ఇప్ప పూల కొమ్మల్లో నిప్పు కణికలు

కవిత్వంలో రాజకీయముంటుందా? ఇదేమీ కొత్త ప్రశ్న కాదు. కాలానుగుణంగా కేవలం కవిత్వం మాత్రమే చదివే ప్రతి తరంలోనూ ఉత్పన్నమయ్యే సందేహమే. అయితే అసలు రాజకీయం లేని కవిత్వముంటుందా? అదొక జీవిత భాగంగా ఉన్నపుడు, దానికి చిత్రిక పట్టగలిగింది కవిత్వమే కాగలిగినప్పుడు, రాజకీయ ప్రస్తావన లేని  కవిత్వావగాహన ఊహాతీతమవుతుంది. మరి ప్రణాళిక నుండి ఆచరణ దాకా ఒక ప్రజా పోరాట సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన కార్యకర్తని, కవి గా చూసినప్పుడు, ఆ కవిత్వంలో మనకేం కనబడుతుంది? అతడి ప్రబల నమ్మకం నిరుపమానంగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఛాయారాజ్ రాసిన శ్రీకాకుళ కధా కావ్యం అలాంటి ఒక శక్తివంతమైన రాజకీయ దృక్పధాన్ని ప్రతీ వాక్యంలో కలిగి ఉంటుంది. అయితే, ఈ కావ్య చర్చలో రాజకీయమా, కవిత్వమా? మనల్నేది ప్రసన్నతకి గురిచేస్తుందో, ఆ గురి దిశానిర్దేశమే చైత్యన్యానికి భాష్యం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండనివ్వదు. ఆయన ప్రజల వైపు నిలబడి ప్రజా రాజకీయాన్ని సమర్ధించినవాడు. ప్రజా వ్యతిరేక రాజకీయాల్ని నిర్ద్వద్వంగా విమర్శించినవాడు.

ఈ కావ్యం అవిభక్త శ్రీకాకుళ జిల్లాలోని (ప్రస్తుత పార్వతీపురం ఏజన్సీ) రైతాంగ పోరాట ఉద్యమ నేపధ్యం గా రాసినది. సోషలిస్టు రాజ్యాలు శ్రీకాకుళ ఏజన్సీ ప్రాంతంలో చట్టబద్ధ భూస్వామ్య విధానాన్ని నిర్మించాయా, కూల్చేశాయా ? అక్కడి గిరిజనలు ఎంత సంక్షోభానికి గురయ్యారో, దాన్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో, ఆ పోరాటాన్ని ఒక బలమైన జీవిత వారసత్వాన్ని చేసి భావితరాలకు ఏ పాఠాలు నేర్పించాయో, ఈ కవిత్వం చదివితే తెలుస్తుంది. “అడవి మీది ఆకాశం, ఊహకందని ఆవేశంలా ఉంది. కొండల కింది భూతలం గాయపడిన ఛాతీ లా ఉంది.. రాలిన ఊపిరుల కథ మూలుగుల్లో పుట్టిన మంట లా ఉంది” లాంటి వాక్యాలు, ఈ కవిత్వం నిలబడ్డ వేదికని సూచిస్తాయి.

అతను ఆ ఏజన్సీని, అక్కడి ప్రకృతిని, ఆ ప్రకృతిలోని అమాయక బతుకుల్ని గురించి ఎంతో ఇష్టంతో రాస్తాడు. “సిగ్గు ప్రకృతై వచ్చి కొండ కటి చుట్టున్న అడవి కోకను చింపి గిరిజన స్త్రీ మొలచుట్టు గోచి కడుతుంది” అంటాడు. పులిసవర్లని, గదబల్ని, జాతాపుల్ని గుండెల కదుముకుంటాడు. వాళ్ళ అలవాట్లని, ఆచారాల్ని వివరిస్తూ “పోడు సాగు కోసం కొత్త కొండలు కొట్టి కష్టాలు రాకుండ కానికే యిస్తారు- దైబాన్ని చల్లబరిచేందుకు కల్లు సారా బోసి కొండ కోపం మాపి, కొండ బక్కను నరికి, ఒడుపు సంబరంలోన దైబాన్ని ఒప్పమని తలమునగ తాగేసి తొంగ్ సేంగ్ (డాన్స్) చేస్తారు” అని  కవి ఎంతో గమనింపుతో రాస్తాడు. ఎంత ప్రేమ ఉంటే ఇలా రాస్తాడు కవి? “బారువ కొబ్బరి నీడల్ల నిలబడి, అటు సోంపేట ఇటు బొడ్డపాడు మధ్యన బారసాచి, ఉప్పలాడ,కొలిగాం, జిల్లిభద్రలనందుకో, వర్గ ఉద్యమ ప్రాంతాల ఊరూర తిరిగి ఉర్రూగిపోయి, చారిత్రాత్మక ఉద్యమ చరిత్ర కథాకథనం కోసం శ్రీకాకుళంలో లీనమై పోతావు” అంటూ కొత్త ఆలోచనాత్మక ప్రదేశాలకి మనల్ని దారి మళ్లిస్తాడు.

తొలుత 1959 లో భూమి హక్కులు, అడవి మీద గిరిజనేతర పెత్తనం, దొంగ వడ్డీలు, దుర్మార్గపు కూలీరేట్లు, శ్రమ దోపిడీ అసమానతల మీద ఎదురు తిరగడంతో గిరిజన పోరాటం మొదలవుతుంది. సామాన్య గిరిజనులు నిర్మాణ కర్తలు. పాఠాలు చెప్పే మేస్టార్లు రధ సారధులు. అక్కడి అడవి పుత్రుల్ని సంఘాలుగా ఏర్పాటు చేయాల్సిన కష్టమంతా పల్లి రాములూ, వెంపటాపు సత్యం మేస్టార్లు తీసుకుంటారు. ఈ ఉద్యమ పుట్టుకకి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనట్టే కనిపిస్తుంది. సత్యం గారు “ఏమి భయము లేదు నీకు, ఎర్రజండా నీడకు రావోయీ, బాధలన్నీ బాసి పోవునురా ఓ గిరిజన రైతా, నీదు కష్టములు తీరిపోవునురా” అని పాట కట్టినపుడు ఆ జండా ఉద్యమానిదని తెలుస్తుంది. “కమ్యూనిస్టులు ఇంకా కొండల కెళ్ళక ముందు చూద్దామా గిరిజనులను, రాజ్యాంగానికి పట్టని మానవులని” అడవి కదలికలతో కొండలు మెదలడం చూసేందుకు మేఘాలు వాగులై దిగి లోయల్లో పారాడుతున్నాయంటాడు.

