లోపలి గోడ మీద రాసుకున్న ధ్యానవచనం

లీనాలీనమ్ గడియారం యాజ్ఞవల్క్య రాసుకున్న అంతర్జాల కవిత్వం. హఠాత్తుగా మాయమైన యాజ్ఞి అంతర్జ్వలన కవిత్వం. అతని తుదిశ్వాస వెలిగిన రాగదీపం.

అనువాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాజ్ఞి తన అంతర్పుటలలో నిత్యం కవిత్వమే రాసుకున్నాడు. చదువరిగా, సంగీతప్రేమికుడిగా ఒంటరిగా బతికిన యాజ్ఞి అంతర్ముఖంగా తన వ్యక్తీకరణను కవిత్వంలోనే పలికాడు. 1972 జూన్ – 2018 జనవరి మధ్య జీవించిన యాజ్ఞి 1992-96 మధ్య కర్నూలు నుంచి వెలువడిన ‘జనంసాక్షి’ మాసపత్రిక కు సంపాదక మండలి సభ్యుడిగా ప్రారంభమైన సాహిత్య రాజకీయ జీవితం సమాంతర, హెచ్ బీటీ సంస్థలకు అనువాదకుడిగా పరిణితి చెందింది,  మాల్కం ఎక్స్ జీవిత చరిత్ర ‘అసురసంధ్య’ అనువాదంతో ప్రసిద్ధి చెందింది, ప్రజాభ్యుదయ సంస్థ, న్యూసోషలిస్ట్ ఇనిషియేటివ్ లలో కార్యకర్తగా నిలిపింది. ఫేస్ బుక్ మాధ్యమంగా అసంఖ్యాకంగా రాసిన అతని కవితల నుండి కొన్నింటిని యాజ్ఞి మరణానంతరం ప్రేమలేఖ ప్రచురుణల వారు లీనాలీనమ్ పేరుతో వెలువరించారు.

లీనాలీనమ్ లో పొరలు పొరలుగా యాజ్ఞి వ్యక్తిత్వం యిమిడి వుంది. కవి తనలోని వ్యక్తినీ, ఆలోచనాపరుడినీ, వ్యంగ్య విమర్శకారుడినీ పాఠకులముందు బహుముఖంగా ప్రదర్శనకు పెట్టుకుంది. అందువల్ల యీ సంపుటిలో యాజ్ఞి ఆలోచనలు వివిధ స్థాయిల్లో అగుపిస్తాయి. ఒక ఏకాకి మానవుడు, ఒక సామాజిక రాజకీయ సాంస్కృతిక బృందాల సమిష్టి మానవుడు ఒకే నాణెంకు రెండు తలాల్లా కనబడతాయి. తనలోని వ్యక్తి ని ప్రేమికుడిగా చూపే యాజ్ఞి సామాజిక అంశాలను పాఠకులకు చెప్పే క్రమంలో సంవేదనను ఆశ్రయించడం  కనిపిస్తుంది. క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పడం తన కవిత్వ లక్షణం.

“ఆకురాలు కాలం కడుపున/ఆరని చిచ్చు నేను
చిగురాకు నేను”. అనినవాడే

“నాదైన శ్మశానం నాకున్నట్టే
నాదైన సమాజం కూడా నాకుంది” అంటాడు.

సిరియా శరణార్థులు యూరప్ వలస వెళ్లే క్రమంలో దుర్మరణం పాలవుతున్న నిర్భాగ్యుల గురించి మరీముఖ్యంగా పసిపిల్లల గురించి, ‘అలెన్ కుర్ధీ’ నేపథ్యంగా రాసిన కవిత యాజ్ఞి కరుణ రసార్ద్ర రచనకు మంచి వుదాహరణ.

రోహిత్ వేముల గురించి చాలా మంది చాలా కోణాల్లో కవిత్వం రాసున్నారు. అయితే యాజ్ఞి రోహిత్ ఆశయకాంక్షను మంచి కవితగా మలిచాడు. యాజ్ఞి తన కవితా వస్తువుల సృజనలో పొలిటికల్ స్టేట్మెంట్ ను తడమడు. అందువల్ల తన కవిత్వంలో నినాదప్రాయమైన జార్గాన్ రాదు. అలా అని తను రాజకీయ అభిప్రాయాలు లేనివాడేమీ కాదు. అందుకే నేరుగా రాజకీయ కవిత్వం రాసినప్పుడు కూడా కవిత్వానికి న్యాయం చేయగలిగాడు.

