హొరేషియో ఖిరోగా

అరటి తోటలో ఐదో చాలు కూడా అతడు గొడ్డలితో శుభ్రం చేశాడు. ఇంకా రెండు చాళ్లు వున్నాయి. వాటిలో కూడా పొదలున్నాయి గాని, అవేమంత సమస్య కాదు. పని తొందరగానే అయిపోతుంది అనుకుంటూ అప్పటి వరకు శుభ్రం చేసిన చాళ్లను తృప్తిగా చూసుకున్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ పని మొదలెడదామనుకున్నాడు. అరటి తోటకు బయట గామా గడ్డి మీద కాసేపు నడుం వాల్చుదామని అనిపించింది.

తోట దాటి వెళ్లడానికి కంచెను పైకెత్తాడు. కంచె కోసం పాతిన గుంజ మీద బెరఢు వూడిపోయి వేలాడుతూ వుండింది. అతడు వేలాడుతున్న బెరడు మీద కాలు పెట్టి జారి పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో చేతిలోంచి గొడ్డలి పడిపోయింది. నేల మీద గొడ్డలి బల్లపరుపుగా కాకుండా, మొన నిలువుగా తన వైపు తిరిగి వుండడం తను పడిపోతున్నప్పుడు అతడికి లీలగా కనిపించింది.

ఇప్పుడు అతడు గడ్డి మీద పడి వున్నాడు, అంతకు ముందు విశ్రాంతిగా ఎలా పడుకోవాలనుకున్నాడో సరిగ్గా అలాగే, కుడివైపు ఒత్తిగిలి పడి వున్నాడు. ఆ సంభ్రమంలో తన నోరు తెరుచుకుని మళ్లీ మూసుకుంది. మామూలుగా తను ఎలా పడుకుంటాడో సరిగ్గా అలాగే, మోకాళ్లు పొట్టలోకి ముడుచుకుని, ఎడమ చెయ్యి రొమ్ము మీద పెట్టుకుని పడుకుని వున్నాడు. ఒక్కటే తేడా. అతడి మోచేతుల వెనుక, నడుముకు సరిగ్గా పైన గొడ్డలి కామ, దాని ఇనుప భాగం సగం బైటికి కనిపిస్తున్నాయి. మిగిలిన పదునైన గొడ్డలి భాగం కనిపించడం లేదు.

తల కదిలించాలని ప్రయత్నించాడు. కుదరలేదు. కంటి కొస నుంచి గొడ్డలి వైపు చూశాడు. గొడ్డలి కామ మీద తన చెమట ఇంకా తడి తడిగా మెరుస్తోంది. పొట్ట లోనికి గొడ్డలి ఎంత లోతుగా ఏ కోణంలో దిగబడిందో వూహించాలని పద్దతిగా, నిర్మోహంగా ప్రయత్నించాడు. అతడికి అర్థమైపోయింది. తను తన ఆఖరి క్షణాలకు దగ్గరయ్యాడనేది నిస్సందేహం.

మరణం. అది అందరికి తెలుసు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కొన్ని సంవత్సరాలకో, నెలలకో, వారాలకో, దినాలకో ఎవరైనా మరణం తల వాకిట నిలబడక తప్పదని. అదొక అనుల్లంఘనీయ శాసనం. దాని సంగతి ప్రతి మనిషికి ముందే తెలుసు. అది ఎంత బాగా తెలుసంటే, ఆ క్షణం కోసం… అన్ని క్షణాల అమ్మ లాంటి ఆ క్షణం కోసం… దాని లోనికి వీయినంత సుఖంగా ప్రయాణించడం కోసం మనందరం మనస్సును తయారు చేసుకుంటాం.

కాని, ప్రస్తుతానికీ మరణానికీ మధ్య జీవితంలో మనకు మనం వూహించుకునే ఎన్నెన్ని కలలు, ఎన్నెన్ని పునరాలోచనలు, ఎన్నెన్ని ఆశలు, ఎన్నెన్ని నాటకాలు?! జీవన దృశ్యం నుంచి తొలగించబడే లోపు చాల ఉద్విగ్నభరితమైన అస్తిత్వం మనల్ని వూపేస్తుంది. బహుశా మరణం గురించిన మన ఆలోచనలకు ఆ ఉద్విగ్న భరిత అస్తిత్వమే నష్టపరిహారం. మరణం ఎప్పుడూ తక్షణం కాదు. అది చాల సుదూరంగా వుంటుంది.. వస్తుంది గాని ఎప్పడో లెద్దూ అనిపిస్తుంది. అలాగే వున్న జీవితాన్ని జీవించేస్తాం.