“ఆకంటే ఆకా అని ఆకులై చూస్తారు, పువ్వంటే పువ్వా అని పువ్వులై చూస్తారు. పువ్వనీ ఆకనీ నువ్వెందుకంటావో అర్ధమయిందాకా మనసుల్ని విప్పరు, బరువుల్ని దించరు. కొండ శిఖరాల్లాగా సిగ ముడులుంటాయి, కల్లు గూనల్లాంటి కడుపులగపడతాయి” అని గిరిజనుల రూపాన్నీ,మనస్తత్వాన్నీ, మొదటి రెండు చాప్టర్లలో వర్ణిస్తాడు. మూడో చాప్టరుకొచ్చే సరికి1959 కి ముందు”భూమిపోయి కూలీలుగ, కూలిపోయి పాలేర్లుగ, పాలెపోయి వెట్టోళ్ళుగ, బానిసలుగ” గిరిజనుడెలా ఉన్నాడో చూద్దామా అని రాస్తాడు. ఈ పుస్తకంలో మొత్తం పది చాప్టర్లున్నాయి.

సాహిత్యంలో, అందునా తెలుగులో ఇదేమీ మొదటి కథా కావ్యం కాదు. సంస్కృతంనుండి తెనిగించబడ్డ ప్రతీ ప్రబంధమూ కధా కావ్యమే. వచన కవితా పితామహులందరూ కధా కావ్యాలు రావాలని కోరుకోవడంలోని ఔచిత్యం- కధ, కవిత్వమూ కలగలసినచోట కమ్మదనం ఎలా ఉంటుందో కవి తన కావ్యంలో కొత్తగా అనుభవంలోకి తెస్తాడు. దాదాపు పది, పన్నెండు సంవత్సరాల జీవన్మరణ పోరాట ఘట్టాలన్నీ కళ్ళ ముందు తిరుగాడుతుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. గిరిజనుణ్ణి అసలు కధానాయకుణ్ణి చేసి కావ్యమంతానడిపిస్తాడు. అతని మనసంతా ఆ కొండోడే నిండిపోయి కనిపిస్తాడు.

“అడివంటే సావుకార్లకి బూరెలున్న బోను పెట్టెలా అవుపిస్తది. అడివంటే భూస్వాములకు అరిసెలు దాచిన అట్టగలా అనిపిస్తుంది” అని కవి ఏజెన్సీ ప్రాంత గిరిజనులపై మైదాన ప్రాంత వ్యాపారుల దుశ్చర్యల్ని కళ్ళకి కడతాడు. గిరిజన సంఘం గిరి పుత్రులను సభ్యులుగా చేర్చుతుంది. జలాధారా ప్రమాణం చేయిస్తుంది. అంటే చేరేవాళ్ల చేతుల్లోంచి నీళ్లు వదులుతూ ప్రాణం పోయినా సరే గిరిజనుల సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేయడమన్నమాట. గిరిజనులు ఈ ప్రమాణానికి బద్ధులై ఉండటం చరిత్రలో వారి నిజాయితీని తిరుగులేని సాక్ష్యంగా నిలబెడతుంది. కూలి రేట్లు, పాలేర్ల జీతభత్యాల పెంపు కూడా సాధించడంతో గిరిజన సంఘ కార్యకలాపాలు పాలకుల వెన్నులో వణుకు పుట్టించాయి. “64 వరకూ పెరిగిన గిరిజన సంఘం వొళ్ళు చేయడం ప్రారంభించింది, కండ బలం విషయం కైలాసం చూస్తూ ఉంటె, రక్త ప్రసరణ సంగతి సత్యం చూసుకుంటున్నాడు” అని కవి చెప్పినపుడు ఆదిభట్ల కైలాసం అనే వ్యక్తి పేరు ప్రస్తావిస్తాడు. ఆయన పార్వతీపురం తాలూకాలోని కారివలసకి చెందిన వాడు. 150 ఎకరాల ఈనాందారి కుటుంబం నుండి వచ్చి కూడా,  “సాగు చేసేవాడిదే భూమి హక్కని” మగతా రైతుల్ని చైతన్యపరిచి కన్నతండ్రిపై తిరుగుబాటు చేసిన వాడు. ఆ 1955  ప్రతిఘటనలో పెదమేరంగి టీచరు తన ఉద్యోగం పోగొట్టుకుని, 59 లో వెంపటాపు సత్యం పరిచయంతో, 1970 జూలై లో చివరి శ్వాశ విడిచే వరకూ గిరిజనోద్యమ నాయకుడిగా, పార్టీ అభివృద్ధి లో కీలక పాత్రపోషించాడు.

ఇలా ఒక్క కైలాసం గురించే కాదు, ఛాయారాజ్ కావ్యం నిండా ఇలాంటి మహోన్నత త్యాగమూర్తులనేక మంది గురించిన ప్రస్తావన ఉంటుంది. వాళ్ళందరూ శ్రీకాకుళ రైతాంగపోరాటం లో తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన అమరులు. పంచాది కృష్ణ మూర్తి, తామాడ గణపతి, పంచాది నిర్మల, బిక్కి రాములు, పద్మయోగి సుబ్బా రెడ్డి, మామిడి అప్పలసూరి, వెల్లాడ జగ్గయ్య– ఇలా ఎన్నెన్నో పేర్లు ఈ కావ్యం లో చదువర్లకి తారస పడతాయి. వాళ్ళు చిత్ర హింసలు పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారని చదువుతాం. “1969అక్టోబరు 10 న కాకిలి లో బిడ్డిక చంద్రమ్మనూ, ఆమె ఆరునెలల పసికందును బాయ్నెట్లతో పొడిచి చంపిన తీరు, భర్త ముందే బాలింత సిక్కిని చెరిచిన తీరు, ఆరిక జయమ్మనీ అదేతీరు ” అని మనకి వివరించినపుడు, “పండు ముసలి  మండంగి సాయమ్మ, మొగిలిపాడు నెయ్యిల అన్నపూర్ణలు రాహస్యాలు చెప్పనందుకు కాల్చబడ్డారు; మరువాడ  బాలిక ను చెరిచారు, కురుపాం గోగుమడుల్లో చెరిచి చంపబడ్డ జాతాపు స్త్రీల శరీరాలు నేల తల్లి కన్న కూతుళ్లు” అని రాసినప్పుడు మన కళ్ళవెంట నీళ్లు రాక మానవు. బిడ్డల్ని కొండల్లో పారేసి ఉద్యంలోకి వచ్చిన సిన్నమ్మ లాంటి తల్లులు, భర్తల్ని పోగొట్టుకుని చివరికంటా నిలిచి పోరాడిన వర్గ ఉద్యమ వనితల్లాంటి పంచాది నిర్మలలు ఈ కవిత్వంలో మన ఊపిరిని బిగదీసేస్తారు. ఈ కావ్యంలో వీళ్ళ ప్రస్తావన ఆయా మనుషుల మహోన్నత  పోరాట పటిమ కావ్యానికి మరింత చిక్కదనాన్ని తెస్తుంది. వీళ్ళెవరు? శ్రీకాకుళ ఉద్యమంలో వీళ్ళేంచేశారు? అసలెందుకు వీళ్ళందరూ అమరులయ్యారు ? లాంటి ప్రశ్నల్ని రేకెత్తించడంలో ఈ కావ్యం నూటికి నూరు శాతం విజయవంతమవుతుంది. ఉద్యమ పూర్వాపరాలుతెలుసుకోవాలని, అది ఎలా మొదలై, ఎటు ప్రయాణించి, ఏం సాధించిందీ తర్కం చేస్తుంది. ఆ సాధింపు ఉపయోగపడిందా, నష్ట పరిచిందా అన్న జిజ్ఞాసను కలిగిస్తుంది.

