మనస్సులను కొట్టేసే వెండితెర పిక్‍ పాకెట్‍

 

ఫ్రెంచి దర్శకుడు రాబర్ట్  బ్రెస్సన్‍

‘సమాజం పట్ల ద్వేషం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా మామూలు విషయం అయిపోయింది ఈమధ్య. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెద్దలు, పిల్లలు అందరూ సంఘాన్ని ద్వేషిస్తూ, తిట్టుకుంటూ సుఖంగానే ఉంటారు. అయితే, కొందరితో సమాజం పట్ల కోపం చాలా ప్రమాదకరం అది పనులు చేయిస్తుంటుంది. పైకో కిందికో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది.

సమాజం పట్ల కోపం రానివాడు నిజంగా ఏమి సాధించగలడు, నెల నెలా జీతం తప్ప?

సమాజం పట్ల కోపం రాకుంటే,  దాన్ని మార్చాలన్న ఆలోచన ఎలా పుడుతుంది?
అసలు సమాజాన్ని నిందించటం, కోపగించడం తప్పా, ‍ఒప్పా?

ఈ సినిమా చూడగానే… కాదు… చూస్తుండగానే నాకు వచ్చిన ఆలోచన ఇది.
సినిమా గురించి రాసే ముందు ఈ సినిమా దర్శకుడు రాబర్ట్ బ్రెస్సన్ గురించి చెప్పాలి. తన 50 ఏళ్ల సినీ జీవితంలో ఇతను చెక్కినవి కేవలం13 శిల్పాలు (సినిమాలు). నెమ్మదిగా ఎలాంటి రంగులు అద్దకుండా, ఏ అందమైన ఆకృతి కోసం చూడకుండా, ఉన్న రాయిని ఏమాత్రం గెలకకుండా చుట్టూ ఓసారి బర్ర బర్ర గీకి కిందపడ్డ ఆ చెత్తని చూపిస్తాడు. ఔను, ఆ చెత్తనే అతని శిల్పం. మనలో ఉండి, మనం గ్రహించలేని చెడుని, సమాజంలో బయటికి కనిపించని తప్పుల్ని చూయించడమే అతని సినిమా, ఆయన సినిమా చూసిన తర్వాత నిన్ను నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకోకుండా ఉండలేవు.

‘ఎవరైనా సినిమాని అర్ధం చేస్కోడానికి చూస్తారా దరిద్రంగా, అనుభూతి పొందడానికి చూడాలి గాని’ అంటాడు బ్రెస్సన్.

తను ప్రొఫెషనల్ యాక్టర్స్ తో సినిమా తీయడానికి ఇష్టపడడు. మొదటి చిత్రం ఒక ప్రొఫెషనల్ యాక్టర్ తో తీస్తున్నప్పుడు “నువ్విలాగే నటిస్తూ, వాగుతూ వుంటే నేను వెళ్లిపోతా” అని చెప్పాడట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ యాక్టర్స్ తో సినిమా తీయలేదు. ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించని ముఖాల కోసం వెతుకుతుంటాడు. వాళ్లే అతని హీరోలు. ఒక నాన్ ప్రొఫెషనల్ యాక్టర్తో ఒక్క సినిమానే తీస్తాడు మళ్ళీ ఇంకో సినిమాకు ఆ వ్యక్తి యాక్టర్ అయిపోతాడు, అతనికి డ్రమాటిక్ గా ఇంప్రొవైజ్ చెయ్యాలనే ఆలోచన వస్తుంది, అప్పుడిక తను నాకు పనికిరాడు’ అంటాడు బ్రెస్సన్. సీను ఏంటనేది కూడా యాక్టర్స్ కి ముందే చెప్పడు – అలా చెబితే వాళ్ళు నన్ను ‘ఇంప్రెస్’ చేయడం కోసం విపరీతంగా నటిస్తారు, ఆ నటనను నేనేం చేసుకోను, అందుకే ముందే సీన్ చెప్పను అని అంటారాయన.
ఇలాంటి ‘అవలక్షణాలు’ ఉండడం వల్ల తనతో సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చేవారు కాదు. అందుకే తన దగ్గర ఎన్నో కథలున్నా కేవలం13 సినిమాలే తీయగలిగాడు.

