రచయితకు తెలియని ఆత్మకథ

కొన్ని పుస్తకాలను చదువుతుంటే పరిసరాలను మరిచిపోయి, పుస్తకంలో లీనమైపోతాం. అలాంటి పుస్తకం “బేబీ హాల్ దార్- చీకటి వెలుగులు.” ఇదొక బెంగాలీ రచన. “ఆలో-ఆంధారి-బేబి హాల్ దార్” పేరుతో వెలువడింది.

తన కథని తాను రాసుకుంటున్నానని తెలియకుండానే రాసుకున్న అరుదైన ఆత్మకథ. ఇందులో ఎలాంటి సాహిత్యం, భాషా వ్యాకరణాల్ని పట్టించుకోలేదు. బేబీ తన ఆత్మను అమాయకంగా  ఆవిష్కరించుకుంది.

మున్షీ ప్రేమ్‌చంద్ మనవడు (కుమార్తె కొడుకు) ప్రబోధ్ కుమార్ ఇందులో ప్రధాన ‘పాత్ర’గా కనిపిస్తారు. ఇతనొక గొప్ప కథకుడు, ఆంత్రోపాలజిస్ట్. తాతుష్ అని అందరు పిలుస్తుంటారు. తాతుష్ వాళ్లింట్లో పనిచేసే అమ్మాయి పేరు బేబీ హాల్ దార్. తన ఇంట్లో అంట్లు తోమే ఆమె. రాయడాన్ని కూడా ఆమె పనిలో భాగంగా చేసి “ఆలో-ఆంధారి” ఒక అద్భుతాన్ని సృష్టించారు. కథ లోని ఆత్మ ఏమాత్రం చెదరకుండా హిందీలోకి ప్రబోధ్ కుమార్ అనువదిస్తే, తెలుగులోకి ఆర్. శాంత సుందరి “చీకటి వెలుగులు” పేరుతో మనముందుకు తీసుకొచ్చారు.

బేబి 38 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో పుట్టింది. తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. అతను ఇల్లు గడవటానికి డబ్బులు ఒకసారి ఇస్తే, ఒక్కోసారి ఇచ్చేవాడే కాదు. ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తుండటం వల్ల, భర్తతో ఎప్పుడూ పోట్లాటలు జరుగుతుండటం వల్ల, నలుగురు పిల్లలను సాకలేక, కష్టాలను భరించలేక, విరక్తితో పసివాడైన చిన్న కొడుకుని తీసుకుని ఎవరికీ చెప్పకుండ ఇళ్లొదిలి వెళ్లిపోతుంది బేబి తల్లి. భార్య కోసం వెతికి వెతికి…కొన్నాళ్ళ తర్వాత రెండో పెళ్ళి… ఆ తర్వాత మూడో పెళ్ళి కూడా చేసుకుంటాడు తండ్రి. బేబి తన తల్లి వెళ్లిపోతూ తన చేతిలో పెట్టి పోయిన పది పైసల బిళ్ళను  చూసుకుంటూ, బాధ్యత ఎరుగని తండ్రి దెబ్బలను భరిస్తూ, చదువుకోవాలని ఎంతో కోరిక వున్నా తండ్రికి భయపడి ఏడో క్లాసులోనే చదువు ఆపేస్తుంది.

