మా ఊరి పప్పు

ఆ పొద్దు మా సిన్నమామ (మాయమ్మ తమ్ముడు) మా ఊరికొచ్చిండ్య.  మా మామ మా ఊరికెప్పుడొచ్చినా యాయో ఒకటి త్యాకుండా ఉత్తసేతల వచ్చింది ల్యా. తోట్లో యాయుంటే అయి మూటెకేసుకుని ‘పిల్లోల్లు తింటారు’ అని వచ్చి ఇచ్చిపోయేటోడు. ఇప్పుడు గూడా సీనాకాయలు, సపోటకాయలు, మాడికాయలు మూటెకేసుకుని వచ్చినాడు. ఎందుకో గానీ మా మామ తెచ్చిన పండ్లు బో రుసుంటాండ్య. అందుకే మా మామ వచ్చినాపొద్దు మా ఇంట్లో పిల్లోల్లకు పెద్ద పండగమాదిరుంటాండ్య.

అప్పటికే ఎండలు బాగ ముదిరిండ్య. పైటాల బస్సుకు దిగి బూ దినే యాలకంతా మామ ఇంటికి సేరుకుండ్య. తోట్లో నీళ్ల పారకముందని , కరెంటుతో శానా ఇబ్బందిగా ఉందని కాదు కూడదు మల్లా మాయ్టాలకంతా తిరిగి ఇండ్లు సేరాల్నని సెప్య.

మా నాయనుండి ‘కోన్ని కోచ్చాలేబ్బి. మాయ్టాల తిని రేప్పొద్దున సీకట్లొ బస్సుకే పోదువులే’ అన్య. ఊహు…పొవ్వలంటే పొవ్వాలని పట్టుపట్య మా మామ.  ఇంగ సేసేది ల్యాక ‘ ఏం సేయ్యాల సెప్పుబ్బీ, ఈ పూటైనా కడుపునిండా తినిపో’ అన్య మాయమ్మ. ‘ఏమొద్దుక్కా పప్పు సెయ్యి. మీ ఊరి పప్పు తినక శాన్నాల్లాయ’ అన్య మా మామ.

మాయమ్మ నగి ‘నేనకుకున్యా బ్బీ ఈ ఊరి పప్పు తప్ప నీకింగేం కాబట్టదని’ అన్య. దానికి మా మాముండి ‘ఎందుకోక్కా మరి, ఏం జేసినా గాని ఈ ఊర్లో ఉన్నెంత రుసిగా మనూర్లో పప్పుండదు, నీళ్ల మార్పనుకుంటా’ అని వంతపాడ్య.

మా మామ ఎప్పుడు మా ఊరికొచ్చినా పప్పు తిన్నంది తిరుగు ప్రయాణం కట్టింది ల్యా. ఆ మాటకొచ్చే మా ఊరి పప్పుకు ఆ రుసి ఒక్క నీళ్ళ వల్లనే రాల్య. దానెనక శానా కతుండాది.

మాదంతా ఎలిభూమి. వానొచ్చే పండాల ల్యాకుంటే ఎండాల. అదునులో పదునైతే మా ఊరి పొలమంతా సెనిక్కాయ యేచ్చాంటిరి. వానలు బాగ కుర్సి ఇత్తనం ఏసిన సమత్సరంలో మా సేల తట్టు సూడాల, సూపు పారినంత దూరం యాన్నేగాని రవ్వంత సందు ల్యాకుండా పొలమంతా పచ్చగ కనపచ్చాండ్య-పచ్చ పరుపు పర్సినట్లు.

అప్పుడు అందరూ గూడా సెనిక్కాయలో కంది సాల్లు గూడా ఏచ్చాంటిరి. ఇత్తేటప్పుడే ఆ కంది సాల్లల్లోనే ఇన్ని అల్సందలు, ఇన్ని పెసులు గూడా కలిపి ఇత్తుతాంటిరి. సెనిక్కాయ నాన్నెల్ల పైరు. కంది ఆర్నెల్ల పైరు. సెనిక్కాయ కట్టె పెరికి కాయలు కోపిచ్చి, ఆ కాయల్ను ఇంటికి తోలి అదో ఇదో అని ఎగాసగా పడ్యాలకే సేండ్లల్లో కంది కట్టె ‘నా వంతెప్పుడని’ ఎదుర్జూచ్చాండ్య. ఎంత అద్మాన్నంగా పండినా గానీ ఇంట్లో వాడకానికైతే సావుల్యాకుండా కందులైతాండ్య.