ఈ ‘పిక్ పాకెట్’ సినిమా దోస్తావిస్కీ రాసిన ‘నేరమూ శిక్ష’ అనే నవల ఆధారంగా తీసింది. (ఆ మాట క్రిటిక్స్ అంటారు తప్ప బ్రెస్సన్ ఎప్పుడు చెప్పలేదు). ఈ నవల చదివినప్పుడు కథ కేంద్ర పాత్ర రాస్కల్నికోవ్ పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకున్న బలహీనతలన్నీ అతనికి కూడా ఉన్నాయి. ఒక ఇద్దరు మనుషుల్ని దగ్గర చేసేది, మంచి స్నేహితుల్ని చేసేది వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న వుమ్మడి బలహీనతలే గాని బలమైన అంశాలు కాదు అనేది నేను చాలా గట్టిగా నమ్ముతా.

ఇక సినిమా విషయానికి వస్తే సినిమా విమర్శకులు అనట్టుగా ఈ సినిమా పూర్తిగా నవల ఆధారంగా తీసింది అని చెప్పలేం గాని రాస్కల్నికోవ్ పాత్రతో ఇనస్పైర్ అయ్యి తీశాడని చెప్పొచ్చు. రాస్కల్నికోవ్ కి ఈ సినిమా కేంద్ర పాత్రకు చాలా పోలికలు ఉంటాయ్. ఆల్బర్ట్ కాము రాసిన ‘ది ఔట్ సైడర్’ నవల కేంద్ర పాత్ర మ్యూర్ సాల్ట్ లా కూడా అనిపిస్తాడు. రాస్కల్నికోవ్, మ్యూర్ సాల్ట్ పాత్రల్ని కలిపి కుడితే వచ్చే రూపం ఈ మిచెల్ (సినిమాలో కేంద్ర పాత్ర) అనిపిస్తుంది.

అయితే సినిమా మొదలయ్యే ముందు ప్రోలోగ్ లో దర్శకుడు ఇలా చెప్తాడు

“ఇది ఒక థ్రిల్లర్ సినిమా కాదు. ఈ కథలో నేను చెప్పదలచింది… బలహీనతల వల్ల దొంగగా మారిన ఒక యువకుడికి ఆ దొంగతనాల వల్ల ఒరిగింది ఏమి లేకపోయినా ఈ విచిత్ర ప్రయాణంలో అతనికి ఒక అమ్మాయి దగ్గరవడం గురించి. అతనే గనక ఈ దారి (దొంగతనాలు) ఎంచుకోకపోయుంటే ఆ రెండు మనసులు ఎప్పటికి కలిసేవి కావు”.

పిక్ పాకెట్ అని సినిమా పేరు పెట్టి దొంగతనాలు అనే కథా వస్తువును తీసుకుని ముందుమాటలో ఇలా చెప్పడం విచిత్రంగా అనిపిస్తుంది కానీ, క్లైమాక్స్ లో కేవలం ఒక్క డయలాగ్తో ముందుమాటకు న్యాయం చేస్తాడు దర్శకుడు.

మిచెల్ బక్కగా పొడుగ్గా ఎప్పుడు అదే లూజు బ్లేజర్ వేసుకుని ఉంటాడు. ఏ పని చేసినా నిమ్మలంగా చేస్తుంటాడు. నడిచినా, మాట్లాడినా, చొక్కా వేసుకుంటున్నా అన్నీ నెమ్మదిగా చేస్తుంటాడు. అలాగని అది సహనమో లేక ఓపికో కాదు, దేని మీద ఆసక్తి లేకపోవడం. అంతా ఉట్టి మాయ అనుకుంటాడతడు. అతనొక దొంగలా కాకుండా దోపిడీకి గురయిన వ్యక్తిలా ఉంటాడు… మరి అంతేగా… ఈ సమాజం నన్నెప్పుడో దోపిడీ చేసింది అని అంటాడేమో అడిగితే. ఒక చిన్న ఆకారం లేని రూంలో ఉంటాడు. పడుకోడానికి ఒక బెడ్డు చదువుకోడానికి కొన్ని పుస్తకాలు ఉంటాయి. అంతే. గొప్ప పిక్ పాకెట్ గా పేరొందిన జార్జ్ బార్రింగ్టన్ ఆత్మకథ ‘ది ప్రిన్స్ అఫ్ పిక్ పాకెట్స్’ పుస్తకం అంటే ఇష్టం అతనికి.

