అదో సరదా!

బూర్జువా వర్గానికి ఒకే ఒక సరదా వుంటుంది.

అన్ని సరదాలను పాడు చేయడం దాని సరదా.

ఇది ఏ ‘మహనీయుడో’ చెప్పిన మాట కాదు. ఇప్పుడు అంతగా ప్రచారంలో లేదు గాని, ‘68 తరం వేనోళ్ల నానిన ‘ఎడమ చేతి నిఘంటువు’ (లెఫ్ట్ హ్యాండ్ డిక్షనరీ) చమత్ కారాల్లో ఇదొకటి.

స్వేచ్ఛ ఒక బూర్జువా మిత్ (పెట్టుబడిదారీ పురాణం) అనే మరో మాట… ఆ నిఘంటు-వాక్కులలోనిదే- కారం పక్కన వుప్పు వంటిది.

ఈ రెండింటి మధ్య వుప్పుకారాల మధ్య వుండేంత లంకె వుంది.

‘అన్ని సరదాల్ని పాడు చేసే బూర్జువా సరదా’ … స్వేచ్ఛ పేరిట జరిగే మోసానికి చక్కని వుదాహరణ.

మనిషికి సరదా లగ్జురీ కాదు, ఒక జీవితావసరం.

ఎంత సీరియస్ మనుషులైనా కాసేపైనా సరదాగా గడపాలి. లేకుంటే తమ గాంభీర్యం కింద తాము నలిగి ఛస్తారు.

సీరియస్ పెద్దమనుషులకే తప్పనిసరి టానిక్ అయినప్పుడు, ఇక, మన బోటి సామాన్యులకది అన్నంతో సమానం.

పూర్వం ఏవేవో ఆట, పాటలుండేవి. ఆటలు కేవలం పిల్లలకేనని అనుకునే వాళ్లు కాదు. ఏ వయసుకు ఆ ఆటలుండేవి.

ఎవరో ఎక్కడో అడుతుంటే టీవీల్లో చూసి ఎగిసిపడే వైకేరియస్ ఆనందం కాదు.

జనం స్వయంగా ఆడే ఆటలుండేవి.

ఆడవాళ్లకైతే బారకట్ట, అచ్చెనగాయలు. మగవాళ్లకైతే పులిజూదం, వైకుంఠపాళి ఎట్సెటరా.

(మన ఇండియన్ల నుంచి ‘రెడ్ ఇండియన్ల’ దాక ఆటలు లేని సంస్కృతి ఏదీ లేదు. అమెరికా, కనెటికట్, ‘మషాంటుకెట్ పెఖోట్’ మ్యూజియంలో నేటివ్ అమెరికన్ (రెడ్ ఇండియన్) వయోజనులు ఆడిన ఆటల మోడల్స్ ముచ్చటగొల్పుతాయి).

మనిషికి పని ఎంత అవసరమో విశ్రాంతి అంత అవసరం.

విశ్రాంతి అంటే ఏం చేయకుండా కూర్చోడం కాదు. సోమరితనం కాదు.

ఊరక కూర్చుంటే మస్తిష్కం విశ్రాంతిగా వుండదు. తనను మోస్తున్న మనిషిని విశ్రాంతిగా వుండనియ్యదు. సోమరి మనస్సులో దయ్యాలు నాట్యం చేస్తాయి.

మనస్సును చురుగ్గా నిమగ్నం చేసే వ్యాసంగమేదో వుండాలి, పనికి సైదోడుగా.

అవే… మునుపు ఇళ్ల ముందరి అరుగుల మీద, వూరుమ్మడి చావిళ్ల వద్ద జమగూడి, పెద్దాళ్లు (సైతం) ఆడిన అటలు.

పేదోళ్లకు అచ్చెనగాయలు, గవ్వలాటలు, పులిజాదాలు.

ఉన్నోళ్లకు చదరంగాలు, పాచికలాట, ఇంకేవేవో.

ఇప్పుడు వూళ్లల్లో, పట్నాల్లో ఎక్కడా అలాంటి ఆటలు కనిపించవు.

క్రికెట్ లాంటివి వున్నా వాటిని పెద్దాళ్లు భారీ కూలీ కి ఆడుతారు, వినోదం కోసం కాదు. ‘ఆటగాళ్ల’కు అవి ఆటలు కాదు. పని. ‘భారత రత్న’ స్థాయి భారీ ‘పని’.

