వాట్సాప్

మేమొచ్చిన కొత్త లో భారతీయులెవరు కనిపించినా, వాళ్ళతో మాట్లాడేసి,  ఫోన్ నంబరిచ్చేసి,  బోయినాలకి పిలిచేసి పండగ చేసుకునేవాళ్ళం.  ఆ వచ్చిన వారి దంతసిరిని బట్టి వారు ఒకసారొచ్చి ఆపెయ్యచ్చు,  లేక పదిసార్లు రావచ్చు.  వస్తే హాప్పీస్ కానీ రాకపోతే పెద్ద కారణమే ఉంటుంది. అబ్బా !నా వంట నచ్చక  కాదండీ. వారి వారి ప్రాంతం వారు దొరకడమో, వారి భాష మాట్లాడే వారు దొరకడమో, వారి కులాలవారీ జనాలు దొరకడమో కారణం కావచ్చు. ఇలా వస్తే వచ్చి, పోతే పొయ్యే వాళ్ళ నొదిలేస్తే , ఒక పది కుటుంబాలు మాత్రం ఎండొచ్చినా -వానొచ్చినా, కలిమొచ్చినా-కరువొచ్చినా…..ఇంకేమింకేమింకేం  కావాలే..చాల్లే ఇకచాల్లే అని మాతో ఫిక్సయ్యారు.

అలా అప్పట్లో పరిచయమయ్యిన వాళ్ళనో పదిమందిని ఇంటికి పిలిచాము.  అందులో  ఒక వ్యక్తి అదే మొదటి సారి రావడం. వచ్చినప్పటి నుండీ  అందరిలోకి వైరుధ్యంగా ప్రవర్తిస్తూ క్లబ్బుకొస్తారా  వెళదాం,  పబ్బుకొస్తారా వెళదాం నేను తీసుకెళతాగా అంటూ స్ట్రిప్పు క్లబ్బు (strip club), కేసినో (casino) లాంటి కొత్త పదాలు పరిచయవాక్యాలుగా ,పెద్ద పెద్ద లెక్చర్లు దంచాడు.  ఇక్కడకి రాకముందు అమెరికాలో కొన్ని ఏళ్ళు ఉండివచ్చినందు వల్ల ఇవన్నీ తనకి కొట్టిన పిండేనని చెప్తూ , ఆ దంపుడులో భాగంగా మాకు తెలియవనుకున్న ఊకవేసి మరీ దంచాడు . టీనేజీ బాయ్స్ చెవులింతచేసుకుని వింటుండడం చూసి, తన చిన్న నాటి ప్రేమ కథలు ,ఏపిల్ల నెలా పటాయించిందీ, ఎన్ని నెలలకో పిల్లని మార్చిందీ  అమందానందంతో చెపుతుండడం  చూసిన తల్లులు వాళ్ళ పిల్లలని పిలిచి  దగ్గరున్న దుకాణంలో కోకు తెచ్చుకోమని పంపారు.   ఆ సదరు వ్యక్తికి మేము బాగా దూరం జరిగాము.  చాలా రోజుల తరవాతెప్పుడో  ఒకసారి   మాల్ లో కలిసి, మంచి ఉద్యోగం వచ్చినదని  ఆస్ట్రేలియానో , బెల్జియమో  ఏదో  దేశమెళ్ళిపోతున్నాము అనిచెప్పి పలకరించాడు. మాటల్లో  గోదావరి అనే సినిమా  అద్భుతంగా ఉందనీ, ఫలానా శ్రీ లంక కొట్లో  తెలుగు సీడీలు అమ్ముతున్నారు కనుక్కోండి అని  చెప్పాడు. సినిమాలు చూసి చాలాకాలమయింది కదా అందులోనూ తెలుగు సినిమా దొరుకుతోందని సంబరపడి కొన్నాము. ఇంటికెళ్లి భోజనాలయ్యాక పిల్లలతో సహా సినిమా చూసేద్దామని కంప్యూటర్లో  సీడీ పెట్టినోళ్ళమల్లా ఫస్ట్ సీన్ చూసి జడుసుకుని  ఇంక చూడకుండానే పిల్లల కార్టూను సినిమా పెట్టేసి…’మనదే బుద్ధి తక్కువ.  ఎవరైనా చెపితే చెప్పినోడెలాంటోడని చూడకుండా కొనేసాం. … పేరుకి పవిత్రమైన గోదావరి పేరు..సినిమా చూడబోతే…హవ్వ హవ్వ అని బుగ్గలు నొక్కుకుని ఆ  సీడీ పట్టుకెళ్లి జాగ్రత్తగా గార్బేజ్ లో వేసేసాం పొట్లం కట్టి!!!..

