Φ (ఫై)

;1.

ఏమీలేనితనమంటే శూన్యమేనా? అప్పుడప్పుడు మనసు గుంజాయితి పడుడు సూత్తాంటె గుండె తరుక్కపోతది. బోర్లించిన ఖాళీ గిన్నెల్లోంచి గాలిని ఎల్లగొట్టి నిన్ను నువ్వు నింపుకుంటావు. ఖాళీగా వున్న రెండు మీసాల బ్రాకెట్లు ఎప్పటికీ నిన్ను ప్రతిబింబిస్తూనే వుంటది.

2.

పోపు పెట్టినప్పుడల్లా పైకిలేచే ఘాటైన పొగలా నీలోంచి గుప్పుగుప్పుమంటూ భావోద్వేగాలన్నీ మూకుమ్మడిగా బైకాట్ చేసి మాయమైతాంటయి. నిన్ను నువ్వు వేపుకున్నప్పుడల్లా మాడిపోయో, అడుగంటిపోయో మిగిలిపోతవు. ఎవలన్న కాసిన్ని నీళ్లు సల్లకపోతరా అని తండ్లాడుతవు.

3.

ఎవరికీ కనిపించకుండ ఆవిరవుతూ జాగ్రత్త పడుతవు. ఎవల చల్లని చేతుల సలవనో తెలీదుగాని బొట్లు బొట్లుగ రాలుస్తూ నిన్ను మట్టి పొత్తిళ్లలోకి చిలకరిత్తరు.

4.

ఎటు మర్రినా అన్నీ సట్టలే అవుపిత్తయి. ఆయిమన్న ఇత్తునం దొరక్కపోదా.. మళ్లీ మొలకెత్తకపోతనా.. అని రంది పట్టుకుంటది.

ఏమీలేనితనం నిండుగ ఇగురెక్కాలంటే తడి తాకాల్సిందేనని మొగులు ఉరుముకుంట మీదిమీదికొత్తది.

5.

శూన్యాన్ని ఆవరిస్తూ పచ్చగ చిగురించడం కంటే ఆనందమేముంటది బతుక్కి? నువ్వు ఎటుతిరిగి ఎటుపోయినా మంచివైపుకు తొవ్వ జేసుకుంటెనే మనుగడ.

ఏమంటావు మిత్రమా ? శూన్యసమితివై మిగిలిపోతావా ఏం?

బండారి రాజకుమార్‍

5 comments

  • ఈ భాషేమిటో పురా జ్ఞాపకాల్ని పెకలిస్తోంది

    • మట్టిభాష మహిమగల్లది మిత్రమా!
      తవ్విపోసుకున్న కొద్దీ ఎల్లబోసుంటది.
      నొసట్ల రాసుకుంటే అదే విభూతి !

      మీ స్పందనకు శనార్తులు

  • {. }మధ్యలో నేను శూన్యమై
    మనిషిలోని ఈ ఖాళీ తనాన్ని పూరిచుకోవాలి
    చాలా బాగుంది మిత్రమా కవిత

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.