అనార్కీ! అనార్కీ!!

అంతకంతకు విస్తరించే వలయంలో గిర గిర తిరిగే
డేగ తన శిక్షకుని మాట యిక వినిపించుకోలేదు
అన్నీ పక్కలకు పడిపోతాయి, కేంద్రం పట్టి వుంచలేదు
శుద్ధ అరాచకం ప్రపంచం మీద విరుచుకు పడుతుంది
రక్త శ్యామల సముద్రం కట్టలు తెంచుకుంటుంది,
అమాయకత్వపు సంబరాన్నిముంచెత్తుతుంది
వుత్తములు అన్ని విశ్వాసాల్ని వొదిలేస్తారు. అలగా
జనాలలో ఉత్సాహోద్రేకాలు పరవళ్లు తొక్కుతాయి.

– ‘సెకండ్ కమింగ్’, డబ్ల్యు బి యేట్స్.

 

యేట్స్ పద్యంలోని చివరి మాట ‘అలగా’ (వర్స్ట్) జనులు పదం మనకు రుచించక్కర్లేదు. విభేదిద్దాం కూడా. సంప్రదాయం నుంచి యెంతో దూరం జరగని ఆధునికుడు యేట్స్. ఆయనకు ఆ మాత్రం మార్జిన్ యిద్దాం. దేవతల నెదిరించిన ప్రమథ గణాలతో కూడిన శివుని సైన్యాన్ని, వంగపండు ‘యెర్రజెండా’ పాట మొదటి వర్షన్ లోని ‘అలగా జనాల’ను యిక్కడ ఆవాహన చేసుకుందాం.

మార్క్సు గారి ‘ప్రొలిటేరియట్’ కూడా అదేనంటారా? ఔన్నిజమే, పోగొట్టుకోడానికి యేమీ లేని వాళ్లు, కొంచెం వల్ల దప్పితే ‘క్షుద్రవర్గం’ (లంపెన్) అనిపించుకోవలసిన వాళ్లు… యేట్స్ తో ‘worst‘ అని అనిపించుకోడం అనాశ్చర్యమే.

నిజానికి వాళ్లే మనం కదూ?!.

మనల్ని మనం ఏమని చెప్పుకుందాం? మనం కార్మికులమా? కర్షకులమా? మనం పెట్టీ బూర్జువానా? బూర్జువానా? యెవరికి బాగున్న పేరు వాళ్లు యెన్నుకుని, అధికార పీఠాల వద్ద బాప్తిజం పొందడం… మతానికి వోకే గాని, మనక్కుదరదు. మరి, నిజ్జంగా యెవరు మనం?

యివాళ కదుల్తున్న బతుకు చిత్రాల్ని కాస్త దగ్గరగా చూద్దాం.

కదుల్తున్న ఈ సమూహాలలో మనకు మనం దొరికినా దొరకొచ్చు, మనకేవో వకాల్తా కర్తవ్యాలు లేకుంటే.

సాంప్రదాయిక, అసాంప్రదాయిక కమ్యూనిస్టు పార్టీల సైద్షాంతిక పరిభాషలలో దేనికీ లొంగని సమూహాల ప్రజలు యివాళ తమ కోసం తాము వీధులకెక్కుతున్నారు.

వాళ్ల చేతుల్లో యేవైనా జెండాలున్నా యేవీ లేకున్నా, వాళ్లు నినదిస్తున్నది జెండాల ఘనతను కాదు. తమ బాధను, తమ క్రోధాన్నే వాళ్లు వెలిబుచ్చుతున్నారు. ధరలు తగ్గాలంటున్నారు, ఇంధన పన్నులు తగ్గాలంటున్నారు.

జెండాల కోసం కాదు. వాళ్ల కోసమే వాళ్లు గొంతులు చించుకుంటున్నారు.

వాళ్లు సమాజ వృత్తం అంచుల్లో (పెరిఫెరీ లో) బతుకుతున్న వాళ్లు.

అయితే గ్రామీణులు లేదా సబర్బన్ నగర వాసులు. (నగరాలకు, పట్నాలకు శివారు (సబర్బన్) కాని గ్రామాలున్నాయా యివాల్టి ప్రపంచంలో?)