మేము నలుగురం చదువుల్లో ఉండడం వల్ల  దూరదర్శన యంత్రం కొనలేదు చాలా ఏళ్ళు..తరువాత కొన్నా అది కేవలము విగ్రహపుష్ఠి తప్ప నైవేద్యాల నష్టాలు తేలలేదు. అనగా డిష్, కేబుల్ వంటి అనవసరమైన కనెక్షన్ లు తీసుకోలేదు.  దీనివల్ల  జనరల్ క్నాలెడ్జి లో (నాకు కె సైలెంట్ పెట్టడం ఇష్టముండదు) చాలా వెనకబడి ఉంటాము. వివిధ రకాల కొత్త గాయకులు గానీ, సంగీత దర్శకులు  గానీ,  ఈ 18 ఏళ్ళ లో వచ్చిన బద్ధకస్తుల (indian idle american idle) షోలు కానీ మాకెర్కలేదు. చంద్రబోస్  అంటే సుభాష్చంధ్రబోస్ గురించి గుక్క తిప్పకుండా అరపేజీ వ్యాసం చెప్పానో సారి. ఎదుటి వ్యక్తి  నా  పాండిత్యానికి మెచ్చి పడీఫడీ నవ్వితే ..నవ్వి పోదువు  గాక నాకేటి సిగ్గు నాకు తెలీదంతే  అనేసా .  అంత  ఇంటెల్ లేడీ  తో వాదన చేసే ఇంటల్ జెంట్ లు, ధీరులెవరూ దొరకలేదు ఆ తరువాత.

ఈ మధ్య ఎవరింటికో వెళ్ళినప్పుడు, మమ్మల్ని భరించలేక టీవీ పెట్టేసి వాళ్ళు పనుల్లో పడ్డారు.  పాపికొండల్లో సాగిపోతున్న పడవ, రామ చక్కని సీతకు అరచేత గోరింట  పాట చూసి మనసు పారేసుకుని , ఇంటికొచ్చి  గూగులమ్మనడిగి వివరాలు  చూస్తే  అద్భుతమైన కళాఖండం..

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే పైన చెప్పిన సదరు వ్యక్తి మీద ఉన్న అభిప్రాయం వల్ల, ఆ సినిమా మొదటి సీన్ లోనే మా కత్తెరవేటుకి గురయిన విధంగా ముఖపుస్తకానికి, వాట్సప్ కి కూడా ఒక  కత్తీ కత్తెర కథ ఉంది. అవ్విధంబెట్టిదనిన…

మా పెద్దోడిని  యూనివర్సిటీ లో  జాయిన్ చెయ్యడానికెళ్ళినపుడు డీన్ గారి ఉపన్యాసం లో పిల్లలు ఎవరి క్రమశిక్షణకి వారే బాధ్యులనీ, ముఖ్యంగా క్లాసులో ఫేస్బుక్ వాడుతూ పట్టుబడితే నిర్దాక్షిణ్యంగా డిస్మిస్ చేసేస్తామనీ, ఆ మధ్య  మూడవ సంవత్సరం పిల్లలు యూట్యూబ్లో  అభ్యంతరకరమైన  వీడియోలు చూస్తూ పట్టుబడితే యూనివర్సిటీ నుండి వారిని తొలగించామని  చెప్పారు. అంతే!! ఫేస్బుక్  మరియు యూట్యూబ్  అనేవి మాకింక వెలివేయబడిన పదాలు అయ్యాయి. అదృష్టం కొద్దీ మా పిల్లలు ఫోను కొనిమ్మని ఎప్పుడూ  పోరు పెట్టలేదు. రూమ్ లో ఉన్న ల్యాండ్  లయిన్  కే  రోజుకొకసారి  ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళం. అప్పట్లో ఫోన్ ల గురించి ఇంత హంగామా లేదుగా !!!!… కాబట్టి వాళ్ళు అలాంటివి చూస్తారని బెంగ లేదు హమ్మయ్య అనేసుకుని అలాంటి వాటికి దూరంగా ఉన్నాము. ఒకసారి మంచుతుఫానులో బస్సు క్యాన్సిలయ్యి ఇంటికి రావలసిన పిల్లాడి జాడ తెలియక మర్నాటి వరకూ అటు వాడూ, ఇటు మేమూ తల్లడిల్లిన సమయం వరకు అసలు ఫోన్ అవసరం పిల్లలకి కూడా తెలియలేదు. ఈ దెబ్బతో ఎవరో యూట్యూబ్ చూస్తున్నామని చెపితే నోరు తెరిచినోళ్ళం మూయడం కూడా మరిచిపోయామసలు.!!

