మరో చిట్టి సంబరం

ఓహ్, ఎనిమిది నెలలు, 15 సంచికలు.

మరో చిట్టి సంబరం.

సంతోషంగా చెబుతోంది ‘రస్తా’ మీకు… నూత్న వర్ష శుభాకాంక్షలు.

మరింత ఆనందంగా చెబుతోంది ‘రస్తా’ మీకు ‘థాంక్యూ సో.. మచ్’.

నిజం చెప్పొద్దూ!

అప్పుడు మీతో అనలేదు గాని, పత్రికను నిజంగా మొదలెడతామని మేము అనుకోలేదు. మొండిగా ప్రయత్నించామంతే.

కష్టప్పడి, బాధప్పడి ఒకటి రెండు సంచికలు తేగలం గాని, ఇది మనతో అయ్యే పని కాదు అనే అనుకున్నాం.

కాని, పని అయ్యింది. అవుతుంది. ప్రపంచం మంచిది.

చెడుగు మీద సమరానికి సై అనే ప్రపంచమే అధికం. పోసికోలు కబుర్ల ప్రపంచమూ వుంది గాని, అది బాగానే అల్లరి చేస్తుంది గాని; డెసిసివ్ కాదు.

చెడుగు మీద సమరం లేకుండా మంచికి మనుగడ లేదని, తిరుగుబాటు లేకుండా మంచి జీవితం అసాధ్యమని ‘రస్తా’ లో మేం ముగ్గురం భావిస్తాం. ఏం చేసినా, ఎలా చేసినా ఫరవా లేదు…. అది చెడుగును తుంచడానికి కాస్తయినా వుపయోగపడాలని మనో వాక్కాయ కర్మలా మేము కోరుకుంటాం.

అంతర్జాలం ఒక విచిత్ర ప్రదేశం. అన్నీ అరిచేతిలో వున్నంత సంతోషమిస్తుంది. అన్నీ, అందరూ మానసికంగా చేరువ అయ్యే సరికి ఆనందాలలతో పాటు మనః క్లేశాలు సైతం తామున్నామంటాయి. నిజాల్ని నిష్ఠూరాలు వెన్నాడుతాయి. నిజాల్లా కనిపించే అబద్ధాలు గుంటకాడి నక్కలు. ఎక్కడ మన కాలు జారుతుందా, ఎప్పుడు పీక్కుతిందామా అని చూస్తుంటాయి.

ప్రపంచంలో మంచివాళ్లే అధికం కాబట్టి మరేం భయం లేదనే భరోసాతో ముందుకు పోవడమే విజ్ఞత, అదే చెడుగు మీద గెలుపు దారి.

ఒకట్రెండు సందర్భాల్లో తప్ప మేం ఎవరినీ నొప్పించక మేమూ నొవ్వక సుమతులమై చరించామనే అనుకుంటాం. ఆ ఒకట్రెండు సందర్భాల్లోనైనా, కొందరు మేధావుల రాగద్వేషాలను అర్థం చేసుకోడంలో మా తొందరపాటు కారణం. ‘ఏ పుట్టలో ఏ పాము వుందో’ అనేది పాత సామెత. వేయి పడగల సంఘంలో ప్రతి పుట్టలో ఒక పాము వుండే అవకాశం వుంది, లేదని తెలిసే వరకు పాము వుందనే అనుకోవాలి, చేతికి గాట్ఠి తొడుగులుంచుకున్నాకే పుట్టల్లో చేతులెట్టాలి అని ఇటీవలి మా అనుభవం.

నలుగురు నడిచే దారికి కాస్త భిన్నంగా చరించడం, యోచించడం… అందుగ్గాను చిరు, పెను మూల్యాలు చెల్లించుకోడం మా యింటా వంటా ఎప్పుడూ వున్నదే.

నలుగురు నడిచే దారి సరైనదయితే ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు ఎందుకుంటాయి? ఇది సరైన సమాజం కాదు గనుకనే ఇన్నిన్ని కల్లోలాలు. ఉన్న కల్లోలం లేదనుకునే శాంతి కాముకులు ఎప్పుడూ వుంటారు. వారి కామం వాళ్లదని వూరుకోనక్కర్లేదు. దాన్ని కూడా ప్రశ్నించవలసిందే.