ఇంకా……. ? ఇంకా రెండు సెకన్లు గడిచీ గడవనట్లే. సూర్యుడు… అతడి అరటి తోటలోంచి బయల్దేరినప్పుడు ఎక్కడున్నాడో అక్కడే వున్నాడింకా. నీడలు ఒక్క మిల్లిమీటరు కూడా ముందుకు జరగలేదు. ఆ మనిషిని చిరకాలంగా బాధించే ఆలోచనలన్నీ అకస్మాత్తుగా వెనుకడుగు వేస్తున్నాయి. అతడు మరణిస్తున్నాడు.

లేక మరణించాడా? ఎంత సుఖమైన భంగిమలో పడుకుని వున్నాడంటే, మరణించాడనే అనిపిస్తుంది ఎవరికైనా.

అతడు కళ్లు తెరిచి చుట్టూరా చూశాడు. తను అలా పడిపొయి ఎంత సేపయ్యుంటుంది? దీని వల్ల యే కల్లోలం ప్రపంచాన్ని ముంచెత్తింది? తన ఈ ఘటన యే ప్రకృతి డిస్టర్బెన్సు ను సూచిస్తుంది?

తను మరణించబోతున్నాడు. విధిగా, ఖచ్చితంగా, అనివార్యంగా తను మరణించబోతున్నాడు.

ఊహించని  భయంకర పరిణామాన్ని మనిషి ప్రతిఘటిస్తాడు. ఇదొక పీడకల, కేవలం పీడకల అనుకుంటాడు. ఏం మారిందని? ఏమీ మారలేదు. అతడు చుట్టూరా చూస్తాడు. అదిగో అదే కదా తన అరటి తోట? దాని గురించి తనకు తెలిసినంత బాగా ఎవరికి తెలుసు? తోట పల్చగా పరచుకుని, తేటగా  కనిపిస్తోంది తనకు. సూర్యకిరణాల కింద వెడల్పాటి అకులు మెరుస్తున్నాయి. అవే ఆకులు. గాలికి కాస్త వడలిపోయి, తన చేతికందేంత దూరంలో. అయితే ఇప్పుడవి కదలడం లేదు. మధ్యాన్నపు నిశ్శబ్దం. ఇంకాసేపట్లో పగలు పన్నెండు గంటలు కాబోతోంది.

అరటి చెట్ల మీదుగా, బాగా ఎగువన అతడికి తన ఇంటి ఎర్ర రంగు పైకప్పు కనిపిస్తోంది. ఇంటికి ఎడమ పక్కగా పొదలు, అడివి దాల్చినచెక్క చెట్లు. అంతే, తను అంతవరకే చూడగల్గుతున్నాడు. కాని తనకు తెలుసు, తన వెనుక ఓడరేవుకు పోయే బాట వుంటుంది. అలాగే తన తల వున్న దిక్కున, దిగువన ఒక నది వుంటుంది. అదొక పెద్ద సరస్సులా మడుగు కట్టి లోయలో నిద్ర పోతున్నట్లు వుంటుంది. అన్నీ, అన్నీ ఎప్పుడూ వున్నట్లే, మండే సూర్యడు, కంపించే గాలి, ఒంటరితనం, కదలని అరటి చెట్లు, తీగెల కంచె, కంచెకు వుపయోగించిన బలమైన గుంజలు.. బహుశా తొందరగా గుంజలను మార్చాల్సుంటుంది… అన్నీ అలాగే ఎప్పట్లాగే వున్నాయి.

ఆఁ, ఔను. ఎవరో ఈల వేస్తున్నారు ఎవరైందీ తను చూడలేడు. రోడ్డు తన వెనుక వుంటుంది. కాని చిన్న వంతెన మీద గుర్రం గిట్టల ప్రకంనాలు తనకు తెలుస్తున్నాయి. .. అది రోజూ పొద్దున 11.30 కు ఓడ రేవు దిక్కు వెళ్లే ఆ కుర్రాడే… తనెప్పడూ ఇంతే ఈల వేస్తూ వెళ్తాడు…. … బెరడు వూడిన గుంజ దగ్గర్నించి తను బూటు కాలుతో కంచెను దాదాపు తాకగలడు. తనకు తెలుసది, ఎందుకంటే కంచె పాతినప్పుడు తను స్వయంగా కొలిచి చూశాడు.