ఇప్పటిలాగా అప్పటి ఫోన్ లు అంత స్మార్ట్ కాదు కాబట్టి అప్పట్లో మా ఫోన్  బయటికెళితే ఇంట్లో ఉన్న పిల్లలకి  ఫోన్ చేయడానికి,  ఇంట్లో ఉంటే పిల్లలకి  ఆటవస్తువు గానూ ఉండేది.  మెస్సేజెస్ ఫ్రీగా పెట్టుకోవచ్చని ఫోన్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చిన  కొత్తలో ఒక పంజాబీ కుటుంబం అప్పుడప్పుడు మెస్సేజ్ పెడుతుండేవారు. కొన్ని రోజులకి ఏవో జోక్స్ పంపడం మొదలెట్టారు. వాళ్ళు పంపిన జోకులు  పిల్లల వయసు జోకులు కావు కాబట్టిన్నీ, వరస బెట్టి తడవకో పది పదిహేను రాబట్టిన్నీ..  ‘ఇవేం మెస్సేజులు బెహెన్ జీ, ఎక్కడివి? కొంపదీసి నువ్వు వ్రాసావా ఏంటి’  అని అడిగా. . వాట్సప్ లో వచ్చాయంది.  అదేంటో తెలియలేదు నాకు. అప్పుడప్పుడే ఇక్కడకొస్తున్న కుర్రకుంకలు ఎవరైనా  కనబడగానే ‘హాయ్ బ్రో వాట్స్ అప్ ‘అని అడగడం వినీ వినీ మా సీతయ్య ‘మూడో రోజుకే నీకెన్ని తెలిసిపోయాయబ్బయా’ అని ఎటకారాలెయ్యడం,  ఉద్యోగాలు దొరక్క విసుగుతో నేను ‘నథింగ్ అప్ – అశ్శ బుశ్శ ఆల్ ఫాల్ డౌన్’ అనడం విన్నానే కానీ ఈ వాట్సాప్ ఏంటో అనుకున్నా. వాట్సప్ భలే సరదాగా ఉంటుందనీ ఇలాటి మెస్సేజులు కోకొల్లలుగా వస్తాయని తెగ సంబరపడింది . ‘వామ్మో నీ సంబరం, సట్టుబండలు నువ్వే ఉంచుకోమ్మా’ అని సున్నితంగా తిరస్కరించా. అసలే ఒకవైపు కొత్త కల్చర్, రోజుకి 10 గంటలు ఫ్యాక్టరీ పనులు, 4 గంటలు రానుపోనూ బస్సు ప్రయాణం, 3 గంటలు చదువులు, ఇంకో  2, 3 గంటలు ఇంటిపనులు. ఇంకో వైపు ఈ టెక్నాలజీ  మార్పులు. వీటి రెండింటితో ఇంట్లో పిల్లలని వదల లేక వెళ్లకుండా ఉండలేక మాతో తీసుకొచ్చింది ఇద్దరు పిల్లలనో లేక రెండు ఆటంబాంబుల్నో అన్నంతగా బెంబేలెత్తేవాళ్ళం

