పర్యావరణ విధ్వంసం మీద పసివాళ్ల తిరుగుబాటు

“మా భవిషత్తును దోచుకుంటున్నారు” అని ప్రపంచ నాయకులను నిలదీసింది స్వీడన్ దేశానికి చెందిన 15 ఏళ్ళ గ్రెటా థున్బెర్గ్,(Greta Thunberg). పోలెండు లో కటొవిస్ లో  జరిగిన 24 వ ఐక్య రాజ్య సమితి ‘క్లైమేట్ సమ్మిట్’  ప్లీనరీలో మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్యం మీద స్పందించని ప్రపంచాన్ని నిలదీసింది.

‘ మీరు మరీ పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు. భూమినంతా చెల్లాచెదరు చేసేశారు. పిల్లలం ఆడుకుంటూ పాడుకుంటూ వస్తువుల్ని చెల్లా చెదరుగా వేస్తే ‘శుభ్రం చేయండ’ని కోప్పడతారు కదా!, ఇప్పుడు మీరు చేసిందేమిటీ? భూగోళాన్ని కాలుష్యాలతో నాశనం చేస్తున్నారు.   మీ లాభాల వేటతో జీవ రాసుల్ని ధ్వంసం చేస్తూ, భూమి తాపాన్ని పెంచుతున్నారు. మీ ఆటలు చాలించండి, భూమిని శుభ్రం చేయడం మొదలుపెట్టండి.” అని ప్రపంచ నాయకులను విసుక్కుంది ఆ చిట్టి తల్లి.

“మా భవిషత్తు గురించి పట్టించుకోమని ప్రపంచ నాయకులను దేబెరించడానికి రాలేదు మేము. గతంలోనే వాళ్లు మనల్ని నిర్లక్ష్యం చేశారు. మేము ఇక్కడకు వచ్చింది, విధ్వంసం మీద తిరుగుబాటు చేయడానికి, ప్రజలు ఉవ్వెత్తునలేస్తున్నారనీ నాయకులకు ఇష్టమున్నా లేకున్నా మార్పు వస్తోందని తెలపడానికి” అని “డెమోక్రసీ నౌ’కు ఇచ్చిన ఇంటర్య్వూలో  చిన్నారి గ్రెటా స్పష్టం చేసింది.

కటొవిస్ లో సిఒపి 24 సదస్సు

పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కాలుష్య నియంత్రణ కోసం ఏర్పడిన వ్యవస్థ ఐ రా స  ‘ఫ్రేంవర్క్ కన్వెన్స్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ ( యు ఎన్ ఎఫ్ సిసిసి). ఈ సంస్థ 1995 నుంచి ఏడాది కొక సారి కాన్ఫరెన్సెస్ ఆఫ్ ది పార్టీ ( సిఒపి) జరుపుతూ పర్యావరణాన్ని వినాశం నుంచి ఎలా ఎదుర్కోవాలో చర్చిస్తోంది. ఇందులో మొదట 194 దేశాలు సంతకాలు చేశాయి. సిఒపి 21 ప్యారిస్ లో (డిసెంబర్ 2015)  జరిగినప్పుడు భూగోళం ఉష్ణోగ్రతను 2 సెంటిగ్రేడ్స్ కు అంటే పారిశ్రామిక యుగం కన్నా ముందుండిన ఉష్ణోగ్రతల స్థాయికి తీసుకరావాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. తమ తమ దేశాల్లో అందుకు అవసరమైన పద్దతులు, విధి విధానాలు రూపొందించుకోవాలని సభ్యదేశాలు అంగీకరించాయి. ఇదే ‘ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్’గా ఉనికిలోకి వచ్చింది. దీన్నుంచి వైదొలుగుతున్నట్టు జూన్, 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. 2018 డిసెంబర్ 3-14 తేదీల్లో పోలెండు లోని కటొవిస్ (Katowice)లో సిఒపి24 జరిగింది. ఈ సమావేశాలకు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్ దూరంగా వున్నాయి. అయితే అమెరికా నుంచి ఒక బృందం సిఒపి 24 కి హాజరై శిలాజ ఇంధనాలా వెలి తీతకు ఒక పాలసీని రూపొందించడానికి ప్రయత్నించింది కాని, తీవ్ర వ్యతిరేకత వల్ల అది సాధ్యపడలేదు.