“ఉద్యమం వెలుగులు ఏ అన్నల ఆవేశాలకు బలైనారు, అతివాదం తన వికృత రూపాన్ని శ్రీకాకుళ ఉద్యమంలో అతిభయంకరంగా ప్రదర్శించింది, దాని రక్త దాహాన్ని ఇక్కడి నాయకత్వం తీర్చింది” అని రాసినప్పుడు,” నిరాశా నిస్పృహ అతివాదానికి కళ్ళు, అవకాశం, ఆందోళన చేతులు, సంచలనం దుస్సాహసం కాళ్ళు, ఉన్మత్తం, ఉద్రిక్తత మెదడు, ఆత్మహత్యామార్గం గుండెకాయ అని తేల్చినపుడు కవి రాజకీయ కోణంలో కనబడతాడు. అతివాదం ఆసనం బలహీనత, ఆహారం నాయకత్వ చిత్తం, వస్త్రం రక్తం; మిత్రులను శత్రువులుగా, సమర్థులను అసమర్థులుగా, భవిష్యత్తుని బలిపీఠంగా; అతివాదమంటేనే సర్వం నాశనం నాశనం; అతివాదంలో శ్రీకాకుళం సమస్తం వినాశనం” అని ప్రకటించిన కవి స్పష్టంగా ఉద్యమ నాశనానికి అతివాదం ఎలా కారణమయ్యిందో చెప్తాడు. అసలింతకీ అతివాదమంటే ఏమిటి ? దానివల్ల శ్రీకాకుళ ఉద్యమం ఎలా నేలకొరిగిపోయింది ? లాంటి సందేహాలు చదువర్లలో కలిగించి వాటికోసం కవి ఎంత మధన పడింది ఈ కావ్యంలో మనకి కనబడుతుంది. ప్రజల పోరాటంగా మొదలైన గిరిజన రైతాంగ ఉద్యమం తదనంతర కాలంలో చారుమజుందారీయ దారుల్లోకెళ్ళి వ్యక్తిగత హింసా వాదం గా మారిన క్రమం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇంతకీ ఎవరీ చారుమజుందార్ ? 1918 లో బెంగాల్లోనిసిలిగురిలో పుట్టి, 1969 లో CPI(ML) పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వాడు. వర్గ శత్రువుని సాయుధ పోరాటం ద్వారానే ఎదిరించాలనే అతివాద పోకడలన్నీ  అతను ప్రవేశపెట్టినవే. చైనా సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతంగా నడిపిన మావోని ప్రేరణగా ప్రకటించిన వాడు. గెరిల్లా పోరాటంతో వర్గ శత్రువుని ఖతం చేయడమే ప్రధాన సూత్రీకరణ చేసి, శ్రీకాకుళ జిల్లా నాయకత్వానికి హింసావాదంతోనే ప్రజా ఉద్యమ నిర్మాణం చేయాలని బోధించిన వాడు. అయితే ఆ వ్యక్తిహింసా  వాదాన్ని కవి స్పష్టంగా వ్యతిరేకిస్తాడు. దానివల్ల ప్రజలకి ఉద్యమం ఎంత దూరమైపోతోందోనని దుక్ఖిస్తాడు. “చిల్లుపడ్డ డెన్నులన్నీ నేలవడిలో తల్లొంచుకున్నాయి, కూలిన వాతావరణంలో కొండలన్నీ వాడిపోయినయి, కామ్రేడుల కాళ్ళ అచ్చుల్ని రాళ్ళన్నీ దాచుకున్నాయని” రక్తపాతం తర్వాతి అడివిని విరిగిన కనురెప్పలెత్తి కలయజూపిస్తాడు.

అయితే అతివాదం అన్న పదం కవి ఎందుకు వాడాడు? బహుశా అది తాను పాటించే రాజకీయ సిద్ధాంతానికి పొసగని తనంగా కవి దాచుకోలేకపోతాడు. రెండు ప్రధాన రాజకీయసిద్దాంతాల్ని చూస్తామీ కవిత్వంలో? అందుకే రాజకీయం కవిత్వంలో ఇమిడిపోయేందుకు ప్రయత్నం చేసినప్పుడు, మరీ ముఖ్యంగా ఒక నైసర్గిక వేదిక మీద నిలబడి, ఆ నేల, మరింత కుంగిపోయి నేల కొరిగిన సందర్భాన్ని రాసినపుడు అందులో కేవలం కవిత్వం కోసం వెతకడం అస్సలు వీలు పడదు. కవిత్వం ముందా? రాజకీయం ముందా? అని బేరీజు వేస్తే రాజకీయమే ముందు తుపాకీ పట్టుకుని నిలబడుతుంది. అయితే ఆ కథ లోని పోరాట కేంద్ర లోకి కవిత్వమే పరుగులు తీయిస్తుంది. ఒక దాని తర్వాత మరోటేంజరిగిందో అన్న ఆత్రుత మనల్ని ఒక చోట నిలవనీదు. ఏడు ఎనిమిదో చాప్టర్లు రెండూ అతివాదం పేరిట కవి శ్రీకాకుళం లో ఉద్యమం మూగబోయి నీడ గప్పుకు నిలబడ్డ అడవుల్నిచూపిస్తాయి. కనిపించకుండా పోయిన కార్యకర్తల్ని గుండెల్లో గుర్తుంచుకుని కొన కొమ్మల గుంపుల్లోన గుబురాకులు విప్పారినట్టు చెట్ల సందుల్లో కదలాడతాయి. ఎన్నెన్ని ప్రకృతి వర్ణననల్ని సహజ సుందరమైన భాషలో రాస్తాడో కవి. గూడలంటాడు, తొర్రల్లో చిలకలంటాడు, చదునైన రాళ్ళల్లో దేవుళ్ళని గురించి, తొంగ్సెంగ్ (నాట్యం) గురించి, పత్తిక, పువ్వల, బిడ్డిక, ఆరిక, నిమ్మక, మూటక, కొండ కుటుంబాల్ని బంధువుల్ని చేస్తాడు. అనుభవించాల్సిందే.