కందిసాల్లలో ఏసిన అల్సందలు ఐదారు సేర్ల గింజలు ఎల్లుతాండ్య. ఉగాది పారనాపొద్దు అల్సంద వడలు సీల పుల్సులో అద్దుకోని తింటాంటే దాని రుసే వేరుగా ఉంటాండ్య.

మా మామ ‘మీ ఊరి పప్పు బాగుంటాదిక్కా’ అన్నెపుడు ఈ తూరి ఆ కందిబ్యాల్ల కోస్రం మాయమ్మ మా నాయన నేను పన్నె అగసాట్లన్నీ మతికొచ్చ. అయ్యన్నీ నా మనసులో సినిమా రీలు తిరిగినట్లు గిర్రున తిరగబట్య.

ఆ ఏడు ( సంవత్సరం) మాకు రోంత వానెక్కువైందాన కంది బాగ ఏపుగా పెరిగి మాన్లయ్యిన్యాది. పూత బో పూసిండ్య. ఈ పక్క కోండ్రలో నుంచి నిలబడి సూచ్చే ఆ పక్క కోండ్రలో ఏముండేది కాన్రాకుండా ఉండ్య సాల్లు. అట్లా మా తూర్పు సేండ్లో ఐదు సాల్లుండ్య. సాలుకో అరమూటె లెక్కన ఏసుకున్యా రెండు మూటెలకేం సావుండదని అనుకుంటిమి. కానీ తీరా అది పూతతో ఉన్నెప్పుడు మొయిలి పట్టి పూతంతా రాలిపాయ. సాలుకు మూటైతాయనుకున్య కందులల్లా ఆడికాడికి వాడకానికయ్యేటట్లొచ్చ పరిస్థితి. కంది కట్టె సూచ్చామా కోత కొడవల్లే మొరాయిచ్చ. సేన్లో కందికట్య కోస్యాలకు సేతుల నిండా బొబ్బలు తేలుండ్య. ‘సరే మనం చేసేదేముంది, యాడికి రాసుంటే ఆడికి’ అనుకుంటిమి.

ఆ కట్టెను బండికి (ఎద్దల బండికి) ఎగెయ్యాలన్యా బో ఇబ్బంది పడ్తిమి. ఐనా ఎట్నోకట్ల సేన్లోని కంది కట్టెను కలంలోకి తోల్తిమి. కూలోల్ల పెట్టి చేసియ్యాలంటే కూలి ఖర్చులు కూడా ఎల్లవని మేమే ఇంటి మంచులమే తలా ఒకపక్క  సుట్టుకుని నులక మంచాలపై బండ పలకలు పెట్టి కంది కట్టె కొడ్తిమి. కట్టె బో తూకంగా ఉండ్య. ఆకు మనంగా రాల్న్యాది. మంచులకు ఎట్లున్యా గానీ జివ్వాలకు, బరుగొడ్లకు ఈ తూరి కందిపొట్టు దపంగా పడిందనుకుంటిమి. జివ్వాలైతే కందిపొట్టు సంపకదింటాయి. మాయమ్ముండి ‘బ్బీ… ఈసారి గాటిపాటలూర్సడానికి కంది పరకలకు కరువుల్యా’ అన్య నగుతా. నిజమే మరి. గాట్లోని దుగ్గు జల్లి కంది పరకతో నూకిన గాటిపాటలు బాగ ఆరి, ఎద్దుల గిట్టలు జారకుండా మట్టగుంటాండ్య.

ఐదుగురం ఇంటి మంచులం ఉసిబోకుండా రెండుమూడ్రోజులు ఆ కట్టెను కొట్టి , పొట్టును తూరబెత్తి తాలుగింజలు తీసేసి కందుల్ను తయారు జేస్యాలకు తలప్రాణం తోకకొచ్చ. అయితే ఏంజెయ్యాల తినడానికి కావాల గదా. ‘ఏదైనా ఊరికే ఎట్లొచ్చాది బ్బి. ఒళ్లొంచి కష్టపడ్తేనే గదా’ అనేది మాయమ్మ తత్వం. అట్ల మూన్నాల్రోజులు మాకు ఇండ్లు కలం తప్ప మరో లోకమే ల్యాకుండా గడ్సిపాయ.

