మరీ ముక్కు సూటిగా వుంటే ముక్కుకే ప్రమాదం!

“A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first.”                                                                                                                                                                                             – Chanakya

‘మనిషి మరీ ముక్కుసూటిగా ఉండకూడదు. నిటారుగా ఉండే చెట్లను ముందు కూల్చేస్తారు. నిజాయితీగా ఉండేవారిని ముందు ఇబ్బందిపెడతారు.’ అది చాణక్యుని అనుభవ సారం. చాణక్య తత్త్వ సారం. చాణక్యుడు చణకుని కొడుకు. అందుకే అతనికి  చాణక్యుడు అన్న పేరు. అతని అసలు పేరు  విష్ణుగుప్తుడు. తన గోత్ర నామంతో ‘కౌటిల్యుడు’ అని కూడా ప్రసిద్ధుడు. అతడిని అవమానించడానికి కొందరు అతడి గోత్ర నామాన్ని ఉపయోగించుకుని, కుటిలుడని ప్రచారం చేశారు. అతని వ్యూహాలు శత్రుదుర్భేద్యమైన కుటిలత్వంతో కూడుకుని ఉండటం వల్ల కూడా ‘కౌటిల్యుడు’ అనే పేరు సార్ధకమైంది. ‘చాణక్య నీతి’ రాజనీతిజ్ఞులకు, రాజకీయ నాయకులకు శిరోధార్యమైంది. కుటిల రాజనీతిజ్ఞతకు, శత్రు నిర్మూలనలో అనితర సాధ్యమైన వ్యూహ చాతుర్యానికి అతడు ప్రపంచ రాజనీతిజ్ఞులకు మార్గదర్శకుడు. చాణక్యుడు అక్షరాలా కింగ్ మేకర్. మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుని అసమాన యోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా తీర్చిదిద్ది, రోమన్ చక్రవర్తి అలెగ్జాండర్ నే నిలువరించి భారతీయ మేధా శక్తిని, యుద్ధ నైపుణ్యాలను, వ్యూహాలను ప్రపంచానికి చాటి చెప్పిన అసాధారణ ప్రజ్ఞాశాలి  చాణక్యుడు. సంపూర్ణ వ్యక్తి వికాసానికి మానవతా దృక్పథాన్ని జోడించి, అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో చంద్రగుప్తుని సువిశాల సామ్రాజ్య నిర్మాతగా, అఖండ భరత దేశ పరిరక్షకుడిగా తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచానికి తెలియచెప్పిన మేటి గురువు చాణక్యుడు. ప్రపంచంలోని విశ్వ విద్యాలయాలన్నీ చాణక్యుడి అర్ధశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని, అతని వ్యూహాలను మేనేజ్- మెంట్ విద్యార్ధులకు బోధిస్తున్నాయి.

రాజనీతి శాస్త్రం, నేరము-శిక్ష, అర్ధ శాస్త్రం – ఏ పాఠమైనా ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయం తక్షశిలలో చాణక్యుడి ద్వారా వినాల్సిందే. ఈ రోజు కూడా చాణక్యుడి బోధలు అనుసరణీయాలు. ప్రపంచీకరణ అనంతరం తలెత్తుతున్న ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం, యువతలో ఆత్మవిశ్వాస రాహిత్యం, శీల దారిద్ర్యం, భావ దారిద్ర్యం వంటి సంక్షోభాలకు చాణక్య నీతి మంచి మందు.

వ్యక్తిగత వికాసానికి, వ్యక్తి వికాసానికి, నిస్వార్ధమైన, విశ్వజనీనమైన సేవా దృక్పథంతో, కూడిన వ్యక్తిత్వ వికాసానికి భేదాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన పరిపూర్ణ మానవుడు చాణక్యుడు. పాలకులు ఎలా ఉండాలో, పాలితులు ఎలా ఉండాలో విచక్షణతో వివరించి, తాను బోధించిన నీతి కి ‘చాణక్య నీతి’ అని పేరు తెచ్చుకున్న ప్రజ్ఞాధురీణుడు చాణక్యుడు.

చాణక్య నీతి చాల నిరాడంబరంగా, అలతి అలతి పదాలతో అందరికీ అర్ధమయ్యేట్టుగా సరళమైన భాషలోనే ఉంటుంది. చాణక్యుడి బోధలు కుండ బద్దలు కొట్టినట్టు కాదు; కొండ బద్దలు కొట్టినట్టు ఉంటాయనడంలో సందేహం లేదు. చాణక్యుడు బోధించిన నీతి సూత్రాల్ని సింహావలోకనం చేద్దాం.

అన్ని రకాల వనరులను పొదుపుగా వాడుకోవాలని చాణక్యుడు బోధించాడు. కుండని నింపడానికి ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని చెప్పాడు. కరవు తాండవిస్తూ, గుక్కెడు నీళ్ళు కరవై నీటి కోసం దూరాలు కొలుస్తున్న నేటి నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు, పాలకులకు కూడా అవశ్యం శిరోధార్యమైన మాట ఇది. ప్రతి పైసాను పొదుపు చేస్తే అది నిన్ను  ధనవంతుణ్ణి చేస్తుంది. నీవు మంచి పనులు చేస్తే ప్రజలు నిన్ను ధార్మికుడని పొగుడుతారు. అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆచరణకు, ఆలోచనకు అంతరాలు పెరిగి పోవడం వలన మనం అన్నింటికీ నాలుక చప్పరించేసే మేతావులమయ్యాం. తు.చ. తప్పకుండా గురువు మాట పాటించిన చంద్రగుప్తుడు మహారాజు అయ్యాడు. చక్రవర్తి అయ్యాడు. శత్రువుల పాలిట సింహస్వప్నమయ్యాడు.