మరయితే ఏం జరుగుతోంది? తన వూళ్లో, ఈ చిట్టడివిలో, ఈ గడ్డిమైదానంలో, తను చెట్టు గొట్టి తయారు చేసిన అరటి తోట వద్ద చాల మధ్యాహ్నాల లాగే ఇదొక మామూలు మధ్యాహ్నమా కాదా? అదయితే అనుమానం లేదు. అదిగో అదే పొట్టి గడ్డి, కొండలు, నిశ్శబ్దం, సీసం రంగు సూర్యుడు … …

ఏదీ అసలేదీ మారలేదు. తను మాత్రమే కొంచెం తేడాగా వున్నాడు. ఇప్పటికి రెండు నిముషాలుగా ఒక వ్యక్తిగా తను, తన సజీవ వ్యక్తిత్వం… స్వయంగా చెట్టు గొట్టి చేసిన తోటతో, స్వయంగా ఐదు నెలల పాటు చెమటోడ్చి చెత్త ఎత్తిపోసి శుభ్రం చేసిన నేలతో, సొంత చేతులతో పెంచిన తోటతో సంబంధం కోల్పోయింది. ఒక వూడిపోయిన బెరడు కారణంగా, పొట్టలో దిగిన గొడ్డలి కారణంగా చాల మొరటగా, చాల సహజంగా ఆ నేల నుంచీ తోట నుంచీ పెకలించి వేయబడ్డాడు. రెండు నిమిషాలు. తను మరణిస్తున్నాడు.

ఆ మనిషి, అలసిపోయిన వాడు, గామా గడ్డి మీద తన కుడిపక్క శరీరం మీద పడుకుండిపోయిన వాడు తన మనో నేత్రానికి కనిపించే పరిణామాన్ని ఇంకా ప్రతిఘటిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే వంతెన దాటి వెళ్లిన కుర్రాడు అనే ఒక  వాస్తవాన్ని, అందులో వున్న మార్పు లేని సహజత్వాన్నీ వొదల లేకపోతున్నాడు.

అలా తను జారి పడి వుండడడు. గొడ్డలిని (దాని మొన అరిగిపోయింది, తొందరగానే దాన్ని తీసేసి కొత్తది అమర్చుకోవాలి) తన ఎడమ చేతికి కంచెకు మధ్య జాగర్తగా పట్టుకుంటాడు తను. పదేళ్లుగా పని చేస్తున్నాడాయె. చెట్లు కొట్టే గొడ్డలిని ఎలా వుపయోగించాలో తనకు బాగా తెలుసు. ఇప్పుడు తను బాగా పని చేసి అలసిపోయి ఎప్పట్లాగే విశ్రాంతి తీసుకుంటున్నాడంతే.

రుజువు? తనే గదా ఒక్కోటి ఒక మీటరు ఎడంగా వుండే చదరాలలో ఇప్పుడు తన పెదిమల మధ్య గుచ్చుకుంటున్న గామా గడ్డిని నాటింది. అదిగో అదే తన అరటి తోట. అదిగో జాగర్తగా కంచెను మూచూస్తున్న, నుదుటి మీద నక్షత్రం వున్న తన గుర్రం. గుర్రం తనను చూస్తున్నది. కాని, అది తన దగ్గరికి రావడానికి ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే తను సరిగ్గా కంచె గుంజ పాదం దగ్గర పడుకుని వున్నాడు. గుర్రం అతడికి స్పష్టంగా కనిపిస్తోంది. దాని పటకా మీదా, వీపు మీదా చెమట చుక్కలు దారాల్లా మెరవడం అతడికి కనిపిస్తోంది. సూర్యుడు సీసం గుండులా బరువుగా వున్నాడు. ఒక మహా నిశ్శబ్దం. అరటి చెట్లు కొంచెం కూడా కదలడం లేదు. తను రోజూ చూస్తున్న దృశ్యమే.

….. చాల అలసి పోయాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు తను. చాల నిమిషాలు గడిచి వుంటాయి….. పావు తక్కువ పన్నెండుకు అదిగో ఆ పైన ఎర్ర పైకప్పు వున్న ఇంటి నుంచి అతడి భార్య, ఇద్దరు పిల్లలు తనను మధ్యాహ్న భోజనానికి తీసుకెళ్లడానికి వస్తారు. ప్రతి సారీ అందరి కంటె ముందు తనకు తన చిన్న కొడుకు గొంతు వినిపిస్తుంది. వాడు తల్లి చెయ్యి విడిపించుకుని .’నానా, నానా’ అని అరుస్తూ పరిగెత్తుకొస్తాడు.

అదిగో, అదే గొంతు కదూ? అనుమానం లేదు. అదే. తనకు వినిపిస్తోంది. తనకు వినిపిస్తున్నది మరేదీ కాదు. తన చిన్న కొడుకు గొంతే.  …

ఏం పీడకల? ఆఁ, సరే, ఇది అన్ని రోజుల్లాగే ఒక రోజంతే. మామూలు రోజు. కొంచెం ఎండ ఎక్కువగా వుంది. పసుప్పచ్చ నీడలు. కొలిమి లాంటి వేడి. అందువల్లనే తనకు దూరంగా అరటి తోట పక్కన ఆ కదలని గుర్రం మూపున చెమట ధారలు.