అలాంటి వాళ్లకు కారు లేకుంటే బతుకు గడవదు. వాళ్లు ‘బయటి’ నుంచి వొచ్చి పని చేసి వెళతారు. ఉన్నోళ్లు యెంచక్కా నగరమధ్యంలో ఆకాశ హర్మ్యాలలో వుంటారు. ‘పెరిఫెరల్’ జీవులకు అది కుదరదు. కారు వారి నిత్యావసరం.

వేతనాలు పెంచకుండా ఇంధనం పన్నులు పెంచి, ధరలు పెంచడమంటే ‘పర్యావరణం’ పేరిట వాళ్ల పొట్ట కొట్టడమే. వాళ్ల జీవనోపాధి మీద దెబ్బ కొట్టడమే.తాము దోచుకున్నంత దోచుకుని, అందుకోసం పర్యావరణాన్ని సైతం పాడు చేస్తూ, శిలాజ ఇంధనాల వినిమయం తగ్గిస్తామని ఓ రోజు పొద్దున్నే బయల్దేరి సామాన్యుని నడ్డి విరగ్గొట్టేలా ధరలు పెంచేశారు. అదీ ప్రజల ఆగ్రహ హేతువు.

చీకటిలో కనిపించడానికి వీలుగా కారు డ్రైవర్లు వేసుకునే పసుప్పచ్చ కోట్లేసుకుని వాళ్లు వీధులకెక్కడం వెనుక కవితాన్యాయమిది. పసుప్పచ్చ రంగు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, దీని వల్ల తమ పోరాటానికి యెక్కువ విజిబిలిటీ వుంటుందనేది మరో కారణం.

ఇంతకూ, పసుప్పచ్చ కోట్లతో ప్యారిస్ నడి బొడ్డున ధిక్కారం ప్రదర్శిస్తున్న వీళ్లంతా యెవ్వరు? వీళ్ల సిద్ధాంతాలేమిటి? వీరి నాయకులెవ్వరు? యిదమిత్థంగా వీరి పోరాట ధ్యేయాలేమిటి? వీళ్లు పర్యావరణానికి అనుకూలురా వ్యతిరేకులా? పెట్టుబడిదారీ అభివృద్ధి వీళ్లకు యిష్టమా అయిష్టమా?

వీళ్ల పోరాటాల్ని… బాష్ప వాయువుకు వాటర్ క్యానన్లకు లొంగని వీళ్ల ఆరాటాల్ని…  ఏ ‘పంథా’, ‘కార్యక్రమాలు’, ఏ ‘రాజకీయ తీర్మానాలు’ వివరిస్తాయి? ఏ సెంట్రల్ కమిటీ యొక్క యెన్నో పొలిట్ బ్యూరో యెన్నో సమావేశం వీళ్లనిలా ఆదేశించింది? ఏ ‘డేగల శిక్షకుడు యీ డేగల్ని కాంక్రీట్ ఆకాశంలో గిరికీలు’ కొట్టిస్తున్నాడు? ఏ సౌందర్యవాదం, ఏ సాహిత్య-కళా వాదాలు వీళ్లను సొంతం చేసుకుని తిరిగి మనకు పరిచయం చేస్తాయి?

అదీ అసలు సంగతి. అదే అసలు సంగతి.

వీరికి వొక ‘కేంద్రం’ లేదు. వీళ్లు ఏ కేంద్రాన్నీ పట్టించుకోరు.

యిప్పుడున్న కేంద్రాలలో యేదీ తన చుట్టూరా వుండాల్సిన ‘వస్తువు’లను తనతో పట్టి వుంచుకోలేక పోతున్నది.

తమను పట్టి వుంచే కేంద్రం లేకపోవడంతో ‘వస్తువు’లు చిందరవందరగా పడిపోతున్నాయి.

ప్యారిస్ వీధులను పోరాట రాగ రంజితం చేస్తున్న పసుప్పచ్చ కోట్లలో అతి మితవాదులు… అనగా ‘ఎక్స్ట్రీమ్ రైటిస్టులు’న్నారు. వాళ్లు గత ఎన్నికల్లో పచ్చి మితవాది లె పెన్ కు వోట్లేశారు. వీరిలో మావోయిజాన్ని ఔదల దాల్చే వాళ్లు, తీవ్ర వామపక్షీయులున్నారు. యీ రెండు కొసల వాళ్లు కలిసున్న చోట కొందరు మధ్యే వాదులు యెలాగూ వుంటారు.