ప్రశ్నలన్నీ వొదులుకుని వుంటే, ఎంచక్కా చాల మందిలా…  సాంఘిక వ్యాకరణానికి, దాని కర్తలైన పెద్దయ సూరి గార్లకు కొన్ని నమస్కార బాణాలు పడేసి మా పబ్బం మేం గడుపుకునే వాళ్లం. ఏదో ఒక తిరపతి కి తలొంచి, గుండు కొట్టించుకుని, తరించే వాళ్లం.

తీరిక మరీ ఎక్కువయినప్పుడు కాసేపు కొన్ని పిడికిళ్ల మధ్యలో నిలబడి ఫుటొవాల్లో పడి, బూర్ల బుట్టల్లో మా వాటా మేము తీసుకునే వాళ్లం, నవీన పూజారులమై, ఆత్మలోకపు జారులమై.

ఎవరు ఎలా చస్తేనేం, మనకేమొస్తదో అది చూసుకోవాల అనుకుంటే చాల క్లేశాలుండవు. బోనస్ గా కొన్ని సుఖాలుంటాయి.

రెవల్యూషన్, రెవల్యూషన్ వితిన్ రెవల్యూషన్ రెండూ ముఖ్యమే, నిజమైన విప్లవానికి.

ఎదిరించాలి. ఎదిరింపును నిరంతరం బతికించాలి. సామాజిక రుగ్మతలు వుపశమించాక కూడా ప్రకృతి విధించే పరిమితుల మీద మనిషి ఎదిరింపు వుంటుంది.

విశ్రాంతి తాత్కాలికం, పోరాటం శాశ్వతం.

‘రణ క్షేత్రంలో ప్రణయకేళి, వ్రణ క్షేత్రంలో వాహ్యాళి…’ జీవితం

ఇది తలకిందుల సంఘం. దీన్నీ దీని కాళ్ల మీద నిలబెట్టాలి.

‘ఆఁ, నువ్వు నిలబెట్టే వాడివీ, ప్రపంచం నిలబడేదీనూ’ అంటో నుదుళ్లు విరుస్తారు కొందరు కాంప్రొమైజర్లు, వాళ్ల ద్వంద్వ నీతిని మనమింకా వేలెత్తి చూపక ముందే, ఒక ప్రీ యెంప్టివ్ మూవ్ గా.

అది కేవల ఎంప్టీ మూవ్.

మేం అలా అనుకోడం లేదు. మేము నిలబెట్టే వాళ్లమూ కాదు, ప్రపంచం మా వల్ల నిలబడేదీ కాదు.

అందరిలా మేమూ అనుభవించి పలవరించే వాళ్లమే. మా మాటలు శాశ్వత, సార్వత్రిక సత్యాలు కావు. అసలు, చర్చనీయాంశాలు కానివంటూ ఏవీ లేవు.

ప్రతిదీ ఎప్పటికప్పడు అనుభవాల ఆకురాళ్ల మీద నిగ్గు తేలవలసిందే.

మేము మాట్లాడుతున్నవి మా జీవనానుభవాల, మా పఠనానుభవాల మీద రుజువైనవి. మాకు రుజువైన వాటినే మేము జీవస్తున్నాం. జీవిస్తున్నవే మీతో మాట్లాడుతున్నాం.

మీరు కూడా… మీరెవరైనా సరే.. మీరు కూడా.. మీ జీవన, పఠనానుభవాల లోంచి మాట్లాడండి అని మాత్రమే స్నేహితులను కోరుతున్నాం. దుర్గంధాన్ని కప్పెట్టే సెంటిమెంట్ల సెంట్లు వెదజల్లొద్దంటున్నాం.

‘పెడగాజీ అఫ్ ది అప్రెస్డ్’ (‘పీడితుల విద్య’) రాసి, దాన్ని తన ఆచరణలో ప్రదర్శించిన పాలో ఫ్రెయిరే (1921- 1997), ‘ఫ్యాక్టరీ కౌన్సిళ్ల’ దారిలో… అనగా నిక్కమైన ‘ప్రజా సోవియెట్ల’ దారిలో… అనగా మేనేజర్లను వర్కర్లు నియమించే సహకార ఉత్పత్తి సంస్థల దారిలో.. సోషలిజాన్ని స్వప్నించిన ఆంటోనియో గ్రాంసీ (1891- 1937… మాకు ప్రేరణ. ఆ కల సాధ్యమే.