“దొంగతనాలు చేసేవాడు వాటి గురించి ఎప్పుడూ మాట్లాడడు. వాటి (దొంగతనం) గురించి మాట్లాడేవాడు ఎప్పుడూ దొంగతనాలు చేయడు. కానీ నేను ఆ రెండు చేశాను” అని డైరీలో రాసుకుంటాడు మిచెల్. ఔను అతను ఒంటరివాడే. ఒంటరి వాళ్ళు, ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్లే కదా డైరీలు రాసుకునేది, అంతా బాగా ఉన్నవాళ్లు కేవలం ఆరోజు వాళ్ళు చేసిన ఖర్చుల గురించి రాసుకుంటారు డైరీలో. వాళ్ళకు డైరీ అంటే ఒక లెడ్జర్ బుక్. కానీ కొందరికి డైరీ ఒక తోడు లాంటిది. ఏం చెప్పినా విని మళ్ళీ ఎప్పుడైనా అడిగితే అంతా తిరిగి చెప్పే బెస్ట్ ఫ్రెండ్. మిచెల్ కు ఒకే ఒక్క స్నేహితుడు, జాక్వెస్. మిచెల్ ని జాక్వెస్ ఒక పిచ్చివాడు అనుకుంటాడు. అలాగే గొప్ప మేధావి అని కూడా అనుకుంటాడు,

ఇక కథ విషయానికి వస్తే డైరీ దృశ్యం తర్వాత సినిమా ఒక గుర్రపు పందాల క్లబ్ లో మొదలవుతుంది. దొంగతనం చేయాలి అని ఆలోచనతో అక్కడికి వస్తాడు మిచెల్. కాని దొంగతనం చేయడానికి కాస్త ఇబ్బందిగా ఒక రకమైన ఆందోళనలో ఉంటాడు. ఇది అవసరమా, వెళ్లిపోదాం అనుకుంటాడు. కాని, దొంగతనం చేస్తాడు. అదే అతని మనస్తత్వం. ఒకటి అనుకుంటాడు, మళ్ళీ అది కాదు అనుకుంటాడు. తర్వాత ఆ రెండు కాదనుకొని ఎహే పో ఏదో ఒకటి అనుకోని ఆ రెండిట్లో ఎదో ఒక ఆలోచనని ఆచరణలో పెడతాడు. ఆ దొంగతనం చేసిన తర్వాత దొరికిపోతాడు, సాక్ష్యం లేకపోవడంతో ప్రశ్నించి వదిలేస్తారు. ఈ దెబ్బతో దొంగతనాలు మన వల్ల కాదనుకొని ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పు అని జాక్వెస్ ని బార్ లో కలిసి అడుగుతాడు. కానీ జాక్వెస్… నువ్వు జాయిన్ కావు నీవన్నీ ఉట్టి మాటలే అంటాడు. లేదు నేను సీరియస్ అంటాడు మిచెల్. జాక్వెస్ కి మిచెల్ గురించి అసలు ఏమి తెలియదు అనిపిస్తుంది కాని, కొన్ని సందర్భాలలో మిచెల్ ని పూర్తిగా చదివాడనిపిస్తుంది. ఆ బార్ లో మిచెల్ ని ఇంటరాగేట్ చేసిన పోలీస్ కనిపిస్తాడు. మిచెల్ అతని దగ్గరికి పోయి “మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, నేను తెలుసా మీకు” అని అడుగుతాడు. తర్వాత పోలీస్ అని తెలుసుకొని అనవసరంగా మాట్లాడానని బాధపడుతాడు. ఇక్కడ ఒక కీలకమైన సన్నివేశం ఉంటుంది. మిచెల్ కి పోలీస్ కి మధ్య, సన్నివేశం ఇలా ఉంటుంది – “కొందరు అత్యంత శక్తివంతులు, అపారమైన తెలివితేటలు ఉన్నవారు, మేధావులు తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడేవారు అలాంటి వాళ్ళకి కొన్ని చట్టాల్ని అతిక్రమించే హక్కు ఉండాలి” అని అంటాడు మిచెల్.

దానికి పోలీస్ “అది చాలా కష్టం, చాలా ప్రమాదకరం” అంటాడు.