దృశ్యాన్ని రంగు కళ్లద్దాలేవీ లేకుండా చూస్తే, ఇండియాలో ఇందిరా గాంధీ విధించిన యెమర్జెన్సీలో జైళ్లకు వెళ్లిన రకరకాల వాళ్లు… ఆరెసెస్, జమాతే యిస్లాం నుంచి సోషలిస్టులు, సాహసిక ట్రేడ్యూనియనిస్టులు, మార్క్సిస్టు లెనినిస్టులనబడే నక్సలైట్ల వరకు అందరూ వున్నారు.

అంటే వీళ్లందరూ ఆనాటి సంక్షోభంలో పాలకులను యెదిరించారు. వీళ్లందరు తమకు ప్రమాదమని ఆనాటి పాలకులు భావించారు. యిన్ని రకాల వాళ్లు వొకే సారి ప్రభుత్వానికి ప్రమాదమయ్యేది యెప్పుడు?

సిద్ధాంతాలేవైనా మనుషులందరూ తినాలి, కట్టాలి, తల దాచుకోవాలి. వాటికి ప్రమాదం యేర్పడేంత సంక్షోభంలోనే… యిలా రకరకాల వాళ్లు… సిద్ధాంతాల్ని పక్కన పెట్టి… ప్రజలుగా యేకమవుతారు. ఇండియాలో యెమర్జెన్సీలో జరిగింది అదే.

ఇప్పటి ప్యారిస్ దృశ్యం కూడా అదే.

బహుశా. అమెరికాలో సిద్దాంతాల ప్రమేయం లేకుండా దైనందిన సమస్యల మీద ట్రంపు పాలనను యెదిరిస్తున్న టీచర్లు, పర్యావరణ వుద్యమకారులు, ‘మీ టూ’ వుద్యమ మహిళలు, సరిహద్దుల వద్ద ఆశ్రయార్థులకు మద్దతు పలుకుతూ వీధులకెక్కే వాళ్లు… అందరూ కలగలిసిన దృశ్యాలు కూడా అవే. బెర్నీ శాండర్స్ తరహా ‘సోషలిస్టు’ డెమోక్రాట్లతో పాటు యితరులు కూడా ట్రంపు ప్రభుత్వ వ్యతిరేకుల్లో వున్నారు.

అక్కడ, యిక్కడ, యెక్కడైనా అందర్నీ కలిపేవి, కదిలించేవి ప్రజల దైనందిన సమస్యలే.

కేవలం సుదూర భవిష్యత్ స్వప్నాల నల్లేరు మీద నడిచే పూర్వ నిర్ణీత కార్యక్రమాలు కావివి.

అలాంటి కలలకు యిప్పుడు కాలం చెల్లింది.

అవి తప్పని సరిగా వేయాల్సిన ఒక వెనుకడుగు కోసం కాలూ చెయ్యీ సవరించుకుంటున్నాయి.

వాటి ఒక వెనుకడుగు రెండు ముందడుగులకు సమానం. ఆ అడుగు యెలా వెయ్యాలో యెవరికి వారు తేల్చుకోవలసిందే.

ఔను, మునుపటి ‘కేంద్రా’లు లేవు. ఇది ‘సెంటర్’ల కాలం కాదు. ‘డీసెంటర్’ల కాలం. నిర్మాణ కాలం కాదు. అనిర్మాణ కాలం.

దేన్ని అనిర్మించాలో దాని పునాది మీద యిక దేన్ని నిర్మించినా నిలబడదు.

చాల అమూర్త, అనిర్మాణ, అకేంద్రక సోషల్ మీడియా ద్వారా యెల్లో వెస్ట్స్ వుద్యమం పుట్టి, పెరుగుతున్నది. దీనికి కళ్లు మూసుకుని వుండలేం.

సూక్ష్మ పరిశీలనలోనే కాదు. స్థూల స్థాయిలో కనిపించేది కూడా యీ చలన చిత్రమే.