“నిప్పు పుట్టింది; ఆహారాన్ని పచనం చేయడం కుట్ర గాదు, నాగలి తయారయింది వ్యవసాయం చెయ్యడం కుట్ర కాదు, ప్రకృతిలో పరిణామం కుట్ర కాదు. జీవించడం కోసం అన్యాయాన్ని ప్రశ్నించడం కుట్ర. శ్రమించడానికి స్వేచ్ఛ కావాలనడం కుట్ర, భుక్తి కోసం భూమిని కోరడం కుట్ర, బుగతోడిని కూలి అడుక్కోవడం కుట్ర, సావుకారిని లెక్కలడగడం కుట్ర, నిరసించడం కుట్ర, నినదించడం కుట్ర. ఎవురి కుట్ర శ్రమజీవులని రెచ్చగొట్టింది, ఏ వర్గం కుట్ర అభాగ్యుల కళ్ళల్లో నిప్పులు పుట్టించింది. ఎలాంటి ప్రజాస్వ్యామ్యాన్ని ఎలాంటి దుర్బలులు కుట్రతో కూలదోయాలని ప్రయత్నించారు” అని ఆవేశంగా ఊగిపోయి రాసిన కవితా పంక్తులు చదివినపుడు కవి హృదయం ఎంత నిప్పులపై నడచిందీ తెలుస్తుంది. మన లోపల ఎడతెగని బాధ తన్నుకొస్తుంది. విశాఖ స్పెషల్ కోర్టులో వేల మంది సాక్షుల్ని నిలబెట్టి, అమాయకుల్ని నిర్బంధించి కేసు తేలే లోపల ఎంతో మందిని కాల్చి చంపిన కుట్ర. చాలా చాలా చారిత్రాత్మకమైన పార్వతీపురం కుట్ర కేసు (140 ముద్దాయిలు, 897 సాక్షులు) ప్రస్తావన తో కావ్యాన్ని ముగింపు వైపుకి నడిపిస్తాడు. ఈ క్రమంలో పట్టుబడిన కామ్రేడులపై పోలీసు దౌర్జన్యం చాలా దుర్మార్గమని చెప్తాడు. గోడకుర్చీలు వేయించి, మునుకుల్ని లాఠీలతో చితక్కొట్టి, లంబసింగి బంగ్లాలో, బిక్కి రాములు గోళ్లలో గుండు సూదులుగుచ్చారు, బత్తుల చేయిని విరిచి శరీరం మీద మరిగే నీళ్ళని పోశారు, రాజా రామ్ రెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికారు, కొల్లిపర నరసింహాను, వావిలాల సత్యం ను గొంతులను బ్లేడులతో కోశారు – కాంపుల చుట్టూ గ్రామాలు దహనమైపోయినాయి, క్యాపుల్లో మానభంగాలు మామూలైపోయాయి” అన్నమాటలు చదివి మనం మౌనముద్రలు వేస్తాం గానీ, “రాజ్య హింస వల్ల ఏజన్సీ ప్రజల రక్తమాంసాల కబేలా యై పోయింది, శ్రీకాకుళాన్ని ఖాళీ చేసి విప్లవమూ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, ఇక్కడి విప్లవ లక్ష్యం విధ్వంసమైపోయింది” అన్నప్పుడు అవునా? కాదా? అని ఆలోచనలో పడతాం. అసలు అలా పడి ఏదో తేల్చుకోవాలనిపిస్తుంది. కవి చెప్పినట్టు “అతి చిన్న గ్రూపుకూ ఒక అఖిల భారత విప్లవకేంద్రముంటుంది- ఒక్కో గ్రూపుకొక పత్రిక పుట్టి దాని కార్యక్రమాన్ని దాని చేతనే చదివించుకుంటుంది”. కవి తరిమెల నాగిరెడ్డి కష్టాన్ని కీర్తిస్తాడు. దేన్నీ కాదనలేని సాక్ష్యాల్ని కాలం శ్రీకాకుళ ముఖచిత్రంలో చూపిస్తునే ఉంది. వేగు చుక్కల్లా అడవిలో ఎవరు ఎందుకు రాలిపోయారో, విప్లవ మేధావులు కొండల్లో ఎందుకు కూలిపోయారో, కమ్యూనిస్టు యోధులాకోనల్లో కన్నెందుకు మూశారో, గెలిచి ఓడిపోయిన విప్లవం చెబుతుందంటాడు. చాయారాజ్ కవిత్వీకరణ కన్నా వస్తు నిర్వహణ చాలా హైలెట్ లా ఉన్న కవిత్వమీ శ్రీకాకుళం. అసలీకవితా వస్తువు ఎంచుకోవడమే అతని నిశితమైన చూపుకి నిదర్శనం. కవిగా అతని విప్లవ పంధా చదవడం అసక్తికరమైన విషయం. అది శ్రీకాకుళ పోరాటంలో నేలకొరిగిన వాళ్ళ రక్తతర్పణల్లో త్యాగాల్ని కీర్తిస్తూ జరిగిన నష్టానికి కారణాల్నీ వెతికి ఎత్తి చూపిస్తుంది. నాజూగ్గా కాదు, వినయంగా కాదు, దయగా, మర్యాదగా, నిగ్రహమూ ఔదార్యంగానూ కానేకాదు. వర్గపోరాటానికతని కవిత్వమొక పర్యాయ రూపాన్నిచ్చింది. యుద్ధం యుద్ధాన్నే నేర్పిస్తుంది. సందేహమేలేదు. అయితే ఏ యుద్ధాలెప్పుడైనా సరే ప్రజలున్నపక్షమే గెలుపు జండాలెగరేస్తాయి కదా ? మనం ఏ యుద్దం చేస్తున్నామన్న నిప్పు ముట్టించిన కవిత్వమిది.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

44 comments

 • డాక్యూమెంటెడ్ పోయెట్రీ …. హాట్స్ ఆఫ్ టూ యూ సార్

 • ఆలోచింపచేసే ఎత్తుగడతో మొదలైంది వ్యాసం.