కందుల్ను కలంలోనే పట్ట పర్సి అట్లనే రెండ్రోజులు ఎండబోచ్చిమి, బాగ ఆర్నీలే అని. అయి ఆరి ఇంట్లో పన్నాయో లేదో మాయన్నగారిద్దరూ డిగ్రీ పరిచ్చలుండాయని,  సదువుకోవాలని జెప్పి కడపకు పోతిరి. ఇంగ ఇంట్లో మిగిలింది నేను మా నాయన మాయమ్మ. అప్పటికే ఇంట్లో కందిబ్యాల్లు అయిపోవచ్చెనని, మల్లా అదో ఇదో అంటే సెనిక్కాయలు కొట్టే కాలం వచ్చాదని , మల్ల అస్సలు ఉసుండదని జెప్పి ‘కందులు తడపాలని’ సెప్య మాయమ్మ. దాంతో ‘ఎప్పుడ్సూడు పని పని…అద్దప్ప ఇంగేం కాబట్టదు నీకు’ అని నేను, మా నాయన మాయమ్మ మీద గుర్రుమంటిమి. దానికి మాయమ్ముండి ‘పప్పు ల్యాకుండా గట్టిగ రెండు పూట్లైనా బువ్వ తిన్లేరు గదుబ్బీ. మరి ఆ పప్పు ఊరికెనే వచ్చాద్యా’ అని మాయమ్మ మాకే రచ్చపెట్య మాటల్తో. ఇంగ సెప్పిన పని సెయ్యక మేం జేసేదేం ల్యాకపాయ!

కందుల్ను నానేయాలంటే మా ఊర్నుంచి యర్రగుంట్లకు పొయ్యే దావలో పెదనపాడు దాట్నాక కోడూరు గుట్టని ఒక గుట్టొచ్చాది. ముందు ఆ గుట్టకు పోయి ఎర్రమన్ను ఎత్తకరావాల. ఆ సుట్టు పక్కల పల్లెలన్నింటికీ ఉండేది ఆ గుట్టొక్కటే. అట్లైందాన యాటా అందరూ వచ్చి ఎర్రమన్ను ఎత్తకపోయాలకు, గుట్ట మొగదాల గుంతలు పడి, గుండ్లు తేలిండ్య. మంచి ఎర్రమట్టి కావాలంటే రోడ్డుపై నుంచి గుట్టలో రోంత ఎగాకి పోక తప్పదు. పొయ్యేటప్పుడైతే ఉత్తసేతల పొవ్వచ్చుగానీ వచ్చేటప్పుడే ఆ మన్నును పాస్పేటు సంచికేసుకుని, అంత తూకాన్ని రోడ్డుకాడికి ఎత్తకరావాలంటే ఎంతటోనికైనా దొమ్మలాచ్చాయి. మల్లా ఆ మూటెను బస్సులో ఏసుకుని ఊరికి తీసకరావాల. అదంతా దెగుమాల్ల పని.

సల్లపొద్దైతే అంత యాసిరిక ఉండదని,  మల్లా అమ్మల్లపొద్దుకంతా ఎర్రమన్ను యేసుకోని ఇండ్లు సేరచ్చున్జెప్పి నేను మా నాయన సెరో సంచి తీసుకుని ఎర్రమన్ను కోసం సీకట్లో బస్సుకే ఎల్లబారినాం. కోడూరు గుట్టకాడ బస్సుదిగి నేరుగా గుట్ట ఎగాకి నర్సబట్నాం. ఆ గుట్ట తట్టు సూచ్చా మా నాయనుండి ‘ఎర్ర మట్టిలో తడిపి తయార్జేసిన బ్యాల్లతో  సేసిన పప్పే పప్పంటే. ఒట్టి బ్యాల్లతో సేసిన పప్పు అసలు నోట్లో కూడా పెట్టుకోబుద్ది గాదబ్బి. పప్పు సూచ్చానే సెప్పొచ్చు అయ్యాకందులో. ఆ రంగులోనే వారా వచ్చాది. అందుకోసం ఈ రెండు మూన్నాల్లు తిప్పలు తప్పవ’ని, మల్లా మా నాయనే ఉండి ‘ఏ మానుభావుడు కనుక్కుండెనో ఈ మర్మం!’ అన్య-నిండు దండాల మనసుతో.

బాగింత దూరానికి పొయ్నాక ఇంగా దూరం పోతే తిరిగి పొయ్యేటప్పుడు బరువు పడ్తామని గుట్టపైకి ఎక్కినాం. ఎర్రమన్ను కోసరం మా ఎంట తెచ్చుకున్య లిక్కి, తొలిక్య తో గుండ్లను కలిగిచ్చా బాగ ఎర్రమన్ను ఉన్యకాడ తావుజేసి కూచ్చున్యాం.