ఒకప్పడు సమాజానికి దేవుడు కేంద్రం. మతం అండగా దైవాంశ సంభూతుడైన రాజు మనల్ని నడిపించాడు. దేవుడిని తీసేసి, ఆ కేంద్రంలోనికి ‘మానవుడు’ వొచ్చాడు. అనిర్దిష్ట మానవుడి నిర్దిష్ట రూపంగా ‘సార్వత్రికం’గా యెన్నికైనవాడు ‘పాలకుడ’య్యాడు.

దైవ కేంద్రక సమాజం మానవ కేంద్రకమైపోయి చాన్నాళ్లయ్యింది.

‘మీకు తెలీదా? దేవుడు చనిపోయాడు’ అన్నాడు ఫ్రెడరిక్ నీషే (‘దస్ స్పేక్ జరతుష్ట్రా’).

‘మేం భగవంతుని వితంతువులం’ అన్నారు శ్రీశ్రీయేయులు.

అంతకు ముందు దేవుడు మొగుడుగా వుండే వాడు కాబట్టి, ఆయన చనిపోయి ‘మనం’ వితంతువులమయ్యాం.

అంతటితో ఆగలేదు ‘అకేంద్రక’ పరిణామాలు.

అమూర్త మానవుడు (ఒకే అందరి వాడు) కేంద్రాన్ని నడిపించలేకపోయాడు.

మానవుడు ‘యేక్ నహీ, అనేక్ హై’ అని ప్రాక్టికల్ గా తెలిసొచ్చింది.

మానవుడు లేడు, మానవులున్నారు.

భిన్న అస్తిత్వాల వల్ల విభజితులైన చాల మంది మానవులున్నారు. మానవులెందరో అన్ని కేంద్రాలు.

రాజ్యానికొక్క రాజు కాదు. వూరికొక్క రాజు. గల్లీకొక్క రాజు. కులానికొక్క రాజు. వుప కులానికొక్క రాజు.

అధికార కాంక్ష ప్రజాస్వామ్యీకరించబడింది.

అధికారం కోసం యేమైనా చేయగలవాడు… దానికి తగినంత నిస్సిగ్గు, నిస్సందేహం వున్న ప్రతి వొక్కడూ యివాళ పాలకుడే.

కీట్స్ ఆవేదన పడినట్లు మునుపటి ‘అమాయకత్వపు వుత్సవం’ పోటెత్తిన ‘రక్త శ్యామల సముద్రం’లో ముంచెత్తబడింది.

ఇప్పుడు అమాయకత్వమంటే పాలించబడడం. అమాయకత్వాన్ని వొదిలేసినోడే పాలిస్తాడు. నిచ్చెన మెట్లలోని ఏదో ఒక మెట్టును తన సింహాసనం చేసుకుంటాడు.

అదే యిటీవలి చరిత్ర.. అదే మన సమీప గతం. యిందులో నెగటివ్, పాజిటివ్ మీమాంస యేమీ లేదు. యేమి వున్నదో అదే వున్నది.

అయితే, అది కూడా వర్తమానం కాదు, అది కూడా చరిత్రే పొమ్మంటున్నారు… పసుప్పచ్చ కోట్లతో విజిబిలిటీ పెంచుకున్న ‘అనార్కిస్టు’లు. కులానికొక్క రాజును, గల్లీకొక్క

‘రాజు’ను కూడా పో పోవోయ్ అంటున్నారు. యే రూపంలోనూ రాజు వొద్దంటున్నారు.

అనార్కిస్టులు అనగా యెలాంటి కేంద్రం లేని వారు. లెఫ్టిస్టు, రైటిస్టు, సెంట్రిస్టు నిర్వచనాల్లో దేనికీ కట్టుబడని వారు. వాళ్లు వొకే సారి వ్యక్తులూ, సమూహాలున్నూ.

ఒక పక్క టియర్ గ్యాస్ కు, వాటర్ క్యానన్లకు రొమ్ములొడ్డి సాగుతూనే… ఎవడేనా తమకు నాయకత్వం వహిస్తాడేమో, అలా జరగనివ్వగూడదని అప్రమత్తంగా వున్నారు వాళ్లు.

