అబద్ధాలపై అబద్ధాలు – పాలన నవ్వులపాలు.

మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఓ కొత్త జబ్బు పట్టుకుంది. యీ జబ్బు గతంలోనే వున్నా 2014 లో అనుకోకుండా వచ్చిపడిన అధికారం  ‘అహం బ్రహ్మాస్మి‘ భావనను మరింత పెంచినట్టుంది. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని అనే విషయం మరిచిపోయరా అని జనాలు అనుకునేంత స్థాయిలో ఉంటున్నాయి  ఆయన మాటలు కొన్నిసార్లు. ఒక పని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసిన తర్వాత అది నా కృషి అని చెప్పుకుంటే బాగుంటుంది. ఎవరో శంకుస్థాపన చేసి ముప్పాతిక పనులు పూర్తి చేసినవి, తాను ఒకప్పుడు వ్యతిరేకిస్తే ఆ పాలకులు ముందుకు తీసుకుపోయినవి కూడా తానే పూర్తి చేశానని చెప్పుకోవడం చూస్తే అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లాడు గోముగా అన్నీ నావే అనే సీన్ గుర్తుకొస్తోంది. మొదట అంత నవ్వులాట కాకపోయినా; మితిమీరిపోతున్న యీ పైత్యాన్ని రోజూ గమనిస్తున్న ప్రజలు విసుక్కుంటున్నారు. ఎలిమెంటరీ స్కూలు పిల్లల నుండి సోషల్ మీడియా వరకూ ఇదొక నవ్వులాట అయిపోయింది.

పొద్దున్న లేచింది మొదలు మంచి పనైతే తన వల్ల అనీ , ఏ తప్పు జరిగినా వెంటనే ప్రతిపక్షం కుట్ర అనో లేక కేంద్ర ప్రభుత్వం లాబీయింగ్ అనో అనడం పరిపాటి అయిపోయింది. అసలు జనాలైతే యీయన చెప్పే మాటల్లో అబద్దాలను కాదు నిజాల్ని వెదుక్కుంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చెప్పినట్లు 2014 వరకూ కేంద్రం తరుపు సాయాన్ని లెక్కగట్టి 4000 కోట్లు మంజూరు చేస్తామని చెబుతుంటే , అలా కాదు మొత్తం లోటు బడ్జెట్ 16 వేల కోట్లు మీరే ఇవ్వాలని పట్టుబడుతూ నానా యాగీ చేస్తున్నారు. మాజీ సీఎస్ లు, ఆర్థిక రంగ నిపుణులు ఎంతోమంది అలా మొత్తం లోటు బడ్జెట్ అంతా కేంద్రమే భరించాలని చట్టంలో లేదు అని చెబుతున్నా వారి మాటల్ని లెక్క చేయకుండా మంత్రి వర్గాన్నేసుకుని పదే పదే చెప్పిందే చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నారు.

పోలవరంలో ఓ ఆక్విడక్ట్ కూలిపోతే ప్రతిపక్షం కుట్ర, సచివాలయంలో సీలింగ్ నుంచి నీరు కారితే అదీ ప్రతిపక్షం కుట్ర… ఇటువంటి చవకబారు మాటలు ఆయన్ని మరింత అపహాస్యం పాలు చేస్తున్నాయి. ఎండాకాలంలో వేడిని తగ్గించమని కలెక్టర్లను ఆదేశించడం, తుపానులలో సముద్రాన్ని కంట్రోల్ చేశాను అనడం… ఈ మాటలు రోజురోజుకు ఆయన ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడి ప్రజల్లో తన పార్టీకి గుర్తింపు లేదని తెలిసినా అడ్డదారిలో కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలో అడుగు పెట్టాలని పార్టీని పోటీకి దించాడు.  ఎలక్షన్లలో పోటీచేసేవారెవరైనా తమ గత పాలనాభివృద్దో, పార్టీ పూర్వ నేతల చరిష్మానో చెప్పుకుని ఓట్లు అడుగుతారు. కానీ ఈయన గారు తనదైన శైలిలో ‘నేను కట్టిన హైదరాబాద్’ అనేశాడు. అసలే ప్రాంతీయవాదం, అస్తిత్వం అజెండాగా పోరాడి వేరే రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు టీడీపీని దాన్ని భుజాన వేసుకుని బరిలో దిగిన కాంగ్రెస్ కు , టీజేఎస్ కు కొర్రు కాల్చి వాత పెట్టారు. అంతేకాకుండా సొంత రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలను బయటి నుంచి పార్టీలో చేర్చుకుని వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన యీయన పక్క రాష్ట్రానికి పోయి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించండి అని పిలుపునిస్తుంటే ప్రజలుగురివింద గింజ’ ను గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకున్నారు.