నా మేనకోడలొకసారి  ‘వాట్సప్ పెట్టుకో అత్తా ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా మెసేజ్ పెట్టవచ్చు’ అంది.  పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డా. ‘అదేంటత్తా అలా ఉలికిపడ్డావు.. అడ్వాన్స్ కంట్రీలో మీరీపాటికే  వాడేస్తున్నారనుకున్నా’ అంది. ‘నా తల్ల్యా… తల్ల్యా…  నువ్వెందుకు వాడుతున్నావే అలాంటి బూతు సైట్లని’ అంటూ ఎడాపెడా తిట్టి పోసా. ఈసారి అది ఉలికిపడింది. ‘అత్తా.. వాటమ్మా…  వాటీస్ దిస్  అమ్మా..  వాట్సప్ గురించి తప్పుగా అనుకుంటున్నా’వంటూ లెక్చరిచ్చింది. వింతగా అదే టైమ్ కి మా ఇంటి పేరుతో  ఉన్న గుంపులో  నేను , మా పెదనాన్న చిన్నాన్న పిల్లలు, మనవలు, వదినలు, అక్కలు, బావలు, అన్నలు ఇలా కుటుంబ  సభ్యులందరూ చేర్చబడ్డారు. మా మేనల్లుడు (పెదనాన్న మనవడు) తయారు చేశాడా గుంపు. భలే ఉంది అసలు!  అందరూ ఒకే చోట!  ఫోన్ చేసే పని లేదు, ఈ మెయిల్స్ పంపే పనిలేదు.  పొద్దున్న లేవగానే అక్కడి విషయాలు ఇక్కడికి, ఇక్కడివక్కడికీ పెన్నీ  ఖర్చు లేకుండా ట్రాన్స్ఫర్ అవడమే. రోజూ ఇక ఇకలు పకపకలు. ఇప్పటి దాకా చూడని మా కుటుంబం పిల్లల ఫోటోలు, పాటలు, డ్యాన్సులు. అబ్బో అందరూ ఇక్కడున్నట్టే. ఇంకేముంది మా ఆల్వాల్ గుడి మేడమీద ఎక్కి ఆడుకున్నప్పటి ఆనందం..

ఇటు వైపు కూడా అన్నదమ్ములక్కాచెల్లెళ్ళ వరకు ఒక గుంపు ఏర్పాటయింది,  కానీ ఎప్పుడో ఒక సారి తప్ప పెద్దగా కదలికలుండేవి కావు. ఇటు కూడా పే….. ద్ద  గుంపొకటి పెట్టెయ్యాలని తాపత్రయం కలిగింది. ఇటు వైపు కూడా నా పుట్టింటి వైపు పొందుతున్న అంతటి ఆనందం పంచెయ్యాలని కడియం కట్టుకుని (ఆ…  సరే మీరు చదువుకోండి కంకణమని.. నేను ఇలాగే అంటా)  ఇద్దరు కసిన్స్ ని కలుపుతూ ఒక గుంపు మొదలుపెట్టే లోగా ఆదిలోనే హంసపాదు..హతవిధీ..ఇద్దరూ నిష్క్రమించారు!  నేనొక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ బొక్కెనలకొద్దీ కన్నీరు కార్చి “విధి ఎంత బలీయమైనది.. అది ఆడే వింతనాటకంలో నేను పావునయ్యా”  అని టెంగ్లిష్లో ఇద్దరికీ మెస్సేజెస్ పెట్టా. ‘అయ్యో అక్కా, నీకు అర్థం కావట్లేదు.. చిన్నప్పటి లాగా ఎవ్వరు కలవట్లేదు. ఎవరెవరు ఎక్కడో టైం లేదంటారు. అనవసరంగా ఎందుకు అని అన్నా  అంతే’  అని  తిరుగు మెస్సేజ్ పెట్టింది .  “వదినా తప్పుగా అనుకోకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో” అని ఇంకో మెస్సేజ్ అంతేనా..”అంతా  భ్రాంతి యేనా , నా  కడియం విలువింతేనా ” అని బాధ పడిపోయా.  చిట్ట చివరగా నా అదృష్టం పండింది.  పిల్లల పుట్టినరోజులని  మా కొత్త గ్రూప్ లో గబా గబా అందరినీ లాక్కొచ్చేసి వాళ్ళు తేరుకునేంతలో ఇద్దరు పిల్లల ఫోటోలు  పెట్టేసి వాళ్ళ పుట్టిన రోజు అంటూ గ్రూప్ పేరు మార్చేసా. నేను ముందర యాపీ బాత్ డే అని కూడా చెప్పేశా. వెంటనే ఒకరిద్దరు మొహమాటస్తులు హాపీ బర్తడే  అని చెప్పారు అక్కడ నించీ ఒకరొక్కరు విష్ చేశారు. అబ్బా అందరినీ కలిసి భలే సంతోషం గా ఉందని ఒకరొక్కరు మొదలెట్టి  ఎడతెరిపి లేకుండా  ఇన్నేళ్లు మిస్ అయిన విషయాలన్నీ ఎంతో ఆప్యాయం గా పంచుకున్నారు.  బంగారు తల్లి అందరినీ ఒక చోట చేర్చిందని మా ఇంటి పెద్దోళ్ళతో బోలెడు బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నా మరి.

