర్. అభినందనలు.

 • శ్రీరాంగారు, కృతజ్ఞతలు! మీకూ ఈ పాట ఇష్టమైనందుకు చాలా సంతోషం.

  ఇంకా రాయొచ్చు అనుకోండి. సాహిత్యం ప్రధానంగా హైలైట్ చెయ్యడం ఉద్దేశం. వేరే పాటల
  సన్నివేశాల గురించి కొన్ని వ్యాసాలలో ప్రస్తావించాను – సాహిత్యానికి బలమైన సంబంధం ఉన్నదనిపించినప్పుడు.
  ఈ సినిమాలో ఈ పాటకు సన్నివేశ బలం తక్కువ – సందర్భం చాలా సాదాసీదాగా ఉంటుంది. అయినా మీ సూచనను మైండ్ లో పెట్టుకుంటాను.

  యతుల గురించి – రెండొ చరణంలో ప్రతి పాదంలోనూ మొదటి ఎనిమిది మాత్రల తరవాత (ఆరవ అక్షరం తర్వాత) విరామం ఉంది. మొదటి, మూడవ పాదాలలో విరామయతితో పాటు 1, 7 అక్షరాలకు అక్షరసామ్యయతిమైత్రి కూడా ఉంది. అందుకే ప్రస్తావించాను.

 • మాకు కూడా చాలా ఇష్టం ఈ పాట. మా సీతయ్య బాగా పాడతారు కూడా..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.