ఇస్మార్ట్

‘గిందాకటి కాన్నించీ  సూత్తన్నా ఏందా సూపు ‘

‘కాదే నిన్ను సూత్తే ఏమీ సమజవడం లే. నువ్వసలు అప్పటి మడిసివేనా అని’

‘కాక అపుడెందో గిపుడూ అదే . నువ్వూరకే అనుమానిస్తన్నావ్. నాకర్ధమైంది నీకేటైందో’

‘ఏటైందేటి పిచ్చి లేత్తాంది సంపి ముక్కలు సేత్తామనిపిత్తాంది. గిట్టయితే నేన్నిన్నొగ్గేసి మా నైజామెల్లిపోతా’

‘అబ్బోసి గందుకేనా ఆడికేడికో ఎల్లీసి నిన్ను కట్టుకుంది. అయినా నానేటి సేసానో చెప్పు. ఆ ముత్తాలు గాడు నాతో మాట్లాడుతాడు, నవ్వుతాడు. గంతేనా?తప్పేటి?’

‘నాకదేం తెలవదు. ఆడితో నువ్వు మాట్లాడోద్దంతే’

‘సూత్తాలే ముందు ముందు నీకే తెలిసిద్ది నా మంచితనమేందో ‘

వీళ్ళిద్దరూ, ఇంకో ముగ్గురు కూలీలు ఉదయం తొమ్మిదింటికే ఆటోలో దిగారు. ఇపుడు పదకొండవుతోంది.

రోడ్డు మూల దగ్గర ఉన్న ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు వచ్చారు. పదకొండవుతుండగా ఇంకొక ఆటోలో పారలు, పలుగులు, పంపు గొట్టపు వాల్వులు వేసుకుని చేగువేరా బొమ్మ ఉన్న ఎర్ర  టీ షర్ట్ తో  జీన్స్ పాంటు వేసుకున్న ముప్పై ఏళ్ళ సూపర్ వైజర్ ముత్యాలు దిగాడు.

చెట్టుకొమ్మకి చీర కట్టి పిల్లల్ని నిద్రపుచ్చుతున్న ఆడవాళ్ళని మగవాళ్ళని పిలిచి ‘రండి రండి. ఇప్పటికే లేటయ్యింది. రంగసామి పలుగందుకో. రే యీరిగా ఆ పార తీసుకో. ఇదుగో ఇక్కడ, ఇక్కడ తవ్వండి. మీరేం సేత్తన్నారు. అదుగో ఆ యింటి కాడకెళ్ళి నాలుగు బొచ్చెలు ఇసక తెండి’ అన్నాడు ఆడ వాళ్ళతో .

రంగసామి భార్య కోటిలచ్చి లేవలేదు. దూరంగా మెట్లమీద  కూచుని  నవ్వుతోంది. ముత్యాలు నేరుగా ఆమె దగ్గరికే వెళ్ళాడు. ‘ఏందమ్మో నీకు మల్లీ సెప్పాల్నా ఏందీ’ అన్నాడు.

‘అంతేనంటావా ముత్తాలూ.’ అని టిఫిన్ బాక్సు లోంచీ స్వీటు తీసి పెట్టింది.

‘సర్లే సర్లే మంచి కుసాలుగున్నావ్ ఏందీ సంగతి?’ అంటూ ముచ్చట్లు మొదలెట్టాడు.

అంతా దూరం నుంచి చూస్తున్న రంగసామికి  కోపమాగడం లేదు. పళ్ళు కొరుకుతూ గాతం మరింత ఊపుతో తవ్వుతున్నాడు. పక్కన కుర్రాడు ‘అన్నా కొద్దిగా చూస్కో’ అంటున్నాడు. ఆడవాళ్ళు ఇసకతెచ్చి  సిమెంటు కలుపుతున్నారు. ఓరగా కోటిని చూసి  అర్ధవంతంగా నవ్వుకుంటున్నారు. రంగసామికి వళ్ళంతా కారం రాచినట్లుంది. ‘ఏయ్ లచ్చీ ఆ మంచి నీళ్ళ సీసా తే’ అనరిచాడు . కోటి లచ్చి సీసా ఇచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళి కూచుంది.

‘బేగి కానీండి’,  అనరిచి ముచ్చట్లు మొదలెట్టాడుముత్యాలు .

‘సరేగానీ నా పనేం చేసావ్’ అంది కోటి లచ్చి

‘చెప్పాగా, మాటంటే మాటే నెక్స్ట్ వీక్ అయిపోయిద్ది’ అన్నాడు.

ముత్యాలు మెలికలు తిరిగేట్టు నవ్వింది కోటిలచ్చి.

గడ్డం కింద చెయ్యెట్టి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ‘మరీ నువ్వు వెల్లిపోతన్నావుగా మరెట్లా’ అంది.

