‘జన’ కవనం: నవజాత కవి జననం

(ఇది మునాసు వెంకట్‍ తాజా కావ్యం ‘మెద’ కు అసురా ముందుమాట… ఎడిటర్‍)

 

‘మట్టిని మల్లేస్తే ఎల్లవ్వ ఎక్కిల్లాగేనా’

”ఏమున్నదని నా దగ్గర

తొట్టెల్లోమట్టి
ఉట్టిలో నక్షత్రాలు
దూరం మీద అరిపాదాల దాడి
నెత్తి మీద పొద్దే కిరీటం”
అంటూ మనముందుకొస్తున్న మట్టి కవి మునాసు వెంకట్‌ దగ్గర ఏం లేదని?! చెరువుకింద పంటసేద్యం, చెరువులో చేపల సేద్యం ఏకకాలంలో చేసే కవికి ఏం తక్కువని?!
దక్షిణ తెలంగాణ నల్లగొండ జిల్లా పల్లెపట్టుల్లో చేపలను వేటాడే బెస్తల ఇంట పుట్టి పెరిగిన మునాసు చేతిలో కవితాచేతన చందమామగా రూపు దాల్చింది. చిన్ననాటినుంచి విన్న, మాట్లాడిన ఇంటి భాషలో రాసే కవిత్వం ఎంత రుచికరంగా వుంటుందో తెలుసుకోవాలంటే వెంకట్‌ కవిత్వం చదవక తప్పదు.
జీవితోత్సవ సంరంభం కళ్లారా చూడాలన్నా, చెవులారా ఆలకించాలన్నా ‘మెద’ మేలిమి అల్లికను సృశించక తప్పదు. మునాసు వెంకట్‌ కవిత్వం ప్రధానంగా దృశ్యశ్రవణ సమ్మిశ్రమం.
ఈ తెలంగాణ ముద్దుబిడ్డ పాంచ భౌతిక కవి. అందువల్లే ఇది సాధ్యపడింది. పంచేంద్రియాల ఉచ్ఛారణ స్వాభావికంగా తెలిసినవాడు కావడం వలన ఇతని కవిత్వం ఆసాంతం ఇంద్రియోత్తుంగ తరంగమై పాఠకుల్ని చుట్టుముడుతుంది. ఆరని జ్వాలై అల్లుకుంటుంది. ఉబికే నీట ముంచెత్తుతుంది. చిరుగాలిలా ముద్దాడుతుంది. సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భూమై లాలిస్తుంది. నీలాకాశమై వర్షించి సేదతీరుస్తుంది.
”బుడుబుంగ మొగుడు
చెరువు కుంటల మిండెడు
కలదిరిగొస్తున్నడే నీలి
కడుపు నింప కళ్ళమూటనిప్పె”
ఇక్కడ కవి తన ఇమేజెస్‌తో, మెటఫర్స్‌తో పాఠకుల్ని తన కవిత్వానికి ప్రత్యక్ష సాక్షిని చేస్తున్నాడు. కవిత జాతరలో భాగస్వామిని చేసి, తన వెంట తిప్పుకుంటున్నాడు. తనను తా మరచి ఎరుక కోల్పోయి దారి తప్పిన ఆగంతకున్ని కవి ‘మేన చందమామ’ గా మారి, స్మృతిలోకి తెస్తున్నాడు. దుఃఖభారంతో వివశులైన వారికి ‘రేలగంధం’ పూసి ఓదార్పునిస్తున్నాడు. నేటివ్‌ ఇమేజరీతో కవి ఈ అసాధ్యాలను అలవోకగా సుసాధ్యం చేశాడు.
మునాసు వెంకట్‌ ప్రాథమికంగా ప్రాకృతిక కవి. ప్రకృతిని చిత్రిక పట్టడం అతని అక్షరాలకు సుమారు ఇరవైయేళ్ల క్రితమే అబ్బింది. జీవితాన్ని చిత్రమయం చేయడం మనం ఆనాటి ‘ఎన’, ‘వర్జి’ సంకలనాల్లోనే చూడొచ్చు. ‘ఎన’ లోని ‘పూదీనగంప’ ‘పుదిచ్చుకొని’, మృగశిర కన్నీళ్ళు’, ‘కడీలు’, ‘మెడతెగిన కలి’ ఇత్యాది కవితలు, ‘వర్జి’ దీర్ఘకావ్యం ఆసాంతం ఇందుకు సాక్ష్యం పలుకుతాయి. భాషలో, అభివ్యక్తిలో స్థానీయతకు కట్టుబడివుండటం మూలంగానే కవికి ప్రకృతి కరతలామలకమయింది.