గ్రెటా థున్బెర్గ్ (Greta Thunberg)

పర్యావరణ సంక్షోభం ముంచుక వస్తున్నదని, వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే, భూమి మీద జీవరాసుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని 15 ఏళ్ళ  గ్రెటా చెబుతూ, మూడు వారాలు  స్కూలు మానేసి స్వీడన్ రాజధాని స్టాక్ హోం లోని  పార్లమెంటు భవనం మెట్ల మీద కూర్చొని సమ్మె చేసింది. ఆగస్టు నెలలో ప్రారంభించిన ఆ సమ్మెను ఇప్పటికీ కొనసాగిస్తున్నది. అయితే నాలుగు రోజులు స్కూలుకు పోతూ శుక్రవారం మాత్రమే స్కూలు మానేసి సమ్మె చేస్తున్నది 9 వ తరగతి చదువుతున్న గ్రెటా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రపంచ వ్యాప్తంగా  పర్యావరణ తిరుగుబాట్లకు ప్రేరణ అవుతున్నది.

గ్రెటా 9 ఏళ్ల వయసులో పర్యావరణ సంక్షోభం మీద  క్లాసులో టీచర్ బోధించిన పాఠాలు విని మానసిక ఆందోళనకు గురయింది. ఏమీ తినకుండా, ఎవరితో మాట్లాడకుండా దిగులుగా వుండడంతో సినిమా నటుడైన తండ్రి తన అవకాశాలను మానుకొని కూతురిని చూసుకోడానికి ఇంటికి పరిమితమయ్యాడు. ‘వాతావరణ కాలుష్యం వల్ల జీవరాసులు చనిపోతున్నాయ’ని. ‘మాంసాహారం  తినడం మానేద్దామ’ని, ‘పాలు, పాల ఉత్పత్తులు తినడం మానేద్దామ’ని అనేసరికి తల్లి, తండ్రి ఆమె కోరినట్టు చేశారు. తల్లి ఒపేరా సింగర్, దేశదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. ‘’విమానాల్లో తిరుగుతూ మనం కాలుష్యాన్ని పెంచుతున్నాం. మనం విమానాల్లో తిరగొద్దు. ఎలక్ట్రిక్ కారులోనే ప్రయాణిద్దాం. నిరాడంబరంగా జీవిద్దాం, మార్కెట్ కు లొంగిపోవద్దు మనం” అనేదట. గ్రెటా మానసికంగా కుంగిపోయింది. ఇదొక రకం జబ్బు. దీన్ని అస్పర్గర్స్ సిండ్రోం అంటారు. కూతురిని సంతోషంగా వుంచడం కోసం ఆమె చెప్పినట్టే చేస్తూ, ఆమెలో  జీవితం పట్ల ఆశలు రేకిత్తించారు తలిదండ్రులు. ఒక ఏడాదికి ఆ అమ్మాయి  మామూలు మనిషై, తిరిగి  స్కూలుకు వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తోంది. గ్రెటా తల్లి పేరు మలెనా ఎర్న్ మన్ (Malena Ernman), తండ్రి పేరు  స్వాంటె థున్బెర్గ్  (Svante Thunberg). కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యం వల్ల గ్రీన్ హౌస్ కు ప్రమాదమని చెప్పిన మొదటి పర్యావరణ శాస్త్రవేత్త, 1896లో నోబుల్ బహుమతి గ్రహీత స్వాంటె అర్హెనిస్ (Svante Arrhenius) వారసులు గ్రెటా, స్వాంటె. ‘’నోబుల్ బహుమతి వచ్చిందని స్వాంటె అంటే మా కుటుంబానికి గౌరవం. అందుకే నాకు ఆయన పేరు పెట్టాడు మా నాన్న. కాని నోబుల్ బహుమతి ఎందుకొచ్చిందో  మా కుటుంబానికి తెలియదు. ఇటీవలె తెలిసింద’’ని గ్రెటా తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.