మనిషి శ్రమను మరిచి పోయి విశ్రాంతి పొందడానికి… ఆధునిక పరిభాషలో చెప్పాలంటే రిలాక్స్ కావడానికి…  ఇవాళ మిగిలిన వనరు వొక్కటే. అదేమిటో మీరిప్పటికి వూహించి వుండొచ్చు.

సినిమా.

పెద్ద తెర మీదిదో, చిన్ని తెర మీదిదో… సినిమా.

పెద్ద తెరకే ప్రాధాన్యం, ఏమాత్రం వీలున్నా.

అదొక్కటే పెద్దాళ్లకు, పిల్లలకు నేడు మిగిలిన సరదా.

ఇప్పటి సమాజాన్ని మీరు బూర్జువా అంటారో భూస్వామ్యం అంటారో ఇంకేమంటారో… మీ యిష్టం. ఇది ప్రజల తనూ మానసాలని తన చేతుల్లోకి తీసుకుని పెత్తనం చేస్తోంది. సినిమా వంటి ఆ కాస్త సరదానూ ప్రజలకు కాకుండా చేస్తోంది.

మన సరదా పాడు చేయాలని పాపం బాలయ్యకు, వర్మకు, మామ్ముట్టికి… వాళ్ల వెనుకనున్న డబ్బు సంచులకు ఏమన్నా సరదానా?

కాదు.

వాళ్లకు అలాంటి సరదా ఏమీ లేదు. అది వాళ్ల ‘పని’. వాళ్ల వ్యాపారం.

వ్యాపారానికి, వ్యవహారానికి పూర్తి స్వేచ్ఛ వుండాలనేది ఇవాళ్రేపు మేధావులు గొంతు చించుకుంటున్న విలువ.

ఇది ప్రజలకు కాదు, బూర్జువజీకి… అనగా శరీర శ్రమ చేయని ఫక్తు వ్యాపారికి… చాల ‘విలువై’న విలువ.

పాపం వాళ్లు దివా రాత్రాలు ‘చెమటోడ్చి’ సినిమాలు నిర్మించి మనకిస్తోంటే ఇలా అనడం ఏమైనా బాగుందా? ఇదంతా వొట్టి ‘కమ్మీ’ ప్రచారం కాదూ?

అ‍నడం బాగుందో లేదో గాని, అది నిజం.

తాజా తార్కాణాలు ఇటీవలి ‘బయో పిక్కు’లు.

ఆ మధ్య మరణించిన సావిత్రి మీద, బతికున్న సంజయ్ దత్ మీద, మరీ ఇటీవల ఎన్టీ వోడి మీద, వయ్యెస్సార్ మీద సినిమాలు… ఇవి వాళ్లు మన నయనాలపై గురి చూసి వొదుల్తున్న పదును బాణాలు.

స్వేచ్ఛ?

ఒక స్త్రీ ని పెళ్లి చేసుకుని, కాపురం చేస్తున్న మగాడితో మరొక స్త్రీ ప్రేమ… అమలిన శృంగారం కాదు, పడక సీన్లు కలగల్సిన ప్రేమ… అదేదో మృదు మధుర వ్యవహారమైనట్లు… ఆ మగపురుషుడి ఒరిజినల్ పెళ్లానికి ఏ వ్యక్తిత్వం వుండక్కర్లేని అద్భుత పాతివ్రత్యం కట్టబెట్టే కథ… అది స్వేచ్చా గీతమా? లేక, బలహీతనతలూ బలాల సమాహారమైన మనిషిలోని బలహీనతల్ని ‘సమర్థించి’ వాళ్ల జేబులు కొట్టేయడమా?

మీరు మాంఛి తాగుబోతైతే… మీ మూడు బీర్లు ఆరు విస్కీల అలవాటు… అసలు బలహీనతే కాదని, అది చాల అందమైన సంగతని చెప్పే రొమాంటిక్ మాటలు మీకు చాల ‘సుఖ’మిస్తాయి. మీ బలహీనతను ‘బలం’గా చిత్రించి ఆత్మహత్యా సదృశమైన ఆనందమిస్తాయి. సుఖం, ఆనందం యిస్తాయి కాబట్టి అవి మంచి మాటలా? తాగుడు మంచిదా? జెమినీ గణేశన్ లా ఒకే సారి పలువురు స్త్రీలతో ‘కాపురం’ చేసే మగతనం మ‍ంచిదా? దాన్ని ప్రోత్సహించే ఆడతనం మంచిదా?

