పద్యాన్ని పట్టుకో…

ఉదయం
కిటికీ తలుపులు తెరవమని
ఒకటే గోల
ప్రేమగ కొడుతూనే ఉన్నావ్
తీరా తలుపు తీశాక నువ్వు మాయం
నీ వాసన
ఆకుపచ్చ హృదయపు జాడ
కన్ను కొడుతున్న గాలి
రాత్రంతా జోరుగా కురిశావ్
తలుపు వేసి కూర్చున్నా
కిటికీ అద్దాల నిండా నువ్వే
స్పర్శ
యేటి కాలువ స్పర్శ
సెగ
లాంతరు సెగ
నువ్వు రావు
చంటి పిల్లలా దాగుడుమూతలు
అర్థరాత్రి ఎంత పిలిచాను
అలా వెళ్లి ఆడుకునే వాళ్ళం
చెట్ల కింద
వికసిస్తున్న పూలతో మాట్లాడుతూ
ఎగురుతున్న మిణుగురులను
సిగలో తురిమే వాణ్ని
నువ్వు రావు
పద్యాన్ని పంపుతున్నా
హృదయాన్ని చేరు.

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

25 comments

 • హృదయమింకెక్కడుంది, నీ భావచిత్రాల బిగి కౌగిట మోహ పరవశ గీతమాలపిస్తోంటే ఎక్కడో దివా రాత్రుళ్ళ కవతల….గోపాల్. మీరిలా తరచుగా రాయండి. గుర్తొచ్చినప్పుడు కాదు. కంగ్రాట్స్.

 • గాలి కన్ను కొట్టడం
  నీ వాసన
  కవితలో కొత్త పరిమళం.

 • పద్యాన్ని చాలా బాగా మలిచారు సర్…
  చాలా బావుంది..💐💐💐

 • పట్టుకోవాల్సిందే.. ఏనాటికైనా

 • యంత్ర భూతముల కోరలు తోమే మనకు ప్రకృతి స్పర్శ ఎలా తెలుస్తుంది.ప్రకృతి ప్రేమగా పిలిచినప్పుడు మనం వెళ్ళలేదు.ఇప్పుడు ప్రకృతి స్పందించడం లేదు.మీ అద్భుతమైన భావ చిత్రాలతో పద్యాన్ని కాదు మమ్మల్ని ప్రకృతి లోకి పంపావు

 • తలుపు వేసి కూర్చున్నా
  కిటికీ అద్దాల నిండా నువ్వే..

  ఎంత చక్కటి వర్ణన మరెంత చక్కని ఆలోచన…
  నా మిత్రుని మీద ఉన్న అంచనాలు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి ఇవి చూసినప్పుడల్లా..

  కొనసాగించు గోపాలయ్య…

 • అద్భుతమైన పద చిత్రాలు మిత్రమా

  • ప్రకృతి ని స్మరించారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసారు సర్

 • చదవడానికి కళ్లు సిగ్గుపడి …గుండే సైతం కన్నీళ్లు పెట్టె లాంటి అక్షరాలు తో సోషల్ మీడియా దoడయాత్ర యూగo లో…..మీ కవిత్వం.. మాకు ఆనoదన్నీ కలగ చేస్తున్నయి….సర్…సూపర్ ,👌

 • పద్యం మంచి బిగితో సాగి ..చైనీయ కవితలు తలపుకొచ్చాయి.ఒక చిన్న మిఠాయి నోటికందించినట్టు…

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.