ఒకపక్క మా నాయన తొలిక్య తో, ఇంగోపక్క నేను లిక్కితో ఎర్రమన్ను తొగి ఆ మన్ను ఉంటల్ను సంచులకు ఎయ్యబడ్తిమి. మా కండ్లకామట్టి బంగారం మాదిరి కనబడ్య. బలే వనరులో కూచ్చున్యామని ఇద్దరం బో సంబర పడ్తిమి. దూరాబారం, రోజొచ్చే పనిగాదు. ఎట్లా వచ్చినాం గదా, మన్నుంటే మల్లొచ్చే సమత్సరానికైనా ఉంటాదని రెండు సంచులకు మూతికట్టు కున్నిచ్చి సంచి నిండా ఎత్తినాం. మా నాయనుండి ‘అబ్బీ ఇంగ సాల్లే. మల్లా ఈన్నుంచి రోడ్డుపైకి మోసకపొవ్వాలన్యా ఉరకైతాది’ అన్య.

మామూలు మట్టి కంటే ఎర్రమట్టి ఎట్లైనా రోంత బరువెక్కువ. అదీగాక సంచులకు దండిగా యేసిందాన బాగ తూకంగా ఉండాయి. మా నాయనకైనా ఒక్కడే మూటెత్తి నెత్తిన పెట్టుకోవాలన్యా బరుపడేట్లుండాడు. సుట్టూ సూచ్చిమి. ఎవరన్నా సెయ్యెయ్యడానికుండారేమోనని. ఊహూ, సుట్టూ పిట్టగూడా కాన్రాల్య. సరే ఇంగ చేసేది ల్యాక ఒక మూటెలో మన్ను రోంత తీసేసి రోంత ఉలకనయ్యేట్లు సేచ్చిమి. ముందు మా నాయనకు నేను సెయ్యేసి మూటెత్తి నెత్తిమీద పెడితి. మల్ల మా నాయన ఒంటి సేత్తో నాకు ఆపిచ్చి మూటెత్తి నా నెత్తిన పెట్య. మా నాయనుండి ‘బ్బీ నువు మెల్లెంగ రా. నేను బెరీన పోయ్ సంచి రోడ్డు కాడేసి నీకు ఎదురొచ్చా’నని కాల్జంపున నర్సబట్య గబగబ.

మూటె దిగుమాల్ల తూకముంది. గుట్ట దిగుతాంటే నా కాళ్లు తడబడ్తనాయి. రోడ్డు కనుసూపు మేర కాన్రాల్య.  వచ్చేటప్పుడు అనిపీల్య గానీ ఇప్పుడు బరువు మీద ఎంత దూరమొచ్చింది తెలుచ్చాంది. ఇంత మూటె అంత దూరం ఎట్లెత్తక పోవాల్రా దేవుడా అని బో భయమేస్య. అయినాగానీ నాయన ఎదురొచ్చానన్యాడు గదా అన్జెప్పి నిబ్బరపడితి. అదీగాక మూటె కిందేచ్చే సిన్నతనం కూడా అన్జెప్పి అట్లనే మెల్లెగ నర్సబర్తి. మా నాయన మాత్రం గబగబా గుట్ట మలుపు తిరిగి మాయమాయ. రోంత సేపటికంతా నా మెడలు మనంగా నొయ్య బట్య. ఆ బరువుకు నెత్తి సివసివ సలపబట్య. మనిసిలోని సత్తవంతా ఆ మూటె పీల్చబట్య. ఆడికీ ఆడాడ నిలబడి రెండు సేతల్తో మూటెను ఒక్కరవ్వట్ల లేపినట్లని, రోంతట్ల ఉసిదీసుకుని, ‘జై ఆంజనేయ, జై జై ఆంజనేయ’ అనుకుంటా అట్లనే నర్సబడ్తి. ఎంతజేసినా బరువైతే తగ్గల్య. ఐనా అట్లనే ‘మా నాయనొచ్చాడులే’ అని లోపల బెదరకుండా, ధైర్యం సెప్పుకుంటా నర్సబర్తి.

