ఎమిలీ డికిన్సన్‍

మృత్యువును ప్రేమించి జయించిన కవయిత్రి

ఎమిలీ డికిన్సన్‍ (డిసెంబర్‍ 10, 1830 – May 15, 1886)

అందరికీ బ్రతుకంటే తీయగా, మృత్యువంటే చేదుగా, భయంగా ఉంటుంది. అవును, జీవితాన్ని ప్రేమించని వారెవరు చెప్పండి. అలాగని మృత్యువును ఆపగలవారూ లేరు. ఏదో నాడు తలుపు తట్టి పలకరించే అనుకోని అతిధే అయినా ఆ పేరు తలచేందుకు కూడా అందరూ భయపడుతూనే ఉంటారు. కానీ మృత్యువును ప్రేమించి తన కవిత ద్వారా జయించిన కవయిత్రి ఎమిలీ డికిన్సన్.
చిన్న వయసు నుంచే చదువు పట్ల రచనా వ్యాసంగం పట్ల ఎంతో ఆసక్తిని, ఆ కాలపు స్త్రీలలో అంతగా కనిపించని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఎమిలీ డికిన్సన్ అమెరికా లోని న్యూ ఇంగ్లాండ్ లోని ఎడ్వర్డ్ డికిన్సన్ కుమార్తె. ఆయన పేరెన్నికగన్న న్యాయవాది. అంతేగాక తన రాష్ట్ర , దేశ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన మేధావి.  తన  విద్వత్తుతో న్యాయవాద వృత్తి లో, న్యూ ఇంగ్లాండ్ లోని ఎన్నో విద్యా సంస్థల నిర్వహణలో కీలక పాత్రను పోషించాడు. ఎమిలీ తండ్రి వల్ల చాలా ప్రభావిత మైంది. Amherst అకాడమీలో పాఠశాల విద్య అభ్యసించిన ఎమిలీ అన్ని విషయాలనూ నేర్చుకోవడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచేది. శాస్త్రీయ విజ్ఞానాన్నీ, దృక్పధాన్నీ కలిగి వృక్ష, జీవ శాస్త్రాల పట్ల ఎంతో అభిరుచి ప్రదర్శించేది. ఆ కాలపు స్త్రీ లలా కాక కళాశాల విద్యనూ అభ్యసించాలని అనుకుంది. కానీ ‘విజ్ఞాన శాస్త్రాలు బ్రతుకు పట్ల ఉండే మమకారాన్ని తొలగించకూడద’ని భావించింది.  కళాశాల విద్యను మధ్యలో ఆపి వేసి తన ఇంటికి తిరిగి వచ్చేసాక ఆమెకు చదువుపై గల మక్కువను గమనించి  ఆమె తండ్రి చాలా పుస్తకాలు తీసుకువచ్చేవాడు.
ఎమిలీ  తన కుటుంబంలో అందరి కన్నా తన సోదరుడు ఆస్టిన్  ను, తరువాత అతని కంటే అతని భార్య, తన బాల్య మిత్రురాలు అయిన సూసన్ ను ఇష్టపడేది. కానీ అతని వివాహానంతరం కొన్ని సంవత్సరాల తరువాత ఆస్టిన్ వేరొక మహిళతో సంబంధాలు పెంచుకోడంతో అతనికి దూరం అయి సూసన్ కి దగ్గర అయింది.
ఎపుడైనా ఒక రచయితనో, రచయిత్రినో తరచి చూడాలంటే, వారు రాసిన పుస్తకాలనే కాక  వారి సంభాషణలనూ, వారు ఇతరులకు రాసిన ఉత్తరాలనూ కూడా చదవాలి. ఆమెకు ఎంతో ప్రఖ్యాతి తెచ్చిన ఆమె కవితలను మాత్రమే కాక, ఆమె ఎందరో మిత్రులకు, కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు రాసిన ఉత్తరాలను కూడా కలిపి చదవాల్సిన అవసరం ఉంది. ఆమె వ్రాసిన ఉత్తరాలలో ఆమె భావోద్వేగాల తీవ్రతను, వారి పట్ల తన  ప్రేమని, అనురాగాన్ని, దగ్గరతనాన్ని, సహజంగా ఉన్న దానికంటే రెట్టింపుగా చూపే విధంగా వ్రాసేది. ఆమె ఉత్తరాలలో చాలా వరకు తన ప్రాణ స్నేహితురాలు, తన సోదరుని భార్య అయిన సుసాన్ కు  వ్రాసినవే ఎక్కువ. ఆమె కవిత్వ లక్షణాలు ఆమె రాసిన ఉత్తరాలలో చాలా కనిపించేవి. ‘ఒక్కొక్కప్పుడు ఆ ఉత్తరాలు కవితలా అన్నట్లు ఉండే’వని ఆమె జీవిత చరిత్ర కారులు అభిప్రాయపడతారు.

