కుల వివక్ష మీద బలమైన బాణం

2018 మార్చి. గుజరాత్ లోని తింబి గ్రామంలో ప్రదీప్ రాథోడ్ అనే ఇరవై ఒక్క ఏళ్ల దళిత యువకుడ్ని అగ్రకులస్తులు ఘోరంగా హత్య చేశారు. గుర్రాన్ని పెంచుకోవడం అతడు చేసిన నేరం. 2018 ఏప్రిల్. రాజస్థాన్ భిల్వారా జిల్లాలో దళితుల పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాడని అతనిపై ఘాతుకంగా దాడి చేశారు అగ్రవర్ణ దురహంకారులు. అంతకు మూడేళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని రత్లాంలో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. చెప్పుకుంటూ పొతే దళితులపై అకృత్యాలు జరగని రోజంటూ లేదు. ‘పెరియేరుమ్ పెరుమాళ్’ తమిళ చిత్రం చూసిన తర్వాత చిత్రంగా ఈ గుర్రం వుదాహరణలే గుర్తొస్తున్నాయి.  గుర్రం అధికారానికి, సంపదకి చిహ్నం. అది  అగ్రకులం సొత్తు మాత్రమే కావాలి. దళిత కుక్కగుర్రమెక్కే ఊహ కూడా మానుకోవాలి. అదీ అగ్రవర్ణ ఆదేశం. కానీ మన సినిమాలో దళిత కథానాయకుడు మాత్రం తను గుర్రమెక్కి వచ్చిన దేవుడిని అంటూ ‘పెరియేరుం పెరుమాళ్’ అన్న తన పేరుకి అర్థం చెబుతాడు క్లాసులో లెక్చరర్తో. బి.ఎ.బి.ఎల్. కంటిన్యూయింగ్ అని కూడా చెబుతాడు అప్పర్ లైనింగ్ తో. (లైనింగ్ లో కూడా నిమ్నస్థానం వద్దనేమో!)

ఇటీవలి కాలంలో మరాఠీలో నాగరాజ్ మంజులే, తమిళంలో పా. రంజిత్ వంటి నవతరం దర్శకులు భారతీయ సినిమాలో దళిత కేతనాన్ని ఎగరేస్తున్నారు. సినిమాలో అంబేద్కరిజాన్ని సెలబ్రేట్ చేస్తున్న ‘మద్రాస్–కబాలి-కాలా’ ఫేం పా. రంజిత్ తన ‘నీలం ప్రొడక్షన్’ సొంత బ్యానర్ పై నిర్మించిన మొదటి సినిమా ఇది. దర్శకుడు మారి సెల్వరాజ్ కూడా తన ఈ మొదటి సినిమాతోనే అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఈ సినిమా మణిరత్నం సినిమాతో సహా రిలీజ్ కావడంతో ప్రదర్శనకు తగినన్ని హాళ్ళు కూడా దొరకలేదు. కానీ ఆ నోటా ఈ నోటా సినిమా ప్రచారం కావడంతో, అవతలి సినిమా చప్పబడిపోవడంతో థియేటర్ యజమానులు ఈ సినిమాకు ఎక్కువ షోలు కేటాయించక తప్పలేదు. చిన్న, పెద్ద కులాల వివక్షల ఈ దేశంలో చిన్న, పెద్ద సినిమాల వివక్ష ప్రతి శుక్రవారమూ సినిమాల విడుదల  సమయంలో కనిపిస్తున్నదే.