రాష్ట్రంలో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత మీద ఓ వ్యక్తి హత్యా ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రిగా, అంతకుమించి ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడిగా పరామర్శించి ఆ సంఘటనను ఖండించాల్సింది పోయి బాధితుడినే విమర్శించడం హేయమైన చర్య.  సంఘటన జరిగిన గంటలోపే, పోలీసులు ఒక అవగాహనకు రాకముందే అది కుటుంబ సభ్యులు చేయించారని, జగనే చేయించుకున్నాడని ఒక్కో మంత్రీ ఒక్కో మాట మాట్లాడుతుంటే ఆపకుండా మౌనం దాల్చారు. ఒకవేళ నిజంగా ఆ దాడి జగన్మోహన్ రెడ్డే చేయించుకున్నాడని ప్రభుత్వానికి అనుమానం కలిగితే చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి నిజాలేంటో రాబట్టొచ్చు. వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచి ప్రతిపక్షం కుయుక్తిని బట్టబయలు చేయొచ్చు. జగనే తన మీద హత్యా ప్రయత్నం చేయించుకుని వుంటే, దానికి ఆధారాలు సంపాదిస్తే అధికార పక్షానికి అదొక పెద్ద ప్రచారాస్త్రం. అంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా. పొద్దున్న లేచినప్పటి నుంచి కనీసం రోజులో ఒక్కసారైనా ‘ నలబై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞున్ని’, ‘దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుణ్ణి’ అని చెప్పుకునే ముఖ్యమంత్రికి యీ చిన్న లాజిక్కు తట్ట లేదని ఎవరూ అనుకోరు.

కొత్త రాష్ట్రంలో ప్రజలిచ్చిన పదవితో గౌరవప్రదంగా పాలన చేయాల్సింది పోయి అడుగడుగునా జరుగుతున్న యీ అబద్ధాల పర్వం వల్ల జనాల్లో అసహనం రోజు రోజుకు పెరుగుతోంది. నూతన రాజధాని ఏర్పాటు, కొత్తా పాత ప్రాజెక్టులు అన్నిట్లోనూ నిలకడలేని చేష్టలే . రాజధాని విషయంలో నైతే అన్నీ కొర్రీలే. రోజుకో మాట, పూటకో చోట భూసేకరణ పేరిట ఇష్టారాజ్యంగా సరిహద్దుల మార్పులు, రైతుల నుంచి వ్యతిరేకత  వీటన్నిటితో అమరావతి మహా జోరుగా ఉంది. అసలు రాజధాని ప్రదేశం ఎంపికే ఏకపక్ష నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి లోబడి నియమించిన నిపుణుల కమిటీ సూచనలను గాలికి వదిలేసి వ్యాపారవేత్తలతో, వ్యాపారవేత్తలైన మంత్రులతో సబ్ కమిటీ నియమించి వాళ్ళు ఎంచుకున్న ప్రాంతాన్నే రాజధానిగా ప్రకటించడం అంతా గందరగోళమే. యీ గందరగోళ వాతావరణంలో సామాన్య ప్రజలకు ఏది మంచో ఏది చెడో కూడా అర్థం కావడం లేదు. ఇది చాలక దేశ దేశాలన్నీ తిరగడం, పోయిన ప్రతి దేశ రాజధానిలాగా అమరావతిని కడతానని ప్రకటన చేయడం అలవాటయిపోయింది. రాజధాని నిర్మాణం కోసం నమూనాలు ఇవ్వమని సినిమా డైరెక్టర్లను పిలిపించి మీటింగ్ పెట్టడం వల్ల  చూస్తున్న జనాలు తమ మనవలయినా ఆ కట్టడాల్ని చూస్తామా అని మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా అధికారులు పదవిలో వున్నంతకాలం నోరు విప్పకుండా పదవీ విరమణ తరువాత ఒక్కొక్కరూ వేదికలెక్కి ఇంతగా విమర్శలకు దిగడం బహుశా యీ ప్రభుత్వ హయాంలోనే జరిగుంటుంది. ఆ మాజీ అధికారుల మునుపటి మౌనానికి కారణం ఏమిటన్నది ప్రజలే గమనించాలి.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక్కదాన్నీ పూర్తి చేసింది లేదు. తాత్కాలిక పనులు మొదలు పెట్టడం, వాటికే అసలు ప్రాజెక్టులకు అయ్యేంత డబ్బు ఖర్చు చేయడం. ఇంతవరకు మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 95 శాతం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములే. ఒకవైపు రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులు అత్యంత తక్కువ ఖర్చుతో గ్రావిటీ ప్రాజెక్టులు చూపిస్తున్నా లిఫ్ట్ ఇరిగేషన్ కే మొగ్గు చూపడం దేనికి సంకేతం? అసలే లోటు బడ్జెట్ రాష్ట్రంలో ప్రజల నెత్తిన యీ శాశ్వత ఖర్చులను రుద్దడం అవసరమా? ఇక ప్రాంతీయ పక్షపాత ధోరణి సరే సరి. దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. పట్టిసీమ ద్వారా సీమ సస్యశ్యామలం అంటూ సీఎంతో సహా మంత్రులందరి స్టేట్మెంట్లని విని రాయలసీమ జనాలు నిజంగా ఎక్కడో దిగువన ఉన్న పట్టిసీమలోని నీళ్లు పైన ఉన్న శ్రీశైలంలో వచ్చి పడతాయేమో అనుకుంటున్నారు.  దీనికి కారణం స్పష్టత లేని ప్రభుత్వ ప్రకటనలే. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి మళ్లించబడిన నీటికి బదులుగా కృష్ణా నీరు సీమ ప్రాంతం వాడుకోవచ్చని ఒక జీవో విడుదల చేయాల్సిందిగా రాయలసీమ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దానికి సీఎం గారిచ్చిన సమాధానం వింటే దేశంలో ఉన్న అందరి రాజకీయ నాయకుల తెలివితేటల్ని శంకించాల్సిందే. ఆయన మాటల్లో సమాధానం ఏమిటంటే ‘ మీకు నీళ్లు కావాలా? జీవో కావాలా? జీవో తో పనిలేకుండా నీరు ఇస్తా, జీవో ఇస్తే ఎగువ రాష్ట్రాలు వాటా అడుగుతాయి. వారికి తెలియని యీ విషయాన్ని మీరే తెలియజేసేలావున్నారు.’ ఐతే నిజంగా జీవోతో పనిలేకుండా నీరు ఇస్తామంటే ఇంకేం కావాలి. ప్రజలకు జీవోలు కాదు నీళ్లు కావాలి. మరి ఓ తెల్ల కాగితం దాని మీద అక్షరాలు, రాజముద్ర ఇవన్నీ ఎందుకు? జనాల భయమంతా జీవోలు ఇచ్చిన వాటిని అమలుకే గతి లేదు ఇక నోటి మాటలు నెరవేరేనా అని.