అట్ల అనుకుంటండగానే రోంచేపటికంతా మా నాయన పరిగెత్తినట్లు ఉషారుగా నర్సుకుంటా నాకు ఎదుర్రావడం కనపచ్చ. మా నాయన్ను సూచ్చానే నాకు కొండంత బలమొచ్చ.  నాకు పోతన్య పానమల్లా లేసొచ్చినట్లనిపిచ్చ. మా నాయన నా కండ్లకు వీరాంజనేయ సామి మాదిరి కనపచ్చ. మా నాయన నాకాడికి వచ్చీ రాంగానే నా నెత్తినుండే మూటెను గబగబా తీసుకుని తన నెత్తిమీదికి మార్సికుంటా ‘అబ్బ ఎంత తూకముంది బ్బీ…’ అన్య. నా నెత్తిమీద నుంచి మూటె దిగ్గానే, నాకు రెక్కలు మొల్సి, నేను గాలిలో తేలినట్లనిపిచ్చ. ‘హమ్మయ్య…బతికిచ్చినావ్రా దేవుడా’ అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటి., మల్లా నేనుండి ‘నాయన నీకు బరువైనప్పుడు సెప్పు నాయన, రోంచేపు నేను తీసుకుంటా ‘ అంటి. ‘ఏంగాదులేబ్బీ నువ్వీడికి ఎత్తకరాడమే గొప్ప . బెరీన్నర్సు . మల్లా ఊర్లో బస్సు తప్పోతే ఇబ్బంది పడ్తాం’ అన్య. ఇద్దరం ఉషారుగా నడిచ్చిమి. అట్లా ఎట్లనోకట్ల గుట్ట నుంచి ఎర్రమన్నైతే రోడ్డుకాడ యేసుకుని ఊర్లో బస్సుకోసం ఎదుర్జూడబడ్తిమి. మా ఖర్మగాలి ఆ బస్సు ఆపొద్దే ఎంతసేపటికీ రాల్య.

అప్పటికే అమ్మల్లపొద్దైతాంది. ఈపున ఎండ సెర్రుమంటాంది. ఆడికే ఇద్దరికీ సాలైనాది. గొంతు తడారి పోయి నీళ్లు బలె దప్పికైతనాయి. నోరు పిడసగట్టక పోతాంది. ఒంట్లో నీటి సుక్క ల్యాక ఇద్దరం ఎడారి లెక్కయినాం. అయితే వల్ల లేదు. ఇండ్లు  సేరేదాంక ఎట్లనోకట్ల పానం బిగపట్టుకోవాల్సిందే. తప్పదనుకుంటా ఆన్నే మూటెలపైన వాలిపోతిమి. మా నాయనుండి ‘కూడున్నెప్పుడు కుక్కుండదు, కుక్కున్నెప్పుడు కూడుండదని, ఈ బస్సు అవసరమైనప్పడే వచ్చి సావదబ్బి’ అన్య. వచ్చీరాని నగు నగ్య. నగడానిగ్గూడా సత్తవ లేదు. దప్పిక ఆకలి మమ్మల్ను సుట్టుముట్నాయి.

ఎట్టకేలకు బస్సొచ్చ. మూటెలు బస్సులో యేసుకుని ఒకే సీట్లో ఒరిగిపోతిమి. ‘హమ్మయ్య ఇంగ ఇంటికి జేరినట్లే’ అని రోంత కుదుటపడ్తిమి. బస్సు మా ఊరు మలుపు తిరిగి పాటిమీదికి సేర్య. మేం రెండు మూటెలు దించుకుని బస్సు దిగితిమి. మా ఊరి పాటికాడ ఒక బోరింగుండాది. మూటెల్నాన్నే ఏసి గబగబా బోరింగు కాడికి పోయి సేతులు మట్టగ కడుక్కుంటిమి. కొన్ని తరాలనుంచి నీళ్లు తాగనోల్ల మాదిరి దోసిలి పట్టి నీళ్లు జుర్రుకుంటిమి. అప్పుడానీళ్లు మాకు అమృతం కంటే తియ్యగనిపిచ్చ. కడుపు నిండినాక రెండు దోసిల్ల నీళ్లు ముఖాన సల్లుకుని నెత్తిన రుమాలు తీసి తుర్సుకుని ఒగరి ముఖం ఒగరం సూసుకుని సిక్కెగ నక్కుంటిమి, యుద్ధంలో గెల్సిన వీరులల్లె. అప్పుడు మా నాయన ముఖం నిండు కుండలా కలకలలాడే మా ఊరు సెరువు మాదిరి అగుపచ్చ. ఆ నగు ఆ సెరువుపై తనుకులీనే పొద్దటెండ మాదిరి మెరసినట్లుండ్య.