బహుశా, అదే, మునుపు 1968 లో, యిప్పుడు యెల్లో వెయిస్ట్స్ తిరుగుబాటులో వుమ్మడి గుణం.

గుర్తుందా? నేడు నక్సల్బరి అని ముద్దుగా వ్యవహరించే వుద్యమం పునాదిరాళ్లలో వొకటైన 1968 విద్యార్థి వుద్యమంలో ‘నాయకత్వ వైముఖ్యం’ ఒక కీలకాంశం. ఆనాడు కాస్త ముందు వరుసలో నిలబడిన కాన్ బాందీ వంటి వాళ్లవి వొకటి రెండు పేర్లు వినిపించినా; 1968 వుద్యమం ఏ నాయకత్వాన్నీ అంగీకరించలేదు. కాన్ బాందీ తన నాయకత్వ పాత్రను తానే తిరస్కరించాడు.

ఆలాంటి అనాయక, అరాచక చేతనత్వాన్నే నేడు పసుప్పచ్చ కోట్లు తమ జెండాగా ఎగరేయడం బహుశా కాకతాళీయం కాదు.

బైది బై అరాచకమని కాస్త మనం దూషణాత్మకంగా అంటామే అది ‘అనాయకం’ కాకపోతే మరేమిటి? ఎందుకు మనకు ‘రాచకం’? ఎందుకు ఏదో వొక రూపంలో రాజు? వాడిని వొదిలించుకోలేమా? నాయకులుగా, అనుచరులుగా కాకుండా మనుషులం వుండలేమా?

ఉండగలం గాని, అలా వుంటే మనకు ‘రాజు’లిచ్చే పదవులుండవు. అవార్డులుండవు, రాజాస్థానాల్ని తలపించే సన్మానాలుండవు. రాజకీయ పార్టీల అండదండలుండవు.

ఒక్క మాటలో సృజనాత్మకతకు సృజనేతరమైన దొడ్డి దారులుండవు.

అప్పుడు, పాపం సృజనాత్మకత, ఏ దాపు, ప్రాపు లేకుండా నడి వీధిలో తనను తాను నిరూపించుకోవాలి.

కాని, అదే సరి దారి.

సృజన రాజాశ్రయ (రాజకీయాశ్రయ) పంకిలమైనంత కాలం మనిషి తన భవిష్యత్తును తాను యెలా తయారు చేసుకుంటాడు? అన్ని సంకెళ్లు వొదిలించుకుని విముక్తుడెలా అవుతాడు?

అందుకే అనార్కిజానికి యివాళ దొరుకుతున్న కరెన్సీ తప్పని సరిగా వొక ముందడుగు.

‘అనార్కీ అనార్కీ నువ్వే నేటికి
భూగోళం నుదుటికి నప్పిన తిలకానివి’

25-1-2019

హెచ్చార్కె

10 comments

 • స్పాంటేనియేటిని ఆరాధించటం కొత్త్త లక్షణం కాదు. కానీ ఈ ప్రాప్తకాలజ్ఞత (స్పాట్నిఏటీ)
  ఆవిరి వంటిది (ఆవిరి యాంతరాల కలం నుండి వచ్చిన ప్రతీక ) నిర్మాణం ఉంటేనే ఆవిరి వాహనాన్ని ముందుకు నడుపుతుంది. ఆ నిర్మాణం లేకపోతే ఎంత ఆవిరి ఐన పిస్టిన్, సిలిండర్ లేని ఇంధన ప్రేలుడు మాత్రమే. ఫ్రాన్సులో ఉన్న ఉద్యమం కూడా ప్రాధికా రూపాలలో నిర్మాణాలు “స్పాంటేనియస్” గా నిర్మించుకుంటున్న దాఖలాలు ఉన్నాయ్ (అసెంబ్లీ రూపంలో ) .

