ఒక తమ్ముడు…

మా తమ్ముడు లాంటి తమ్ముడు మీకున్నాడా?
ఇలాంటి పిల్లాడు భూమ్మీద ఎక్కడా వుండడంటుంది నానమ్మ.
అందరు పిల్లలూ అంతే అంటుంది అమ్మమ్మ. ఈ కాలమే అంత అని.
నా రాజే.. అంటుంది అత్త. తాటిరాజు పితూరి.. అని కూడా అత్తే అంటుంది.
తాటిరాజు ఎవరని అడిగితే, తాటిరాజుకి భయపడినట్టే మీ తమ్ముడికీ అందరూ భయపడతారు- అని నాయనమ్మ చెప్తుంది. వీడి అల్లరి భూమిల్లేని అల్లరని కూడా అంటుంది.
వీడు పిల్లడు కాడు పిశాచి- అని అప్పుడప్పుడూ అమ్మ కూడా తమ్ముణ్ణి తిట్టేస్తుంది.
వీడిలా సాధిస్తున్నాడేమి?- అని నాన్న కూడా తిట్టుకుంటారు.
తమ్ముడంటే అందరికీ హడల్! అమ్మా నాన్నా  నానమ్మా అమ్మమ్మా నేనూ మా ఫ్రెండ్సూ అందరం భయపడతాం.
వాడ్ని చూస్తే మీరయినా భయపడతారు.
ఇలా ఎలా తయారయాడని అనుకుంటారు.
వాడు చూడడానికి బుద్దిగా బుద్దుడి తమ్ముడిలా వుంటాడు. నెమ్మదిగానే వుంటాడు. నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు వుంటాడు. కాని- చెయ్యాల్సింది చేసేస్తాడు.
‘వాడ్నేమనకు.. ఆ రిమోట్ పగలగొట్టీగలడు..’ అని అమ్మ అంటుందా?, అన్నదే తడవు రిమోట్ తీసుకొని నేలకేసి టపా టపా కొట్టేస్తాడు.
‘నేనంటూనే వున్నా, వాడు చెయ్యాల్సింది చేసేసాడు’- అని అమ్మ లబోదిబోమంటుంది.
వాడు పెన్సిల్ పట్టుకు నిలబడి చూస్తాడా?, అది చూసి నాన్న ‘వీడి చేతికి పెన్సిలెవరిచ్చార్రా.. గోడమీద గీసేయ్యగలడు’ అంటారు. అంతే.. ఠక్కున గోడమీద గీతలు బరబరా గీసేసి నవ్వుతాడు.
నాన్న కొట్టడానికి వస్తారా.. ‘కొడితే మొండయిపోతాడు’ అని నానమ్మ అడ్డుకుంటుంది.
యస్.. నేను మొండివాడ్నే అన్నట్టు చూసి- దెబ్బలు తిని- ఏడ్చి- మళ్ళీ పెన్సిల్ అరిగిపోయేదాక గీస్తాడు.
ఎవరైనా ఏదైనా గిఫ్టుగా బొమ్మ తెచ్చి తమ్ముడికివ్వగానే, అమ్మ అంటుంది.. ‘వాడు రెండు నిముషాల్లో పాడు చేసేస్తాడు’ అని. అంతే- అప్పటివరకూ బుద్దిగా వున్నవాడు మరుక్షణం ఆ బొమ్మని పళ్ళతో కొరికో- గోడకేసి కొట్టో- కాదూ అంటే సుత్తి తెచ్చి ఒక దెబ్బవేసి బాదో- చెప్పిన రెండు నిముషాల్లో ఫినిష్ చేసేస్తాడు.
చెప్పానా?- అంటుంది అమ్మ.
చేసానా?- అన్నట్టు చూస్తాడు తమ్ముడు.
వాడు చక్కగా నా పుస్తకం తెరచి బొమ్మలు చూస్తూ వుంటాడా?, నానమ్మ వచ్చి ‘నా తండ్రే చక్కగా చూసుకో.. చింపకూ’ అంటుంది. అలాగేనన్నట్టు తలూపుతాడు తమ్ముడు.
అనుమానం తీరక, వెళ్ళబోతూ వెనక్కి వచ్చిన నానమ్మ గొంతు తగ్గించి.. ‘వాడికెందుకిచ్చావు?, చింపెయ్యగలడు’ అని నన్ను కోప్పడుతుంది. కళ్ళు బిగించి మరీ. అంతే-
ఆ మరుక్షణం పుస్తకం సర్రున తమ్ముడు చింపేస్తాడు. అమ్మ చేతో నాన్న చేతో నాలుగు దెబ్బలు తినేస్తాడు. ఏడుస్తాడు.
‘వాడ్ని అలా బండి మీద తిప్పుకొస్తే గాని ఏడుపు ఆపడు’ అంటుంది అమ్మ. అమ్మ చెప్పినట్టుగానే బండి మీద మావయ్య తిప్పి తీసుకు వచ్చినంత వరకూ ఏడుస్తూనే వుంటాడు.
అంతే కాదు, టీవీ చూసినప్పుడు కూడా అంతే. ‘వాడికి నచ్చిన ఛానెల్ మనం చూడాల్సిందే, మారిస్తే ఒప్పుకోడు వదినా’ అని అమ్మ గొప్పగా చెప్తుందా? అంతే-
తమ్ముడు తనకి నచ్చిన ఛానలే అందర్నీ చూడమంటాడు. మారిస్తే ఏడుస్తాడు. ‘వాడ్ని ఎందుకు ఏడిపిస్తారు? వాడు నేల మీద పొర్లి బట్టలు పాడు చేస్తాడు..’ అని అమ్మమ్మో అత్తో అంటారా, అంతే-
వాడు మరుక్షణం నేలమీద పడి దొర్లి బట్టలు పాడుచేసేస్తాడు.