ఒక మనిషి తన జీవిత కాలంలో జీవిక కోసం, జీవితాన్ని జీవంతో జీవించడం కోసం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన పద్ధతులేమిటి? తపస్సును ఒంటరిగా చెయ్యండి. తపస్సంటే చాణక్యుడి దృష్టిలో కేవలం ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. ఒక పని చేయడానికి, అనుకున్నది సాధించడానికి అవసరమైన నిబద్ధతను అలవరచుకోవడం. ఆ పని ఏకాంతంలో, ఏకాగ్రతతో చేయడం. చదువుకునేటప్పుడు ఒకడు తోడుండాలి.  అంటే combined studies కి ఒక్కడు చాలంటాడు చాణక్యుడు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే చదువు చట్టుబండలవుతుందని వేరే చెప్పాలా?  చదువంటే కేవలం పుస్తక పఠనం కాదు; అధ్యయనం చెయ్యాలి.  అంతరార్ధాన్ని తెలుసుకోవాలి. సంగీతం నేర్చుకునేటప్పుడు ముగ్గురితో కలసి నేర్చుకోవాలి. ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించాలనుకున్నప్పుడు నలుగురితో కలసి వెళ్ళాలి. వ్యవసాయం చేసేటప్పుడు కనీసం ఐదుగురుండాలి. యుద్ధానికి వేల మందితో వెళ్ళాలి.

‘ప్రియ వాదినో న శత్రు:’! నలుగురితో చక్కగా మాట్లాడేవారికి శత్రువులే ఉండరు. మానవ సత్సంబంధాలన్నింటికీ మాటే మూలం. మాట స్నేహితుల్ని తెచ్చిపెడుతుంది. మాటే శత్రువులను పెంచుతుంది. ఇతరులను నొప్పించకుండా, నువ్వు నొచ్చుకోకుండా ఈ ప్రపంచంలో బతకాలి. ఇటువంటి మనిషికి ప్రపంచంలో శత్రువులే ఉండరు. అటువంటివాడే అంతిమ విజేత.

ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం గురించి చాణక్యుడిలా అంటారు.  ప్రజలు ప్రభుత్వం మీద కోపిస్తే అది అశాంతికి, అలజడికి దారి తీస్తుంది. పాలకులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.  వాటిని కేవలం ప్రకటనలకు, ప్రచారానికే పరిమితం చేయకుండా  నిబద్ధతతో పూర్తి చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.  ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం కల్పించాలి.

మానవ సంబంధాల గురించి చాణక్యుడు మాట్లాడుతూ స్నేహితులతో శతృత్వం ప్రమాదం. మూర్ఖులతో శతృత్వం మరీ ప్రమాదం. గురువులతో శతృత్వం వలన జ్ఞానానికి దూరమవుతాం. అజ్ఞానంలో పడిపోతాం. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండాలి.

నువ్వు గర్వంగా రాజుగారి దర్బారుకు పోతున్నా, విషాదంతో శ్మశానానికి వెళుతున్నా నిన్ను అనుసరించేవాడే నిజమైన స్నేహితుడు.

నీ కుటుంబానికి, బంధువులకు, అతిధులకు, పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి భోజనం పెట్టాకే నువ్వు భోజనం చేయాలి. అటువంటి భోజనం అమృతంతో సమానం.

అనారోగ్యం శతృవు కంటే ప్రమాదకరం. నువ్వు జాగరూకతతో లేనప్పుడు అది నిన్ను చంపేస్తుంది. పరిమితి లేకుండా తినడం అజీర్తికి దారి తీస్తుంది. మితాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జంతువులనుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అంటాడు చాణక్యుడు. సింహం తన ఆహారాన్ని వేటాడి సంపాదించుకుంటుంది. వదిలేసిన ఆహారం కోసం అదెప్పుడూ ఎగబడదు. కొంగ కేవలం తన పొట్ట నింపుకోవడానికే వేటాడుతుంది. దానికి అత్యాశ లేదు. కోడి ఉదయాన్నే నిద్ర లేస్తుంది. అదెప్పుడూ బద్ధకించదు. కుక్క ఎప్పుడూ తన యజమానికి విధేయంగా ఉంటుంది. విశ్వాసంతో ఉంటుంది. గాడిద ఓర్పు అందరికీ ఆదర్శం. నాలుగు మెతుకులు కనబడితే కాకి మరో నాలుగు కాకులను కావు కావుమంటూ పిలిచి పంచుకుంటుంది. ఈ ప్రపంచంలో మనతో పాటు నివసించే జంతువులను చూసి మనం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

చాణక్యుడి బోధలు ఈనాటికీ ఆచరణీయాలు.  ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు చాణక్యుని బోధనల ఆధారంగా తమ ఉద్యోగులకు నాయకత్వ
లక్షణాలు, మానవ వనరుల నిర్వహణా నైపుణ్యాలు, సమస్యా పరిష్కార నైపుణ్యాలు తదితర ఎన్నో అంశాల్లో శిక్షణనిస్తున్నాయి.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.