ఐదొందల ఎకరాల్లో అపురూప దేవాలయం

ఆంగ్కోర్ వాట్ (Angkor wat) చూడటం జీవితంలో ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన ఒక కల. అక్కడకి వచ్చిన వారిలో అన్ని  దేశాల వారు  సమాన సంఖ్యలో కనిపిస్తారు. తాము అంతగా కలగన్న ఆ ప్రదేశాన్ని చూడటానికి  వచ్చిన వారు ఎవరూ  నిరాశపడరు. చూడటానికి  మనస్సు, ఐదు వందల ఎకరాలను తిరగడానికి శరీరంలో శక్తి ఉండాలి కానీ రోజులు కాదు నెలలు  గడిపినా  తనవి తీరదు.  ఆంగ్కోర్ వాట్  చాలా  సంవత్సరాలుగా  ప్రపంచం లో అతి ఎక్కువ మంది సందర్శించిన మొదటి పది విహార స్థలాలలో  ఒకటి. సరాసరి ఏటా ఇరవై లక్షలకు పైగా యాత్రికులు ఆ ప్రాంతాన్ని చూడటానికి వస్తున్నారు. ఆ సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు. కంబోడియా కొచ్చే మొత్తం విదేశీయులలో సగం మంది   ఆంగ్కోర్ వాట్ కోసమే వస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచంలో మరే  చోట ఇంతపెద్ద దేవాలయాల సమూహాలు లేవని గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ చెబుతోంది. కాంబోడియా  జాతీయ జెండాలో  కూడా ఆంగ్కోర్  వాట్  దేవాలయం (మన   జెండా లోని  అశోక చక్రం స్థానం లో) కనిపిస్తుంది.

ఎగరనున్న విమానమా? 

ఆకాశం నుంచి చూస్తే ఆంగ్కోర్ వాట్  గుడి  ఎగరడానికి తయారుగా వున్న పెద్ద అంతరిక్ష నౌకలా ఉంటుంది. ఆ  దేవాలయాల  సముదాయాల గురించి ప్రాంతీయంగా ఒక నమ్మకం వుంది , ఆ దేవాలయాలన్నిటిని ఇంద్రలోకం నుంచి వచ్చిన ఒక శిల్పి రాత్రికి రాత్రే నిర్మించాడని అక్కడివారు  విశ్వసిస్తారు. ఇంకో కథనం ప్రకారం పురాతన కాలం నాటి  బ్రహ్మ తదితర దేవతల నివాసమైన “మేరు పర్వతం” ఈ దేవాలయాల సముదాయమేనని ప్రచారంలో వుంది. ఆ విశ్వాసాల  సంగతేమోకాని ఆంగ్కోర్ వాట్  చూసినవారు వాళ్లు అవి దైవ నిర్మాణాలే అనుకొంటారు. వీటిని మొదట కనుక్కొన్న ఫ్రెంచ్ పురావస్తుపరిశోధకుడు కూడా మొదట వీటిని ఏ అంతరిక్ష వాసులో కట్టారని భావించాడట. గుడి ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ప్రదేశం అబ్బురపరిచేలా ఉంటుంది. గుడి లోపల దేవుడి విగ్రహాలు వుండవు. కొన్ని గదులను మాత్రం బౌద్ధ ఆరామాలుగా మార్చారు. గుడి లోపల ఎక్కడా హిందూ దేవతలున్న గదులు కనిపించలేదు గాని శిధిలావస్థలో  వున్న శివలింగం, గోడల మీద  దేవుళ్ళ  బొమ్మలు  కనిపిస్తాయి. పైకి  ఎక్కడానికి  చెక్క నిచ్చెనలను  ఏర్పాటు చేయడం వల్ల పైకి ఎక్కి ఆ ప్రాంతం మొత్తం చూడటానికి అవకాశం వుంది. ఎంత పైకి ఎక్కినా కొన్ని వందల ఎకరాల భూభాగం కావడం ఒక గుడికి మరో గుడి కి మధ్య దట్టమైన భారీ వృక్షాలు ఉండటంతో మనమున్న గుడిని మాత్రమే చూడగలం. మరో గుడి చూడాలంటే మళ్ళీ  ఆటో ఎక్కి పోవాల్సి ఉంటుంది. కాలి నడకన అన్ని దేవాలయాలు చూడటం దుర్లభమైన పని.

ఆంగ్కోర్ వాట్  ఎలా పోవాలి ?