  అసలురాజకీయం లేని కవిత్వముంటుందా — అన్న ప్రశ్నలో అతి విశ్వాసం ధ్వనిస్తుంది.

  రాజకీయాన్ని “కూడు గూడు, గుడ్డ” లేదా వాటిని కల్పించాల్సిన భూమిక గా అనుకొంటే ఆ స్థాయిలో రాజకీయం తప్పని సరిగా ఉంటుంది, ఉండాలి కూడా.

  కానీ జీవితం అక్కడితో ఆగిపోదు… ఆ పైన ఇంకా కొనసాగుతుంది….. అక్కడ రాసే కవిత్వంలో ఈ సో కాల్డ్ రాజకీయం కనిపించదు… దానికి మించినదేదో ఉంటుంది.

  కవి ఏ వైపున ఉన్నాడు అనేది కూడా ముఖ్యమే.

  మొదటి మార్గం లో ఉండేవారు నా దృష్టిలో యోధులు.
  రెండోవైపు మాత్రమే చూసేవారు స్వాప్నికులు.

  రెండు వైపులా ఉండేవారు చింతనాపరులు…..

  ఈ రోజు గొప్ప యుద్ధకవిత్వం గురించీ, ఒక యోధుడైన కవిగురించీ చక్కని వ్యాసాన్ని అందించారు. థాంక్యూ
  ఇదంతా చరిత్ర… చరిత్రని కవిత్వరూపంలో భద్రపరచుకోవటమూ అవసరమే….
  ఛాయారాజ్ గారికి వందనములు…

  పుప్పాల శ్రీరామ్ గారికి అభినందనలు.

  బొల్లోజు బాబా

  • కూడూ, గూడూ, గుడ్డా ఏ భూమికలోంచి మొదలవుతాయి ? ఎక్కడ ఆగిపోతాయి ? రాజకీయం కాని స్వప్నమూ, యుద్దమూ, చింతనా ఉండవేమో ? కవిత్వం కూడానూ ! అయితే దాని ప్రవాహోద్వేగాన్ని బట్టి లోతూ, వైశాల్యమూ…వాక్యమూ నిర్మాణమవుతుందనుకుంటాను.

   మీరిచ్చే ప్రోత్సాహానికి సదా కృతజ్ఞుడను.

 • మీ వ్యాసం చదివాక ఛాయరాజ్ గారి కవిత్వాన్ని వెంటనే చదవాలనిపిస్తుంది సార్.శ్రీకాకుళ ఉద్యమం గురించి కొంత తెలుసు.. ఆ ఉద్యమాన్ని కవిత్వంలో చెప్పడం…అందులోని పదాలు తడితో నిండిపోయినయి.మీ వ్యాసం మరింత బలాన్నిస్తున్నది.మంచి కవిత్వాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు…. అభినందనలు సార్.

 • One of the best pieces of your writing sir.
  శ్రీకాకుళం చరిత్ర, గిరిజనుల చరిత్ర ,పోరాటాలు అవమానాలు … అన్నీ కలిసి ఉన్న ఈ కథాకవిత్వం గురించి ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాశారు అభినందనలు!
  ఈ పుస్తక రచయిత కు శతకోటి దండాలు!

  • రవీ థ్యాంక్యూ. ఇది మీరూ చదవాలని నా విన్నపం.

 • శ్రీకాకుళ పోరాటాన్ని,చాయరాజ్ కవిత్వాన్ని జమిలిగా నడిపారు.ఆయన కవిత్వం లో మీరు ఎంత దహనమయ్యారో తెలుస్తోంది. మిగతా వ్యాసాల తో పోలిస్తే భాష సరళమై0ది. నిప్పు ముట్టించారు.తగలబడుతున్నా.అభినందనలు.

  • థ్యాంక్యూ గోపాల్. నాకు ఎంత బలాన్నిస్తున్నారో మీరు. మాటల్లో చెప్పలేను

 • 150 ఎకరాల ఈనాందారి కుటుంబం నుండి వచ్చి కూడా, “సాగు చేసేవాడిదే భూమి హక్కని” మగతా రైతుల్ని చైతన్యపరిచి కన్నతండ్రిపై తిరుగుబాటు చేసిన వాడు. ఆ1955 ప్రతిఘటనలో పెదమేరంగిటీచరు ఉద్యోగం పోగొట్టుకుని, 59 లో వెంపటాపు సత్యం పరిచయంతో, 1970 జూలై లో చివరి శ్వాశ విడిచే వరకూ గిరిజనోద్యమ నాయకుడిగా, పార్టీ అభివృద్ధి లో కీలక పాత్రపోషించాడు.
  గోడకుర్చీలు వేయించి, మునుకుల్ని లాఠీలతో చితక్కొట్టి, లంబసింగి బంగ్లాలో, బిక్కి రాములు గోళ్లలో గుండు సూదులుగుచ్చారు
  వావిలాల సత్యం ను గొంతులనుబ్లేడులతో కోశారు –

  ఇవన్నీ వాస్తవాలు కాదు.కొన్ని పేర్లు సరిగ్గా లేవు. కొన్ని పూర్తి వాస్తవాలు కాదు.
  ఆ క్వాత్వంలో ఛాయరాజ్ కేవలం అతివాదం వల్లనే అది ఓడిపోయిందని సూత్రీకరింహారు. అదేకాలంలో మొదలైన “మొదలు ‘ ఉద్యమాలు, తర్వాత మొదలైన అడవి ఉద్యమాలు కూడా ఓడిపోయాయి లేదా నిలిచిపోయాయి. వైఫల్యం కేవలం అతివాద పంథాలో లేదు. వెనుకబడిన ప్రాంతాలలో,వెనుకబడిన సమూహాలతో అత్యంత ఆధునిక వ్యవ్యస్థను మార్చవచుననే అవగాహనలో ఉంది. అది అతివాద పంథా అయితే నిర్బంధం తో అణచివేయబడతాయి. ప్రజాపంథా అయితే సహజ మరణం చెందుతాయి.

  • థ్యాంక్యూ సర్. బత్తుల శివరామిరెడ్డిదీ, వెంకట్ గారిదీ అందుబాటులో ఉన్న రెఫరెన్సులు. అయితే ఇంకేమన్నా వాస్తవాల వివరం మీరు చెబితే ఉపయుక్తంగా ఉంటుంది.