“అలా చేయడం సమాజానికి మంచిది” అంటాడు మిచెల్

“సరే, అలాంటి వాళ్ళని ఎక్కడ వెతుకుతావ్, ఎవరు గుర్తిస్తారు?”

“వాళ్ళంతట వాళ్లే”

“ వానికి వాడే ఒక గొప్ప మేధావిని అని అనుకోని ఒక్క మనిషిని చూపియ్ నాకు?, అయినా నువ్వు అన్నట్టు చేస్తే ప్రపంచం తలకిందులు అవుతుంది.”

“ప్రపంచం ఇప్పుడే తలకిందులుగా ఉంది. నేను అన్నట్టు చేస్తే సెట్ అవుతుంది” అని చెప్తాడు మిచెల్.

పోలీస్ మిచెల్ ని కోపంగా చూసి వెళ్ళిపోతాడు. పోలీస్ కి ఇతని మీద అనుమానం వచ్చి మిచెల్ ఎక్కడికి పోయినా ఒక కంట కనిపెడుతూనే వుంటాడు.

ఇదంతా అనవసరంగా పోలీస్ కి చెప్పా అనుకుంటాడు మిచెల్. కానీ వెంటనే మళ్ళీ ‘ఐ డోంట్ కేర్, దేని కొరకు భయపడాలి, ఎందుకు భయపడాలి’ అని అనుకుని వెళ్లిపోతాడు. మిచెల్ ధైర్యవంతుడు కాడు. కాని, కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని ఎక్కడ్నుంచో అరువు తెచ్చుకొని ధైర్యవంతుడిలా నటిస్తాడు. ఎలా అంటే ఎప్పుడైనా మిచెల్ కి ఎప్పుడైనా కాస్త క్లిష్ట పరిస్తితి వచ్చిందంటే కాసేపు ఆలోచించుకొని ‘ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి అంతా అనవసరం’ అని మనసులో అనుకుని ధైర్యం తెచ్చుకుంటాడు. నిజమైన ధైర్యవంతుడు అలా చేయడు. నిస్పృహ, నిస్సహాయత వల్ల వచ్చే ధైర్యం ఇది.

ఏ మనిషైనా ఎలాంటి మానసిక ఇబ్బందులు లేకుండా బతకాలంటే రెండు విషయాలు అవసరమవుతాయి. ఒకటి- చేయడానికో పని ఉండాలి, ఇంకోటి- ప్రేమించడానికి ఒక మనిషైనా, వస్తువైన లేక ప్రదేశమైనా ఉండాలి. చేయడానికి మన మిచెల్ ఎంచుకున్న పని పిక్ పాకెటింగ్. ఈ ఇల్లీగల్ సమాజంలో లీగల్ పనులు చేయడం కన్న పెద్ద తప్పు ఇంకోటి ఉండదని అతని భావన. ఇతను ప్రేమించింది కూడా పిక్ప్యాకెటింగ్ నే. దొంగతనంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకున్న ప్రతిసారి అతను ఎంతో మజాగా ఫీల్ అవుతాడు.

ఒకరోజు మిచెల్ ఇంట్లో పడుకొని ఉండగా జాక్వెస్ తో పాటు జీయెన్నే (మిచెల్ అమ్మని దగ్గరుండి చూసుకునే మనిషి) వచ్చి అమ్మ చాలా నీరసంగా ఉంది, నిన్ను చూడాలంటోంది అని మిచెల్ కి చెప్పి వెళ్లిపోతుంది. మిచెల్ వెళ్ళను అంటాడు జాక్వెస్ ని వెళ్లి చూసిరా అంటాడు. దానికి జాక్వెస్ కి కోపమొచ్చి “నువ్వెంత స్వార్థపరుడివి, పైగా అమ్మని ఎంతో ప్రేమిస్తా అని చెప్పుకుంటావ్…ఛీ”,

“నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తా అమ్మని, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళు” అని సమాధానం ఇస్తాడు.