ఇప్పటి సినిమా అయినా మునుపటి వీధి బాగోతాలైనా, మధ్యలో సురభి వాళ్ల నాటకాలైనా… అన్నీ సరదా కోసమే. మన క్లేశాల్ని మరిపించే రిలాక్సేషన్ కోసమే. పునరుజ్జీవం కోసమే.

జరుగుతున్నది అదేనా? మనుషుల బేసిక్ ఇన్స్టింక్ట్స్ ను వాడుకుని చేస్తున్న ఘనకార్యం అదేనా?

మీరు గమనించారా? సరదా/వినోదం సమయంలో మనమెవరం జాగర్తగా వుండం. జాగృతిలో వుండం.

అప్పుడున్నంత అజాగర్తగా బహుశా ఎప్పుడూ వుండం. ఏది దొరికితే దానికి శరీరాన్ని చేరగిల వేసి, ఈ మనస్సు మనది అనే సంగతి కూడా మరచిపోయి… సినిమా కథలో, మెరిసే దృశ్యాలలో లీనమైపోతాం.

మనల్ని లీనం చేయలేకపోతే అది మంచి సినిమా కాదు

భక్తులు భగవంతునిలో ఎలా లీనం కావాలని కోరుకుంటారో అలా… అంత కన్న ఎక్కువగా… లీనమవుతాం. భగవంతుడు కనిపిస్తే తనను అడగాలనుకున్న కోరికలేవో భక్తుని మనస్సును తొలుస్తుంటాయి. (మోక్షం కూడా కోరికే). సినిమా చూస్తున్నప్పుడు అలాంటి అడ్డంకులేవీ లేకుండా తెలి నలి కాంతులలో కలగలిసిపోతాం.

అప్పుడు సినిమా ఏం చెప్పినా కాదనం. కాదన బుద్ధి కాదు. కాదనే స్థితిలో వుండం. కాదనాలని అనిపిస్తే… ‘హేయ్, ఈ మూడు గంటలైనా అన్నీ మరిచిపోరా నయ్నా…. నీ హేతువాదం, నీ నిరీశ్వరవాదం అన్నీమరిచిపోయి తెర మీద బొమ్మల బతుకే నీ బతుకయిపోరా నయ్నా’ అని మనల్ని మనం కోప్పడతాం.

ఒక్క మాటలో చెప్పాలంటే హిప్నాటిజానికి పూర్తిగా అంగీకరించిన మనిషి మాదిరి సినిమాకు లోబడిపోతాం.

హిప్నాటిస్టు బెల్లం అని చెప్పి ఇచ్చిన చేదు నముల్తూ ‘వావ్ ఎంత తీయగా వుందో’ అని ఫేస్ బుక్ రివ్యూలు రాసేస్తాం.

సినిమా అనే వింటేజ్ పాయింట్ నుంచి మన మీద జరిగే దాడి ఇది. దీన్నుంచి… మంచి, చెడు దేన్నించీ… మనల్ని మనం కాపాడుకోలేం.

సినిమాలో హీరోయినమ్మ వేసుకున్న డ్రస్సు మామూలుదైనా, చాల ‘చినిగిపో’యినదైనా, ఎప్పుడు షాపుకెల్దామా అలాంటిదెప్పుడు కొనుక్కుందామా అని వస్తు వ్యామోహానికి తలల్ని తాకట్టు పెట్టేసుకుంటాం.

వస్తువులే కాదు. సినిమాలో చూపించినట్టు పెళ్లి సంబరం చేసుకోవాలని కష్టార్జితాల్ని షాపుల పాలు, ‘ఈవెంట్ మేనేజర్ల’ పాలు చేస్తాం. కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొస్తాయి. కొత్త కొత్త మిత్ లు, విశ్వాసాలు, అనుభూతులు, అభిరుచులు తయారవుతాయి.

ఈ భౌతిక విషయాలే కాదు.. అచ్చంగా ఇవే అయితే అప్పటికప్పుడు నాలుగు డబ్బులతో రెండు మూడ్రోజుల ‘శ్రమ’తో అయిపోతాయి… మనస్సుల మీద పడే ముద్రలు మరీ ఖరీదైనవి.