ఇప్పుడు జరగాల్సిందీ, నిజంగా జరుగుతున్నదీ వీధి పోరాటాలే. ఇవి స్ట్రీట్ ఫైటింగ్ టైమ్స్.

ఆల్వేస్ అబౌ ది బోర్డ్. ప్రిజర్వ్ అండ్ ఫైట్ అనేది ఇవాల్టి నినాదం.

పెట్టుబడికి, అన్ని రకాల బ్రాహ్మణ వాదానికి అనగా ఇంటల్లెక్చులిజానికి సవాలుగా జరిగే వీధి పోరాటాల కాలమిది.

రాజ్యాన్ని వ్యతిరేకించడానికి అదే రాజ్యాన్ని అనుకరించడం కుదరదు. రాజ్యాన్ని దాని ఆయుధాలతోనే వోడించడం కుదరదు.

జీవితం లోని ‘స్పాంటేనిటీ’ని కాళ్ల కింది నేల లోంచి వుబికే తిరుగుబాటును అడివి దారి పట్టించి జన జీవన మైదానాలను శతృవుకు ఖాళీ చేసే ఎత్తుగడ ప్రజోపయోగకరం కాదని చెప్పడానికి ‘రస్తా’ ఎప్పుడూ సందేహించలేదు. అది చాల ఖరీదైన సందేహమని సహచరులకు ‘రస్తా’ విజ్ఞప్తి చేస్తోంది.

కొందరికి ఈ విన్నపం నచ్చదు, హ్యాబిట్స్ డై హార్డ్. అలవాటయిన ఆలోచనలూ ఒక పట్టాన వొదలవు.

మరి కొన్ని అనుభవాలు అవసరం వాళ్లకు. ఆ యోధుల నిజాయితీకి, వాళ్ల త్యాగ ధనానికి ఎప్పటికీ మా జోతలు. ఆ దారి వైఫల్యానికి రాచబాట మాత్రమే కాదు, ఇతర సోషల్ శక్తుల చొరవకు ప్రతిబంధకం కాబట్టే లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టు కన్జర్వేటివిజం మీద ఈ విమర్శ తప్పనిసరైంది.

అత్యవసరమైన ఈ హెచ్చరికల్ని దాచుకోనక్కర్లేకపోతే, యోధులతో కలిసి పని చేయడానికి ‘రస్తా’ సదా సిద్ధం. నిజానికి సంతోషమూ, వుత్సాహం కూడా.

ఈ ఎనిమిది నెలల కాలంలో ముందుకు వొచ్చిన ఇస్యూస్ లో దాదాపు దేని ముందూ రస్తా మౌనం వహించలేదు. నేరపూరిత సమాజంలో మౌనం నేరమని ‘రస్తా’కు తెలుసు.

అది సాహిత్యమా, సమాజామా అని కాదు. ఏ మంచి వ్రాయస గాడికైనా ఆ రెండూ రెండు కళ్లు. అందులో ఏదో ఒకదానితోనే చూడడం మెల్ల కంటి దృష్టి.

అమెరికాలో జడ్జ్ కావినా వుదంతం కావొచ్చు, టర్కీ లోని సౌదీ ఎంబసీ లో ఖసోగ్గీ దారుణ హత్య కావొచ్చు, సొంత లాభం కోసం జాత్యహంకారానికి వూతమిచ్చిన డొనాల్డ్‍ ట్రంపు మీద ‘సోషలిస్ట్’ డెమోక్రాట్ల విజయం కావొచ్చు, ఇండియాలో దళితుల మీద దాడులు, మోడీ ప్రచ్ఛన్న ఫాసిజం, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు లీలల నుంచి తెలంగాణాలో ‘తెలంగాణా జన సమితి’ స్వీయతప్పిదాలతో జార విడుచుకున్న అవకాశాల వరకు రాజకీయ పరిణామాలు కావొచ్చు, సాహిత్య రంగంలో ప్రేమ, సెక్సు మధ్య తరిగిపోతున్న వ్యత్యాసాలు కావొచ్చు… అన్ని ఇస్యూస్ లో ‘రస్తా’ నిర్మొహమాటంగా, నిర్ద్వద్వంగా కల్పించుకుంది.

