ఆలోచనాత్మక నాయకత్వం

‘నాయకత్వమంటే నియంత్రణ కాదు; పెత్తనం చేయడం నాయకత్వం కాదు; నాయకత్వమంటే నాయకత్వమే. నలుగురిని నడిపించే నాయకుడివి కావాలంటే నీకున్న సమయంలో 50 శాతాన్ని నీ లక్ష్యం కోసం, నీ విలువలకోసం, నీవు పాటించే నీతి నియమాల కోసం, స్ఫూర్తి కోసం, నడవడి కోసం వినియోగించు. 20 శాతం సమయాన్ని నీ మీద అధికారం ఉన్నవారి కోసం వినియోగించు. 15 శాతం సమయాన్ని నీ సహ ఉద్యోగుల కోసం వినియోగించు. పని చేస్తూ కూడా ఎప్పటికప్పుడు అపార్ధాలకు గురయ్యే నీ సహోద్యోగులకోసం పని చేయాలని నీకు తెలియకపోతే, నీకు నిరంకుశత్వం మాత్రమే తెలుసు గాని, నీకు నాయకత్వమంటే ఏమీ తెలియనట్టే!.’
-డీ హాక్, వ్యవస్థాపకుడు, CEO ఎమెరిటస్, వీసా ఇంటర్నేషనల్
నియంత్రించడం నాయకత్వం కాదు. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండటమే నాయకత్వం. నిరంతర అధ్యయనాసక్తే నాయకత్వం. ఒక సంఘటనను సమర్ధతతో అధ్యయనం చేసి, విస్తృత స్థాయిలో ప్రతిస్పందించే ప్రవర్తనలను విశ్లేషించడమే నాయకత్వం. సరైన నాయకత్వ ప్రవర్తన ఎప్పుడూ ఒక బృందాన్ని నడిపే వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనాలు వ్యవస్థాగత ప్రయోజనాలకు వ్యతిరేకం కావు. రెండూ సమానార్ధకాలే. సరైన పనులు చేయడం, సరిగ్గా పనులు చేయడం – ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సమర్థ నాయకత్వమెప్పుడూ భాగస్వామ్యంతో ఎంతో విలువను సృష్టిస్తుంది. పరస్పర లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. బహిరంగ సమాచార వితరణ, పరస్పర ప్రయోజనం చేకూర్చే సమాచార విధానాలు, సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఎదుర్కోవడం, బృంద నిర్మాణం, విశ్వసనీయత – ఇవే సమర్ధ నాయకత్వ లక్షణాలు. భారతీయ క్షిపణి సృష్టికర్త, మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఆలోచనాత్మక నాయకులలో అగ్రగణ్యులు. తన ఆలోచనలతో ఆయన యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఆలోచనలకు, ఆచరణకు మధ్య అంతరాన్ని చెరిపేసి, ఆరచణలో తన ఆంతర్యాన్ని, అంతరంగాన్ని ప్రతిఫలించి ప్రపంచ దేశాల ఆలోచనా ధోరణిని ప్రభావితం చేశారు. ఇటువంటి వారినే ‘ఆలోచనాత్మక నాయకులు’ (Thought Leaders) అంటారు. ఆయన ఏనాడూ ‘నియంత్రణ’ ను నాయకత్వ లక్షణమనుకోలేదు. 1984-1989 ప్రాంతాల్లో అబ్దుల్ కలాం డి.ఆర్.డి.ఎల్. సంచాలకులుగా ఉండగా నేను (ఈ వ్యాస రచయిత) ఎల్. డి. సి. గా పని చేశాను. ఆయన ఉపన్యాసాలు విని, ఆ స్ఫూర్తితోనే చివరకు వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా స్థిరపడ్డాను. ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చి, దేశ విస్తృత ప్రయోజనాలకోసం ఉద్యోగుల ప్రతిభను వినియోగించుకోవాలని, అనుక్షణం తపించేవారు. ఉద్యోగులను నియంత్రించాలన్న మాట ఆయన నిఘంటువులోనే లేదు. అందుకే ఆయన సాధారణ ప్రభుత్వోద్యోగి అయినా రాష్ట్రపతి అయ్యారు. ప్రపంచ దేశాలకు ప్రేరణనిచ్చారు. ప్రభుత్వోద్యోగి అయినా ‘భారతరత్న’ కావచ్చని నిరూపించారు.
వ్యవస్థలు, సమాజం నిస్పృహతో ఉన్న ఈ రోజుల్లో సేవక నాయకత్వ (Servant Leadership) అవసరం ఎంతైనా ఉంది. మూర్తీభవించిన సేవక నాయకత్వానికి ఉదాహరణ మదర్ తెరెసా. ‘The otherside of Leadership’ అనే పుస్తకంలో యూజీన్ బి. హాబెకర్ ఇలా అంటాడు. ‘నిజమైన నాయకుడు సేవ చేస్తాడు. ప్రజలకు సేవ చేస్తాడు. వారి ప్రయోజనాలను పరిరక్షిస్తాడు. అలా చేయడం వలన అతనేమీ ప్రసిద్ధుడు కాలేడు. కనీసం ప్రజల మెప్పు కూడా పొందలేడు. నిజమైన నాయకులు విశ్వజనీన ప్రేమ తత్వంతో ప్రేరణ పొందడం వలన, వ్యక్తిగత పేరు ప్రతిష్టలకు అంత ప్రాదాన్యతనివ్వరు. దానికి తగిన మూల్యం చెల్లించడానికి సిద్ధపడతారు’. అంటే నిజమైన నాయకులు త్యాగమూర్తులై ఉంటారని అర్ధం. మదర్ తెరెసా త్యాగనిరతి మనందరికీ తెలిసిందే. అబ్దుల్ కలాం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన విషయం మనందరికీ తెలుసు. పైగా ఆ విషయాన్ని ఆయనతో ఒక విలేఖరి ప్రస్తావించినపుడు ఎంతో తేలికగా ‘నేను నా పరిశోధనల్లో పడిపోయి పెళ్లి విషయమే మరిచిపోయాను’ అంటారు.