సినిమాలో తెర మీది నాయికా నాయకులు ఎలాంటి డవిలాగులతో ఎలా ప్రేమించుకుంటారో మనం కూడా అవే డవిలాగులతో అలాగే ప్రేమించుకోవాలని కోరుకుంటాం.

ఇలా కోరుకుంటున్నామని మనకు తెలీదు. తెలీకుండానే కోరిక మనలో ఇంకిపోతుంది, మంచిదో చెడ్డదో బ్యాక్టీరియా శరీరంలో కలిసిపోయినట్టు. అది అక్వైర్డ్ అనిపించనంతగా, పుట్టుకతో వొచ్చినట్టుగా మనదైపోతుంది. మంచిదైతే ఆరోగ్యంగా, చెడ్డదయితే రోగ్యంగా వ్యక్తమయి తీరుతుంది, ఇవాళ కాకపోతే రేపు.

కళాకారుల స్వేచ్ఛ అనేది వొక బూటకం. అమ్మకం, కొనుగోలు ప్రక్రియలో అవినాభావ భాగమయ్యాక, ఇక కళ పేరిట మాట్లాడేదయినా, మతం పేరిట మాట్లాడేదయినా… అది కేవలం వ్యాపార స్వేచ్ఛ యే.

వ్యాపార స్వేచ్ఛ ఎప్పుడూ వ్యాపారి స్వేచ్ఛ యే. వినియోగదారుని స్వేచ్ఛ కాదు.

వినియోగదారునికి… స్వేచ్ఛ అనదగినంత ఛాయిస్ వుండదు. ఛాయిస్ వున్నట్టనిపించీ అనిపించకముందే ‘మొనోపొలీ’ వొచ్చి కూర్చుంటుంది.

నిన్నటి స్వేచ్చా గాయకుడు ఇవాళ యే షాపులోనో పాడుతూ కనిపిస్తాడు.

చూస్తే ‘కథా నాయకుడు’ చూడు. లేదా మామ్ముట్టి మొహంలో వయ్యెస్సార్ ను చూడు. అంత స్వేచ్ఛ వుంటుంది మనకు. అంతే స్వేచ్ఛ వుంటుంది.

సినిమా వల్ల అంతా చెడే అని కాదు.

మంచిచెడులు పనిముట్టువి కాదు. దాన్ని వాడుకునే చేతులవి.

ఎన్ టి యార్ గొప్ప నటుడు కావొచ్చు. ఆయన జీవితం చాల ఆసక్తికరం కావొచ్చు. ఇప్పుడు ఆడుతున్న బైస్కోపైనా, దీనికి రానున్న తోక స్కోపైనా, వాటికి భిన్నం అంటో వర్మ తెస్తున్న బయో పిక్ అయినా, ఆ పక్కనే వయ్యెస్సార్ సినిమా అయినా వొనగూర్చగల ప్రయోజనం స్పష్టం.

ఎన్నికలు వొస్తున్నాయి. ఓటర్లు స్వేచ్చగా ఆలోచించుకుని తమ జీవితాల్ని తాము మెరుగు పరుచుకునేలా ఎన్నికల్లో పాల్గొనాలి. అదే ఎన్నికల పరమోద్దేశం.

ఆ వుద్దేశం నెరవేరకుండా చూడడానికి తగిన మెకానిజమ్స్ అన్నీ ఇప్పటికే సిద్ధంగా వున్నాయి. అవి మన సమాజానికి ఇన్ బిల్ట్.

ఎన్నికల రాత్రులలో జనాలకు పంచడానికి… ఏలికలు జనాలను దోచి, దాచిన డబ్బు సంచులు సిద్ధం.

ప్రజల్ని మత్తులో ముంచెత్తి వోట్లు దండుకోడానికి తగినంత భారీగా మద్య, మాంసాలు సిద్ధం.

ప్రజలు అలసి సొలసి విశ్రాంతి కోసం ఆశ్రయించే సినిమా కూడా ఇప్పుడు అదే మహత్కార్యానికి సిద్ధం.

ఈ సినిమాల పరమార్థం ఇది అని చెప్పకుండా… ఇంకేం చెప్పినా, ఎంత గొప్ప సినీ విమర్శలు చేసినా… అవన్నీ ఆ సినిమాల ప్రచారానికి, అవి వెదజల్లే దుర్విలువల ప్రచారానికి నిర్ద్వంద్వ దోహదాలే.