‘ఇంకా టయమున్నాదిగా’ అన్నాడు

రంగసామికి  వీరి మాటలు ఎలా ఆపాలో తెలియడం లేదు. అంతలో ఓ కుక్క అక్కడకొచ్చి నిలబడింది. ఓ రాయి తీసుకు ‘థూ నీ యవ్వ, ప్రతి కుక్కకీ ఈడే పని’ అంటూ రాయి బలంగా విసిరాడు.

కోటిలచ్చి పకపకా నవ్వింది. ‘మా వోడికి కుక్కలంటే ఒకటే బయ్యం’ అంది. ముత్యాలు కూడా నవ్వాడు. దగ్గరకొచ్చి  చూసి ‘ఆపండం’టూ లోపలకు దిగాడు. రంగసామి పలుగు పట్టుకు బయట నిలబడ్డాడు. లోపల ముత్యాలు వాల్వ్ లో గోలీ పీకి టాప్ కన్క్షనిచ్చాడు. ‘ఈ చిన్న పనికి ఈడికి రెండువేయ్యిలు లంచం. ఐదడుగులు గంటసేపు తవ్వితే రెండువందలు కూలి’ పలుగు మీద పిడికిలి బిగుసుకుంటోంది. గాతం పూడ్చాక ఆడాళ్ళని పైపు మీద  సిమెంటు వేసి లైన్ చేయమన్నాడు. దాని మీద గడ్డి కంప వేసాడు. తలా రెండు వందలు ఇచ్చాక ‘ఆటోకి నేనే ఇస్తన్నా’ అన్నాడు. అందరిదగ్గరా ఇంకో ఏభై నొక్కాడు.

‘అదేమి సేసింది . ఊరక్కూకుంది. దానిక్కూడానా’ అన్నారు ఆడాల్లిద్దరు. ‘నా ఇష్టం.ఇంకా నసపెడితే రేపటినింఛీ పనికొద్దు.’  అని గదిమాడు. కోటిలచ్చి లేచొచ్చి ముసిముసిగా నవ్వుతూ డబ్బు తీస్కుంది. ‘మరీ కాయమేనంటావా వచ్చే వారం?’ అంది రంగసామి సైకిలెక్కుతూ.

‘మాటంటే మాటే’ తలెగరేసి నవ్వాడు. ‘సామానంతా లోపలెట్టండి’ అంటూ ఆ ఇంటి యజమాని దగ్గర నాలుగు వెలు లంచం పైసలు లాగాడు.

ఇల్లు చేరాక  రంగసామి ఏదో అరవబోయాడు. ‘ఇంకా కోపమా’  మోచేత్తో పొడిచి నవ్వింది.

‘అద్గో ఆ నవ్వే నన్ను పిచ్చాడ్ని సేత్తుంది. అయినా ఆడితో ఆ సరసాలు ఇకికలేంది’ అన్నాడు.

‘సరసాలా పాడా. ఎన్నాళ్ళీ గాతాలు తవ్వుకుంటా తిరుగుతావు. ఆడి లాగా సూపరైజరైతే డుర్రు మని మోటార్ బైకెక్కి తిరగొచ్చు. నాకు ఈ రోడ్దేక్కే
పనుండదు. కొద్ది కుసాలుగా మాట్టాడితే ఆడికి పిచ్చ. ఆడు ఈ ఊర్న్నించీ ఎల్లిపోతన్నాడు. నిన్ను సూపరైజర్ ని చేయమన్నా. ఏందో గొనిగాడు. అంతేనా అన్నా’ ‘సర్లే’ అన్నాడు. అంది.

రంగసామి కళ్ళల్లో నమ్మలేని తనం.  ‘అగొ అట్టా సూడకు నేనేం సెడ్డ దాన్ని కాదు. అంతా నీకోసమే.’ అంది.

రంగసామి అరుగుమీద గుంజ నానుకు కూలబడ్డాడు. కోటిలచ్చి  వెనక కుర్చీలో కూచుని రంగసామి వీపుమీద కాలానించి ముందుకు నెడుతూ ఊపుతోంది. ‘నువ్వుత్త బండాడివి. కొద్దిగా ఇస్మార్ట్ గా ఉండాలెహె.’ అని ముందుకు వంగి రంగసామి బుగ్గలు పట్టి అటూఇటూ లాగుతూ ‘వచ్చే వారం ఆడి బైకు కోనేద్దాం. మా రంగసామి సూపరైజరు కదా’ అంటూ నవ్వుతోంది. రంగసామికి అంతుబట్టటం లేదు.

ముత్యాలు, వాడి పై అధికారి జింకు పైపులు దొంగతనంగా అమ్ముతుంటే కోటిలచ్చి చూసి బెదిరించిందని, రంగసామికి ఉద్యోగం యిప్పించిందని వాడికి తెలియదు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.