పాటిమీద నుంచి సంచులు భుజానేకుని ఇంటికి రెండు నిమిషాల్లో సేర్తిమి. అప్పటికే అమ్మల్లపొద్దు దాటిపాయ. మాయమ్మ ఆ పొద్దు సంగటి ఊరిమిండి జేసిండ్య. ఆకలిగొన్న పులుల మాదిరి మేం సంగటి గురిగెలో ఊరిమిండి బేసుకుని యంపర్లాడ్తా తింటిమి.  ‘ఏం ఇంత సేపు ?’ అన్య మాయమ్మ మాటలకు మా నాయన జరిగిన కతంతా సెప్ప్య. ‘అయితే ఈ దప ఎర్రమన్నకు బో అగసాట్లు పన్యారైతే’ అన్య మాయమ్మ.

ఆ పొద్దు రాత్రికే మాయమ్మ మా దొడ్లో అదేపనిగా కట్టిన సిన్న అవుతుకోన్లో (గచ్చు) వాడకానికి కావల్సినన్ని కందుల్ను ఏసి నీళ్లు పోసి నానబెట్య. అయ్యి బాగ నాన్యాక మర్సట్రోజు అమ్మల్ల పొద్దుకంతా దాంట్లను నీళ్లల్లో నుంచి తీసి ఆన్నే బండల సపటపైన కూబోస్య. ఆ కువ్వమీద నిన్న మేం తెచ్చిన ఎర్రమన్ను రోంత ఏస్య. దానిపై మా నాయన రోన్ని నీళ్లు సిలకరిచ్చి రెండు సేతులతో బాగ పిసికి కందులకు ఎర్రమన్ను పట్టేట్లు వాటంగా కలపబట్య, గింజల్ను రొల్లు రొల్లు జేచ్చా మల్లా ఎర్రమన్నేచ్చా , దానిపై తగినన్ని నీళ్లు సిలకరిచ్చా గింజలకు బాగ తంపుగా మన్ను పట్టేంత వరకు అట్ల జేస్య. ఈ పని శానా వాటంగా,  అట్ల నీళ్లెక్కువై దొడ్డంతా మడుగ్గాకుండా, అట్లనే కందులకు ఎర్రమన్ను మట్టగ పట్టేటట్లు సూడాల. అట్ల సేసిన కువ్వ తేనీగెల తెట్టె మాదిరి బలే మట్టగ కానచ్య. దాన్ని మేం ‘కందులు తడపడం’ అంటాంటిమి.

మల్లా పైటాల బూ తిన్యాక ఒకతూరి రోన్నీల్లు పోసి ఈ దపా పారతో కువ్వను బాగ కలయదిప్పాల. ఎర్రమన్నేమన్నా తక్కువలెక్కువలయ్యింటే మల్లా కలుపుకోవాల. మల్లా రాత్రి బూ తిని రోన్ని ఉడుకుడుకు నీళ్లు కువ్వపై తగినన్ని పోసి గొర్రుకారో, లిక్కో , కొడవలో ఏదో ఒక ఇనుప ముక్క ఆ కువ్వ మధ్యలో బూర్సి, కువ్వను సంచిపట్టల్తో బాగ కప్పి, ఆ కువ్వ సుట్టు ఇసుర్రాయి, బండ పలకలూ అట్ల  బాగ బరువులు పెట్టి, కువ్వపైన రోకలి బడెలేసి బిర్రుగ ‘బిగిచ్చాంటిరి’. అట్ల బరువులేసి బిగిచ్చే గింజలు ఊపిరాడక ఊరుతాయని అంటాంటిరి.

మర్సటి రోజు పద్దనికంతా తడిపిన కందులాసన గుమాయిచ్చాంది. అమ్మల్ల పొద్దు బూ తిని ఆ కువ్వ పైన బరువు దించి , పట్టలు దీసి సూడాల. కందులు బాగ ఊరి బో కసికసిగా ఉండేటి. నేను ఉండబట్టల్యాక రెండు గింజల్ని నోట్లోకి ఏసుకోని జూచ్చి. బాగ ఊరిన మాడికాయ ఊరగాయలో మాడిముక్క మాదిరి  గింజ బలే మెత్తగుండ్య. మా నాయన పార దీసుకుని మెల్లెగ కువ్వను కదిలిచ్చ. మాయమ్మ కువ్వకాడ కూచ్చోని ముద్దగా ఉండే గింజల్ను సేత్తో నులుపుతా పగలబెరిక్య. అంతలోకే నేను మా నాయన పోయి మా దొడ్లో పట్ట పర్సి నాలుగు మూలలా రాల్లేసి వచ్చిమి పట్ట గాలికెగరకుండా.