  స్టాలినిసెడ్ నిర్మాణాలు వాటి అనుచరులు మావోయిస్టు నిర్మాణాలు ఇప్పుడు పూర్తిగా తమ దివావులకోరు తనం ప్రదర్శించాయి ( క్లోజర్ హోమ్ ఏమి జరిగింది మనకు తెలుసు ). ఇప్పుడు అవసరం ఉద్వేగం కాదు ఫిలోసఫీర్,హిస్టోరియాన్, సోషల్ సైంటిస్టులు ద్రుష్టి కార్యకర్తల కమిటీట్మెంట్. శాస్త్రీయ విప్లవ సిద్ధాంతం అంటే ప్రాధమికంగా (మార్క్సిజం అనే లేబిల్ నాకు నచ్చదు ) పద్ధతి ; ఆలోచన, ఆచరణలను ఐక్యం చేసే పద్ధతి (ప్రాక్సిస్ ) . ఎలాంటి నిర్మాణాలు అవసరం అనే చర్చ కావాలి కానీ స్పాంటేనియేటిని ఒక ఫెటిష్ గా మార్చే ధోరణి కాదు .

  స్టాలినిస్ట్, మావోయిస్టు పార్టీలు ఒక ఆక్సిఓం లేక డాగ్మాగా మార్చిన సూత్రీకరణలను ఎండగట్టాలి , వాటి చరిత్రను అధ్యయనంన౦ చెయ్యాలి. బ్యాక్ తో బేసిక్స్.

 • డియర్ నరేంద్ర మోహన్, మీ వ్యాఖ్య చాల బాగుంది.కృతజ్ఞతలు. స్పాంటేనిటీ ఆరాధన, నిర్మాణం ఆరాధన యేదయినా ఆరాధనగా రూపం చేరాక జరిగేది నష్టమే. నిర్మాణం, ఆరాధన కలిసి వుంటాయి. విడిగా వుండవు. నిర్మాణాల మీది ఆరాధన కలిగించే వెగటుకు బ్యాక్ లాష్ గా ముందుకు వచ్చినదే ‘స్పాంటెనిటీ. భావన. ఈ మొగ్గు ఆరాధనగా (నిర్మాణంగా) మారకుండా చూసుకోడం తప్పక అవసరమే. ఎడిట్ లో అలాంటి ఆరాధన మీకు కనిపించలేదనుకుంటాను.

 • కేంద్రక బలం లేని పెరిఫెరల్ విన్యాసాన్ని చైతన్య పరచాల్సిన అవసరాన్ని గురించిన సంపాదకీయం. సాహిత్యాన్నీ రాజకీయాన్నీ సమ్మిళితం చేసిన సబ్జక్టు. అంత సులువుగా లేదు. రెండు మూడు రెఫరెన్స్ పుస్తకాలు ముందేసుకుని అర్ధం చేసుకోవల్సిన బాకీ ఉంది.

  కేంద్రం లేదనడం, ఒక రాజు మాత్రమే ఉండలేని ఆశా కాస్తంత పదునైన కొత్త ఊహ. మీ వాక్యాలు చాలా బాగున్నాయి. థ్యాంక్యూ సర్

 • థాంక్సెలాట్ శ్రీరామ్. ఇప్పుడు నాకూ అలాగే అనిపిస్తోంది. ‘కేంద్ర’కత్వం లేని జీవితాలు ఎప్పుడో మొదలయ్యాయి. ఆ భావన మనకు సరిగ్గా బట్వాడా కాలేదన్నది నిజమే. బహుశా, అందువల్ల ఈ ఎడిట్ మనాళ్ళకు సరిగ్గా చేర్లేదేమో. 🙁

 • As in 1968, may be this is a prelude to the ensuing organised movements globally!

  మళ్ళి విప్లవాల అక్టోబరొస్తుంది!
  తూర్పు గాలి గ్లోబు చుట్టేసి వస్తుంది!!

  మార్క్సిజం అజేయమ్మూ … కామ్రేడా!
  కమ్యూ నిజం తప్పదూ …. కామ్రేడా!!!

  – రాప్ర “కమ్యూనిజం అజేయం” (1990 జనవరి 10) పాట ముగింపు.

  • థాంక్యూ రాఘవేంద్ర ప్రసాద్! మీరన్నట్లు జరిగితే బావుంటుంది. దానికి మనసారా ఆహ్వానం. సరిగ్గా అలాగే జరక్కపోయినా, ప్రజా విజృంభణ ఆగదు, ఆగకూడదు. సమస్యలు తీరే వరకు సమస్యల మీద పోరు తప్పదు. మార్క్సిజం అత్యుత్త్రమ కరదీపిక. గ్రేట్ గైడ్ లైన్ టు యాక్షన్. ప్రజలు అజేయులనడం నిస్సందేహం.