ఒకరోజు పిల్లలతో ఆడుకుంటున్న బేబిని తీసుకొచ్చి, పీటల మీద కూర్చోబెట్టి, ఒళ్లంతా పసుపు రాసుకుంటూ నీకిప్పుడు పెళ్ళి, నువ్వు పెద్దదానివైనావు అని చెప్పినప్పుడు, అమాయకంగా కడుపు నిండా విందు భోజనం దొరుకుతుందనుకుంటుంది. తనకు రెట్టింపు వయస్సు వాడితో … అదీ ఒక మూర్ఖునితో పదమూడేళ్లైనా నిండని తన జీవితాన్ని ముడేస్తున్నారని అనుకోదు బేబీ. మూడు నెలలకే నెల తప్పడం, శాడిస్ట్ భర్తతో తన్నులు తప్పకపోవడం, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలియని తనం.. ఆ మీద తల్లి జ్ఞాపకాలు..బేబిని మానసికంగా కుంగదీసేవి. అవేవీ పట్టించుకోని తండ్రి ఉన్నా లేకున్నా ఒక్కటే గాని తల్లి లేకపోతే పిల్లలు అనాథవుతారని బేబి గ్రహించగల్గింది. వెళ్లిపోయిన తల్లి తిరిగొస్తే బాగుండని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయిదు రోజుల పురిటి నొప్పుల యాతన…ఒంట్లో భరించే శక్తి లేకపోవడం… చివరికి చావు బతుకుల గండం నుండి గట్టెక్కి పిల్లవాడికి జన్మనిస్తుంది. పుట్టిన బాబు ఎందుకేడుస్తున్నాడో తెలవదు..ఎలా ఊరుకోబెట్టాలో తెలవదు… పెళ్ళై పెద్దదైపోయినట్టు ఒక ముద్ర తగిలించుకొని, చిన్నతనంలోనె ముగ్గురు పిల్లల తల్లి అవుతుంది. పిల్లల చాలీచాలని ఆకలి తీర్చడానికి ఇండ్లల్లో పనిచేస్తూ పిల్లలను చదివిస్తూ వుంటుంది.ఎంత కష్టపడ్డప్పటికీ అర్థం చేసుకోకుండా అనుమానంతో కొట్టే భర్త, బాధ్యత లేకుండా బతికే తండ్రి, పలకరింపులు కూడా లేని అన్నదమ్ములు, ఒక్కగానొక అక్క తన భర్త చేతిలో చనిపోవడం… ఇవన్నీ బేబిని కలవర పెడుతాయి. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, వీటన్నిటికి దూరంగా వెళ్ళి బతకడమే మంచిదనుకొని పాతికేళ్ళ వయసులో శరీరమ, మనసును కూడగట్టుకొని, తనమీద తనకున్న నమ్మకంతో పాలుతాగే బిడ్డను చంకనెత్తుకొని, ఇద్దరు కొడుకుల చేయిపట్టుకొని ఢిల్లీ రైలెక్కి, అక్కడి నుండి ఫరీదాబాద్ కి చేరుకుంటుంది.

ఫరీదాబాద్ లో ఉంటున్న అన్న ఏమైనా ఆసరవుతాడనుకొని వెళితే చీదరింపులే ఆహ్వానిస్తాయి. ఆ దగ్గరలోనే ఉంటున్న తమ్మునింటికి వెళ్లినా అదే పునరావృతం అవుతుంది. కొన్ని రోజుల్లో ఎలాగైనా వేరుగా ఇల్లు తీసుకుని ఉండాలనుకుంటుంది.

తెలియని ఊరు… ముగ్గురు పిల్లలు… ఎక్కడుండాలో తెలవదు… భర్తను, బంధువులను వదిలేసి రావడం తప్పో ఒప్పో తేల్చుకోలేని పరిస్థితి వెంటాడుతుంటుంది. అక్కడ ఇక్కడ పనిదొరకబట్టుకొని పిల్లల కోసం పడరాని కష్టాలు పడుతూ ఇండ్లల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో తాతుష్ ఇంట్లో పని దొరకడం బేబి జీవితానికొక మూలమలుపవుతుంది.

తాతూష్ బేబిని పనిమనిషిలా గాకుండా ఒక కూతురిలా చూసుకుంటాడు,

పిల్లలకు చదువుకునే ఏర్పాటు కూడా చేస్తాడు. బేబిలోని అమాయకత్వాన్ని, ఆమె పడిన కష్టాల్ని అర్థం చేసుకుంటాడు .

ఒకరోజు ఇల్లూడుస్తుండగా కొన్ని పుస్తకాలు బేబీ కంటపడతాయి.