   ఇక అతివాదం అణచివేతని కాలం నిరూపించింది కనుక రాజ్య బలం గురించి రెండో మాట లేదు. కానీ ప్రజా పంధాలు చిరాయువులు కదా ! వాటికి మరణముంటే సమాజ చరిత్రలో వర్గ పోరాట స్పూర్తి లేనట్టే కదా ?

   ధన్యవాదములు.

   • నాకు తెలిసి వెంకట్ పుస్తకంలో కైలాసం గురించిన వివరాలు అలా లేవు. కైలాసం పెదమేరంగిలో ఉద్యోగం చేయలేదు. ఆటను కరివలసలో వాళ్ళ తండ్రి యాజమాన్యం లోని పాఠశాలలో పనిచేసాడు.1955 ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ వేదిక మీద ప్రకటన చేసినందుకు అతనిని అతని తండ్రి ఉద్యోగంనుంనుంచి తొలగించాడు. కోర్టుకి వెళ్లి ఉద్యోగం తిరిగి పొందినా దానికి రాజీనామా చేసి పూర్తికాలం కార్యకర్తగా మారదు. వాళ్ళది 1800 ఎకరాల ఇనాందారి కుటుంబం. మరిన్ని వాస్తవాలకు భూషణం వ్రాసిన సిక్కోలు జీవితాలు చూడండి.
    అతనిపేరు వావిలాల సత్యం కాదు. వావిలపల్లి సత్యనారాయణ. అతను కూడా వృత్తిరీత్యా ఉపాద్యాయుడు. అతన్ని బొబ్బిలి షబ్ జైలు లో చిత్రహింసలకు గురిచేసి చంపారని ఆనాడు అసెంబ్లీ లో కూడా వాదనలు సాగాయి. ఈ మధ్యనే అతని కుమారుడు అజయ్ ఆ విషయాలని ఒక చిన్న పత్రం గా వేశారు.
    ఇక బిక్కి రాములు కూడా ఉపాద్యాయుడు.
    నేను మాట్లాడింది ప్రజాపంథా అని చెప్తున్న దాని గురించి.మౌలికంగా ఆదివాసీ ప్రాంతాలను ఆధారం చేసుకుని చేసే ఏ ఉద్యమంలో కూడా ఓటమి లేదా నిస్తేజం అనివార్యం.దీనర్థం ఏ ఉద్యమాలు విజయం సాధించవని కాదు.

 • వ్యాసం బావుంది. ఛాయరాజ్ ఆత్మ శ్రీకాకుళం కవిత్వ ఆత్మ పట్టుకున్నారు. డాక్టర్ కె. ముత్యం శ్రీకాకుళం కావ్యం మీద పి హెచ్ డి చెసారు. ఉస్మానియా నుండి వెలువడింది. ఈ తరానికి శ్రీకాకుళం గురించి తెలియదు. మీ వ్యాసం కొత్త తరానికి దారి దీపం. అభినందనలు

  • ‘డాక్టర్ కె. ముత్యం శ్రీకాకుళం కావ్యం మీద పి హెచ్ డి చెసారు’
   ముత్యం దానిమీద పి హెచ్ డి చేయలేదు.అతను శ్రీకాకుళ ఉద్యమం సాహిత్యం మీద చేసారు.అతని పుస్తకంలో ఈ కావ్యం రిఫరెన్స్ గా లేదు. అతను బి.హెచ్ .యూ లో పరిశోధన చేసి సొంత డబ్బులతోనే ప్రచురించుకున్నారు.

  • థ్యాంక్యూ వంశీ గారూ, ముత్యం గారితో మాటాడాను కూడా.

 • చదివింపచేసిన వ్యాసం…ఒకసారి ఛాయా రాజ్ గారిని చదవాల్సిందే…చాలామందిని ఇలా పరిచయం చేస్తున్న శ్రీరామ్ సోదరుడికి థాన్క్స్ 🙂

  • చదువ్ సాయి. పుస్తకం పంపిస్తాను. ఆనక మాట్లాడుకుందాం.

 • ఎంతో ఆసక్తికరమైన విశ్లేషణ. కవిత్వంలో రాజకీయాలుండటం కుదరదు అనటం మూర్ఖత్వం అయితే రాజకీయేతర కవిత్వం వుండదు అనటం చాదస్తం. కొన్ని విషయాల్ని రాజకీయ పరిధిలోకి తీసుకు రాకుండా కవిత్వం రాయలేని మాట వాస్తవమే. ప్రతి విషయాన్ని రాజకీయ పరిధిలోకి తీసుకు రావటం అసాధ్యమేమీ కాదు. అయితే కొన్ని విషయాల్ని రాజకీయ ప్రస్తావన తీసుకురాకుండా కూడా రాయొచ్చు. ఉదాహరణకి ప్రకృతి. దాన్ని రాజకీయాలకి ముడి పెడుతూ రాయొచ్చు. రాజకీయ ప్రసక్తి తేకుండానూ రాయొచ్చు. అది రాసే సమయంలో కవి పెర్సెప్షన్ మీద ఆధారపడి వుంటుంది. నేనైతే రెండింటికీ బద్ధుడనే. రాజకీయ వ్యతిరేకమైన అరాజకీయ కవిత్వమంటూ ఏమీ వుండదు. కేవలం రాజకీయ స్పర్శ లేని రాజకీయేతర కవిత్వానికి అవకాశం వుంటుంది. రెండింటికీ మధ్యన ఒక సున్నిత వ్యత్యాసముంటుంది. కవిత్వంలో రాజకీయాలు వుండకూడదని పళ్ళు నూరేవారిది రాజకీయమే. ఇంక ఛాయారాజ్ గారి దీర్ఘ కవిత ఒక పార్టీ పంథాని అనుసరించే వుంటుంది. నిజానికి ఈ కవిత రాసే నాటికే ఆయన నిబద్ధుడైన పార్టీ నిర్వహించిన “కొండమొదలు” పోరాటం చల్లబడింది. మీరన్నట్లు ఆయన పరిశీలన బాగుంటుంది. ఈ దీర్ఘ కవితలో కొన్ని చోట్ల కవిత్వం బాగుంటుంది. అయితే చారిత్రిక దృష్టి, రాజకీయ స్పృహ, ప్రాపంచిక దృక్పథమే, బలమైన ఫీల్ మాత్రమే ఒక కవి రాసిన దానిని గొప్ప కవితని చేయలేవు. అంతకు మించి ఏదో కావాలి. క్లుప్తత, గాఢత, సృజనాత్మకత కూడా అవసరమే. మీరు పరిచయం చేసిన పద్ధతిలో మంచి ఫోర్స్ వుంది. కీపిటప్.