‘మావాడు కూర తినడు..’ అని అమ్మ పక్కింటి పిన్నికి చెప్తుంది అదేదో గొప్ప విషయమైనట్టు.
అంతే, నిజంగానే తమ్ముడు కూర తినడు.
‘పెరుగూ తినడు..’ అంటుంది అమ్మ. అంతే-
తింటున్న పెరుగన్నం వూసేస్తాడు.
‘మరి వీడితో ఎలా పడుతున్నాననుకున్నావ్..’ అంటుంది అమ్మ బడాయిగా. బంగాళ దుంప కూర ఒక్కటే తింటాడు అంటుంది అమ్మ.
తమ్ముడు అమ్మ చెప్పినట్టు బంగాళ దుంప కూర తింటాడు.
‘పచ్చి దొండకాయలు తినేస్తాడు మావాడు..’ అని అమ్మ చెప్పినట్టుగానే పచ్చి దొండకాయలు వాంతొచ్చినా కరకరా నమిలి తినేస్తాడు. ఆ తరువాత అలవాటయిపోయింది.
‘వాడికి పేస్టెందుకిచ్చారు? పిండేస్తాడు..’ అని నాన్న అనగానే తమ్ముడు స్టార్ట్ చేసి పేస్టు మొత్తం పిండేస్తాడు.
అన్నం గుడ్డు కూరతో తమ్ముడు తింటూ వుంటాడా.. ‘అసహ్యంగా అన్నంలో కలిపేస్తాడే’ అని నాన్న అనగానే నిజంగానే తమ్ముడు కలిపేసి కంపు చేసేస్తాడు. ‘రెండు చేతులు పెట్టేస్తాడు’ అనగానే గుర్తొచ్చినట్టు వెంటనే రెండు చేతులూ తిన్న కంచంలో పెట్టేస్తాడు. గర్వంగా చూస్తాడు.
‘తమ్ముడ్ని మీతో ఆడిపించుకోండి.. లేకపోతే మిమ్మల్ని ఆడనివ్వడు..’ అంటే నిజంగానే తమ్ముడు బేటూ బాలూ తీసుకొని పారిపోవాలని చూస్తాడు. పోనీలే అని ఆడిపిస్తాం. వాడు అందర్నీ ఏడిపిస్తాడు.
‘మా తమ్ముడికి అర్ధరాత్రి దాకా ఆటలే, నిద్ర రాదు..’ అని అమ్మానాన్నా అంటే ఆవలింతలు తీస్తున్నవాడు లేచి కూర్చుంటాడు. వాడు నిద్ర పోడు. పోనివ్వడు.
అన్నట్టు మా పక్కింటి పాప మా ఇంటికి వస్తూ వుంటుంది.
ఒకరోజు.. ఏమయ్యిందీ?
ఆ పాప చేతిలో పీస్ మిఠాయి వుంది. తింటూ వుంది. ఇంటికి పొమ్మంది నానమ్మ. ఆ పాప వెళ్ళలేదు. తమ్ముడక్కడే వున్నాడు.
‘తమ్ముడికిస్తావా?’ అంది అమ్మ. ఇవ్వనని అడ్డంగా తలూపింది అది.
‘తమ్ముడు తీసుకోగలడు.. వెళ్ళిపో’ అంది అమ్మ. అంతే-
తమ్ముడు పీస్ మిఠాయి తీసుకోబోయాడు.
ఆ పాప ఇవ్వలేదు. తమ్ముడు వదల్లేదు.
అమ్మ కాదు, నానమ్మ కాదు.. ఎవరూ విడిపించలేకపోయారు.
‘వదిలెయ్యవే పిల్లా, తమ్ముడు కరిచెయ్యగలడు..’ అంది నానమ్మ. అంతే-
తమ్ముడు ఠక్కున పాప చేతిమీద కరిచేసాడు.
పీస్ మిఠాయి కిందపడింది.
తమ్ముడి వీపుమీద దెబ్బపడింది.
ఆ పాప ఏడుస్తూ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మానాన్నా గొడవకు వచ్చారు. ‘అడిగింది ఇవ్వకపోతే కరిచెయ్యడమేమిటి? విచిత్రం..’ అన్నారు. వాడు అడగ్గానే ఇచ్చెయ్యాలి, లేకపోతే కరిచేస్తాడని అందరూ అనుకున్నారు. అన్నారు. అంటూనే వున్నారు.
నిజంగానే తమ్ముడు అడగ్గానే ఏది ఇవ్వకపోయినా కరిచేస్తున్నాడు. కరవడం అలవాటయిపోయింది. దెబ్బలు తినడం కూడా.
ఏమైనా-
ఏదైనా మనం అనడమే చాలు.. తమ్ముడు అదే చేసేస్తున్నాడు.
‘నేను చెప్పలా?’ అంటుంది అమ్మ.
చెపితేనే చేసాడనిపిస్తుంది నాకు. అదేమాట అమ్మతో అంటే- ‘వాడి గురించి నీకు తెలుసా? నాకు తెలుసా?’ అని తిరిగి అంటుంది. నా కడుపులో పుట్టాడు నాకు తెలీదా?- అంటుంది.
మా తమ్ముడి గురించి మీకు తెలుసా?
మరి మీ తమ్ముడూ అంతేనా?

-గౌతమ్,
నాలుగవ తరగతి,
నారాయణా కాన్సెప్ట్ స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

4 comments

  • మన రాజకీయ నాయకులూ ఇలాగే ఉన్నట్టున్నారు

  • అందుకనే మనం ఏమీ అనకూడదు వాళ్ళ గురించి 😄

  • మొత్తానికి భలే తమ్ముడు… సరదాగా బావుంది. అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.