సోఫియా డి మెల్లో బ్రేయ్నర్  కవితలు నాలుగు

సముద్రపు పగలు

ఆకాశంలో సముద్రపు పగలు, అది
నీడలతో, గుర్రాలతో, పక్షి ఈకలతో తయారయినది.

నా గదిలో సముద్రపు పగలు- అదొక క్యూబ్
అక్కడే నా నిద్రానడక చర్యలు జారుతుంటాయి

మెడుస్సా (గ్రీకు పౌరాణిక పాత్ర)

జంతువుకీ పువ్వుకీ మధ్య, మెడుస్సా మాదిరి.

సముద్రంలో సముద్రపు పగలు, మిట్ట మధ్యాన్నం
అక్కడ నా సంజ్ఞలు తమని తాము పోగట్టుకుని
మేఘాలపైనా నురగ మీదా గిరికీలు కొట్టే సముద్ర కాకులు.

(పోర్చుగీస్ నుంచి ఇంగ్లీషు: రూత్ ఫెన్లైట్)

సముద్ర తీరం

గాలి వీచి పైన్ చెట్లు మూల్గుతాయి
భూదేవి సూర్య కిరణ తాడితమవుతుంది, రాళ్లు రగుల్తాయి

అద్భుత దేవతలు ప్రపంచం అంచుల్లో
వొంటి మీద వుప్పు పొరలతో, చేపల వలె మెరుస్తూ నఢుస్తారు

ఆకస్మిక పక్షులు ఆకాశంలోనికి,
అక్కడి కాంతి మీదికి గులకరాళ్ల మాదిరి విసరేయబడతాయి
అవి పైకెగరి నిట్ట నిలువుగా చనిపోతాయి
వాటి శరీరాల్ని రోదసి తీసేసుకుంటుంది

కాంతిని నలిపేయదల్చినట్లు అలలు వురుకుతాయి
వాటి నుదుళ్ల మీద జలస్తంభాల్ని అలంకరించుకుని.

తెరచాప కర్రగా వుండిన నాటి సనాతన జ్ఞాపకమేదో
పైన్ చెట్ల మధ్య వూగుతుంది.

(పోర్చుగీస్ నుంచి ఇంగ్లీషు: రూత్ ఫెన్లైట్)

వాగ్దేవత

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
గౌరవనీయమైనది, సృష్ట్యాది నాటిది
ప్రతి ఒక్కరి కోసం పలికే పాట
అందరూ విశ్వసించేది.

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
ప్రతి వస్తువుకు నిజ సోదరుడయినది
రాత్రికి, సాయంకాల రహస్యానికి
నిప్పెట్టగల ఒక పాట

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
ఆలస్యం గాని తొందరపాటు గాని లేకుండా
నన్నొక మొలకనో రాయిగానో చేసి
ఇంటికి తీసుకెళ్లే పాట

లేక మొదటి ఇంటికి నన్నొక
గోడను చేసేది
లేక అంతటా వుండే సముద్ర
మర్మర ధ్వనిగా మార్చేది

(నాకు గుర్తుంది బాగా రుద్ది
కడిగిన పలకల ఒక ఓడ నేల,
దాని సబ్బు వాసన
ఎప్పుడూ నన్ను తాకుతూనే వుంది)

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
సముద్రపు వూపిరి పాట
మెరుపుల్మెరుపులుగా ఆయాసపడుతున్నది

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
ఆ తెల్లని గది పాట
ఇంకా, ఆ చదరపు కిటికీ పాట

దాంతో నేను చెప్పగలనిక
అక్కడ సాయంకాలం
తలుపులను, టేబుల్ ను కప్పులను
అద్దాన్ని ఎలా స్పృశించేదో
ఎలా కావిలించుకునేదో.

ఎందుకంటే కాలం గుచ్చుకుపోతుంది
కాలం విడదీస్తుంది
కాలం అడ్డగిస్తుంది, ఇంకా,
మొదటి ఇంటి
గోడల నుంచి నేల నుంచి
నన్ను సజీవంగా చీల్చేస్తుంది

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
గౌరవనీయమైనది, సృష్ట్యాది నాటిది
పాలిష్ చేసిన ఉదయపు
కాంతిని నిలువరించి వుంచే పాట

ఇసుక మేటల మీద మెత్తగా
విశ్రాంతిగా తన చేతి వేళ్లుంచిన పాట
ఆ సామాన్యమైన గదులకు
వెల్ల వేసిన పాట

వాగ్దేవతా! నాకు నేర్పించు ఒక పాట
నాకు గొంతు పట్టేసే పాట

(పోర్చుగీస్ నుంచి ఇంగ్లీషు: రూత్ ఫెన్లైట్)

మృతుల స్పర్శ

మృతులను స్పృశిస్తాన్నేను వైలెట్ పూల శైతల్యంలో,
చందమామ లోని ఆ మహా అస్పష్టతలోనూ.

భూమి ఒక ప్రేతాత్మ అవక తప్పదు
సకల మృత్యువునీ తన వొడిలో వూయల వూపే భూమి.

నాకు తెలుసు నేను నిశ్శబ్దం అంచు మీద పాడుతున్నాను
నేను ఒక సందిగ్ధం చుట్టూరా నాట్యం చేస్తున్నాను
వొదులుకోడం చుట్టూ గట్టిగా కలిగి వుంటున్నాను.

నాకు తెలుసు, సొంత మృత్యువుని చేతిలో పట్టుకుని
నేను మూగ మృతుల మీదుగా ప్రయాణం చేస్తున్నాను.

ఇన్ని అస్తిత్వాల మధ్య నా అస్తిత్వాన్ని పోగట్టుకున్నాను
నా జీవితాన్ని నేను చాల సార్లు మరణించాను,
నా ప్రేతాత్మలను నేను చాల సార్లు ముద్దాడాను,
నా చర్యల గురించి చాల సార్లు నాకేమీ తెలియకుండానే,
మృత్యువు అంటే కేవలం ఒక ఇంటిలో నుంచి వీధిలోనికి
వెళ్లడం మాత్రమేనని తెలియకుండానే.

(పోర్చుగీస్ నుంచి ఇంగ్లీషు: రూత్ ఫెన్లైట్)

సోఫియా డి మెల్లో బ్రేయ్నర్‍ / హెచ్చార్కె

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.