కుక్కలా అవమానించబడుతున్న వాడు తన పేరుకు తగ్గట్టు గుర్రమెక్కే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించడమే సినిమా ఇతివృత్తం. కులం, మతం మానవత్వానికి కంటకాలు అని ఆరంభంలో చూపినపుడే ఈ సినిమా ఎలా సాగాబోతోందో మనకర్థమవుతుంది. కథాకాలం 2005. ‘కరుపి’ (నల్ల కుక్క) చావుతో మొదలౌతుంది సినిమా. ఊరి బయటి నీటి కుంటలో కొందరు నిమ్నకులస్తులు పాటలు పాడుకుంటూ పెంపుడు కుక్కలను ఆ నీటిలో స్నానం చేయిస్తుంటారు. అక్కడికి కథానాయకుడు ‘పెరియన్’ వస్తాడు తన ప్రాణానికి ప్రాణమైన కరుపితో. వారు బయల్దేరేసరికి అగ్రకులాల బ్యాచి అటువైపు వస్తుంది. తర్వాతి రోజే లా కాలేజీలో అడ్మిషన్ గనుక తను గొడవకు పోనంటాడు పెరియన్. ‘ఎంతకాలం అణిగిమణిగి ఉండాలి’ అని వాళ్లలో ఒకడంటే మన పెద్దవాళ్ళు వీళ్ళ పొలాల్లో పని చేస్తున్నంత కాలం మన బ్రతుకులు ఇంతే అని జవాబిస్తాడు మరో కుర్రాడు. మరోవైపు, ‘వీళ్ళకి ఈ రోజు బుద్ధి చెప్పాల్సిందే’ అని అంటాడు పెద్దకులానికి చెందిన ఒక కుర్రాడు. మరొకడు ‘అపవిత్రమైపోయిన’ ఆ నీటి కుంటలో ఉచ్చ పోస్తాడు. ఇంటికి వెనుదిరిగిన పెరియన్ కి కరుపి కనిపించడంలేదని తెలుస్తుంది. మనసు శంకించినట్టే అగ్రవర్ణానికి ఆ మూగజీవి బలైపోతుంది. రైల్వే లైనుకు కట్టేయగా వాయువేగంతో వస్తున్న ట్రైను కింద పడి తునాతునకలౌతుంది. ‘మనుషులంతా ఒక్కలాంటి వాళ్ళని ఎలా నమ్మేశావమ్మా? ఎవరు పిలిచినా వెళిపోతావా?’ అంటూ ఊరిజనం ‘కరుపి’ కోసం విలపిస్తూ గౌరవంగా అంత్యక్రియలు జరుపుతారు.

తిరునెల్వేలి లా కాలేజీలో చేరుతాడు పెరియన్. ‘లా చదివి ఏమవ్వాలనుకుంటున్నావ్?’ అని ప్రిన్సిపాల్ అడిగితే ‘డాక్టర్ అంటే డాక్టర్ అంబేద్కర్ అవుదామనుకుంటున్నాను’ అని చెప్పి అక్కడే ఐడెంటిఫై అయిపోతాడు. పెద్ద కులపు ‘లా కాలేజి’ ప్రిన్సిపాల్ కి రాజ్యాంగ నిర్మాత పేరు కూడా సందేహాస్పదమనిపిస్తుంది. ప్రిజుడిస్ తో వున్న అతడు అడ్మిషన్ ఫారం వెనక ఆ సంగతి రాయమంటాడు తన గుమస్తాతో. అంబేద్కర్ పెరెత్తే వారు త్వరలోనే ఏదో రాజకీయపు గొడవ చేస్తారన్నది అతడి ప్రగాఢవిశ్వాసం! ఆయన టేబుల్ మీద గాంధీజీ పటం ఉంటుంది. నూతన ఆలోచనలకి శ్రీకారం చుట్టాల్సిన విద్యాసంస్థలు కులవ్యవస్థ కేంద్రాలుగా మారాయని రుజువుచేస్తాయి కాలేజీలోని పరిస్థితులు. అగ్రవర్ణాల వారు ముందు బెంచీల్లో, దళితులు వెనక బెంచీల్లో! ఇంగ్లీషు సరిగ్గా రాకపోవడంతో లెక్చరర్ల హేళన ను ఎదుర్కొంటాడు పెరియన్. నుదుట తిలకం పెట్టుకున్న ఇంగ్లీష్ అధ్యాపకుడు రిజర్వేషన్ తో వచ్చిన కోటా కోడివి, కనుక గుడ్లు పెట్టడానికే పనికొస్తావ్ అని అతడితో అవమానంగా మాట్లాడతాడు. కానీ, విద్యావ్యవస్థ లోపం వల్లనే పల్లెటూరి విద్యార్థులకి ఇంగ్లీషు సరిగా రావడం లేదన్నది అసలు నిజం! పెరియన్ అమాయకత్వాన్ని మెచ్చి, అతడికి ఇంగ్లీషు విషయంలో సహకరించడానికి ముందుకొస్తుంది జో లేక జ్యోతి మహాలక్ష్మి అనే అగ్రకుల అమ్మాయి. వారి స్నేహం అదే క్లాసులో వున్న జో అన్నయ్య శంకర లింగం కు నచ్చదు. కాలేజీ మొత్తానికి పెరియన్ ఒక్కడినే తన అక్కయ్య పెళ్ళికి ఆహ్వానిస్తుంది జో. ఆహ్వానం అందుకుని వెళ్ళిన పెరియన్ ను జో తండ్రి ఓ గదిలోకి తీసుకుపోతాడు. అతడి వూరి పేరు ‘పులియాంకులం’ ద్వారా కులాన్ని కనిబెడతాడు. ఆ గదిలో శంకర లింగం మనుషులు అతడిని చావబాది, అతడిపై ఉచ్చపోస్తారు. తమ అమ్మాయి నుంచి దూరం కాకపొతే అతడినీ, తమ అమ్మాయినీ తమ కులపోళ్ళు చంపేస్తారని బెదిరిస్తాడు జో తండ్రి. జరిగిన సంగతి తెలీని జో పెరియాన్ తనకెందుకు దూరంగా ఉన్నాడో, హఠాత్తుగా ఈ మార్పేమిటో అని బాధపడుతుంది.