 • పరిణామాలు, పర్యవసానాలని మనుషులుగా విభజించబడిన విషయసంగ్రాహణే సమూహాలని అనేకరకాలుగా కేంద్రీకృతం చేసింది.
  విషయం విస్తృతమయినపుడు, సులభంగా అందుబాటులో ఉన్నపుడు కాలక్రమేణా మనుషుల విషయం సంగ్రాహం ఆధారితంగా నిర్మించబడిన వ్యవస్థల ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నది.
  విషయం అనేది, పవర్ కావచ్చు, నాయకత్వం కావచ్చు, కృత్రిమంగా నిర్మించుకున్న స్థాయి కావచ్చు, ఒక విలువని పెంచే ఏ సంగ్రాహకమయినా కావచ్చు.

  ఎట్లా, ఎందుకు, ఎప్పుడు, దేనికి కోసం చేయాలి అనే చేయబడే క్రియల ఆధారితంగా వందల వేల సంవత్సరాలుగా బీటాలు ఆల్ఫా ల కింద కృతకృత్యులై ఉన్నారు . ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. మనతో సీదాగా “అవసరం” అనే సందర్భం లేకుండా లోకంలో ఏ మూల నుండో మార్గదర్శకత్వం, దిశానిర్దేశికత్వం జరగబడుతున్నది. భాషలో ఉన్న అంతరాలు కూడా కుదించుక పోతున్నాయి.

  తెలిసిన ప్రపంచపు తీరుతెన్నులన్నీ ఎక్కువ, తక్కువలుగా చూసిన పరిస్థితులు మారిపోయి, అడ్డం, నిలువు లాంటి హేతుబద్ధమయిన గ్రిడ్ వ్యవస్థలు మెదళ్లలో నాటుకుపోతున్నాయి. ఎగువ దిగువ వ్యవస్థల్లో నచ్చకుంటే నోరు మూసుకుంటే ఇంటికీ, ఒంటికీ మంచిదనే అభిప్రాయం. తోడున్న సమూహాల ఆధారితంగా శక్తిని కేంద్రీకృతం చేయాల్సిన నిస్సహాయత. ఆధునిక యుగంలో ఎగువ, దిగువతో పాటు, అడ్డంగా పోయే సదుపాయం. కేంద్ర బిందువులు విషయం ద్వారా కేంద్రీకృతమై ఉన్న అచంచలిత అంశాలు కాదిప్పుడు, కొంచెం పక్కన చూస్తే కొత్త పార్శ్వాలు కనిపించే సౌలభ్యం ఉన్న విస్తృత సమాచార స్రవంతి.

  మనిషిని విభజించే ఒక్కొక్క అంశం మనిషిని దాటి విషయం వైపుగా పోయే కనిపించని కొత్త విప్లవం.

  దీన్ని అనార్కీగా అభివర్ణించలేను. చైతన్యం అనార్కీ కన్నా గొప్పది. పది పన్నెండేళ్ల క్రితం అనార్కిస్టుగా నన్ను నేను అభివర్ణించుకున్న. “మార్పుకు తగ్గట్టుగా పరిణామం చెందగలిగే శక్తే విజ్ఞత” గా స్టీఫెన్ హాకింగ్ అభివర్ణిస్తాడు. ఒక లేబుల్ తగిలించుకోవడమంటే మార్పు కనబడే దారులని మూసుకోవడమే అని నమ్ముతాను.

  • థాంక్స్ ఎ లాట్, అల్లం కృష్ణ చైతన్య గారు! నాకు అర్థమైనంత వరకు, అనార్కీ ఒక లేబుల్ కాదు. అది ఒక పరిస్టితి. ఒక హ్యూమన్ కండిషన్. ఏ లేబుల్ లేకపోవడం అనే కండిషన్.