అయితే తల్లికి జీవితం పట్ల గల నిరాసక్తత వల్ల, తరువాతి కాలంలోని ఆమె అనారోగ్యం వల్ల, ఎమిలీ జీవితం పట్ల వైముఖ్యాన్ని పెంచుకుంది. అలాగే ఆమె జీవితంలోని చిన్నతనంలోనే ఎందరివో మరణాలను చూసింది. ఆమె ఉపాధ్యాయుని మరణం, తర్వాత తనకిష్టమైన తన మేనకోడలిదీ,  ఇంకా కొంతమంది స్నేహితుల అకాల మరణాల వల్ల తీవ్ర మానసిక వత్తిడికి, బాధకు ప్రభావితురాలై ఒక తాత్విక చింతనను అలవరచుకుంది. కవిత్వ రచనను వ్యాసంగంగా అలవరచుకుంది. సమాజానికి దాదాపు దూరంగా ఏకాంతంలో తన పుస్తకాలతో, ప్రకృతితో పెనవేసుకున్న తన జీవితాన్ని సృష్టించుకుంది. ఏకాకిగా ఉండిపోయింది. పెళ్ళి చేసుకోక ఎప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి తిరిగేది. దీనికి ఆమె మూర్ఛ వ్యాధి  కూడా ఒక కారణం కావచ్చని భావించారు. పరిచయస్తులు, స్నేహితులు ఇంకా ఇతరులు ఆమె గురించి “విచిత్రంగా అందరి నుంచి ఏకాంతంగా ఉండే మహిళ” అని వ్యాఖ్యానించే వారు.
ఎమిలికి కవిత్వ రచనలో గురువులు ఎవరు లేరు. తనకు తానే కవిత్వాన్ని నేర్చుకుంటూ, దిద్దుకుంటూ, ప్రపంచానికి దూరంగా నాలుగు గదుల మధ్యలో తన కవిత్వాన్ని తీర్చిదిద్దుకుంది. ఎవరినో సంతోషపెట్టడానికో, పేరు ప్రఖ్యాతులు అందిపుచ్చుకోవడానికో కాక తన మనస్సును ఆత్మను సంతోషింప చేసుకునేందుకు కవిత్వాన్ని వ్రాసుకుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ-“I have done my work so far as work not as my hand and head work apart from the personal being but as the completest expression of that being to which I could attain.” అంటుంది.
ఆమె రాసిన దాదాపు 1800 కవితలలో కేవలం 10 నుండి 15 మాత్రమే ఆమె జీవిత కాలంలో ప్రచురింపబడ్డాయి. ఎమిలీ ఒక కవయిత్రిగా తన ఆలోచనలకు, వ్యక్తీకరణకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఆమె కవిత తేలికైన మాటలతో, లోతైన ఆలోచనలతో, అనూహ్యమైన శబ్ద చిత్రాలతో పలకరిస్తుంది. అయితే ఈ అంశాలను ప్రస్తావించే తీరు, వ్యక్తీకరించే విధానము, చాలా వినూత్నంగా ఉంటాయి. ఆమె విమర్శకులు, సమకాలీన రచయితలు దాదాపు ఆమె ప్రచురణలు ప్రాచుర్యం పొందే వరకు కూడా, ‘అప్పటి వరకు  ఆమోదయోగ్యమైన కవిత్వ నియమాలకు పూర్తిగా ఆమె కవిత్వం వ్యతిరేకంగా ఉందనీ, దానిని అసలు కవిత్వమని అనలేమ’ని భావించారు.