తనను అమితంగా ప్రేమిస్తున్న జోకి నిజం చెప్పలేక, కేవలం పుట్టుక కారణంగా తనెందుకు ఆశ్ప్రుష్యుడయ్యాడో అర్థం కాక, ‘నేనెవర్ని?’ అన్న ప్రశ్నకు జవాబు దొరక్క తాగిన మైకంలో క్లాసులో కొచ్చి, వార్నింగులు పొంది స్వవినాశక పతన దిశలో సాగుతాడు పెరియన్. ‘హ్యుమిలియేషన్’ అన్న మాటకు ‘అవమానం’ అన్న మామూలు అనువాదం సరిపోదేమో! అటువంటి ‘హ్యుమిలియేషన్’కు గురై ఎంతో పెద్ద ‘ఏంబిషన్’తో వచ్చిన రోహిత్ వేముల లాంటి బ్రైట్ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, మన పెరియన్ అలా కాకుండా తన ఆత్మగౌరవాన్ని కూడగొట్టుకుని ఎదురు నిలవాలనుకుంటాడు. కానీ, అతడ్ని ప్రతిసారీ మరింత అపనిందల పాలు చేస్తుంటారు శంకరలింగం అండ్ కో. పేరెంట్ కాల్ పై కొత్త ప్రిన్సిపాల్ తో కలవడానికి వచ్చిన అతడి  తండ్రిని కూడా బట్టలూడదీసి అవమానిస్తారు ఈ అగ్రవర్ణ మూక. ఏం చేసినా, అసలు సమస్య తమ అమ్మాయి వైపు నుండే వుందని బాగా అర్ధమైన తర్వాత అతడిని లేపేయడానికే నిశ్చయించుకుంటారు.

అనుమానం రాకుండా పగడ్బందీగా హత్యలు చేసే ఒక ముసలాడి పాత్ర ఈ సినిమాలో ఉంది. కులహంకారం వంటబట్టించుకున్న యితడు తను చేసే హత్యలు కులదేవతకు నైవేద్యం లాంటివని చెప్పుకుంటాడు. ఇతడికి కులపిచ్చి ఎంతెక్కువంటే వూరి చెరువులో స్నానమాడినందుకు ఒకడ్ని చంపుతాడు. కులం తక్కువవాడ్ని ప్రేమించిన అమ్మాయి ఇంకా బ్రతికుందని తెలిసినా చంపేస్తాడు. మంచివాడని తెలిసినా నిమ్నజాతి వాడి ప్రక్కన బస్సులో కూర్చోడు. కులం హత్యల్ని, పరువు హత్యల్ని యాక్సిడెంట్లుగా, ఆత్మహత్యలుగా చలామణి చేయగలడు. ఇతన్నే పెరియన్ హత్య కోసం నియమిస్తారు. ‘కుర్రాడు మంచి వాడ’ని తెలిసినా ‘కులం’ కోసం వొప్పుకుంటాడు. మొన్నటి ప్రణయ్ హత్యలా, కోల్కతాలో కొన్నేళ్ళ క్రితం జరిగిన రిజ్వనూర్ రెహమాన్ హత్యలా, 2013 జూలై 4న ఇళవరాసన్ అనే ఒక నిమ్నకుల అబ్బాయి (ఆత్మ)హత్య తమిళనాడులో చాలా కుఖ్యాతి గాంచింది. రైలు పట్టాలను చూపిన ప్రతిసారీ ఇళవరాసన్ ను గుర్తుచేస్తాడు దర్శకుడు. పెరియన్ హత్యను యాక్సిడెంట్ గా చూపే యత్నంలో విఫలుడై తను తక్కువ కులం వాడి చేతిలో ఓడినందుకు అవే పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటాడు ఆ ముసలాడు.