తడిపిన కందుల్ను పుటెక్యలకెత్తుకోని పట్టపై ఒకపక్క నుంచి పోచ్చా నెరుపుకుంటా వచ్చిమి. అట్ల కందులన్ని పోసి దాంట్లను బాగ నెరిపి ఆరబోచ్చిమి. మాయ్టాల పొద్దుగునికే యాల కందుల్ను కూబోసి, రాలిన ఎర్రమన్నును పుటికెలో ఎత్తి మల్లా ఎర్రమన్ను సంచిలో ఏచ్చిమి. మల్లా మర్సట్రోజు ఆ ముందు దినం మాదిరే కందుల్ను పట్టపై నెరిపి ఎండబోచ్చిమి. రోజుకు రెండుమూడు తూర్లు కాళ్లతో గింజల్ని దున్నినట్లు, సాల్లు జేచ్చిమి. ఆ ఎండకు కందులు బాగ ఎండి పెనం మీద ఏంచినట్లు పలపలమనాల. అట్లైతేనే పప్పు రుసి. ఈ తంతంతా అందుకోసమే. సమత్సరం పొడుగునా తినే పప్పు కోసరమే ఆ శ్రమంతా.

మాయ్టాలకంతా కందులు పేలాలేగినట్లు ఎండినాయి. దాంట్లను మూటెలకెత్తి ఆపిద్దెలో ఏచ్చిమి. పట్టపై రాలిన ఎర్రమన్నును మల్లా పుటిక్యకెత్తి ఎర్రమన్ను సంచిలో కలిపితిమి. పట్ట మర్సి అట్టంపైన ఎత్తిపెడ్తిమి.

మల్ల రెండ్రోజులకు రెండు ఇసుర్రాళ్లు పట్టపైన పొందికేసి కందులను ఇసరబడ్తిమి. మాయమ్మ పిల్లప్పుడు మాయవ్వగారి ఊర్లో తోటలో పండే పంటల గురించి, ఎనమలకు పొయ్ శ్యాపలు పట్టకచ్చింది, పూల సెట్ల కత, వాళ్లూరి సెరువు కత ఇట్లా దండిగా కతలు జెప్య. అట్లనే  మా నాయన మా ఇంట్లో పూర్వమున్య ఎద్దుల కతలు, కరువు కతలు జెప్య. కమ్మని ఆ కతలు ఇంటా ఆ పొద్దు మాయ్టాలకంతా కందులిసిరు మర్సట్రోజు ఆ కందుల్ను తూరిబెత్తి , పొట్టు నుంచి కందిబ్యాల్లు వేరుజేసి మల్లా దాంట్లను శాటతో సెరిగి, యాడన్నా నూకుంటే దాన్ని జివ్వాలకుంటాదని పక్కన పెట్టి నికరమైన కందిబ్యాల్లను మాత్రం సంచికేసి ఎత్తిబెడ్తిమి.

అట్లా పది పదైదు దినాలు మనిసికి ఉసిల్యాకుండా జేసిన ఆ కందిబ్యాల్లను సమత్సరమో రెండేండ్లో వాడుకుంటాంటిమి.

వంకలో నీళ్లకు బ్యాల్లు సరిగా ఉడకవని, పప్పుకు బాయి నీళ్లైతేనే రుసని మాయమ్మ సెప్పంగా ఇంటి. అందుకే పప్పుకు మాయమ్మ ఎప్పుడూ బాయినీళ్లు పెడ్తాండ్య.