కాంబోడియాకు మూడు దేశాల నుంచి రోడ్డు మార్గం లో పోవచ్చు. అవి థాయిలాండ్, వియాత్నం, లావోస్. అది కాక ఆంగ్కోర్ వాట్  దేవాలయాల సముదాయమున్న సియెమ్ రీప్ (siem reap) నగరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. ఆంగ్కోర్ వాట్  ను  మాత్రమే  చూడాలను కొనేవాళ్ళు థాయిలాండ్ లేదా మలేసియా ద్వారా తక్కువ ధరలో పోవచ్చు. అలాకాకుండా  వాటితో పాటు రోడ్ మార్గంలో వియత్నాం, థాయిలాండ్ కలిపి చూడాలనుకునే వాళ్ళు మొదట థాయిలాండ్ తో మొదలు పెట్టి ఆ తరువాత కంబోడియా అక్కడి నుండి వియత్నాం చూసుకొని తిరిగి  రావచ్చు (థాయిలాండ్ నుంచి లావోస్ వచ్చి అటునుండి రోడ్ మార్గంలో కంబోడియా వచ్చే సౌలభ్యం కూడా వుంది. ఇక్కడ మనకున్న (భారతీయులకున్న ) ఒక అవకాశమేమంటే ఈ  నాలుగు దేశాలకు (థాయిలాండ్ ,లాఓస్ ,వియత్నాం , కంబోడియా ) visa on arrival లేదా e -visa సదుపాయం. ప్రయాణాన్ని వియత్నాంతో  మొదలు పెట్టి కంబోడియా గుండా థాయిలాండ్ పోవాలంటే థాయిలాండ్ వీసా లభించదు (థాయిలాండ్ లోకి ప్రవేశించడానికి ఇరవై నాలుగు ఎంట్రీ పాయింట్స్ ఉంటే అందులో రెండు ఎంట్రీ పాయింట్స్ దగ్గర మాత్రమే భారతీయులకు visa on arrival సదుపాయం లేదు అందులో ఒకటి కంబోడియా నుండి థాయిలాండ్ లోకి  ప్రవేశించే పాయ్పెట్ట్  (కంబోడియా బోర్డర్ టౌన్), –అరణ్యప్రథెట్ (థాయిలాండ్ బోర్డర్ టౌన్) పాయింట్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ థాయిలాండ్ కాన్సలేట్ కాకుండా చిన్న ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ ఉంది. వియత్నాం మాజీ రాజధాని హోచిమిన్ సిటీ (పాత పేరు సైగాన్) నుంచి నేరుగా సియెమ్ రీప్ వరకు బస్సు లు కూడా వున్నాయి. అదే థాయిలాండ్ నుంచి పోవాల్సివస్తే ఖచ్చితంగా రెండు మూడు రవాణా మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది. థాయిలాండ్ బోర్డర్ వరకు సుమారు బ్యాంకాక్ నుంచి ఐదు గంటల ప్రయాణం. థాయిలాండ్ సరిహద్దు వరకు దారి చాలా బాగుంటుంది . మొదట బ్యాంకాక్ నుంచి బస్సు లేదా ట్రైన్ లేదా క్యాబ్  లో థాయ్ సరిహద్దు వరకు ప్రయాణించి ఆ  తరువాత ఆంగ్కోర్ వాట్  వున్న నగరం సియెమ్ రీప్ వరకు క్యాబ్ లేదా బస్సులో పోవచ్చు. కంబోడియా  వెనుకబడిన దేశం అవినీతి కూడా ఎక్కువే. అందుకే థాయిలాండ్ సరిహద్దు దాటిన తరువాత ఆంగ్కోర్ వాట్  పోయే దారి చాలా దారుణంగా ఉంటుంది. వయస్సుమళ్ళిన వారు ,అనారోగ్యవంతులు ఈ విషయాన్ని  గుర్తుపెట్టుకోవాలి.

చరిత్ర

ప్రాంతీయ భాషలో ఆంగ్కోర్  అంటే నగరం. వాట్ అంటే గుడి . ఆంగ్కోర్ వాట్  అంటే టెంపుల్ సిటీ అని అర్థం. ఆధునిక చరిత్ర ప్రకారం వీటిని 12 వ శతాబ్దంలో కాంబోడియాను పాలించిన ఖ్మేర్ రాజవంశస్తుడైన సూర్యవర్మన్ II నిర్మించాడని చరిత్ర చెబుతుంది. సూర్యవర్మన్  కు  కంబోడియాను పాలించిన ఖ్మేర్ రాజవంశస్తులు శైవ మతాన్ని ప్రమోట్ చేస్తే సూర్యవర్మన్ మాత్రం ఈ దేవాలయాలను విష్ణువుకు అర్పణం చేసాడు. తరువాత కాలక్రమంలో కంబోడియాలో  బుద్ధిజం వ్యాప్తి చెంది ఈ రోజు అక్కడ హిందూ దేవుళ్ల కంటే బౌద్ధ ప్రార్థనా స్థలాలు ఎక్కువున్నాయి. 1992 లో UNESCO  ఇటు బౌద్ధమతం  అటు హిందూ మతాలకు సంబంధించిన ప్రపంచ సాంస్కృతిక ప్రాంతంగా ఆంగ్కోర్ వాట్  ను గుర్తించింది.