  • థ్యాంక్యూ సర్. నిజమే. చాయారాజ్ కవిత్వంలో గాఢత విషయంలో మిమ్మల్ని కాదనను. కానీ ఒక రాజకీయ సిద్దాంతాన్ని కవిత్వాంశం చేసుకున్నపుడు, అతని పరిమితి ఊహాతీతమైనది కాదు. అయితే చరిత్ర తెలీని వాళ్ళం. ఇలాంటివి చదువుతుంటే వొళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. మీ విలువైన పరిశీల్నాత్మక వ్యాఖ్య కి థ్యాంక్స్ అగైన్.

 • చాలా గొప్ప వ్యాసం సార్ , మీరు ఒక పరిశోధన చేసి రాసారు , జరిగిన చరిత్రకి ఎన్ని పైపూతలైనా పూయవచ్చు గాక , దాని మరుగున అసలైన చరిత్ర ఉండిపోతుంది , చరిత్ర దాన్ని రికార్డు చేస్తే ఎవరో ఒకరు దాని రహస్యాలని ముడి విప్పుతారు , ఇప్పుడు ఆ చిక్కుని కొంత తీయాలనిపూనుకొవడం సాహసం , రైతాంగ పోరాటాలు , ఉత్త్రరాంధ్ర గిరిజనులమీద జరిగిన ఆధిపత్యాలని ,ఎదుర్కున్న కొంతమంది సాహసీకుల జీవితాలని తెలియజెప్పడం బాగుంది , అది ఇప్పుడు అవసరం కూడా , ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయ ప్రణాలికలు వేస్తూ , ఆ కమ్మ్యునిస్టులు ఏమి చేసారూ , అని దీర్ఘాలు తీస్తున్న రాజకీయ పార్టీలకి వాటిని గుడ్డిగా అనుకరిస్తున్న వారికీ ఇలాంటి వ్యాసాలు కనువిప్పు కలిగిస్తాయి . ఒక తరం తనని తాను కొల్పోయి ప్రస్తూ వర్తమానాన్ని మనకి అందించింది. మీ కార్యదక్షతకి అభినందనలు .

  • అనిల్, చాలా మంచి మాటలు అన్నావు. చరిత్ర రికార్డులు తిరగేస్తే మరపురాని మనుషులెంత మంది ఉన్నారో! ఎన్ని కవితాక్షరాలున్నాయో ! ఇవన్నీ చదవాల్సిన అవసరం ఎంతో ఉంది. సైద్దాంతిక బలం ఉన్న మనుషుల్ని కలవడం ఇలాంటి పుస్తకాల్లోనే సాధ్యమా ? అనిపించేంత బలమైన వ్యక్తీకరణ ఈ కవిత్వంలో కనిపించింది.

 • ఒక‌ ఉద్యమాన్నే వస్తువులా మలిచి యుద్ద కవిత్వాన్ని రాసిన యోధుడు కవి ఛాయరాజ్ గారు అని అనిపిస్తుంది మీ వ్యాసం చదువుతుంటే.
  బలమైన సమీక్షతో శ్రీకాకుళం పుస్తకాన్ని చదవాలనే తపన కలిగించిన మీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు…

 • రాస్తా మాగ్ లో నీ వ్యాసాల సిరీస్ శ్రద్ధగా చదువుతున్నా. నీ సెలెక్షన్ చాలా స్ట్రటజిక్ గా వుంటోంది. వైవిధ్యంగా వుంటోంది. గత వాటితో పోల్చితే యిందులో భాష సరళంగా అనిపించింది. పాత వాటిలో టెక్ట్స్ యెక్కువగా వుండేది. ఛాయరాజ్ గారినీ యెక్కువగా కోట్ చేసుంటే బాగుండు. అది అవసరం. టైటిల్ నాకేమీ నచ్చలా. నిజానికి కావ్యం నిప్పుకణికల్ని నష్టంగా చూస్తుంటే….

  మొత్తానికి బాగుంది. అభినందనలు.

  • మీ అమూల్యమైన గమనింపుకి ధన్యవాదములు సర్. స్ట్రాటజీ చదవడంలోంచి రాస్తున్నప్పుడు కళ్ళుతెరుస్తోంది. వచనం సరళీకరించుకోవల్సిన అవసరం తెలుస్తోంది. చాయారాజ్ చాలా మంచి కవి. ఉద్వేగం ఉన్న కవి. టైటిల్ అదేతోచింది. నిప్పుకణికలు వద్దన్నారంటారా ?

 • ఎక్స్ల్లెంట్ write -అప్ .. ఆఫ్టర్ ఆల్ these people ‘s కామెంట్స్ .. There is nothing లెఫ్ట్ ఫర్ మీ to సే …… గ్రేట్

 • ఒక ప్రశ్నతో మొదలుపెట్టి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా చేసిన మీ వ్యాసం అద్భుతంగ ఉంది సార్ .మీ వచనం నాకెంతో ఇష్టం సార్ .శ్రీకాకులంలో జరిగిన పోరాటాల గురించి సందర్భోచితంగ చెప్పడం మరింత బలం సార్