ఆమె కవిత్వ ప్రగతికి దోహదం చేసిన ప్రముఖ రచయితలలో యూరప్ నుంచీ కీట్స్,షెల్లీ, వర్డ్స్ వర్త్ లాటి రొమాంటిక్ కవులు, బ్రాంటీ సోదరీమణులు, జార్జ్ ఇలియట్ వంటి వారు కాగా, అమరికా నుంచీ హెచ్.డబ్ల్యు.లాంగ్ ఫెలో, తోరో, హాతార్న్, ఎమర్సన్ వున్నారు. ఆమె వీరి రచనలను, కార్లైల్, డార్విన్ మాథ్యూ ఆర్నాల్డ్ ని ఎక్కువగా చదివింది. తన సమకాలీకులైన ఈ రచయితలను అవపోశన పట్టిన ఈమె, బైబిల్ ను మరియు షేక్స్పియర్ను కూడా తనలో అంతర్భాగం చేసుకోడం కనిపిస్తుంది. స్త్రీకి రచనా ప్రపంచంలో స్థానం లేని పరిస్థితుల్లో, స్త్రీని ఒక పఠిత గానే చూసిన అప్పటి  సమాజం నుంచి వాల్ట్ విట్మన్ తో పాటుగా తనదైన కవిత్వ శైలి గల ఒక ప్రముఖ కవయిత్రి గా నిలబడింది.
1850ల నాటి సమాజంలో చర్చి వ్యవస్థను  పునర్నిర్మించే  పరిణామక్రమంలో, ఎమిలీ భగవంతుని నమ్మింది. అయితే చర్చిని ‘ఒక వ్యవస్థగా’, ఆ వ్యవస్థ పెంపొందించిన విలువలను, నమ్మకాలను వ్యతిరేకించింది. ఈ వ్యక్తీకరణలో  గొప్ప విప్లవ భావాన్ని చూపింది. తన కుటుంబం మొత్తం ఒక చర్చిలో సభ్యులుగా చేరినప్పటికీ, ఎమిలీ మాత్రం తన భగవద్ విశ్వాసాన్ని అలా ‘ప్రకటింప బడవలసిన/బహిర్గత పరచవలసిన’ అంశంగా చూడలేదు. 1850లలో తన స్నేహితురాలు జేన్ కి  ఉత్తరం రాస్తూ ‘విప్లవ పోరాటంలో నేను ఒంటరిగా నిల్చున్నాను’ అనీ, తన ‘కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ చర్చిలో సభ్యులుగా అవడం ద్వారా క్రీస్తుచే ఎన్నుకొనబడిన వారుగా గుర్తింప బడ్డారనీ, దాని ద్వారా అపురూపమైనదేదో పొందామని భావిస్తున్నార’ని, అంటూ, ‘అది నిజంగా అంత విలువైనదా’ అని ప్రశ్ని స్తుంది. ఆమె మతాన్ని గౌరవించి, దైవాన్ని విశ్వసించినా ప్రకృతిని ఏకాంతాన్ని ఎక్కువ ప్రేమించింది. ఈ కవిత చూడండి:
కొందరు పూజకోసం, విశ్రాంతి కోసం చర్చికి వెళతారు –