ఒకప్పటి దాని విలువ కాలక్రమంలో తగ్గిపోయి ప్రస్తుతం సియెమ్ రీప్ నగరం లో ఆంగ్కోర్ వాట్ ఒక పర్యాటక  ప్రాంతంగా మారింది. ఆ ప్రాంతంలో ఆంగ్కోర్ వాట్ గుడి మాత్రమే కాక ఆంగ్కోర్  థోమ్ అని , బయోన్ టెంపుల్ (దేవతల మొహం లాంటి గుడి) కూడా ఆకర్షిస్తుంది.

ఈజిప్ట్ చూసిన వాళ్లకు ఆంగ్కోర్ వాట్  దగ్గర నిర్వహణ కొంత మేరకు మెరుగు అనిపిస్తుంది. కొన్ని   ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఆలయాల పునరుద్దరణకు సహాయం అందిస్తున్నాయి. భారతదేశం కూడా బ్రహ్మ గుడి నిర్వహణను చూస్తోంది. దీని వలన అవి మరింతగా విధ్వంసం  కాకుండా  వున్నాయి. మనం చూడాలనుకున్న రోజులను బట్టి టికెట్ ధరలు వున్నాయి. ఒక రోజు టికెట్ అయితే 2500 రూపాయలు. వారం రోజుల టికెట్ అయితే 4500 రూపాయలు. నెల రోజుల టికెట్ అయితే ఐదు వేలకు  పైచిలుకు.

ఎప్పుడూ వున్నదాన్ని ఎవరెలా కనుగొంటారు?

ఆంగ్కోర్ వాట్  ను  హెన్రీ మౌహాట్ అనే ఫ్రెంచ్ పురావస్తు వేత్త కనుకొన్నాడని చెబుతారు. చరిత్రను పరిశీలిస్తే ఆంగ్కోర్ వాట్ ఎప్పుడూ కనుమరుగు కాలేదు. ఆ నాటి నుంచి ప్రజలు, ఆ తరువాత వచ్చిన రాజవంశాలు నిరంతరం సేవించేవారని ప్రాంతీయంగా అందరికి తెలుసు. అవి ఎప్పుడూ  కనుమరుగు కాలేదు గాని, కాలక్రమేణా పాతబడ్డాయి. అలాంటప్పుడు ఎవరో వచ్చి కనుక్కొన్నారనడం అర్థం లేని మాట. బహుశా మొదట ఆ ప్రాంతాన్ని హెన్రీ మౌహాట్ యూరోప్ కు పరిచయం చేసినవాడై వుంటాడు. యూరోపియన్స్ వచ్చి ఆసియాలోని చారిత్రాత్మక కట్టడాలను కనుగొన్నారనే భావన పశ్చిమ దేశాల వారి సృష్టి.  స్పీల్ బట్గ్ సినిమా “ఇండియానా జోన్స్ అండ్ టూంబ రైడర్” లోని అరణ్యంలో చూపించే ప్రదేశాలు ఇలానే ఉంటాయి. మీడియా  ఆ సినిమా ఆంగ్కోర్ వాట్  మీదనే అని ప్రచారం చేసింది .

లండన్ టవర్ ను 1038 AD  లోనూ, నోటర్ డామ్ డి ప్యారిస్ ను 1163 AD లోనూ   నిర్మించారని చరిత్ర చెబుతోంది. వాటిని మాత్రం పురాతనమైనదిగా  పరిగణించరు. ఆంగ్కోర్ వాట్ అదే కాలం నాటిదని   చెబుతున్న చరిత్రకారులు దీన్ని ఎందుకు పురాతన మైనది అంటున్నారు? అందుకే  కొంత మంది ఆసియా చరిత్రకారులు చరిత్ర యూరో సెంట్రిక్ గా తయారయ్యిందని అంటున్నారు.

మన దేశంతో పోల్చితే కంబోడియా చాలా పేద దేశం. ఇప్పటికి  రవాణా సదుపాయాలు సరిగ్గా లేవు. మాకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో వున్న కంబోడియా రాజధాని నాంఫెన్ పోవడానికి ఏడు గంటలు  పట్టింది. ప్రతి చోట రిక్షాలతో బేరం చేసి ధరలు తగ్గించుకోవలసిందే. ధరలు మన దేశంతో పోల్చితే తక్కువే. స్థానిక కరెన్సీతో పాటు డాలర్ ను అందరూ అంగీకరిస్తారు చివరకు రిక్షా వాళ్ళు కూడా డాలర్ ను అంగీకరిస్తారు.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.