తొలి నీతి శాస్త్రం బద్దెన పద్యం

భూమి మీద మనుషులంతా ఒకలాగే పుడతారు. జన్మలొక్కటే అయినా జనులు ఏ జాతిలో పుడితే ఆ జాతివారైపోతారు. జాతికో రకం పండుగలు, ఆచారాలు, అహార అలవాట్లు ఉంటాయి. అలాగే జాతికో రకం నీతి కూడా ఉంటుంది. ప్రాథమికమైన జీవన నీతి లోకంలోని వారందరికీ ఒకటే అయినా, ఆ నీతులను జన బాహుళ్యంలోకి తీసుకువెళ్ళే వాహకాలు ఆయా జాతి సాహిత్య సంస్కృతీ స్రవంతులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పుణ్య పురుషులకీ మిగతా వారికీ తేడా చెప్పేందుకు వేమన వేసిన ఉప్పు కప్పురాల ఉపమానం ఒక భారతీయుడు అన్వయించుకున్నంత సులభంగా ఇతరజాతివాడు అందుకోలేడు. కర్పూరం అంటే ఆంగ్లంలో “కేంఫర్” అని విదేశీయుడు తెలుసుకోవచ్చు. కానీ కర్పూర జ్వాల హారతి రూపంలో ఒక దేశీయుడి హృదయాన్ని చేరినంత వేగంగా ఒక విదేశీయుడ్ని చేరలేదు. దాని పవిత్రత అతని అనుభవానికి తెలియనిది. అందుకే నీతి సూక్తులు జాతీయత రంగును దిద్దుకుంటాయి. 

ప్రతీ జాతిలోనూ నీతి సూక్తులు ప్రజల నోళ్ళలో నలిగి, సమాజాంలో సంస్కారాన్ని పెంచుతాయి. సంస్కర్త గుణం గలిగిన కవులు రాయగా జనంలో అవి ప్రాచుర్యాన్ని పొందుతాయి. అటువంటి సత్కవులు సమాజాన్ని నిశితంగా పరిశీలించిన వారై ఉంటారు. వారి సూక్తులు “జాతి జనులు పాడుకునే మాంత్రాలై” వారిని మహాకవుల శ్రేణికి చేరుస్తాయి. వారు తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని చెప్పగలిగే వారై ఉంటారు. మఱ్ఱి విత్తనమంత చిన్నపద్యంలో మహా వృక్షమంత అనుభవాన్ని చెప్ప గలవారై ఉంటారు. ఉదాహరణకు, “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను” అన్న శ్రీ శ్రీ మాటలు ఆధునిక తత్వశాస్త్రమైన మార్క్శ్ సిద్దాంతాన్నంతటినీ ఒక్క చిన్న వాక్యంలో ఇమిడ్చ ప్రయత్నించినట్టు, చిన్న చిన్న పద్యాలలో సమాజపు పోకడలను బయటకు చెప్పి జాతి నడతను మార్చ యత్నించారు మధ్య యుగంలో వేమన, ప్రాచీన యుగంలో బద్దెన.

వారి నీతి పదాలు సమాజపు లోతైన పొరలలోకి వెళ్ళబట్టే ప్రతీ తెలుగు వాడూ ఒక వేమన పద్యమో, ఒక సుమతీ శతక పద్యమో కనీసం ఉదహరించగలడు. తెలివిలేని వానికి తెలివి చెప్పాలి కాబట్టి నీతి పద్యాలు సులభమైన భాషలో రాయాలనేది ప్రాథమిక నియమంగా పెట్టుకున్నారు. సరళభాషే కాక కొంత హేళన, ఎత్తిపొడుపు, మందలింపు లాంటివి కూడా కలిపి అధిక్షేప కవితలతో కూడా నీతిబోధ చేశారు. చౌడప్ప లాంటి కవి హాస్యాన్ని కూడ జోడించి మరీ చెప్పాడు- “నీతులు బూతులు లోకఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్ప” అంటూ.

నీతి పద్యాల శైలి గమనిస్తే మనకు కనబడే ధర్మాలు: మాటలలో పొదుపు, భాషలో సరళత, సమకాలీన దేశ కాల పరిస్థితుల ప్రస్తావన, రాజ్యంలో ఉన్న సాధరణ జన సంబంధమైన సమస్యల ప్రస్తావన, ఉపయోగించే ఉపమానాలు పాఠకుడి అనుభవంలోనివై ఉండడం, అన్వయ క్లేశం లేకుండా గంభీరమైన సత్యాలను సామాన్యంగా చెప్పడం. వీటిని తెలుగు వాఙ్మయంలో మొదట ప్రయోగించింది సుమతీ శతకంలోనే. నీతి సూక్తులను చెప్పిన చాలా మంది కవులు తమ పద్యాలను శతకాలుగా చెప్పారు. శతకం అంటే నూరు నుండి నూటపదహారు పద్యాలు గలిగిన కావ్యరచనా ప్రక్రియ. తెలుగులోనే ఈ ప్రక్రియ ప్రాచుర్యం పొంది వేయికి పైగా శతకాలు వెలువడ్డాయి. మిగతా దక్షిణ దేశీయ భాషలలో శతకాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. తొలి తరం కవులలో శతక ప్రక్రియకు వృషాధిప శతకం ద్వారా ఒక ప్రామాణికతను కలిగంచినవాడు పాల్కురికి సోమన. కానీ తెలుగు సమాజం, వాటిలోని పోకడలను ఎత్తి చూపే నీతి పద్యాలను మొదట రాసినవాడు 14వ శతాబ్దపు కవి సుమతీ శతకకర్త బద్దెన భూపాలుడు.