కోయిల పాటను ప్రార్ధనా గీతాన్ని చేసి-
పండ్ల పొదరింటిని, దేవాలయాన్ని చేసి-
నేను ఇంటి దగ్గరే ఉండి పొందుతాను-
కొందరు ప్రార్ధనకు అంగీ తొడుగుతారు-
నేను కేవలం రెక్కలనే తొడుగుతాను-
చర్చ్ లో గంటకు బదులు –
మా చిన్నిపక్షి – పాడుతుంది.
దేవుడు మతాధికారి లా బోధిస్తాడు, –
బోధనా సాగదీసి ఉండదు-
స్వర్గానికి వెళ్ళే బదులు, చివరకు-
నేను వెళ్తున్నాను, ఇలానే,రోజూ –(* స్వేచ్చానువాదం)

ఈ కవితలో భగవంతుడిని ఏ ఆలయానికీ వెళ్ళకుండానే ఎలా చూడచ్చో, వినచ్చో చెప్తుంది. ఏ ఒక్క రోజో ప్రార్ధనకు, విరామానికీ కాక ప్రతిరోజును ఎలా ‘సబాత్’ గా మార్చవచ్చో చెప్తుంది.
విమర్శకులు ఆమె కవితా రచనా కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1861 కి పూర్వం ఆమె కేవలం ఐదు కవితలే వ్రాసింది.వాటిలో కొన్ని గీతాలు కాగా రెండు హాస్యపూరిత మైనవి. 1861- 65 మధ్యలో దాదాపు 800 కవితలు వ్రాసింది. కాలానుగతమైన కవితా రీతులకు భిన్నమైన శైలిని ఎన్నుకుందామే. ఎమిలీ తన కవితల  రాతప్రతులను అన్నింటిని కుట్టి ఒక పుస్తకంగా భద్రపరిచేది. ఎమిలీ ఎప్పుడు తన కవితలకు పేరు పెట్టలేదు. కవితలలోని మొదటి పాదంతోనే అవి ప్రాచుర్యాన్ని పొందాయి. ఆమె కవితలు చాలా వరకు ‘డ్రమెటిక్ మోనోలాగ్’ లాగా ఉంటాయి.  నర్సరీ రైమ్స్, ప్రొటెస్టెంట్ గీతాలు, బాలాడ్ లలా  ఆమె కవితలను చతురస్ర(4) త్రిశ్ర (3) గతులలో సాగే పద్య పాదాలతో నడిపిస్తుంది.
ఆమె కవితలు జీవితంలోని అనేక అంశాలను స్పృశిస్తాయి. వీటిలో ప్రేమ కవితలు, వేదాంత ధోరణిలో సాగే మత విశ్వాస కవితలు, నైరాశ్య కవితలు, మృత్యువును గురించి వ్రాసిన కవితలు – ఇలాంటివి చాలా ఉన్నాయి. సరళత, భావ గాంభీర్యత, క్లుప్తత ఆమె శైలికి ముఖ్య లక్షణాలు. ఆమె శైలిలో విరామ చిహ్నాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆమె చాలా ఎక్కువగా పదాల మధ్య గీతలను వాడుతుంది. దీని వాడకం కూడా మనల్ని తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. భగవంతుడు – మతం-మృత్యువు- మృత్యువును జయించడం- వంటి విషయాలు ఈ గీతాల వల్ల మరింత సంక్లిష్టమైన అర్ధాన్ని సంతరించుకుంటాయి.
ఈ కవితను చూడండి :

ఆట లోలా ఆమె పడి ఉంది

“ఆట లోలా ఆమె పడి ఉంది
ఆమె జీవం దుమికి పారి పోయింది –
మళ్ళీ తిరిగి రావాలని –
కానీ అంత త్వరగా కాదు –

ఆమె సంతోషపు చేతులు, కొంచెం వాలి-
ఆటలో సేద తీరడం కోసం –
తిరిగి లేచే గమ్మత్తును
ఒక్క నిముషం పాటు మరిచి –
నాట్యమాడే ఆమె కనులు – సగం తెరుచుకు –
వాటి యజమాని
ఇంకా వెలుగుతున్నట్లే
గమ్మత్తుగా – నీ వైపు-

తలుపు దగ్గర ఆమె ఉదయం –
ప్రణాళికను ఊహిస్తూ , నాకు తెలుసు –
ఆమెను నిద్రపుచ్చేందుకు –
లలితంగా – సుషుప్తిలోకి- ”
(స్వేచ్చానువాదం)
ఇక్కడ ఆమె వాడిన గీతలు పాఠకులను నడిపిస్తూ, ఆలోచింపచేస్తూ సాగుతాయి.
ఆమె సృష్టించే శబ్ద చిత్రాలు, ప్రతీకలు వాటి పాత్రను సమర్ధవంతంగా నిర్వహించి కవితలో తగిన ‘ambience’ (వాతావరణం) ను సృష్టిస్తాయి. A Narrow Fellow in the Grass అనే ఈ కవితను చూడండి: పామును, దాని కదలికనూ వర్ణిస్తూ సాగే ఈ కవిత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కవితలోని వర్ణనలను పరిశీలించండి.