ఈ సంపుటి లో నేరుగా మావోయిస్టు పంథానూ, అస్థిత్వ వాదాన్నీ విమర్శించే “కావలెను” అనే కవిత వుంది. ఆ కవిత నిర్మాణానికి వ్యంగ్యాన్ని యెంచుకోవడం వల్ల కవిత తేలిక కాలేదు. వ్యక్తిగా యాజ్ఞి తన జీవితాన్ని గురించి కూడా చాలా వ్యంగ్యంగానే పరామర్శించుకుంటాడు. ‘నేనే’ కవితలో

“ఇంకెవరైనా వున్నారా యిక్కడ/ ఈ మనుషుల మందిలో /నాతో నడవడానికి/ నాతో మాట్లాడడానికి/ నాతో నభూతో నభవిష్యతి కావడానికి/ నేను కావడానికి?” అనడంలోని వ్యంగ్య వైభవం దానికదే పరాకాష్ట.

కవిగా వ్యక్తి యొక్క వివిధ దశలను యాజ్ఞి కవిత్వం చేశాడు.

‘శిథిల సౌధం నుండి / శిరసెత్తి చూసింది
కుసుమమై పూసింది / కోయిలై కూసింది
నాబతుకు నను చూసి /నాట్యమాడింది.’

శిథిలం నుండీ పునరుద్ధరణ చెందే జీవితం తనదని ఆశను వ్యక్తం చేసిన కవి ప్రయాణంలో ప్రేమ వ్యక్తీకరణ చాలా ముఖ్యమైనది.

‘నా మనసు మంచుకొండ మీద / నీలపు నెలవంక/ ఆమె యెవరు/ ప్రేమగాక/ ఇంకెవరైనా?  అన్నప్పుడు గానీ,

‘పకృతీపురుషుల/పూదోటలో/ఓంకారాన్ని పోలిన తుమ్మెద ఝూంకారం’ అన్నప్పడుగానీ ప్రేమ హృదయమే వ్యక్తమవుతుంది.

వ్యక్తీ-ప్రేమ పరికల్పన నుండి యీ కవి చేసే తరువాతి ప్రయాణం వ్యక్తి – ప్రకృతి వైపుకు. ప్రకృతిలోని ఒక చమత్కారాన్ని వ్యక్తికి గల పరిమితినీ సూచించడానికి,

“అది సముద్రమైనా/ఉప్పునీటి చెరువైనా/పారేఏరైనా/చివరికి రక్తమైనా/వలల్ని విసిరి/చేపలు పట్టేవాడే కానీ/అలల్ని పట్టే మొనగాడు యింకా పుట్టలేదు.” అంటూ, కవి
వల-అల పరికల్పనను చాలా చక్కగా వాడుకున్నాడు.

ఆకురాలు  కాలం కడుపున /ఆరని చిచ్చునేను/     చిగురాకు నేను. అన్నప్పుడు కూడా మూడు వాక్యాలలో ప్రకృతి లోని పెద్ద ప్రక్రియను చెప్పాడు. ప్రకృతి నేపథ్యంలో వ్యక్తి వికాసాన్ని సూచించే కవిత్వం కూడా యీ సంపుటిలో వుంది.

‘ఆకురాలు కాలానికి సమాధానమతడే
చిగురించే పూలరుతువు చిరునామా అతడే
ఆకురాలు కాలానికి అరుణకాంతి అతడే
చిగురించే పూలరుతువు చిరునామా అతడే’

పాటలాగా లయబధ్ధంగా వుండే లక్షణం యితని కవిత్వంలో చూడవచ్చు. ఇంకో కవితలో వ్యక్తి వికాసం గురించి,

‘మొగ్గలు మందహాసం చేస్తున్నాయి
ముళ్లు కళ్లు తుడుచుకుంటున్నాయి
ఎరుపెక్కుతున్న నానడకను చూసి
ఆకురాలు కాలం అంతర్థానమవుతుంది.’

అంటాడు.

యాజ్ఞి కవిత్వంలో “ఆకురాలు కాలం” అనే ప్రతీక శిథిలత్వానికి సూచనగా చాలా చోట్ల కనబడుతుంది. ‘ఎరుపెక్కుతున్న నడక  ‘ మొత్తం యీ కవిత్వపు నడకే.