సాహిత్యం, రాజకీయాలకు… చాతనైతే ఆర్థికాది వ్యాసంగాలకు కూడా పత్రికలో చోటు కల్పించాలనేది ‘రస్తా’ సంపాదక వర్గం ఆలోచన.

మా యోపిన కొలది, రచయితలూ పాఠకుల నుంచి సహకారం దొరికిన మేరకు సమాజ ప్రిజం నుంచి వెలువడే అన్ని రంగులకూ పటం కట్టడానికి ఈ ఎనిమిది నెళ్ల 15 సంచికల్లో మేము ప్రయత్నించాం.

ఇక ముందూ ప్రయత్నిస్తాం.

ఇందుకు మీ సలహాలు సూచనలు మాకు ప్రాణ సమానం.

అబ్యూజ్ అంటారే ఆ కేటగరీ కిందికి రాని ఎలాంటి వ్యాఖ్యనైనా అనుమతించి, దాన్నించి మా పాఠం మేము తీసుకోవాలని కూడా మనసారా అనుకుంటున్నాం.

2019 చాల బాగుంటుంది.

ఔను, నిన్నటి కన్న, రేపు ఎప్పుడూ మిన్న. ఇవాల్టి మనం నిన్న జీవించిన వాళ్ల భుజాల మీంచి లోకాన్ని చూస్తాం. వాళ్ల కన్న ఎక్కువ ఎత్తుల్ని చూస్తాం.

శ్రీశ్రీ అన్నట్లు కాళిదాసు శ్రీశ్రీ నుంచి నేర్చుకోలేడు. శ్రీశ్రీ కాళిదాసు నుంచి నేర్చుకుంటాడు.

నిరంతర నేర్చుకుందాం. పురోగమిద్దాం.

కలిసి నేర్చుకుందాం. కలిసి నడుద్దాం. కలిసి ఎదిరిద్దాం. కలిసి గెలుద్దాం.

వెనకాల మనకు వెన్నుదన్నుగా వుండనీ పాత ప్రపంచం.

25-12-2018

పాలో ఫ్రెయిరీ

హెచ్చార్కె

11 comments

  • ముందుగా 15 సంచికలు పూర్తి చేసుకున్న రస్తా కు అభినందనలు . మీ సంపాదకీయం బావుంది. 2019 చాలా కష్టమయిన సంవత్సరం. బహిరంగంగా చెప్పని ఎమర్జెన్సీ పోకడలు ఉన్నాయి. రస్తా ఇంకహుషారుగా ప్రజల సాహిత్యం అందించాలని కోరుతున్నాను .

  • రస్తా కు అభినందనలు.
    ‘ప్రపంచంలో మంచివాళ్లే అధికం కాబట్టి మరేం భయం లేదనే భరోసాతో ముందుకు పోవడమే విజ్ఞత, అదే చెడుగు మీద గెలుపు దారి’ అంటూ ఈ సంక్షోభ సమయంలో దారి దీపాన్ని వెలిగించారు.కృతజ్ఞతలు.

  • దిగ్విజయంగా15 సంచికలు తెచ్చిన సందర్భంగా ప్రత్యేక అభినందనలు సార్.2019 లో మరింత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • హెచ్చార్కే గారూ మీ నిబద్ధత..నిజాయితీ రస్తా ను మునుముందుకు నడిపిస్తుందని ఆశిస్తూ మీకూ మీ సహచరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • రస్తా కి అభినందనలు. ఇవన్నిటితో పాటు ” కొంచెం నవ్వండి సారూ”

  • మంచి ఆశావాద ఆహ్వానిత సంపాదకీయం.
    8 నెలల్లో 15 సంచికలు తేవడం… అదీ మనం నిర్దేసించుకున్న విలువలతో తీసుకురావడం ఎంత శ్రమో నాకూ కొంత తెలుసు. అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.