పొయ్యికాన్నుంచి ‘సుర్రుమన్య’ శబ్దానికి కమ్ముకున్య ఆ పాత రోజుల ముసురు నుంచి గడ్డకొచ్చి. నేను పొయ్యికాడికి పోతి. మాయమ్మ పొయ్సుట్ట కాడ కింద కూచ్చోని, రెండు అరికాళ్ల మధ్య పప్పు సెరవ పెట్టుకుని , పప్పుగుత్తితో పప్పు ఎనుపుతా కనపచ్చ. నన్ను జూసి ‘బ్బీ తిరగమాత మాడకుండా గంటెతో రోంతట్ల కల్దిప్పు’ అన్య. యర్రగడ్డలు, తెలవాయలు, తిరగమాత గింజలు పెనంలోని నూనెలో దోరగా ఏగుతనాయి. మల్లా మాయమ్మే ఉండి ‘ఇదోబ్బి, తక్కెక్కువలేమన్నా ఉంటే సూడ’ మని పప్పుగుత్తి కైన పప్పును రోంత సల్లార్పి నా అరసేతిలో వేస్య. ‘సరిపోయింది మ్మా…’ అంటి . ‘ఉప్పు సరిపొయింద్యా…’ అన్య. ‘అన్నీ సరిపొయ్నాయ్ మ్మా . బాగుంది’ అంటి.

ఎనిపిన ఆ పప్పును పెనంలోని తిరగమాతలో ఏస్య. పప్పుగిన్నెలో రోన్నీళ్లేసి కలదిప్పి దాంట్లను పప్పులో కలిప్య. ఆ పప్పు ఆవిర్లు సర్రున గాలిలో కలిసి ఇండ్లంతా పప్పు వాసన గుమాలించ్య. ఆ పెనంపైన ఆవిరి పోకుండా మాయమ్మ దానికి మూత మూస్య. రెండు మూడు నిమిషాట్లనే పెట్టి పప్పు దించి పొయ్యి మీద మల్లా రోన్ని ఒడిగ్యాలు ఏంచ.

‘బ్బీ రఘు, బువ్వయ్యిందిబ్బీ తింటారా’ అని క్యాకేస్య. మా నాయన, మామ దొడ్లోకి పొయ్యి కాళ్లు మొగం కడుక్కోని బువ్వకు కూచ్చుండ్య. మాయమ్మ నేను అన్నం, పప్పు, ఒడియాలు, ఆయిగిన్నె, మజ్జిగ అన్నీ తెచ్చి పెట్టి అందరం బూదిన్ను కూచ్చుంటిమి. మాయమ్మ మామకు అన్నం పెట్టి పప్పేసి, ఆ పప్పులో నెయ్యేస్య. మా మామ పప్పు అన్నం కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టికుని తిని ‘ఊ… అక్కా మీ ఊరి పప్పు రుసే వేరుక్కా’ అని మొదులు పెట్య. ఆ మాటకు మా తూర్పు సేను, కోత కొడవలి, కలం గోడ, నీళ్ల బాయి, కోడూరు గుట్ట, ఎర్రమట్టి, ఇసుర్రాయి కడకు కందిబ్యాల్లు కూడా , అన్నీ మా తట్టు జూసి పక్కున నగినట్లాయ. దాంట్లతో పాటే మేము.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

7 comments

 • రాయల సీమ యాసలో మంచి ప్రయత్నం చేస్తాం డారు అన్నా మీరు.చాన ఆనందం.

  • అన్నా, ధన్యవాదాలు న్నా. అనుభవాలను కాలగర్భంలో పోగొట్టుకోవద్దన్న చిరు ప్రయత్నమే అన్న.

 • ఎర్ర పప్పు శానా రుశి గుంటాదని వినిందే గాని ఎప్పుడూతినల్యా అన్నా. దీని వెనుక కుటుంబం పడే శ్రమ ,ముఖ్యంగా బ్యాళ్లను రూపుదిద్దడానికి తల్లి కొడుకు పాత్ర లేనిదే కమ్మటి పప్పు తయారవదు. బజార్ లో దొరికే నంద్యాల, హైదరాబాదు పప్పే ఫేమస్ అనుకుంటి కదన్నా ఎర్ర పప్పు కి ఇంత కథ వుందా.

  • అవును సర్తాజ్ శానా కతుండాది ఆ పప్పు వెనుక. మీ ఇంట్లో ఒకరోజు పప్పు వండుతా సరేతాజ్.

 • అన్న కత శానా బాగుండాది…
  ఎర్రపప్పు లా… చదవతావుంటే ఆ పక్కవం చేసేటోళ్లకే తెలుస్తాది….నోరూరిస్తావుంది..
  ఒక రోన్తా పప్పు సేయడం యంకమాలా ఎంత కతుండాది…మన సంస్కృతి కళ్ళకు కట్టినారు….
  చాలా సంతోస్మం అన్నా…

  • నిండు దండాలు నాగరాజు.

   అట్లజేసిన పప్పే రుచని పూర్వం నుంచి అంటాంటిరి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.