ఈ తరహా వ్యక్తి వికాసత నుండీ యాజ్ఞి కవిత్వం రాజకీయం వైపు ప్రయాణిస్తుంది.

‘నీవు/ చర్చ చేస్తావా/యుధ్ధం చేస్తావా/
నేను దేనికైనా సిధ్ధమే’.

అన్న చిన్న కవితలో మాటలకూ ఆచరణకూ గల భేదాన్ని సంకేతిస్తాడు.అలాగే ఒక పెద్ద నేపథ్యాన్ని అలవోకగా సృష్టిస్తాడు.

‘శత్రువు విసిరిన గునపం/గుండెల్లో దిగబడినా
స్వరమెత్తిన శిరమెత్తిన /కొన్నైత్తుటి గులాబీలు.’ అంటూ ధిక్కరించి నిలబడే విప్లవ వనితల గురించి రాస్తాడు.

‘ఆంక్షలున్న చోట/అబద్ధాలుంటాయి
నిజాలున్నచోట / నిబద్ధాలుంటాయి
నివురుగప్పిన నిప్పులుంటాయి.’ అని వుద్యమాల గురించి సమర్థిస్తాడు.

‘ఈ దేశంలో ధైర్యమెవరు/శౌర్యమెవరు/తిరుగుబాటు జెండా ఎగరేసే జనులు గాక/సమాజ నటరాజ పద ధ్వనులు గాక/ ఝుమ్ ఝణక ఝుమ్ ఝుణక ఝుమ్’.
అనడంలో విప్లవ నర్తనాన్ని సంకేతిస్తాడు.
విప్లవం అనేది మనుషుల్లో ప్రేమను బతికించేదని చెప్తూ మార్క్స్ కోసం రాసిన చిన్న కవితలో
‘ప్రేమను బతికించడం కోసం/మనిషి ఆలోచించగలడు/మనిషి యుధ్ధం చేయగలడు.’
గొప్ప భావనను యిమిడ్చి చెప్పాడు.
ఏ కవినైనా అతని ప్రాంతం, సంస్కృతి ప్రభావితం చేస్తుంది. ప్రతి ప్రతిభావంతుడైన కవిలోనూ తన సంస్కృతి నుండి రక్తగతం చేసుకున్న పురాణ ప్రతీకలు అనివార్యంగా  కవిత్వంలోకి వస్తాయి. దాన్ని బలహీనతగా కాకుండా ఆ నేల లక్షణంగా పరిగణించాల్సి వుంటుంది. యాజ్ఞి తన కవిత్వంలో శివతత్వాన్ని, శివప్రతీకలనూ తీసుకొస్తాడు.
శిథిలం నుంచి వికాసం చెందడం శివత్వం. ఆకురాలు కాలం కడుపున ఆరని చిచ్చు, తన బతుకు శిథిలం నుంచి కుసుమించి ‘ఆనందతాండవం ‘ఆడుతుంది అన్నా…
‘ నాదైన స్మశానం నాకున్నట్టే /నాదైన సమాజం కూడా నా కుంది’అన్నా…
‘ఈ రోజు పుట్టినవాడెనడు/ప్రేమ ప్రళయ కాళీయ కేళీయుడు/శివాశ్రు గర్భితుడు’. అన్నా అదంతా శివతత్వమే. అది మానవులందరిలో వుంటుందని ప్రతిపాదిస్తూ,
‘అంతర్మథనం అనుభవమైన వాడే/అక్షరామృతాన్ని లోకానికి పంచగలడు/కవి మానవుడు /మానవుడు గరళకంఠుడు’ అంటాడు.
విప్లవ పద ధ్వనులను ‘సమాజ నటరాజ పదధ్వను’ లనడం కూడా అందుకే. ప్రేమను
‘నా మనసు మంచుకొండ మీద నీలపు నెలవంక’ అన్నప్పుడు నెలవంక ను ధరించిన శివుడు గుర్తుకు రాక మానడు. అందుకే యీ కవి తనను తాను ‘శివాశ్రుగర్భితుడు నేక మానవుడు’ అనుకోగలిగాడు.
యాజ్ఞి లో ప్రపంచ కవులను చదువుకున్న గొప్ప పరిశీలకుడు వున్నాడు. జలాలుద్దీన్ రూమీ, మాయాఏంజిలో, పాబ్లోనెరూడా, ఆక్టేవియా పాజ్, లాంటి గొప్ప కవుల్నే కాకుండా ఖలీల్ జీబ్రాన్, అల్లమప్రభు లాంటి తాత్వికులనూ చంద్రశేఖర కంబారా వంటి కన్నడ కవులనూ చదివి అనువదించుకున్నాడు. అవన్నీ యీ సంపుటిలో వున్నాయి. పాఠకులకు యాజ్ఞి ని చదవడంలో లభించే అదనపు బహుమతులు యీ అనువాద కవితలు.
నిఖార్సైన కవిత్వం పట్ల నిబద్ధతను పాటిస్తూనే జీవితం పట్ల వుండవలసిన ఆరోగ్యకరమైన దృక్పథం కల్గివుండి, తన అభిప్రాయాలను చిక్కని కవిత్వంగా మలచినవాడు యాజ్ఞి. క్లుప్తంగా   గాఢంగా పదునుగా వాక్యాన్ని పలకడం వచ్చినవాడు. మాయాఏంజిలో గురించీ మెహదీహసన్ గురించీ రాసిన కవితలు యాజ్ఞి కి సంగీతం పట్ల ప్రేమకు వుదాహరణలు.
వ్యక్తిగతంలా అన్పించే స్థాయిలో మొదలై వ్యక్తి-సమూహంలో భాగం అనే భావాన్ని చాలా ఘాడంగా తాత్వికంగా వెల్లడించడం యాజ్ఞి కవిత్వ లక్షణం. విషాధంగా అన్పిస్తూనే అంతర్లీనంగా మంద్రంగా వినిపిస్తూనే ఆశవైపూ వెలుగు వైపూ ప్రయాణించే స్వరం అతనిది.