నందమూరి పెద్దాయన తన జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోడం. ఆనాడు పెళ్లి తరువాత వొచ్చిన ఆక్షేపణలకు జవాబిస్తూ ‘అమ్మాయిని వాడుకుని వొదిలెయ్యమంటారా?’ అని వేసిన ప్రశ్న ఆయన వ్యక్తిత్వానికి కీర్తి కిరీటం. ఆయన గొప్పతనానికి ఘన సంకేతం. ఆ వొక్క మంచి పనికి రామారావు చాల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వొచ్చింది. అందుకాయన అభినందనీయుడు. ఆ విలువను వుగ్గడించడమే వర్మ వుద్దేశమైతే తెలుగు వాళ్లందరూ వర్మకు అండగా నిలబడాలి.

‘వీలైనంత మంది ఆడపిల్లలకు కడుపుల్చేయండ’ని యువ-ఎన్టీయార్లకు సలహా ఇచ్చిన కుమార ‘కథా నాయకుడు’ ఇప్పుడు వర్మ సినిమాను అడ్డుకోవాలనడం సహ‍జమే గాని గర్హనీయం. తండ్రి చేసిన ఆ వొక్క మంచి పనిని వుగ్గడిస్తే తమ కుటుంబాన్ని బజార్న పడేయడమవుతుందన్న కొడుకు ఏడుపును ఎవరూ కేర్ చెయ్యక్కర్లేదు.

వర్మ చేస్తున్న పని సాపేక్షికంగా బాగానే వున్నా… ఎన్నికల వేళ ప్రజలను సొంత ఆలోచనల నుంచి మళ్లించే ప్రతి ప్రయత్నం అప్రజాస్వామికమే. .

సరదా సరదా సమ‍యంలో కూడా మంచికే, మనిషికే పట్టం కడదాం.

స్వేచ్చ దిశగా పయనంలో అన్ని అవరోధాల్ని తొలగించుకుందాం,

పాదాలకు గుచ్చుకునే ఎప్పటి పల్లెరు గాయల్ని అప్పుడే తొలగించుకుని ముందుకు నడిచినట్లు…..

 

13-1-2019

హెచ్చార్కె

12 comments

 • అత్యద్భుతం. HRK గారు మాత్రమే రాయగలిగినది

 • భలే ఉంది సార్… సరదాగా ఉన్నట్టే ఉంది కానీ వెనుక టోన్ లో ఆ పాథోస్ మనసు ని మెలితిప్పుతూ ఉంది.

 • ఇన్ని బూతులున్న సినిమా ఇప్పుడు చూడాలా అని ఒకరిని నేనడిగినప్పుడు ,
  “ఇప్పుడన్ని సినిమాలూ అలానే ఉన్నాయి . ఏదీ చూడకుండా ఎలా ఉండగలం?” అన్న సమాధానం వచ్చింది .
  అంటే, మురిక్కాలవ పక్కన ఊపిరి బిగబట్టి ఉండలేం కదా అన్నంత సహజంగా ఉంది ఆసమాధానం .

  తండ్రిని అడ్డమైనజోకులతో ఏడిపిస్తున్న హీరో కి చప్పట్లు కొట్టే నలభై ఏళ్ళవ్యక్తి , తనపక్కనే అదే సినిమా చూస్తున్న టీనేజ్ కొడుకు తనని ఎంత గౌరవిస్తాడో అన్న ఆలోచనే ఉండట్లేదు .

 • చాలా బావుంది సార్.
  ” వర్మ చేస్తున్న పని సాపేక్షికంగా బాగానే వున్నా… ఎన్నికల వేళ ప్రజలను సొంత ఆలోచనల నుంచి మళ్లించే ప్రతి ప్రయత్నం అప్రజాస్వామికమే ”
  అలా చేయకపోతే ఇంకా ఎక్కువ అనర్థాలు జరుగుతాయి కదా సార్.

 • Wah..అద్భుతమైన రైటప్ సర్.ఎన్టీఆర్ వ్యక్తితానికి కీర్తి కిరీటం ఆ మాటలు..👌మనకేపాటి స్వేచ్ఛ ఉందొ భలే రాశారు👏👏

 • స్పష్టంగా, ఇష్టంగా చదివాను. ఆలోచనాత్మకమైన రచన.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.