యు.ఎన్. సమ్మిట్ లో మాట్లాడిన తరువాత గ్రెటా ఎలక్ట్రిక్ కారులో పోలెండ్ నుంచి స్వీడన్ కు వెళ్లిపోయింది. పది రోజులు (డిసెంబర్ 3 నుంచి14 వరకు) యు ఎన్ సమావేశాలు జరిగినా ఏ చర్యా తీసుకోలేదని నిరసన తెలుపుతూ ప్రపంచ పర్యావరణ సమ్మె చేయాలని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది. డిసెంబర్ 14 శుక్రవారం కావడంతో ఆమె స్టాక్ హోం మెట్ల మీద బైటాయించింది.

గ్రెటా సమ్మె పిలుపును అందుకొని  పోలెండులోని హైస్కూల్ విద్యార్థులు 30 మంది శుక్రవారం డిసెంబర్ 14న క్లాసులను బహిష్కరించి,‘’12 years left’’, “climate strike” అని రాసిన ప్లే కార్డ్స్ పట్టుకొని  మైఖేల్ జాక్సన్ “భూమి పాట” (Earth song-1995)ను పాడుకుంటూ వచ్చి యు.ఎన్. క్లైమేట్ సమ్మిట్  మెయిన్ హాలు ముందు బైటాయించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో అనేక మంది విద్యార్థులు అహింసా మార్గంలో శాసనోల్లంఘనం చేశారు. పార్లమెంటు భవనాల ముందు లేదా ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చొని ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప జేశారు.

నవంబర్ 30న శుక్రవారం ఆస్ట్రేలియాలోనూ అనేక నగరాలలో, పట్టణాల్లో వేలాది మంది పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించి వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ భవనాల ముందు బైఠాయించారు. పర్యావరణ మార్పులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు.

సన్ రైజ్ మూవ్ మెంట్

సన్ రైజ్ మూవ్ మెంట్ కు చెందిన పర్యావరణ యువ కార్యకర్తలు దాదాపు 1,000 మంది డిసెంబర్ 10 న వాషింగ్టన్ డి.సి.లోని  కాపిటల్ హిల్ ను వరదలా ముంచెత్తారు. కాంగ్రెస్ మెంబర్లను, కాబోయే హౌస్ స్పీకర్ నాన్సీ పెలొసిని కలిసి తమ డిమాండ్లు వినిపించారు. న్యూయార్క్ నుంచి కొత్తగా ఎన్నికైనా అలెగ్జాండ్రియా ఒకసియో కార్టెజ్  ప్రతిపాదించిన ‘గ్రీన్ న్యూ డీల్’  కమిటీ కి మద్దతు తెలపాలని కోరారు.  ఉద్యోగ అవకాశాలు పెంచడం పేరిట బొగ్గు గనుల తవ్వకం, ఆయిల్ వెలికితీత వంటి అమెరికా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని, భూమిని కాలుష్యాల నుంచి కాపాడుకోడానికి , పచ్చ దనాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని అలెగ్జాండ్రియా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈమె ప్రతిపాదించిన “ గ్రీన్ న్యూ డీల్” కమిటీకి ఇప్పటికే 35మంది కాంగ్రెస్ సభ్యులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ భవనంలోకి చొచ్చుకపోయిన ‘సన్ రైజ్ ఉద్యమం’ యాక్టివిస్టులను 140 మందిని అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది.