ఆలోచనాత్మక నాయకుల మరో లక్షణం నిరంతర అధ్యయన శీలత. నేర్చుకునే తత్వం లేకుండా నాయకత్వం వహించడం కష్టమవుతుంది. అటువంటి నాయకత్వం విఫలమవుతుంది. నిరంతరం నూతన విషయాలు నేర్చుకునే అలవాటు లేకుండా ప్రజలను ముందుండి నడిపించడం దుర్లభం. ‘నాయకత్వం, నేర్చుకునే తత్త్వం పరస్పరం విడదీయలేని అంశాలు’ అని జాన్ ఎఫ్.కెనెడి అంటారు. మంచి ఆలోచనాత్మక నాయకులు కావడానికి మానవ ప్రవర్తనను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. అంతే కాకుండా పని చేసే ప్రదేశంలోని సంక్లిష్టతను అర్ధం చేసుకోవడానికి, మనం ఎంచుకున్న రంగంలో ప్రముఖ నాయకుల నాయకత్వ లక్షణాలను అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం.
ఫలితాలు సాధించగల నేర్పుతో తన బృందానికి శిక్షణ నిచ్చే నాయకుడు తన దార్శనికతను (Vision) వారికి విస్పష్టంగా తెలియచేయాలి. దూరదృష్టి లేని నాయకుడు సంస్థలను నడిపించలేడు. బలహీన నాయకత్వం వలన ఉద్యోగులు కంపెనీని వదలి వెళ్ళిపోతారు. దీనివలన చివరికి సంస్థను మూసివేసే అగత్యం కూడా కలగవచ్చు. బలహీన నాయకత్వం వల్లనే సత్యం కంప్యూటర్స్ వంటి ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. ‘దార్శనికత’ను (Vision) వాస్తవికత (Reality) లోకి తీసుకురావడమే సమర్ధ నాయకత్వం’ అంటారు వారెన్ బెన్నిస్. తమ దూరదృష్టిని, దార్శనికతను వాస్తవికతలోకి తీసుకువచ్చి అది తమ మాతృభూమి భారత దేశానికి ప్రయోజనాలు చేకూర్చేలా చేసిన మహానుభావులు మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో భారత దేశ భావి ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఇటువంటి ఆలోచనాత్మక నాయకుల వల్లనే నేటి సుస్థిర పాలనకు పునాది పడింది.
ఆలోచనాత్మక నాయకుడు ఫలితాల గురించి ఆలోచించాలి. ఎంతో కృషి చేశామన్న దృష్టితో సంతృప్తి పడకూడదు. తన చుట్టూ ఉన్నవారు అనంగీకారాన్ని సైతం తెలియచేసే వాతావరణాన్ని సృష్టించాలి. తిరస్కారంలో ఉన్న విలువను కూడా నాయకుడు గ్రహించగలిగి ఉండాలి. తనతో పాటు పని చేసేవారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. విశ్వసనీయతను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించాలి. నాయకుడు మంచి ఉపాధ్యాయుడిలాంటి వాడు. బోధించే సామర్ధ్యం కలిగిన నాయకుడు ఏ సంస్థకైనా పేరు తీసుకొస్తాడు. భారత దేశ తొలి ఉప రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడే కాక ఆలోచనాత్మక నాయకుడు కూడా! ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా భారతదేశమంతటా జరుపుకుంటారు. జాన్ గార్డనర్ ఇలా అంటారు. ‘బోధన, నాయకత్వం వహించడం – ఇవి రెండు అత్యుత్తమమైన, అత్యున్నతమైన వృత్తులు. ప్రతి గొప్ప నాయకుడు చక్కని ఉపాధ్యాయుడై ఉంటాడు. ప్రతి గొప్ప ఉపాధ్యాయుడు గొప్ప నాయకుడై ఉంటాడు.’
ఆదర్శవంతమైన ఆలోచనలతో కూడిన ఆచరణాత్మక నాయకులుగా (Action Leaders) ఎదగడానికి నేటి యువత నిరంతర కృషి చేయాలి. అనేక సంక్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న నేటి భారత దేశానికి ఆలోచనతో కూడిన ఆచరణాత్మక నాయకులే శ్రీరామ రక్ష.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

 • మేధావి —

  అందరూ రాష్ట్రపతులు లాగానే వారి టర్మ్ పూర్తి అయింది –మార్పు కనిపించింది ఎక్కడ ??

  ఇక వారు సాయిబాబా ను కలువడం ?????

  యి రోజు ల్లో ప్రతి వెధవ నాయకుడే –ప్లస్ వారసత్వం ???

  నిజమయిన నాయకుడు ( j.p.. జి –లాల్ జి –న౦దా జి — లోహియా జి — సుందరయ్య గారు )

  దేశం లో కరువు అయి పోయారు —– మల్లి పుట్టాల్సిందే

  ================== బుచ్చిరెడ్డి గంగుల

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.