మీటింగ్

‘మధ్యాహ్నం కొత్త ప్రిన్సిపాల్ మీటింగ్ పెడతాట్ట గురూ’ – టీ తాగటానికి కాంటీన్ వైపు నడుస్తున్న అయిదుగురు అధ్యాపకులలో ఒకరు.

‘పొద్దునేగా జాయిన్ అయాడు’ –

‘కొత్త బిచ్చగాడు…’ అర్ధోక్తిగా తన ముక్కు నవ్వు నవ్వి ఆగాడు పండితుడు.

‘ఏం చేస్తాట్ట మీటింగ్ పెట్టి?’

‘ఇక్కడి పరిస్థీతులు చక్క దిద్ది, కళాశాలకు మంచి పేరు తెస్తాట్ట’ – అనగానే అందరూ కలిసి పగలబడి నవ్వి కాంటీన్ బల్లల మీద చేరారు.

‘సరేలే వెళ్దాం. మనకు మామూలేగా. ఎందుకు కాలేజీలో ఉదయంనుంచీ సాయంత్రం దాకా ఉండరు-అంటాడు.ఏం చెప్తాం?’

‘వాష్ రూమ్ లు లేవు’ అంటాం-అన్నారు కోరస్ గా

‘సెలవులెందుకు ఎక్కువగా పెడతారు?’ అంటాడు.

‘మనుషులం కదా అవసరాలు’ అంటాం. ‘అయినా సెలవలు మన హక్కు కదా’-

‘పాస్ పర్సెంటేజ్, సిలబస్ లు కాకపోవడాలూ’ …

‘విద్యార్ధులకి ఇంట్రెస్ట్ లేదందాం’ –

‘నిజమే కానీ ఈ విషయం చెప్పు హిందీ, ఉన్న పదిమందిమీ రెగ్యులర్, అయిదుగురూ కాంట్రాక్ట్, ఏదో మంచిగా కాలేజీ నడిపించుకోక ఈ రూల్సూ గీల్సూ అవసరమా?… అడిగాడు రాజనీతిజ్ఞుడు అడుగున మిగిలి  ఉన్న టీని గ్లాసులో గుండ్రంగా తిప్పుతూ.

‘చెప్పాగా కొత్త బిచ్చగాడని. పోయిన వాడు ధర్మాత్ముడు. ఎప్పుడు వచ్చేవాడో ఎప్పుడు వెళ్ళే వాడో. ఆయన చిట్ ఫండ్ బిజినెస్ పుణ్యమా అని మూడేళ్ళు హాపీగా గడిచాయి.’

‘సాయంత్రం పార్టీకి పిలుద్దామా?’

‘ఆ టైపు కాదట’

‘అబ్బో’ నవ్వుకున్నారందరూ-

‘అవును, ఎన్నింటికి మీటింగ్?’

‘సాయంత్రం నాలుగున్నరకి. నాకు రైలు ఉందిగా ఐదుకి.’

‘ఏదోకటి చెప్పు. అర్జంటు పని మీద వెళ్ళాడని’

సాయంత్రం  ప్రిన్సిపాల్ రూమ్ లో సమావేశమయ్యారు అందరూ.

‘ఇంతేనా స్టాఫ్?” అడిగాడు ప్రిన్సిపాల్.

‘సర్ కాంట్రాక్ట్ మేడం లు పిల్లల్ని పికప్ చేసుకోడానికెల్లారు’.

‘మరి రెగ్యులర్?’

‘మీకు బోకే తేవడానికిద్దరు వెళ్ళారు. కొంచెం పని మీద ఇద్దరు వెళ్ళారు. మీరు మొదలెట్టండి.’

‘ బొకేలు గికేలు అవసరమా? మనందరికీ ప్రభుత్వం జీతాలిచ్చేది పిల్లలకు సేవ చేయమని. వారికి విద్యాబుద్ధులు ఇచ్చి మంచి పౌరులుగా తీర్చి దిద్దమని.’  అంటూ ఉండగా ఫోన్ మోగింది.

‘హలో ప్రిన్సిపాల్ స్పీకింగ్’

అవతల జిల్లా కలెక్టరు. ‘ఇంకో వారంలో ప్రభుత్వ కార్యక్రమం. పదిరోజుల పాటు అధ్యాపకులు, విద్యార్ధులూ అందరు కావాలి. లిస్టు తయారు చేసి పదిరోజుల ప్రోగ్రాం ప్రకారం పంపండి’.

‘సర్, రేపట్నుంచీ క్రిస్మస్ సెలవలు. మళ్ళీ 12 నుంచీ సంక్రాంతి సెలవలు. వెంటనే సెమిస్టర్ పరిక్షలు. పిల్లలకింకా సిలబస్ కాలేదు. .. ‘ అంటూ ఉండగానే  ‘ నాకనవసరం. పై నుంచీ ఆర్డర్. చెప్పింది చెయ్’ ఫోన్ పెట్టేసాడు కలక్టర్.

‘లెక్చరర్లంతా ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

‘మనమిప్పుడు…’ –

ఇంకేం మాట్లాడాలో కొత్త ప్రిన్సిపాల్ కి అర్ధంకావట్లేదు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.