“గడ్డిలో ఒక సన్నని వాడు
అపుడపుడూ తిరుగుతాడు –
మీరు వాడిని కలిసే ఉంటారు ? లేదా
అతడు క్షణం లోనే చూసేస్తాడు-

గడ్డిని దువ్వెనతో చీల్చినట్లుగా,
ఒక మచ్చల బాణం కనిపిస్తుంది,
ఇక మీ పాదాల దగ్గర కదిలి
దూరంగా ఎక్కడో కనిపిస్తుంది-

అతడికి చిత్తడి నేల లిష్టం-
జొన్న చేలు భరించలేని చల్లదనమూ –
కానీ ఒక పిల్లవాడిలా అనాచ్చాదిత  పాదాలతో  ఉన్నపుడు
నేనే చాలాసార్లు మధ్యాహ్న వేళ (చూశాను)-

ఎండలో విడివడి పోయే
ఏదో కొరడా తోక దాటినట్లు,
వంగి అందుకోబోతే
ముడతలు పడి పారిపోతూ-

ప్రకృతిలో  చాలామంది
నాకు తెలుసు, వారికీ నేను తెలుసు
వారికోసం ఎప్పుడూ నాలో
ఒక ఆత్మీయ వాహిక
కానీ జతగానూ, ఒంటరిగా
ఊపిరి బిగపట్టకుండా
ఎముకలు గడ్డకట్టకుండా
ఎపుడూ ఇతనిని కలవలేదు”

కొత్త పదాల కూర్పు, ప్రత్యేక పదాల ఎన్నిక, అంత్యప్రాసలు, స్వేచ్ఛగా వాడే విరామ చిహ్నాలు, ఇవన్నీ ఎమిలీ కవిత్వ లక్షణాలు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కవిత –“ Because I could not stop for death”… లో ‘మృత్యువు’ అనే మాట లేకుంటే గొప్ప ప్రేమ కవితలా నడిచి పోతుంది. చాలా భారమైన భావాన్ని పొదువుకున్నా ఎంత తేలికగా, లలితంగా, అప్రయత్నంగా నడిపిస్తుందో చూడండి. జీవితాన్ని, జీవితాన్ని తొణికించే ఘడియల్ని, సున్నితమైన సన్నివేశాల్ని ఎలా బంధిస్తుందో చూడండి. సంభాషించే తీరులో, ఆగి, వాక్యాన్ని మళ్ళీ మార్చి, ఆహ్లాదకరమైన దృశ్యాల్ని మనకోసం చెప్తున్నట్లు, వ్రాస్తున్నట్లు కాకుండా మనల్ని కూడా కవిత తో పాటు తీసుకెళుతుందో చూడండి.

మృత్యువు కోసం నేనాగలేకపోయాను కాబట్టి –
అతనే నాకై దయతో ఆగాడు-
ఆ బగ్గీ సరిపోయింది కేవలం మాకూ
అమరత్వానికీ .

మేము మెల్లగా వెళ్ళాము-అతనికి తొందర తనం తెలియదు
అతని మర్యాదను చూసి-
నా కష్టాన్నీ, నా విరామాన్నీ కూడా,
నేను పక్కన పెట్టేశాను

మేము బడిని దాటి వెళ్ళాము, పిల్లలు తోసుకునే
విరామంలో – రాట్నంలో –
చూస్తున్న ధాన్యపు పొలాలు దాటి వెళ్ళాము-
అస్తమిస్తున్న  సూర్యుడ్నీ దాటాము-