వాట్సాప్ అంటే ఇదేనా అనుకుంటూ అలా మా కుటుంబం ఆరు ఆడియోలు , మూడు వీడియోలతో సంతోషంతో  కలిసిమెలిసి  వాట్సాప్ వాడేస్తున్నాము.

నాకు ఇంత  వీజీ అయినా విషయం  మరెందుకో కానీ అందరికీ  కాదుట. మా స్నేహితురాలోకావిడ చెప్పిందిలెండి. వాళ్ళ కుటుంబాన్ని కలపాలంటే కప్పల తక్కెడలా ఉందిట. ఒకళ్ళొస్తే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారుట. ఛీ అని వదిలేసిందిట.  అసలు ఫోన్ చూడడం  మానేసాను అంది. ఎందుకంటే…. “కష్టమబ్బా , మనకి కోపాలొచ్చి అలిగినప్పుడు కామ్ గా ఒకచోట కూచుని వాట్సాప్ వీడియోలు చూసుకోడానికుండదు. అక్కడ మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా మరి.. నామోషీ గా ఉంటుంది.. నచ్చని విషయాలుంటే చెప్పడానికుండదు. ఫ్యామిలీ కదా మరి. అలాగే ఏ ఫ్రెండ్ కో చెప్పినట్టు రెండు ముక్కల్లో చిన్న మెస్సేజ్ పెట్టలేము. చివరన  బావగారనో అక్కయ్యగారనో లేకపోతే గౌరవం తగ్గినట్టుంటుంది కదా.. ఇంకో చిక్కొస్తుండప్పుడప్పుడు . కొన్ని సార్లు కొందరు ఎన్ని పోస్టులు పెట్టినా రెస్పాండ్ కానివారెవరో ఇంకొకరు పెట్టిన పోస్ట్ ని పదే పదే మెచ్చుకుంటారు. అప్పుడు మొదట 20 పోస్టులు పెట్టిన సదరు సభ్యులు.. ఛీ అనుకుని గ్రూప్లోంచి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళని గమనించి వెంటాడి బతిమాలి బతిమాలి మళ్ళీ గ్రూప్ లో చేర్చాలి. మనం చేరుస్తుంటే వాళ్ళు బింకంగా వెళ్లిపోతుంటారు. మీరు లేకపోతే ఎలా అంటూ వెంటపడి చేరుస్తూ ఉండాలి.ఈ లోపు ఇంకో పెద్దావిడ ‘వదిలెయ్యవే మరీ నాటకాలు’ అని అంటారు. అలాంటప్పుడు వెళ్లిన వారి వైపో ఉన్న వారి వైపో కాకుండా గోపి (గోడ మీద పిల్లి ) అవతారమెత్తాలి. ఆ వచ్చిన వ్యక్తి తొందర పడి  ఎవరి పోస్ట్ లకి రెస్పాండ్ అవరు. మనమే వాళ్ళని కలుపుకుంటూ “కదా అన్నయ్యా, కదా అక్కయ్యా” అంటూ పది సార్లు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉండాలి.. ఎప్పటికో వాళ్లకి దయ కలుగుతుంది అన్నమాట.  ఇంకొందరు పని మానుకుని పక్క వాళ్ళు ఎవరి పోస్ట్ కి రెస్పాండ్ అవుతున్నారు, ఎవరి పోస్ట్ కి అవట్లేదు అని లెక్కలేసుకుంటూ నా పోస్ట్ కి ఫలానా వాళ్ళు అసలు మాట్లాడలేదనో తాను అడిగిన ప్రశ్నకి బదులు చెప్పలేదనో పంతం పట్టి పగ తీర్చుకుంటుంటారు, ఇవన్నీ నా వల్ల  కాదబ్బా, నిన్ను చూస్తే కుళ్ళుగా ఉంది . కావాలంటే మీ కజిన్స్ గ్రూప్ లో చేర్చు ” అనేసింది.