… .. బాగా బాగా అలసి పోయాడు. అంతే. అంతకంటె ఏమీ లేదు. ఎన్ని సార్లు, పగలు మధ్యాహ్నాలు, ఇంటికి వెళ్లే దారిలో ఈ కంచెను దాట లేదు తను. తాము ఇక్కడికి వచ్చే నాటికి కంప తారగా వున్న కంచెను, ఇంకా అంతకు ముందు నిండు పొదలుగా వున్న ఈ కంచెను తను ఎన్ని సార్లు దాటి ఇంటికి పోలేదు. అప్పుడు కూడా ఇలాగే పని చేసి చేసి బాగా అలిసిపొయి, ఎడమ చేతిలో గొడ్డలి వేలాడుతుండగా నడిచిపోయే వాడు.

ఇప్పుడు కావాలంటే తన మనస్సులో తాను పక్కకు లేచి వెళ్ల గలడు. తన దేహాన్ని ఒక్క క్షణం వదిలేసి తాను సొంత చేతులతో కట్టిన వరద కతువ మీద నిలబడి చుట్టూరా చెట్టూ చేమను, దూరంగా ఓల్కానిక్ శిల మీద ఏపుగా పెరిగిన గామా గడ్డిని, అరటి తోటను, తోటలో ఎర్ర మట్టిని, దిగువకు రోడ్డు వైపు పోయే కొద్దీ అస్పష్టమయపోయే ఈ కంచెను అన్నిటినీ చూడగలడు. అలాగే బెరడు వూడిన గుంజ పాదం వద్ద కుడి పక్కకు పడిపోయి, కాళ్లు ముడుచుకుని, ప్రతిరోజూ పడుకున్నట్లే పడుకున్న తనను, గడ్డి మీద ఎండలో మెరుస్తున్న ఒక కుప్ప లాంటి తనను తాను చూడగలడు- తను విశ్రాంతి తీసుకుంటున్నాడంతే, బాగా అలసిపోయి వున్నాడంతే.

కాని, చెమటలో తడిసి, మూలన కంచె అవతల జాగర్తగా కదలకుండా నిలబడిన గుర్రం ఆ మనిషిని చూసింది. అది తను కోరుకున్నట్లు, ఎప్పట్లాగ తోటలోకి రావడానికి ధైర్యం చేయని ఆ మనిషిని చూసింది. దగ్గర్లోంచి ‘నానా నానా’ అనే అరుపును మరీ ఎక్కువ సేపు విన్నది. నిక్కబొడిచిన చెవులను కదలిక లేని మనిషి వైపు సారించింది. చివరికి శాంతించి, ఒక నిర్ణయం తీసుకుని, పడిపోయి విశ్రాంతి తీసుకుంటున్న మనిషికీ కంచె గుంజకూ మధ్య స్థలం లోకి వెళ్లింది.

(ఇంగ్లీషు లోనికి అనువాదం: మార్గరెట్ సేయర్స్ పెడెన్, తెలుగు: హెచ్చార్కె)

 

హొరేషియో ఖిరొగా

హొరేషియో ఖిరోగా (1878- 1937) అర్జెంటీనా రచయిత. ఇప్పుడు 'రస్తా' ప్రచురిస్తున్న ‘మనిషీ మరణం’ లో లాగే ఖిరోగా వాళ్ల నాన్న తన చేతిలోని తుపాకీ పొరపాటున పేలి చనిపోయారు. ఖిరోగా రాసిన కథలు ప్రపంచ ప్రసిద్ధం. దాదాపు ఆయన కథలన్నీ అడివి నేపధ్యంలోనే వుంటాయి. మనిషీ, ప్రాణులూ బతికి వుండడం కోసం చేసే పోరాటమే చాల సార్లు ఆయన కథా వస్తువు. మానసిక జబ్బులకు, చిత్త భ్రమకు లోనైన మనుషులను చిత్రించడం ఆయన ప్రత్యేకత. లాటినమెరికన్ ‘మాంత్రిక వాస్తవికత’లో గేబ్రియల్‍ గార్సియా మార్క్వెజ్ మీద, ఉత్తరాధునిక అధివాస్తవికతలో జూలియో కోర్టాజార్ మీద హొరేషియో ఖిరోగా ప్రభావం వుందని కొందరు విమర్శకుల అభిప్రాయం.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.