ఎప్పుడో మరిచిపోయిన చదువును గుర్తుచేసుకుంటూ ఆమె వాటిని చదవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం తాతుష్ అనుకోకుండా చూస్తాడు. చదువు పట్ల బేబికున్న మక్కువని గ్రహించి, తన కథని తనే రాయడాన్ని ఆమె పనిలో భాగం చేస్తాడు. బేబి ముందుగా రాస్తున్నప్పుడు ఎన్నో అక్షరాల తప్పులుండేవి. చదవడం ఇబ్బందిగా ఉండేది, అయినా భాషాదోషాలను దిద్దుకుంటూ …రాసుకుంటూ పోతుంది. తాను రాస్తున్నదంతా అచ్చవుతుందని బేబికి ఏమాత్రం తెలియదు. ఒకరోజు తనకు వచ్చిన పోస్ట్ ను విప్పి చూసినప్పుడు “ఆలో-ఆంధారి బేబీ హాల్ దార్” అనే పుస్తకం ఉండటం… తాను ఇన్నాళ్ళు రాసిన కథనే అందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. తన పేరుని బిడ్డకు చూపించుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆనందంతో ఏడుస్తుంది. రోజంతా పనులు చేసుకుని, అందరు నిద్రపోయాక రాయడం, చదవడం చేసే మరో ‘ఆశాపూర్ణాదేవి’ అని బేబిని చెప్పొచ్చు.

ఇక్కడ బేబి శ్రామికవర్గం ప్రతినిధి. ఈ ఆత్మకథలో పీడితుల, బాధితుల జీవితాలను చిత్రించింది. దారి పక్కన స్పృహ లేకుండా పిల్లలు ఎలా పడి వుంటారో, మురికి వాడల్లో కుంపట్లు ఎలా వెలుగుతాయో, వారి జీవితాలు ఎలా తెల్లారుతాయో… చాలా ఆర్థ్రంగా చూపెట్టింది.

అంతే కాకుండా బేబి బంధుత్వాలు, స్నేహాలు, అధికార సంబంధాలు అన్ని తెలుసుకోగలిగింది. నిజం చెప్పాలంటే బేబి జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎటువంటి గడ్డు పరిస్థితి వచ్చినా పోరాడే గుణం, మరోవైపు నిప్పులాంటి వ్యక్తిత్వం.. వీటికి తోడు తాతుష్ లాంటి అరుదైన వ్యక్తి బేబికి అదృష్టంగా దొరికాడనుకోవచ్చు.

ఇలా బేబీ లాంటి జీవితాలను ఎంతో మంది ఆడవాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ ఈ పుస్తకం చేరాలి. వాళ్లలో కొంతయినా ధైర్యం నింపాలనే ఆశతో బెంగాలీ రచనను హిందీ, తెలుగు భాషలలోనికి అనువదించారు. పుస్తకం వాళ్లందరికీ చేరువ కావాలనే ఆశతోనే మీకు పరిచయం చేశాను.

 

– వెంకి

హన్మకొండ.

 

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

6 comments

  • పుస్తకం గురించి ఆసక్తికరంగా రాశారు మేడం

  • మీ ప్రోసెంత బాగుందో మాటల్లో చెప్పలేను. ఏదో మానవీయత, హత్తుకుంటోంది. యు ఆర్ కన్సండ్. మీరు చెప్పిన పద్దతి చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. కంగ్రాట్స్ రాధిక గారు.

  • ఒక అద్భుతమైన పుస్తకాన్ని 5 నిమిషాల్లో కళ్ల ముందు ఆవిష్కరించిన విశ్లేషణకు అభినందనలు ..
    థాంక్ యు వెంకీ గారు..

  • చాలా చక్కగా రాసారు ధన్యవాదాలు రాధికగారు

  • Excellent it’s really wonderful ma’am as you said this is to reach to every woman those who real sufferers thank you for your post

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.