అమ్మని కలవడానికి మిచేల్ చాలా గిల్టీగా ఫీలవుతాడు. ఒకసారి అమ్మ పర్సు నుంచి కొన్ని పైసలు దొంగతనం చేస్తాడు ఆ పని చేసినందుకు అతను ఎప్పుడూ బాధపడుతుంటాడు ఆ అపరాధ భావన వల్ల అమ్మని కలవడానికి తనకి హక్కు లేదని అతనికి అతనే నిర్ణయించుకుంటాడు.
అమ్మకు సీరియస్ గా ఉంది అని మళ్ళీ లేఖ వస్తుంది జీయెన్నే నుంచి, వెంటనే వెళ్తాడు అమ్మ దగ్గరికి

అమ్మతో ‘నీకేమి కాదమ్మ నేను చూస్కుంటా అంతా’ అని అనగానే అమ్మ చనిపోతుంది.

“అంతా అయిపోయింది ఇక నాకంటూ మిగిలింది ఈ ఉత్తరాలు, ఫోటోలు మాత్రమే. ఇక దేనికి భయపడేది లేదు, వెనుదిరిగేది లేదు (దొంగతనాల గురించి అనుకుంటా)” అని అంటాడు జీయెన్నే తో, అక్కడికేదో అమ్మని చంపింది సమాజమే అన్నట్టు.

“ఒక మనిషి చేసేది తప్పా ఒప్పా అని నిర్ణయించగలుగుతారా? ఎలా జడ్జ్ చేస్తారు? ఈ చట్టాల ఆధారంగానా? అసలివి ఒక చట్టాలా? అంతా అర్ధరహితమైన, అసంబద్ధమైన చట్టాలు” అని జీయెన్నే తో అంటాడు మిచేల్.

అప్పుడు జీయెన్నే “అసలు నువ్వు దేన్నీ నమ్మవా?” అని అడుగుతుంది. దానికి మిచేల్ “నేను దేవుణ్ణి నమ్మాను….ఒక మూడు నిమిషాలు”అంటాడు.

“ఏది పట్టించుకోని ఒక తాగుబోతు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడున్న అమ్మ, ఇలా అన్ని బాధ్యతలు నీ మీదే ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావ్?” అని జీయెన్నే ని అడుగుతాడు మిచేల్. అతనే ఇల్లు చూసుకోవాలి, నాన్న మందుకు డబ్బులియ్యాలి, అమ్మ మందులకి డబ్బులివ్వాలి, అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి, ఆసుపత్రి ఖర్చులు చూసుకోవాలి… నిజంగానే అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎం చేయగలడు, బయట ఇలాంటి పరిస్థితుల్తో ఇబ్బంది పడే అనేకమంది కష్టపడి చదివి ఉద్యోగాలు చేసే వారు లేరా, చదవలేని వారు నిజాయితీగా కూలీ, ప్యూన్ ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు చూసుకునేవారు ఎంతమంది లేరు అని అనొచ్చు కానీ దేన్నీ నమ్మని, ఇదంతా అర్ధరహితమైన జీవితమని ఇక్కడ జరుగుతున్నది ఏది లెక్కలోకి రాదు అనుకునే ఒక నిరాశావాది (నిహిలిస్టు) నిజంగా అసలు ఎం చేయగలడు? అలాంటి పరిస్థితుల్లో. ఒక నిరాశావాది బతుకు చాలా దారుణంగా వుంటుంది. మామూలు మనిషి ఊహించలేనంత దారుణంగా వుంటుంది.. అన్నీ ఉన్నా ఏదీ లేనివాడు నిరాశావాది. జీవితం కొందరి పట్ల ఎందుకంత ద్వేషంగా, కక్షతో ఉంటుందో అర్ధమేకాదు.

సాఫీగా దొంగతనాలు చేసుకుంటున్న మిచెల్ కు తన సహచరులను అరెస్ట్ చేశారని తెలిసి తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని భయపడి  మిలాన్ కి పారిపోతాడు. అక్కడ చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ బతకుతాడు. రెండు సంవత్సరాల తర్వాత జీయెన్నే ని కలవడానికి వస్తాడు. అప్పటికి జీయెన్నే ఒక పాప కు తల్లి. దానికి కారణం అతని ఫ్రెండ్ జాక్వెస్. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోరు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని మిచేల్ అడిగితే, “జీవితమంతా అతన్ని ప్రేమిస్తున్నానని అతను అనుకునేలా నటించడం మోసం” అని సమాధానం ఇస్తుంది జీయెన్నే. “మరి నువ్వు అతన్ని ప్రేమించలేదా” అని అడిగితే, “తగినంతగా కాదు” అని చెప్తుంది జీయెన్నే. తను కూడా మిచేల్ లాంటిదే. బాధలకి అలవాటు పడింది. బాధలకు ఎంత అలవాటుపడకపోతే తనకు ప్రేమంటే అంత భారంగా తోస్తుంది?