రోజురోజుకు పెరుగుతున్న అసహనం దేనికి సంకేతం

గడిచిన నాలుగున్నర ఏళ్ల పాలనలో మొదటి సంవత్సరం మినహా మిగిలిన కాలమంతా అసహనాల ఘట్టాలే. ఒక్కసారైనా మంచిగా సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజల దగ్గర్నుంచి ప్రతిపక్ష నేతల వరకు అందరి మీదా అసహన ప్రదర్శనే. ఎవరి మీద అసహనం? అసలెందుకు యీ అసహనం? ప్రజలెవరైనా తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే, వారికి కనీస గౌరవం ఇచ్చి అసలు వారేం చెబుతున్నారో వినడం ముఖ్యమంత్రి చేయాల్సిన పని. అలాగాక జనాల మీదనే చిందులు వెయ్యడం, మీరేంటి నాకు చెప్పేది నాకన్నీ తెలుసు అని బాహాటంగానే వారి మీద విరుచుకుపడడం జరుగుతోంది. 2014 ఎలక్షన్లకు ముందు క్షురకులకు గౌరవ వేతనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు తమకిచ్చిన హామీని గుర్తు చేయాలని వెళితే వారిని వేలు చూపించి మరీ బెదిరించడం మొన్న తిరుపతిలో చూశాం. ఐనా మితిమీరిపోతున్న యీ అసహనానికి కారణం ఏమిటి? ఒకవైపు తమ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని బాకాలూదుకుంటూనే ఉన్నారు గదా. రాబోయే ఎన్నికలకు ధైర్యంగా వెళ్లాల్సింది పోయి ఎందుకింత  ఇదైపోతున్నారు?.

రాష్ట్రంలో ఒక్క పనీ సంపూర్తి అయిన దాఖలాలు లేవు. ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు సన్నగిల్లిపోతుంది. ప్రజల్ని మీడియా మేనేజ్మెంట్ ద్వారా లోబరుచుకునే పద్ధతికి కూడా కాలం చెల్లింది. కేవలం ఒక పార్టీ తరుపు వాదాన్ని ప్రజల్లోకి జొప్పించే సమస్య ఇకలేదు. ప్రభుత్వ , ప్రతిపక్షాల ఇరువురికి మీడియా ఉంది.  అంతకుమించి; సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రజలకు నిజానిజాలు బాగా తెలుస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా అంటే , అనుమానమే. అధికార పక్ష ఎమ్మెల్యేల నుండి ముఖ్యమంత్రి గారి దాకా యీ పని పూర్తి చేసి మీకు మేలు చేశాం కాబట్టి మాకే మరో ఛాన్స్ ఇవ్వాలని కోర లేరు. ప్రతిదానికీ యూటర్న్ తీసుకుంటున్నారన్న అపవాదును పోగొట్టుకునేంత సమయం కూడా లేదు. స్వచ్ఛందంగా ప్రజల మనసును ఆకట్టుకునేందుకు పనిచేయాల్సిన కాలం గడిచిపోయింది. ఇప్పుడంతా మరో అవకాశం ఇవ్వమని అడగటానికి కారణాలు వెతుక్కోవడమే. అండగా ఉండటానికి 2014 లాగా బలమైన కూటమి లేదు. మొత్తానికి. పాలక పార్టీ ప్రతి విషయంలోనూ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. విషయంలో ప్రతిపక్షం కొంత మెరుగు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశమే తీసుకుంటే దాంట్లో ప్రభుత్వం ఎన్నిసార్లు మాట మార్చిందో ప్రజలందరికీ తెలుసు. అటువంటి వాటిలో ప్రతిపక్షం మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉంది. అయినా; బీజేపీ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం నుంచి ఇంకొంచెం గట్టి సమాధానం అవసరమే.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.