విధ్వంసం పై తిరుగుబాటు

వాతావరణ సంక్షోభం ముంచుక వస్తున్నదని, దీన్ని నివారించాలని ‘’విధ్వంసం పై తిరుగుబాటు’’( Extiction Rebellion-XR) పేరిట బ్రిటన్ లో ఒక సంఘం ఏర్పడింది. భూమి మీద 3 డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు వేడి పెరిగితే అడవుల్లో దావానాలాలు, సముద్ర తీర ప్రాంతాల్లో తుపాన్లు, మైదానాల్లో వర్షాభావం వల్ల కరువులు భూగోళాన్ని అతలాకుతలం చేస్తాయని, జీవరాశులు నాశనం అవుతాయని, అంతిమంగా మానవాళి విధ్వంసం జరుగుతుందని ‘ఎక్స్ ఆర్’ సంఘం హెచ్చరిస్తోంది.  కాలుష్యాల వల్ల ఒక సెంటిగ్రేడ్ వేడి పెరిగితేనే, వరదలు ఒకవైపు, నీటి కొరత, కరువులు మరో వైపు. ఒక వైపు అడవులు కాలిపోతుంటే మరో వైపు తుపాన్లు, వరదలు చూస్తున్నాం. జరగబోయే విధ్వంసం గురించి నిజాలు చెప్పాలని, రానున్నది అందరికీ తెలియాలని, ప్రపంచ ప్రజలందర్నీ మేల్కొల్పడానికి  ‘’ఏక్స్ ఆర్’’ ను ఆరునెలల క్రితం ఏర్పరచినట్టు ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. ఒకటిన్నర నెలలుగా మాత్రమే సమస్యలపై కార్యక్రమాలు రూపొందించి రోడ్ల మీదకు వస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో ఈ సంఘం శాఖలు ఏర్పాడ్డాయని, లక్ష మందికి పైగా సభ్యులుగా వున్నారని ఇంగ్లండ్ లో పని చేస్తున్న యాక్టివిస్టులు ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. తాము అహింసా మార్గంలో శాసనాలను ఉల్లంఘించడం ద్వారానే పోరాటం కొనసాగిస్తామని చెప్పుకున్నారు. ముఖ్యంగా పార్లమెంటు భవనాల ముందు, ప్రభుత్వ పాలనా విభాగాలున్న ఆఫీసు భవనాల ముందు బైఠాయింపులు జరుపుతూ ప్రభుత్వ పనులను అడ్డుకుంటామని చెప్పారు. అరెస్టులు జరుగుతాయి, అయిన భయం లేదు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా విడుదలయ్యాక మళ్లీ ఈ కార్యక్రమాల్ని చేపడతామని. భూ గ్రహం మీద మూకుమ్మడిగా జీవరాశుల్ని అంతం చేస్తూ ప్రభుత్వాలు నేరపూరితంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వాలు చట్టబద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తూ 2025 కంతా కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

పోలెండ్ లో ఐ రా స ‘క్లైమేట్ చేంజ్ సమ్మిట్’ జరుగుతుండగా ‘ఎక్స్ ఆర్’ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనికి ముందు నవంబర్ 17న 6,000 మంది  ఈ సంఘం సభ్యులు వీధుల్లోకి వచ్చి  సెంట్రల్ లండన్ లోని 5 బ్రిడ్జిలపై  బైటాయించి రాకపోకలని నిలిపివేశారు.  వీరిని చూసిన ప్రజలు వేలాది మంది వీధుల్లోకి వచ్చి రోడ్ల మీద బైఠాయించడమే గాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న  ప్రతిఘటనను ఒక వేడుకలాగా జరుపుకున్నారని యాక్టివిస్టులు తమ సంతోషాన్ని ప్రకటించారు.

ఇప్పటికే ఐర్లాండ్,ఆస్ట్రేలియా, కెనాడా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, కొలంబియా, అమెరికా … ఇలా 27 దేశాల్లో యువత పర్యావరణ మార్పులపై ప్రదర్శనలు, బైఠాయింపులు నిర్వహించారని, కంపెనీలకు అనుకూలమైన ప్రభుత్వ చర్యల పట్ల ప్రజలు కోపంగా వున్నారని. వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారని, అమెరికాలోని సన్ రైజ్ మూవ్ మెంటులోనూ, పోలిష్, ఆస్ట్రేలియా స్కూల్ పిల్లల సమ్మెల్లోనూ ఈ విషయాన్ని చూశామని, తొందర్లోనే తమ ఉద్యమాన్ని ప్రపంచమంతా విస్తరింపజేస్తామని, మరో నాలుగు నెలల్లో  ఏప్రిల్ 15 నుంచి వారం రోజుల పాటు “గ్లోబల్ సమ్మె” చేపడతామని, అహింసా మార్గంలో శాసన ఉల్లంఘన రూపంలో బైటాయింపులు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.