ఒక ఆవలింత…

హాయ్ ఫ్రెండ్స్…

ఒకసారి ఏమయిందో తెలుసా?

చాలా సార్లు అయ్యిందే అయ్యింది!

ఔను, ఎప్పట్లాగే ఆరోజూ మా క్లాసంతా పిండ్రాప్ సైలెన్స్ అయిపోయింది…

ఎంత సైలెన్స్ అంటే.. మాస్టారు పాఠం చెప్పినప్పుడు కూడా లేనంత సైలెన్స్!

ఎక్కడో దూరంగా వెళ్తున్న వాహనాల రకరకాల హారన్ల సంగీతంతో పాటు మరెక్కడో యెవరో పాడుతున్న పాట… పోటీ పడుతున్నట్టు కోయిల కూత… పాప యేడుపు… కుక్కరు విజిలు.. కుక్కల భౌభౌభౌ… తాత దగ్గు ఖహ్ ఖహ్ ఖహ్… వినపడేంత సైలెన్స్!

పక్క క్లాసు పాఠం కూడా స్పష్టంగా వినిపిస్తూ వుంది…

వీటన్నిటినీ మించి డీటీయస్లో వినిపిస్తోంది… గుర్రు గుర్రు… గురక… మా మాస్టారి గురక!

అలా గురక తీస్తున్నప్పుడు మాస్టారి పొట్ట కొండలా పెరుగుతోంది. అంతలోనే బండలా తరుగుతోంది. పెరిగీ తరిగీ భలే మ్యాజిక్ చేస్తోంది.

అది బాన పొట్ట కాదు. ఊదుతున్న బెలూన్. అంతలోనే గాలిపోతూ వున్న బెలూన్. మళ్ళీ గాలి వూదుతున్నట్టు వుబ్బుతున్న బెలూన్. భలే భలే బావుంది.

మాస్టారి బెలూన్ చూస్తే నవ్వు వస్తోంది. కాని అరచేతులు అడ్డం పెట్టుకొని కిస్ కిస్… మంటున్నామే తప్ప, నవ్వడం లేదు.

నవ్వు వినపడి మాస్టారు లేచారా ‘క్లాసు’ మొదలెట్టేస్తారు. చాలక యింటికి కూడా బోల్డంత హోం వర్క్ ఇచ్చేస్తారు, చేసుకు రమ్మని. ‘మీ తిక్క కుదురుస్తాను’ అని అన్నంత పనీ చేస్తారు. తప్పు చేస్తే పదేసి దఫాలు రాయాల్సింది, ఒప్పు రాసినా వందేసి దఫాలు రాసుకు రమ్మంటారు. ఎందుకంటే రైటింగ్ కుదురుగా వస్తుందంటారు. అందుకే మేమందరం కుదురుగా కూర్చున్నాం.

‘గుర్… గుర్…’మని మాస్టారి గురక. మమ్మల్నందర్నీ వొకే దఫా కితకితలు పెడుతోంది. క్లాసంతా అదే డిస్టర్బ్ చేస్తోంది. అదే కంట్రోల్ చేస్తోంది.

మాస్టారు నోరు ‘ఆ…’ అని బార్లా తెరచుకొని వున్నారు. మాస్టారికి రెండు నాలుకలు వున్నాయి. ఒకటి పెద్ద నాలుక. ఇంకొకటి అంగుట్లో వేళ్ళాడుతున్న చిన్న నాలుక. కొండ నాలుక పేరుకే గాని అది కొండంత లేదు, గోరంత వుంది.

మేమంతా చూస్తున్నామా?

క్లాసంతా పిండ్రాప్ సైలెన్స్ గా వుందా?

క్లాసులో పిల్లలు వున్నారో లేరోనని అనుమానం వచ్చేలా వున్నామా? హెడ్ మాస్టారికి ఆ అనుమానమే వచ్చినట్టుంది. రౌండ్సుకు వచ్చినట్టున్నారు.

మా క్లాసు డోర్ దగ్గర లేట్ కమ్మరులా బుద్దిగా మాకంటే సైలెంటుగా వున్న హెడ్ మాస్టారిని చూసి ‘ఒరే… ఎడ్మాస్టార్రొరే’ అన్నాడెవడో.

ఉలిక్కిపడి నోరు మూసేసిన మాస్టారు – మళ్ళీ అలాగే నోరు తెరచి ఆవలింత తీసారు. లేచి నిలబడ్డారు.

ఆవలింత తీసి – మళ్ళీ ఆవలిస్తూ “అన్నా అని చెవి నులిమి యశోద… ఏదన్నా నీ నోరు చూపుమనగా… ఆ…” అని మాస్టారు హెడ్ మాస్టారిని పట్టించుకోకుండా రాగమెత్తుకున్నారు.