”చినుకు తట్టి లేపితే
దిగిన పచ్చనాకులోకి
వణికిపోతున్న లేత ఆకుల మధ్య
పాకుతున్న పసరు తీగ ఆవులమాసం”
(వానొచ్చిందల్లో)

”గిరకబాయిలో గిర్రుమన్న తాంబేలు
బొక్కెన్లో ఎక్కి బావురుమంది
చెట్టులేక చేనులేక
ఊరబిష్క ఉసూరుమంది
ఉడుత ఉరికి ఉరికి
మరుగులేక మాడి సచ్చింది
ఎనుగులో తొండ ఎల్లకిల్ల పడ్డది”
(పాతాళ దీపం)

కులమా?! తలమా?! అన్నది నానుడి. మనిషి మనుగడను శాసించేవి అతడు పుట్టిన కులం, పుట్టి పెరిగిన ఊరు, అంటే ప్రాంతం. వెంకట్‌ కవిత్వాన్నికూడా ఈ రెండు పునాది అంశాలు శాసించాయి, తీర్చిదిద్దాయి. మన దేశంలో ప్రతి శ్రామిక కులానికి, కులవృత్తికి సంబంధించిన భాష/పరిభాష ఉంటాయి. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంతపు యాసబాసలు ఉంటాయి. తెలుగునాట దాదాపు 1990 దాకా ఆధిపత్య, విద్యాధిక కులాలకు చెందిన కవులు సోకాల్డ్‌ ప్రామాణిక భాషలో రాసిన కవిత్వానిదే పైచేయి. 1990 ఆదిగా దళిత, బహుజనులు సాహిత్యరంగంలోకి పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో ఒక్కసారిగా కవిత్వతత్వం, భాష, అభివ్యక్తిలో మౌలికమైన పరివర్తన చోటు చేసుకున్నది. దళిత-బహుజన కవిత్వం కూడా కోస్తాంధ్ర ప్రాంతంలో ‘ప్రామాణిక’ భాషలోనే వెలువడటం ఒక వైచిత్రి. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతంలో అది ప్రజల జీవభాషలో వెల్లువెత్తింది. వేముల ఎల్లయ్య, చిత్రం ప్రసాద్‌, మునాసు వెంకట్‌ల కవిత్వం ఈ గుణాత్మక ధోరణికి నిదర్శనంగా నిలుస్తుంది.

”ఒడ్డెంట ఒడ్డెంట మతి నిదీ పాయెకు
ఎదురెక్కే సందమామ
ఎండికంచమాయె చెరువు”
(పానగల్లు చెరువు)

ప్రకృతిని ప్రాణ ప్రతిష్ట చేసే కవి ‘వికృతి’ ని కళ్లముందు నిలపడం మరవలేదు. కులవృత్తులలో కడదేరుతున్న బతుకు చిత్రాలను బొమ్మకట్టడం మానలేదు. దుఃఖితుల వెతలను, కష్టాలను, కన్నీళ్లను, నిస్సహాయతను, ఆగ్రహాన్ని అత్యంత తీక్షణంగా వ్యక్తం చేసిన కవితలు ‘కయాలు’, ‘ఎక్కిల్లు’ , ‘సింతల కోపు నుంచి’ ఇందుకు దృష్టాంతంగా నిలుస్తాయి.