ఏమోనండీ ! మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడికి క్షేమంగా చేరామని ఎలా చెప్పాలో తెలియలేదు. 15 యూరో లకి బ్రిటన్ లో కాలింగ్ కార్డు కొన్నాము కానీ అది పని చెయ్యలేదు. ఇక్కడికొచ్చాక కొన్న కార్డు పనిచేయలేదు. కార్డు వాడాలంటే ఫోన్ ఉండాలి కదా మరి. ఇంటి దగ్గర లాగా ఎస్ టీ డీ ఉంటుందని వెతికాము మంచులో పడి. దొరకలేదు.  మూడు రోజులకి ఫోన్ కొనుక్కునేదాకా ఇంట్లో వాళ్ళు, మేము కూడా ఖంగారు పడ్డాము.  అదీ కాక రెండున్నర డాలర్లకి కార్డు కొనుక్కుంటే 20 నిమిషాలోచ్చేది . అది కూడా ఏకబిగిన మాట్లాడితేనే. నిద్ర చేసిందంటే కార్డు లో సగం డబ్బులు పోయేవి. మాకు కార్డులు అన్ని దుకాణాలల్లో దొరికేవి కాదు. ఒకోసారి అంతదూరం వెళ్లి కొనే తీరిక లేకపోతే ఇంటికి వారం దాటినా మాట్లాడడం కుదిరేది కాదు. మందీ మార్భలమున్న కుటుంబాలాయే ! ఎన్ని కార్డులు కొని ఎంతమందితో మాట్లాడితే మాత్రం సంతృప్తి కలుగుతుందని!!

అలాంటివన్నీ చూసిన మూలాన ఇప్పుడు అరచేతిలో వైకుంఠం కనిపిస్తోంది. ఇలా అడగడమేంటి ఇలా జవాబు వచ్చేస్తోంది కదా.. ఇంత కన్నా ఆనందమేముంది. అదీ కాక ఇంతకు ముందు గుడికో గోపురానికో వెళితే అందరినీ గుర్తుపెట్టుకుని చల్లగా చూడమని రిక్వెస్ట్ పెట్టడంలో ఎవరో ఒకరిని మర్చిపొయ్యేదాన్ని. ఇప్పుడలా కాదు. ఇటు గన్నవరపు కజిన్స్ లో మెంబర్లని , అటు రాయవరపు కజిన్స్ లో మెంబర్లని , ఇటు కెనడా కుటుంబం మెంబర్లని అటు ముఖపుస్తకం స్నేహితులని చల్లగా చూసేయ్ దేవుడా అనుకుంటే ప్రపంచం లో నాకున్న సమస్త బంధుగణమూ  కవర్ అయిపోతోంది తెలుసా.. బాబోయ్… లింకుడిన్ కూడానండోయ్!!!! అక్కడ మరి నాతో పనిచేసేవాళ్ళుంటారు కదా..! అదన్నమాట. మీకు నచ్చితే ఈ సారి గుడికెళ్ళినప్పుడు దేవుడిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వాట్సాప్ అనండి అంతే.  అన్ని  గ్రూపులనీ ఆయనే చూసుకుంటాడు. ఏమంటారు ?…. ఒప్పుకున్నట్టేనా  మరి.. వాట్సాప్ ???

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

2 comments

  • మీ ఊరిలో అధికార భాష అయిన పంజాబి నేర్చేసుకుంటున్నారా? పంజాబీలను నేపధ్యం లో ఉంచి మంచి హాస్య వ్యాసం వ్రాసేయండి.

    • ధన్యవాదాలు అండీ. వచ్చే నెల అదే వ్రాస్తాను

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.