“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు”
“తనకోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష”
“అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి”
“కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు” (కలకంఠి = కోయిల స్వరము గల స్త్రీ)
“చింతించకు గడచిన పని”
“చేతులకు తొడవు దానము”
“ఖలునకు నిలువెల్ల విషము” (ఖలుడు = మూర్ఖుడు)
“నీరే ప్రాణాధారము”
“మాటకు ప్రాణము సత్యము”
“వినదగు నెవ్వరు చెప్పైన”

మొదలైన ఎంతో చిక్కని చక్కని తెలుగు పదాలతో నిండిన నీతులు సుమతీ శతకంలో ఉన్నాయి. అయితే సుమతీ శతక కర్త వాస్తవానికి బద్దెనా మరొకరా అన్నది పూర్తిగా నిర్ధారణకు రాని చిక్కుప్రశ్న. సగం మంది పరిశోధకులు బద్దెన అనే వాదిస్తున్నారు. బద్దెనదే అని రూఢిగా చెప్పబడుతున్న “నీతిశాస్త్ర ముక్తావళి” అనే నీతి శాస్త్ర గ్రంధంలో అనేక పద్యాలు సుమతీ శతక పద్యాలను పోలినవి వున్నాయి. పామరులకే కాదు రాజులలాంటి వారికి కూడా నీతులు, సలహాలు చెప్పాడు బద్దెన. రాజులు ఎవరిని నమ్మాలో యెవరెవరితో స్నేహం చేయాలో చెప్పే ఈ క్రింది పద్యాలు:

కం||
స్థిర మతినేక స్థితి జను
పురుషుని నమ్మునది పెక్కు బుద్దులమై నూ
సరవెల్లి పొడలు చూపెడు
నరుపొరుపున బోకయేల నయ తత్వ నిధీ

స్థిర మతి = నిలకడ గల ప్రవర్తన గలవాడు; ఏక స్థితి = ఒకే విధంగా నడచుకొనువాడు; చను = వెడలు; నమ్మునది = నమ్ముము; పెక్కు బుద్దుల మై = పలు రకాల దేహము గల; ఊసరవెల్లి పొడలు = ఊసరవెల్లి రీతులు; పొరపు = చెంత; పోక యేల = పోవడమెందుకు; నయ తత్వ నిధి = సంబోధన = సుమతీ/వేమా అన్నట్లుగా

భావము = స్థిర మనస్కుడై ఒకే రీతిలో మెలగు పురుషుని నమ్మ వలెను గాని, పెక్కు విధముల దేహమును మార్చు ఊసరవెల్లి రీతిన నుండు నరుని చెంత చేరకుము

కం||

స్నేహలతలు సద్గుణసం
దోహ జలంబుననె పెరుగు దుర్గుణ యుక్త
స్నేహితుల వలన మాతృ
స్నేహము జెడునండ్రు రాజసిద్ధాంతవిదుల్

భావము = స్నేహలతలు సద్గుణ సముదాయంలో ఉన్న వారి మధ్యనే పెరుగుతాయి. దుర్గుణుడైన స్నేహుతుడి వలన మిగతా వారితో ఉన్న స్నేహం కూడా చెడుతుంది.

పై రెండు పద్యాలూ బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళిలోనివని రూఢిగ చెప్పబడుతున్నవి. సుమతీ శతకంలో బద్దెన తన పేరును ఎక్కడా చెప్పకపోయినా, నీతిశాస్త్ర ముక్తావళికి చెందిన ఒక తాళపత్ర గ్రంథంలో సుమతీ శతకాన్ని తానే రాసినట్టుగా చెప్పడం వల్ల బద్దెనే సుమతీ శతకాన్ని రాశాడని ఊహించవచ్చు. సుమతీ శతకంలో ఆ కాలానికి మాత్రమే సరిపోయిన నీతులున్నాయి. స్త్రీలను, కొన్ని వృత్తుల కులాలను అవమానించే పద్యాలు కూడా ఉన్నాయి. కానీ శతకంలోని అధిక సంఖ్యలో ఉన్న పద్యాలు అన్ని కాలాలకూ సరిపడేవిగా ఉన్నాయి. ఆ కాలానికే పనికొచ్చే కొన్ని నీతులను మనం ఆ కాలానికే వదలి, నేతి కాలానికి పనికొచ్చే వాటిని గ్రహించి, బద్దెన కవికి తెలుగు భాషలోని మొదటి నీతి శాస్త్ర శతకకర్తగా కొనియాడి, ఆ పద్యాలను తెలుగు వారందరమూ కంఠతబెట్టి ప్రచారం చేయడం ద్వారా ఆ కవికి నివాళులర్పిద్దాం

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.