కరుపి సినిమా మొదట్లోనే చనిపోయినా, దాని నీడ సినిమా మొత్తం వుంటుంది. అది అవమానపు నలుపునుండి ఉద్యమించే నీలంలోకి మారుతుంది. చాలా ప్రతీకాత్మకంగా సినిమా ఆఖర్లో కథానాయకుణ్ణి కాపాడుతుంది. ‘నాన్ యార్?’ (నేనెవర్ని?) పాట నిండా ఎన్నో ప్రతీకలు. పురాణాల నుంచి, సైకో ఎనాలిసిస్ నుంచి, వార్తల నుంచి,    ఇళవరాసన్, రోహిత్ వేముల ఇలా ఎన్నెన్నో!  చావు తర్వాత నీలం రంగులోకి మారే నేనెవర్ని?’ అన్న పాటలోని వాక్యం శరీర తత్వాన్ని, పోరాట తత్వాన్ని బోధిస్తున్నట్టు వుంటుంది. ఒక చోట బస్టాండ్లో పూర్వ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ మృతికి సంబంధించిన పోస్టర్ ఒకటి ఉంటుంది. తర్వాత్తర్వాత దళితుల (ఆత్మ)హత్యల పోస్టర్లతో ఆ గోడ కప్పబడిపోతుంది. దళితుడు దేశాధ్యక్షుడైనా, దళితులపై అమానుషత్వం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పకనే చెబుతాడు దర్శకుడు.

కథానాయకుడి అడ్మిషన్ నాటి అగ్రవర్ణ ప్రిన్సిపాల్ దృక్కోణానికీ, తర్వాత వచ్చిన దళిత ప్రిన్సిపాల్ దృష్టికీ తేడా ఉన్నట్టు చూపుతాడు దర్శకుడు. “నేను చెప్పులు కుట్టేవాడి కొడుకునని నన్ను అవమానించినవారే నేడు ఈ స్థితికి వచ్చిన తర్వాత చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కాబట్టి కష్టపడి పైకి రా. నీకు జరిగిన అవమానాన్ని, నీ కోపాన్ని కసిగా నీ చదువు మీద చూపించు. నువ్వు అనుకున్నది సాధించు. అప్పుడే నిన్ను సమాజం గుర్తిస్తుంది’’ అని ఈయన పెరియన్ కి ధైర్యం చెబుతాడు. వీడు వురేసుకు చావడని నాకు తెలుసు. పోరాడుతూ చనిపోనీ అని ఒక టీచర్ తో అంటాడు. ఈయన టేబుల్ పై అంబేద్కర్ పటం ఉంటుంది.