   మీరు ముక్తాయించినట్లు…

   ‘ఒక లేబుల్ తగిలించుకోవడమంటే మార్పు కనబడే దారులని మూసుకోవడమే’

   కాకపోతే, నా మట్టుకు నేను ఏదైనా లేబుల్ వుంచుకునే వారితో కలిసి నడవడానికి ఏమాత్రం సందేహించను. ఈ క్షణంలో వాళ్లు చేస్తున్నది ప్రజా సమస్యల పరిష్కారంలో భాగమా కాదా అన్నదే నాకు గీటురాయి, కలవడానికి కలవకపోవడానికి; వారి షర్టు జేబుకు కు వ్రేలాడే లేబుల్ కాదు. 🙂

 • ‘ఒక్క మాటలో సృజనాత్మకతకు సృజనేతరమైన దొడ్డి దారులుండవు.’ ఇటువంటి వాక్యాల కోసమే మీ రచనలు చదవాలనిపిస్తుంది. అవును. There are no short cuts to creativity as it is synonym to success of your choice. ఒక మార్పుకు నాంది పలికే స్థాయిలో మీరు పత్రికను తీర్చిదిద్దుతున్నారు. మీ భావాలను, అనుభవాలను నేటి తరానికి అద్భుతంగా అందిస్తున్నారు. రస్తా రచనలు చదివే ఒక కమ్యూనిటీని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫేస్ బుక్ లో ఒక పుట ప్రారంభించి like minded చదువరులను ఒక చోట చేర్చాలి. వారు జనంలోకి పత్రికను అనివార్యంగా తీసుకెళతారు. ‘అనార్కీ ‘ అంటే అరాచకత్వం విశ్వవ్యాప్తం; అది లేని భూమి లేదు అని మీరు చెప్పింది అక్షర సత్యం. ఇటువంటి మేధోపరమైన, అనివార్యంగా జీవితాలను ప్రభావితం చేసే అంశాలను, మామూలు మానావుడికి అందుబాటులో లేని జ్ఞానాన్ని మరింత సరళమైన భాషలో రాస్తే బాగుంటుందని నా భావన. దశాబ్దాలుగా చిత్తశుద్ధితో అక్షర వ్యవసాయం చేస్తున్న మీకు చెప్పేంత వాణ్ణి కాదు. అందరూ అనివార్యంగా ‘కొని’ ప్రేమతో చదువుకునే పుస్తకాలెన్నో రాశారు మీరు. నేటి యువతరానికి చేరేలా, మీ వ్యక్తీకరణ మరింత సరళంగా ఉంటే, చదువరులు మరింత పెరుగుతారు. ప్రతి అక్షరం, వాక్యం అది పుట్టిన లక్ష్యాన్ని చేరేలా ఉండాలి. అసలే పఠనాసక్తి దాదాపుగా తగ్గిపోయిన ఈ రోజుల్లో, మేధావుల కోసం మేధావులే రాసుకుని, వాళ్ళే విమర్శించుకుని, వాళ్ళల్లో వాళ్ళే పురస్కారాలిచ్చుకుని, వీలైతే పదవులు పుచ్చుకుని, మాయమైపోతున్నారు. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఇంతకు ముందెప్పుడూ వరసగా తెలుగు వాళ్ళకు కేంద్ర సాహిత్య పురస్కారాలు లభించిన దాఖలాలు లేవు. బహుశా ఇప్పుడు సామాజిక మాధ్యమాల వినియోగ విస్తృతి పెరగడం వలన మనకు పురస్కార వార్తలు తక్షణం తెలుస్తున్నాయేమో! తెలుగు బలం అకాడెమీ పురస్కారాల దృష్ట్యా పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ కొంచెం ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. నా బాధంతా ఏమిటంటే ‘ఎవరి గురించైతే మనం రాస్తున్నామో వారికి మన అక్షరాలు చేరకపోవడం దురదృష్టం ‘! రాసే రాతలు కేవలం పురస్కార దృష్టితో ఉంటే ఆ రాతలు వ్యర్ధం! Carry on with your mission Sir! We are with you!

  • రామఫణి గారు, చాల థాంక్స్. కీలకాంశం పట్టుకున్నారు. మీ వ్యాఖ్య లోని మొదటి వాక్యం కోసమే ఇదంతా రాశాను. మీరు సూచించినట్లు, మన వాళ్ళందరికి చేరడం అనే ధ్యేయంతోనే రాస్తాను. కలిసి నడుద్దాం ఈ రస్తా లో.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.