రాగమాపి మళ్ళీ నోరు తెరచి (ఆవలింత వచ్చిందేమో?) “బాపురే పదునాల్గు భువన భాండమ్ముల…” అని ఆగి, అప్పుడే హెడ్ మాస్టారిని చూసినట్టు “రండి… రండి సార్” అన్నారు మాస్టారు.

హెడ్ మాస్టారు అలాగే నిలబడ్డారు.

“మన్ను వెన్నలా తిన్న చిన్ని కృష్ణుని మీద అన్న బలరాముడు కంప్లైంట్ చేస్తే – యశోద వచ్చి – నోరు తెరవమని చూస్తే – అందులో అంగుట్లో విశాల విశ్వం కనిపించిందన్నమాట…” మాస్టారు చెప్పి, హెడ్ మాస్టారు దగ్గరకు వచ్చి “వెధవలు విన్న కథే వింటారు, చెప్పిందే చెప్పమని చంపుకు తింటారు… పాఠం కన్నా ఇలాంటివి చాలా ఇంట్రెస్టు…” అని అడక్కుండానే సంజాయిషీ ఇచ్చారు.

“క్లాసు పాఠాలు కూడా ఇంపార్టెంటే…” హెడ్ మాస్టారు చెప్పబోతే, “నేనదే చెప్పాను, వింటేనా?, చిన్ని కృష్ణుడి చిత్రాలు చెప్పమని ప్రాణం తోడేస్తున్నారు” మాస్టారు మమ్మల్ని తిట్టేస్తే, హెడ్ మాస్టారు ఎవర్నీ తిట్టకుండానే వెళ్ళిపోయారు.

తర్వాత బెల్లయింది. లాంగ్ బెల్. ఆ రోజుకు స్కూలయిపోయింది.

మరుసటిరోజు మళ్ళీ మొదలయిపోయింది.

మాస్టారు నా దగ్గరకు వచ్చేవరకూ నాకు తెలియలేదు. ఉలిక్కిపడి నిద్ర కళ్ళు తెరచి – తెరచిన నోరు మూసి భయంతో చూసాను.

“ఏం చేస్తున్నావురా?” అని అడిగారు.

ఏం లేదన్నట్టు తల అడ్డంగా వూపాను.

“ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావా?” అని అడిగారు.

అవునన్నట్టు తలాడించేన్నేను.

“నన్నా… నా పాఠాన్నా?” మాస్టారు మళ్ళీ అడిగారు.

ఏం చెప్పను? రాత్రి టీవీలో మంచి సినిమా వచ్చిందని కూడా చెప్పలేదు.

“రాత్రంతా సముద్రం ఆర్పావేంట్రా? జల్లెళ్ళతో నీళ్ళు మోసిగాని…” మాస్టారు తొడపాశం తీసేస్తుంటే – జల జలా కళ్ళలోంచి నీళ్ళు కారిపోగా ముందురోజు రాత్రి చూసిన సినిమాని మించిన సినిమా కనిపించింది.

“నేన్నిద్ర పోలేద్సార్…” అన్నాను ఏడుస్తూ.

“ఆ సంగతి నాకూ తెలుసురా, యెధవ… నన్ను వెక్కిరించేంత వాడివయిపోయావా?” మాస్టారు తొడపాశం తీస్తూనే వున్నారు. “నిన్నా మొన్నా రోజూ చూస్తున్నాను కదా?, కునుకు బాగానే తీస్తున్నావు” చర్మం నలిపేస్తున్నారు.

నేను రోజూ సినిమాలు చూసేదేం లేదు. మా అమ్మ వద్దంటే వినదు. రాత్రి అన్నంలో గెంజి పుల్లబెట్టి చేసిన తరవాణి పోసి పెడుతుంది. అలా అయితే అన్నం పాడవదంటుంది. నిజమే. కాని నిద్దరొస్తుంది.

భగ్ భగ్ మని మండుతోంది. ‘అమ్మా’ అన్నాను. ‘ఆ…’ అని బాధకు నోరు తెరిస్తే – “ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తా” అన్నారు. “నీకు పదునాల్గు భువన భాండమ్ములు చూపిస్తాన్రా…” అన్నట్టుగానే చూపించాక, తొడపాశం వదిలేసారు.

ఆరోజు నుండి ఆవలంత వస్తే – నోరు మూసేసి – చెవుల్లోంచి ముక్కులోంచి – కళ్ళలోంచి – గాలి వదిలేలా ప్రాక్టీసు చేశామే తప్ప ఎవరమూ ఎప్పుడూ నోరు తెరవలేదు!

మా మాస్టారు మాత్రం నోరు తెరచి ఏడాది పొడుగునా చెప్పిన పాఠమే చెప్తూ వస్తున్నారు!

పుస్తకాల్లో లేకపోయినా ఆ పాఠం కంఠోపాఠమే!

సిమా చెలం,

నాల్గో తరగతి,

సమితి ప్రాధమిక పాఠశాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.