సంధ్యార్ణవంలో/ముంచుకొస్తున్న మునిమాపులో/చెమ్మగిల్లిన కన్నులు మలుపు మలుపులో/నువ్వూ నేనూ శోకమై నలనల్లని నీడల్లో/మెలమెల్లని జాడల్లో/

అపురూపస్పర్శ
కాలమ్ రక్తరంజిత గళమెత్తి
మనమై స్వాగతించే చోట తిరిగి
నువ్వు నేనూ ఏకమై
లీనాలీనమ్.

నిజంగా ఒక ధ్యాన వచనం.

జి. వెంకట కృష్ణ

జి. వెంకటకృ‌‌ష్ణ, కవీ కథకుడు. కర్నూలు లో వుంటారు. నాలుగు కవితాసంపుటులు, రెండు దీర్ఘకవితలు, మూడు కథా సంపుటులు ప్రచురించారు. కొంత కాలంగా సాహిత్య పరామర్శ రచనలు కూడా చేస్తున్నారు.

4 comments

 • బుక్కెంత బాగుందో, మీ సమీక్షంత బాగుంది. కవిత్వ రూపం గురించి మీరొక మాట చెబితే వినాలని ఉంది సర్.

 • రివ్యూ ఓకే, ఇంకా విశ్లేషిస్తే బాగుండేది. తనలోని శివతత్వం గురించి చక్కగా చెప్పారు. యాజ్ఞి పోయెమ్స్ ని రివ్యూ లో రాసేటప్పుడు సొంతంగా కాకూండా కొంచం రివ్యూ చేసి బుక్ లో వున్నది రాసుంటే బాగుండేది.

  **మనుషుల మందిలో – మనుషుల మందలో
  **శిథిల సౌధం నుండి / శిరసెత్తి చూసింది – శిరమెత్తి చూసింది
  **శివాశ్రుగర్భితుడు నేక మానవుడు’ – – శివాశ్రుగర్భితుడు నేనైక మానవుడు!

 • డియర్ కామ్రేడ్ వెంకటకృష్ణ
  యగ్లోగి లోని ఏకాకినీ, ప్రేమికుడినీ, అంతర్ముఖుడినీ, సామాజిక చింతనాశీలినీ సమకాలీన సందర్భంలో చక్కగా నిలబెట్టే నీ విశ్లేషణ చాలా నచ్చింది. చదువుతూ వుంటే యగ్గి మాగిన రాతలను బాగా మిస్ అయ్యామని చివుక్కుమంది మది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.