అక్షరాలే ఆసరా…

చేయి అలా చాస్తే….
నోటి మాటగా ధ్వనిస్తే..
కొల్లల కరెన్సీ కట్టలు!!

తుప్పట్టిన ఇనుప బీరువాల బందీలయి
మట్టి బొరియల చీకటి గూళ్లల్లో
నా నా జీవుల విసర్జకాల
పెంటల్ని ప్రీతిగా మెక్కి పొర్లాడి
దుర్గంధాల క్రిముల బురద నంటిన
వరాహ స్వాముల తనువుల్లాగా
ముట్టుకోవా లంటేనే మహా భయం!!

పరిశుభ్రత కోసం
శుద్ధిజలాలు సబ్బుల ద్రవాలు
వడ్డికాసుల సమర్పణల
నెల నెలా కూడికలూ తీసివేతల తోనే
కాలం హరించుకు పోతుంది

దర్జాలూ దర్పాల పోషణకు
ధనం అవసర ఇంధనమే అయినా…..
కవి హస్తం ఎప్పుడూ—-

ఎదురుగా ఎందరు
సుందర సుగుణాల మాతాసమాన మహిళలున్నా
చంటి బిడ్డల లేత చేతు లెప్పుడూ
అమ్మ చంక నెగబాకడానికే ఆరాట పడినట్లు
కలాన్నందుకుని
అక్షర రాగాల్తో

అనుభవాల శిథిలాలకు ఆకారాలిస్తూనో
భావి స్వప్నాల ప్రాభవాల్ని పల్లవిస్తూనో
సహృదయ స్నేహాల పందిరి అల్లుకోవడానికీ
గడియారం సూచికల భుజాల నెక్కి
క్షణం తీరిక లేని చలాకీ తనంతో !!

సడ్లపల్లె చిదంబర రెడ్డి

సడ్లపల్లె చిదంబర రెడ్డి ఎమ్మే బియిడి చేసి, తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. రెండు కథల పుస్తకాలు, రెండు కవిత్వం పుస్తకాలు ప్రచురించారు. మరి మూడు పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 కథలకు, 10 కవితలకు రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. వందకు పైగా కథలు, 200 పైగా కవితలు రాశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చిదంబర రెడ్డి ప్రధానంగా సీమ ప్రాంతం మాండలికంలో అక్కడి జీవితం నేపధ్యంగా రాస్తారు. ఆయన కాంటాక్టు నంబరు 9440073636.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.