 • “రాజ్య హింస వల్ల ఏజన్సీ ప్రజల రక్తమాంసాల కబేలా యై పోయింది, శ్రీకాకుళాన్ని ఖాళీ చేసి విప్లవమూ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, ఇక్కడి విప్లవ లక్ష్యం విధ్వంసమైపోయింది” వేగు చుక్కల్లా అడవిలో ఎవరు ఎందుకు రాలిపోయారో, విప్లవ మేధావులు కొండల్లో ఎందుకు కూలిపోయారో, కమ్యూనిస్టు యోధులాకోనల్లో కన్నెందుకు మూశారో, గెలిచి ఓడిపోయిన విప్లవం చెబుతుందంటాడు. చాయారాజ్ కవిత్వీకరణ కన్నా వస్తు నిర్వహణ చాలా హైలెట్ లా ఉన్న కవిత్వమీ శ్రీకాకుళం. అసలీకవితా వస్తువు ఎంచుకోవడమే అతని నిశితమైన చూపుకి నిదర్శనం. కవిగా అతని విప్లవ పంధా చదవడం అసక్తికరమైన విషయం. అది శ్రీకాకుళ పోరాటంలో నేలకొరిగిన వాళ్ళ రక్తతర్పణల్లో త్యాగాల్ని కీర్తిస్తూ జరిగిన నష్టానికి కారణాల్నీ వెతికి ఎత్తి చూపిస్తుంది. నాజూగ్గా కాదు, వినయంగా కాదు, దయగా, మర్యాదగా, నిగ్రహమూ ఔదార్యంగానూ కానేకాదు. వర్గపోరాటానికతని కవిత్వమొక పర్యాయ రూపాన్నిచ్చింది. యుద్ధం యుద్ధాన్నే నేర్పిస్తుంది. సందేహమేలేదు. అయితే ఏ యుద్ధాలెప్పుడైనా సరే ప్రజలున్నపక్షమే గెలుపు జండాలెగరేస్తాయి కదా ? మనం ఏ యుద్దం చేస్తున్నామన్న నిప్పు ముట్టించిన కవిత్వమిది….. ఈ పుస్తకం చదవాలని తహతహలాడేలా ఉంది మీ సమీక్ష. అద్భుతమైన విశ్లేషణ. మీ సాంద్రత మరింత పెంచింది ఈ రివ్యూ అంటే అతిశయోక్తి కాదు.. అంత మాట అనగల అర్హత నాకుందో లేదో గానీ.. చదవగానే అలా అనిపించింది… పుస్తకమే వర్గ ద్రుష్టితో రాసింది.. దాని విశ్లేషణ కూడా సరైన పద్ధతిలో చేయడం కత్తిమీద సాహసమే.. మీరు అందులో క్రుతక్రుత్యులయ్యారు… మీకు విప్లవాభివందనాలు శ్రీరామ్ గారూ. అభినందనలు..

  • శాంతి గారూ, మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను. ప్రతీ వ్యాసాన్నీ చదివి శ్రద్దగా మీ అభిప్రాయం చెప్పడం నాకెంతో బలాన్నిస్తుంది. ఆ అభిమానానికి మించిన అర్హత ఏముంటుంది చెప్పండి ? థ్యాంక్స్ ఎంత చిన్న మాట.

 • సర్, ఈ భాష అర్ధం కావడం లేదు. కానీ చదువుతుంటే బాధ కలుగుతోంది. ఎందుకు ?

 • శ్రీరాం ఛాయారాజ్ కవిత్వాన్ని ఎన్ను కున్నందుకు అభినందనలు శ్రీకాకుళ ఉద్యమ కథాకవిత్వాన్ని ఇష్టంతో వ్యాఖ్యాన్నించటం మీ ఆలోచనాధోరణకి అద్దం పడుతుంది ఈనాటి సమాజానికి ఈ కవిత్వం ఎంతో అవసరం పాఠకుణ్ణి ఉద్యమస్ఫూర్తితో ఆలోచింపజేసే మంచి వ్యాసాన్నందించినందుకు అభినందనలు

 • నిప్పు ముట్టించిన కవిత్వంపై నిఖార్సయిన వ్యాసం

  • థ్యాంక్యూ వేణు. మీరూ ఇది ఒకసారి చదవాలి.

 • అన్నా.. ఇంతకుముందు ఛాయా రాజ్ కవిత్వాన్ని చదవలేదు…మీ పరిచయం లో ఎన్నో విషయాలు తెలుసుకున్న..కవిత్వం లో రాజకీయం ఉంటుందా..అన్న వాక్యాలు వ్యాసం చదవడానికి ఆసక్తి కలిగించాయి…అలా చదువుతూ ..శ్రీకాకుళ ప్రాంతాన్ని గిరిజన పోరాటాల్ని… ఆ రక్తపాతాలను…ప్రత్యక్షంగా చూసినట్టనిపించింది…
  ఎప్పటిలా మీ వ్యాసం….మీదైన విశ్లేషణ లో సాగింది…
  విశేష కవిత్వాన్ని ఎంపిక చేసుకుని ఇలా పరిచయం చేస్తూ ..ఎంతో తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు… ధన్యవాదాలు….

 • Chayaraj’s has been a poet of the right politics and heightened poetry. He ranks among the great poets of contemporary India.

 • ” గుమ్మ ” లాంటి గొప్ప కవితా సంపుటిని గిరిజన లోకానికి కానుకగా ఇచ్చిన కవి చాయరాజ్.. కొండ కావ్యాలను రాయడంలో మంచి దిట్ట.. ఇప్పుడు ” శ్రీకాకుళం ” పేరుతో నక్షల్బరీ ఉద్యమాన్ని.. ఊగించి.. శ్వాసించి.. శాసించిన.. కథనాల నేప ధ్యాన్ని అక్షరీకరించడంలో.. అందెవేసిన చెయ్యి దివంగత ఛాయారాజ్ ది.. ప్రజాస్వామ్యం ముసుగులో చెలరేగిన ఆరాచకత్వం.. ఎన్ని ప్రాణాలను బలిగొందో.. ఆ బాధ వర్ణనాతీతం.. ఈ దృశ్యాన్ని కళ్ళకి కట్టించడంలో.. కవి ఛాయారాజ్ ఎంత మథనపడ్డాడో.. ఇక్కడ విమర్శకుడు పుప్పాళ్ళ శ్రీరాం కూడా..అంతే ఆత్మ సంఘర్షణకు లోనయ్యాడు.. వొలికిన పదాల్లో.. చిలికిన భావ సంఘర్షణలో.. వెంటాడిన జ్ఞాపకాల్లో.. అనుభవించి పలవరించిన బతుకు వెతల కన్నీటి జీవన కథల్లో.. ఒకటే ఆరని వేదన.. పాలితుల పీడనలో అస్తిత్వ కదలికలు.. వర్గపోరాటం అంతిమ దృష్టి.. జీవన లక్ష్యం.. కానీసన్యాయం.. స్వేచ్ఛాయుత సమదృష్టి.. మిగులవిలువ పొందడం.. ఇవన్నీ శ్రీరాం దృష్టిని మరల్చలేకపోయాయి.. మార్క్సిజం దృక్పథాన్ని ప్రతిబింబించడం.. చివరికి ఏదైతేనేం.. ఛాయారాజ్ కవితాత్మను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యాడు.. నేల రాలిన పోరాటవీరుల్ని.. అప్పటి స్థితిగతుల్ని.. రాజకీయ పరిస్థితుల్ని.. విస్తరించిన ఉద్యమ క్రమాన్ని.. అనంతర పరిణామాలనీ.. లోతుగానే చర్చించాడు.. ఒక కవి కనుకే.. మరొక కవి మనస్తత్వాన్ని విమర్శకుడిగా పట్టుకోగలిగాడు.. మంచి సమీక్షను అందించిన శ్రీరాంగారికి.. ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తున్నాను!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.