కదిర్ అమాయకమైన మొహం కథానాయకుడి పాత్రకు తగ్గట్టు సరిపోయింది. జో (ఆనంది) పాత్రచిత్రణలో కొంత లోపం వుందనిపించింది. కానీ, సంగీతం పెద్ద హైలైట్. పా. రంజిత్ కోసం సంతోష్ నారాయణన్ ప్రత్యేకంగా కంపోజ్ చేస్తాడేమో. ర్యాప్ అయినా, గరగాట ప్రదర్శన కోసం (పెరియన్ తండ్రి స్త్రీ వేషం వేసి ఆడే పాట) జానపదం అయినా అన్ని పాటలతో సహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అమోఘం. ముసలమ్మ ఏడుపుతో ‘కరుపి’ పాత ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’ సినిమాలోని ‘పేసురెన్ పేసురెన్’ పాటను గుర్తు తెప్పించింది. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ లకి కూడా వంద శాతం మార్కులు దక్కాలి. కథలో ఎన్నెన్నో అంశాలతో పాటు జెండర్ అంశం పెరియన్ తండ్రి పాత్ర ద్వారా చెప్పడం బావుంది. చెట్టంత మగబిడ్డకి తండ్రి అయినప్పటికీ అతడి పుంసత్వాన్ని శంకిస్తుంది అల్లరి మూక. స్త్రీ, పురుషుడు అనే బైనరీ తప్ప శరీరనిర్మాణం లోపం వలన గానీ, ఇతరత్రా కానీ మరో రకపు సెక్సువాలిటీని కనీసపు మర్యాదతో చూసే పరిస్థితి సమాజంలో లేదని, ఎన్నో వివక్షల్లో ఇదొకటని చెప్పడం బావుంది. కులములన్నియు మాసిపోవును, మందు ఒక్కటె నిలిచి వెలుగును(గురజాడకు క్షమాపణతో) అనేలా వుంటుంది మందుషాపులోని ఒక హాస్య సన్నివేశం. నుదుట నామాలు పెట్టుకుని, జంధ్యం రివర్సులో వేసుకున్న ఒక పెద్దాయన్ పెరియన్ కి ‘తల రాట్నంలా త్రిప్పించగల సరుకు’ త్రాపిస్తాడు. మరో చోట నిర్మాణంలో వున్నా గుడిలో కథానాయకుడు స్నేహితులతో మందుకొడుతూ కనిపిస్తాడు.

చాలా వివాదాస్పదమైన సబ్జెక్టు ఐనప్పటికీ ఉపన్యాసధోరణి, ప్రచారధోరణి రానివ్వకుండా కథాకథనంలోనే  తన సందేశాన్ని ఎంతో సున్నితంగా చెబుతాడు దర్శకుడు. కాదు, మనల్ని ఆలోచించమని అభ్యర్దిస్తాడు. సినిమా ఆఖర్లో జో నాన్నకీ, పెరియన్ కీ మధ్య సంభాషణ ఎంత హృద్యంగా వుందో గమనించండి.

జో నాన్న: “నిన్ను మా అమ్మాయి అమితంగా ప్రేమిస్తోంది. నువ్వు కూడా అంతే గాఢంగా ప్రేమిస్తున్నావా?”

పెరియన్: “అది తెలుసుకునేలోగానే నన్ను నిలువునా చంపేశారు కదా సార్?”

జో నాన్న: “ప్రస్తుతానికి బాగా చదువుకో, చూద్దాం భవిష్యత్తు ఎలావుంటుందో!”

పెరియన్: మీరు మమ్మల్ని కుక్కలుగా చూసినంత కాలం పరిస్థితి మారదు సార్.

బెంచీపై టీ గ్లాసుల్లోని టీ రంగును, గ్లాసుల్లో మిగిలిన టీ మట్టాలనూ సమాజంలోని తేడాలకు ప్రతీకగా చూపుతాడు దర్శకుడు. ఆ రెండు గ్లాసుల మధ్య కదలాడుతున్న పువ్వును (ఆ పువ్వు జో ది, పూర్వభావన లేని నిష్కల్మష ప్రేమది) చేతిలోకి తీసుకోలేకపోతున్నారని బాధపడతాడు. చిన్న పిల్ల పాడే ఎండ్ క్రెడిట్ పాట కూడా రా, మనం రైలుబళ్లలా ప్రక్కప్రక్కనే (హెచ్చుతగ్గులు లేకుండా సమాంతరంగా) పోదామా?’ అని ప్రాధేయపడుతుంది. ఇంత సున్నితంగా మాట్లాడిన సినిమాను కూడా ‘కులాల మధ్య చిచ్చుపెట్టే సినిమా’ అని తీర్మానించేవాడు తప్పకుండా అతి పెద్ద కులదురహంకారి అయ్యుండాలి.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

3 comments

  • కులం అనే కుల గజ్జి కి మందు, మాకు, వైద్యులు లేరు.
    సమాజ నిర్మాణానికి నిజంగా మానవత్వం ముందుకు రావాలి.
    కులం అనే నిప్పు సెగలో, స్వార్థ ప్రయోజనాల కోసం అన్నము వండు కోవడము, నీళ్లు మరిగించు కోవడం, మురికి బట్టలు ఉడక పెట్టుకోవడము కన్నా హీన స్థితి మరి వేరే లేదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.