”ఎచ్చిపచ్చి కాలం కాలే కమురాసన
ఊపిరికి ఉచ్చులేసి
కూతలేని మర్మరాజ్యం
పీనిగల మధ్య తోలుగుడ్లు బెట్టె
కుతికల కూడు కుతికలనే
సింతా సింతా దేవడోలుమోగె సింతా”
(సింతలకోపునుంచి)

”కలవరిచ్చి కలవరిచ్చి నొసలుసాలల్లో
పేగుతీగకింద ఏడ ఉన్నావే పెద్ది
ఊరు నిలిసింది మట్టి మనాది పెట్టుకుంది
ఎక్కిల్ల సప్పుడాయె ఏడనించే పెద్ది”
(ఎక్కిల్లు)

నల్లగొండ జిల్లా పేద పల్లె జనాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్‌ భూతం కోరలు పీకే ”నక్కలగండి’ ప్రాజెక్టుకు స్వాగతిస్తూ రాసిన ‘అవిటి పొద్దు’ కవిత కవి వాస్తవిక దృష్టిని పట్టిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపిన పదునైన కవిత్వం కూడా ఇందులో చూడొచ్చు. ”ముందుగాలనే చెబుతున్నాం’ కవిత ఇందుకు ఉదాహరణ.

” కరువో బరువో
కళ్లల్లో ఆవుసుండె
గింజలప్పు గింజలొస్తే తీరె
ఎక్కడిపత్తి ఏం పత్తి
మెత్తగ దిగె గుండెల్లో
కమ్మగూడాల కత్తి
రైతాలికి నేసింది తెల్ల చీరె…”

”మళ్లి ఎలక సచ్చిన వాసన రాకముందే
అణగారిన ఆటపాటలతో ఈ నేలంతా
అలుకుతూనే ఉంటాం ఏకమై ఏలికైన దాక…”

అంటూ విస్పష్టమైన ప్రకటన చేస్తాడు కవి ఈ కవితలో.. ‘దేవండ్లు’, ‘ఎరుకలో’ , ‘తియ్యనొప్పుల పండు’, ‘చివరంచున’ వంటి కవితలు తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, స్వరాష్ట్ర ఆవశ్యకతను బలీయంగా ప్రతిఫలిస్తాయి.
‘మెద’ లోని అత్యధిక కవితలు’ ఎక్కిళ్లు ఏడుపులతో పూనుకున్న’ పద్యాలే కావడం మూలాన విషాద సంగీతం, నేపథ్యంలో సదా మంద్రంగా చెవిన పడుతూనే ఉంటుంది. మరోవైపు మాంత్రికత, మార్మికతలకు పటం కట్టిన, కవితలు కవి అంతస్సును ఆవిష్కరిస్తాయి. ‘పరవశం’, ‘పూటిక తీస్తే పుత్తడే’, ‘రేలగంధం’, ‘వొంపులతాడు’, ‘దమ్మనగొయ్య’, ‘ఇగురుతొడిగిన మెలకువ’, ‘మహా సంచారం’, ‘అలుగెల్లిన పండుగ’, ‘పిట్టల తొట్టెల’, ‘మెద’ వంటి కవితలు, ‘నీలి’ దీర్ఘ కవిత ఇందుకు నిలువుటద్దాలు.
జెన్‌ బౌద్ధ కవి మాదిరి ధ్యాన ముద్రలో, నిశ్చల సమాధి స్థితిలో అతిలోక సౌందర్యాన్ని వీక్షించిన తీరుకు ఈ కవితలు తార్కాణాలు. ‘ఈడుకు ఇల్లెందుకే నీలి/ వొడ్డెంటే వయస్సు పోనీ’ అన్న కవి ‘నా ఇచ్ఛను మెచ్చి/ పచ్చలుడు పానగల్లునిచ్చెను” అని చెప్పడం కవి భౌద్ధిక విజయాన్ని నర్మగర్భంగా సూచిస్తున్నది.
అచ్చమైన తెలుగు/ తెలంగాణ కవులు సిద్ధార్థ, గోరటి వెంకన్నల సరసన చోటును తన సొంతం చేసుకుంటున్న నిలవెత్తు నవజనకవి మునాసు వెంకట్‌. అతని ‘అంతరమంతా అంజనకేళి.’ కొత్త కాలపు సరికొత్త కవిత్వానికి కొంగ్రొత్త తెలుగు చిరునామా మునాసు వెంకట్‌ ‘మెద.’

అంబటి సురేంద్ర రాజు

ప్రముఖ విమర్శకుడు, కవితా ప్రేమి, తాత్వికుడు, జ‍ర్నలిస్టు. హైద‍రాబాదులో వుంటారు. హోమియో వైద్యుడిగా కూడా ప్రసిద్ధుడు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.