కాదు -అతడే మమ్మల్ని దాటాడు-
మంచుబిందువులూ చలీ వణుకుతూ వచ్చాయి –
నా గౌనేమో పలుచనిది
నా చున్నీ – మరీ పలుచనిది-
మేమొక ఇంటిముందు కొంచెం ఆగాము
అది ఓ ఉబ్బెత్తుగా ఉన్న నేల-
పైకప్పు కనిపించడమే లేదు  –
కప్పు అంచు – భూమిలోపలే –

అప్పటినుంచీ-శతాబ్దాలు –ఇంకా
రోజు కన్నా తక్కువే  అనిపిస్తూ
ముందేమో నేననుకున్నా గుర్రాలు వెళ్ళేది
శాశ్వతత్వం వైపేమోనని- (స్వేచ్చానువాదం)

ఆమె కవిత్వంలో ప్రముఖంగా ప్రకృతి అందాలు, వనాలు, పుష్పాలు ప్రస్తావనకు వచ్చే అంశాలు.  అనేక రంగుల పూలు ఆమె వ్యక్తపరిచే భావోద్వేగాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. నైరాశ్యం, రోగం, మృత్యువు ఆమెపై చిన్నతనం నుంచి కలిగించిన ప్రభావంవల్ల  మరణం గురించిన ప్రస్తావన ఆమె కవితల్లో తప్పనిసరిగా కనిపించే ఒక అంశం. దీన్ని అనేక ప్రతీకల ద్వారా – ‘సిలువ,  మునక, ఉరి, ఊపిరి ఆగినట్లున్న స్థితి, గడ్డ కట్టుకొని పోయే స్థితి, ముందస్తు సమాధి, కాల్పులు, కత్తిపోట్లు’ వంటి పద ప్రయోగాల ద్వారా తెలియచేస్తుంది.
ఆమె ఏకాంత జీవితంలో ఒంటరితనాన్ని మృత్యువును ఎదురొడ్డి పలకరించింది. అందరూ తలచి భయపడే మృత్యువును జీవితపు అంతంలా కాక జీవితం లోని ఒక భాగంగా భావించింది. తప్పించుకోలేని నిజంలా గుర్తించి తానే పలకరించింది.
It was just this time last year అనే కవితలో మరణించిన ఒక పాత్రతో పోల్చుకుని జీవితం ఎంత బాగుంటుందో తెలియచేస్తుంది. మరణించిన తనను ప్రకృతిలోనివేవైనా అంటే- పూలు, పళ్ళు, పంట పొలాలు వంటివి గుర్తుచేసుకుంటాయా అని వేచిచూస్తుంది. ఎవరూ పట్టించుకోని విషయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్తూ  జీవితమంటే అలాటి వాటిని గుర్తించడమే ననీ, మరణిస్తే ఇలాటి అద్భుతాల్ని చూడలేమన్న సత్యాన్ని తెలియచేస్తుంది. ఒక ప్రేక్షకురాలిలా గాక ఈ జీవిత మరణ ప్రహసనంలో తనను తానూ ఒక పాత్రధారిణిలా భావిస్తుంది. మృత్యువు జీవిత క్రియల్లో ఒక భాగమని, గూఢంగా  దాగి ఉంటుందనీ ఎప్పుడూ బయట పడుతుందో తెలియదనీ చెపుతుంది.
మృత్యువుతో తన భేటీని The Only Ghost I ever saw అనే కవితలో ఇలా వర్ణిస్తుంది:
మృత్యువు మేక్లిన్ అల్లికల వస్త్రాన్ని ధరించాడని, చెప్పులు లేని కాళ్ళతో మంచు పొరలలా అడుగులేస్తున్నాడని, చప్పుడులేని పక్షి నడకలా అడుగులేస్తూ, పొట్టేలంతా వేగంగా నడుస్తున్నాడని చెప్తుంది. తక్కువ మాట్లాడుతాడని, చిన్న గాలిలా నవ్వుతాడనీ , చాలా సిగ్గరి అనీ చెప్తుంది. కవిత చివరకు చేరుకునే సరికి మనకు ఒక సన్నని తెలియని భయం కలుగుతుంది.
‘What Inn is This’ అనే కవితలో ‘ఒక్కోసారి మృత్యువు ఈ జీవిత ప్రయాణపు కొసన మరో ప్రయాణపు దారి మొదలు దగ్గర సేద తీర్చే ఓ సత్రం లాంటిద’ని చెప్తుంది.