జాక్వెస్ తనని, పాపని వదిలి వెళ్ళాడు అని తెలిసి తనతో “నువ్వు బాధపడకు, పాప నా బాధ్యత నేను డబ్బు పంపిస్తాను” అని అంటాడు. “వద్దు, నువ్వు వెళ్లిపో” అంటుంది జీయెన్నే. జీయెన్నే కి భయం మళ్ళీ ఈ డబ్బు కోసం ఎక్కడ దొంగతనాలు మొదలెడతాడో అని. అప్పుడు అమ్మని చూస్కోడానికి దొంగతనాలు మొదలెట్టాడు మళ్ళీ ఇప్పుడు పాప కోసం మొదలెడతాడేమో అని భయపడుతుంది జీయెన్నే, “నేను నిజాయితీగా వుండగలను కనీసం నన్ను ప్రయత్నించనివ్వండి” అంటాడు ఎంతో బాధగా, నిస్సహాయంగా. సమాజం పట్ల అతనికి ఉన్న అభిప్రాయాన్ని తెలియచేస్తుంది ఈ సీను. ఈ సమాజమే అతన్ని నిజాయితీగా ఉండకుండా అడ్డుపడుతోంది అని అతని అభిప్రాయం. అన్నట్టుగానే నిజాయితీగా ఏదో ఉద్యోగం చేస్తూ జీయెన్నే కి డబ్బులు పంపుతుంటాడు. కానీ మిచేల్ మళ్ళీ ఊరిలోకి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఒక ట్రాప్ చేసి అరెస్ట్ చేస్తారు.

అరెస్ట్ అయ్యాక ఒకరోజు మిచేల్ ని కలవడానికి జైలుకి వస్తుంది జీయెన్నే. తనతో ఇలా అంటాడు “ఈ గోడలు,ఈ జైలు ఇవేవీ నేను పట్టించుకోను ఇవన్నీ నాకు అసలు కనపడవు కూడా. కానీ దొంగతనాలు మానాక పట్టుపడటం అనే ఆలోచనే నన్ను ఎక్కువగా బాధపెడుతుంది. నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పేశాను. కానీ, చెప్పిందంతా అబద్ధం అని చెప్తా తరువాత, అంత ఈజీగా వాళ్ళు నిజాన్ని కనుక్కోవడం నాకు ఇష్టం లేదు.” అని చెప్తాడు. చట్టం పట్ల, పోలీసుల పట్ల అతనికున్న ద్వేషం అర్ధమవుతుంది ఈ డయలాగుతో.
“అసలు నువ్వు ఎందుకొచ్చావ్?” అని అడుగుతాడు మిచేల్

“నాకున్నది నువ్వు మాత్రమే” అంటుంది జీయెన్నే

“నా దిగజారుడు చూసి ఆనందిస్తావా? నాకు ఎవ్వరూ వద్దు ఏదీ వద్దు” అని అంటాడు మన నిహిలిస్టు. కానీ తాను లేచి వెళ్లిపోబోతుంటే “ఉండు వెళ్ళిపోకు” అంటాడు. పాపం ఎంత అయోమయం.

ఇక నాకు బాగా నచ్చిన క్లైమాక్స్ దృశ్యం గురించి ఇక్కడ రాసి దాని విలువని తగ్గించడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ సీన్ గురించి రాసే అర్హత కూడా లేదు. ‘టాక్సీ డ్రైవర్’ (1976) సినిమా రచయిత పాల్ ష్రేడర్ ఈ సినిమా ముక్తాయింపు సీన్ గురించి చెప్తూ “సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఇక ముందు కూడా రాజాలని అందమైన ఫైనల్ సీన్ ఇది.” అన్నారు.

డేగల‍ హిమసాయి

Degala Himasai is from Suryapet of Nalgoinda district, Telengana. He lives in Hyderabad now. Describes himself as ‘employed at Wandering in the abandoned places’. He is already known to Rastha readers after his free translation of Chekhov’s Short story as ‘thummu’ and also his review of the movie ‘Pick packet’. This, he says is one of his first attempts in writing fiction in English.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.