పక్కటెముకల మద్దె యుద్ధం

సరిగ్గా అప్పుడే
మొదలవుతుంది యుద్ధం…
కుళ్ళినపండు మీద ఈగ వాలినప్పుడు
ఎంగిలాకు కాడ
పందులు రెండు కొట్లాడుతున్నప్పుడు…

ఎందుకున్నాయి కళ్ళు..
ఎండిన ఈ దేహానికి?
మెతుకు చూసినప్పుడల్లా…
పేగులు కత్తులవుతుంటాయి..!

సొంగ కార్చి కార్చి సొమ్మసిల్లిన వీధికుక్క ప్రాణం..
ఎంతకీ పైకి లేవదు…

అయినా లోపల యుద్ధం ఆగదు…
పక్కటెముకల మద్దె పోరు నడుస్తూనే వుంటుంది..

సరిగ్గా అప్పుడే
ఖాళీ చేసిన బిర్యానీ పొట్లమో
కాగితంలో చుట్టిన నిన్నటి అన్నమో
కాల్వలోకి విసురుతుంటాయి వాకిళ్ళు..!

ఏ గుండెకూ చూపులు పుట్టవా…!
ఏ గుమ్మానికి చేతులు మొలవ్వా..!

ఎంతవరకీ పోరాటం…!?
చేతులున్నోళ్ళంతా…
చేతులు పైకెత్తి సెలవియ్యండీ..!

పల్లి పట్టు

పల్లి పట్టు పేరుతో కవిగా సుపరిచితులైన పల్లిపట్టు నాగరాజు చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయులు. తెలుగు ఎమ్మే చేసి, ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర యూనివ్సిటీలో పి. హెచ్ డి కూడా చేస్తున్నారు. 600కు పైగా కవితలు మినీ కవితలు, 6 కథలు రాశారు. ఆకాశవాణిలో వినిపించారు, పలు పత్రికల్లో కనిపించారు. కవిగా చాల పురస్కారాలు అందుకున్నారు. నాగరాజు చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’లో, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ సభ్యలుగా క్రియాశీలురు కూడా. నాగరాజు కాంటాక్ట్ నంబరు 9989400881.

14 comments

 • చేతులెక్కడున్నాయ్ నాగరాజూ. అవెప్పుడో తెగ్గోసుకుని, వేళ్ళు ముడుసుకుని, ఏ రెస్టారెంట్ టేబిల్ మీదనో స్పూనూ, ఫోర్కులతో సరసాలాడుతుంటాయ్. నీదైన శైలిలో నీ కవిత టచ్ చేసింది.

  అభినందనలు మిత్రమా.

 • బావుంది నాగరాజు ఇలాగే.కవిత్వం కొనసాగించు.

 • సూపర్ మిత్రమా……కవిత జీవం తో కదులుతుంది.

 • వస్తువు పాతదే అయినా అభివ్యక్తి గొప్పగా ఉంది.
  కవిత మొత్తం మానవతా పరిమళం. శభాష్ నాగరాజు

 • ఏ హృదయానికి చూపులు మోలవ్వా
  చాలా బాగా రాసారు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.