“ఇది ఏమి సత్రం
ఎక్కడికీ రాత్రికి వింత యాత్రికుడు వస్తాడు?
యజమాని ఎవరు?
పనిమనుషులెక్కడ?
చూడండి, ఎంత విచిత్రమైన గదులు!
కొలిమిపై మంటలే లేవు-
పాత్రలేవీ పొంగి పొర్లడం లేదు-
మంత్రగాడు ! యజమాని!
ఈ కిందంతా ఎవరు?”

ఎంత తేలిక పదాలతో వర్ణిస్తూ ఓ వింత ప్రపంచాన్ని సృష్టిస్తుందో చూడండి?
చాలా మొండిగా ధైర్యంగా మృత్యువును ఎదురొడ్డి మాట్లాడుతుంది. కవిత్వాన్ని తన భాషగా ఎంచుకుని ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. మృత్యువును రక్షకుడిగా, బాధల నుండి విముక్తి దాయకుడిగా, యాత్రా మార్గదర్శకుడిగా, ప్రేమికుడిగా వర్ణిస్తుంది. ఆమె కవిత ఒక బాధా తప్తమైన స్పర్శతో బాటు ఒక ఓదార్పునూ అందిస్తుంది. మృత్యువును ఎదుర్కుంటున్నపుడు ఎలా ఉంటుందో తెలిపే ‘I have seen a dying eye’ అనే  ఈ కవితను చూడండి.

“నేనొక చనిపోతున్న కంటిని చూసాను
గది చుట్టూరా తిరుగుతూ-
దేని కొరకో వెతుకుతున్న్నట్లు-అనిపించేలా-
ఇప్పుడింకా మసకబారి-
ఇంకా-పొగమంచు పట్టినట్లు కనబడక-
మరింకా అతికించబడుతూ-
ఏమిటో తెలియచేయకుండా
చూడడం ధన్యమైనట్లుగా” –

అలాగే మృత్యువుతో సంభాషించే కవితల్లో ఉత్త ఆవేశపూరిత పద గుంఫన కాక ఒక ప్రశాంత నిశ్శబ్దాన్నీపరచి ఆ నిశ్శబ్దం ద్వారా కవితను అర్ధం చేసుకునే శక్తిని ఇస్తుంది. ఆమె పదాల ఎన్నిక బయటికి ఒక రకంగా,  తరచి తరచి చదివినపుడు మరింత లోతుగా భావాన్ని గాఢతరం చేస్తుంది. ఎమిలీ జీవితాన్ని, మృత్యువును సమానంగా చూసి, ప్రేమించి, మృత్యువును జయించింది. 1862 లో థామస్ అనే ప్రచురణకర్తను తన కవిత ప్రచురించడం ఆలస్యమైనందుకు ‘నా కవిత బ్రతికే ఉందా’ అని ప్రశ్నించిన ఎమిలీకి తన కవిత అజరామరమౌతుందని తెలియదు. ఆమె జీవిత కాలంలో ఆమె ఒక కవయిత్రిగా ఎవరికి తెలియకపోయినా, మరణానంతరం కీర్తి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.  1955 -1958 మధ్యకాలంలో ఆమె కవిత్వం ప్రచురింపబడినప్పుడు కవిత్వ ప్రపంచం ఇన్నాళ్లుగా ఒక మహా కవయిత్రిని గుర్తించలేకపోయినందుకు నిర్ఘాంత పోయింది. నిజమే కదా. చాలా సార్లు గొప్ప వ్యక్తులు మరణానంతరమే గుర్తింప బడతారు. మృత్యువును కవిత్వాన్ని చేసుకు జీవించిన ఎమిలీ కూడా అంతే!

ఎమిలీ సొంత గది

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.