ఒక నిజాలు..

నిఝo…
నిజంగా నిఝo…
ఒకరోజు కాదు, ప్రతిరోజూ అమ్మ అదే చెప్తుంది. చెప్పిందే చెప్తుంది.
‘నువ్వే తిను..’ అంటుంది.
అలాగేనని తలూపుతానా?
‘ఎవరికీ పెట్టకు.. నువ్వే తిను..’ మళ్ళీ అంటుంది.
నేను మళ్ళీ తలూపుతాను.
‘వాళ్ళకీ వీళ్ళకీ పంచకు..’ అర్థమయ్యిందా అన్నట్టు ఈసారి అమ్మ తలూపుతుంది.
నేనూ ఎప్పట్లాగే తలని అడ్డంగానూ.. నిలువుగానూ.. గుండ్రంగానూ.. ఊపుతాను.
‘తలూపడం కాదు, చెప్పింది బుర్రకెక్కించుకో..’ అంటుంది అమ్మ.
‘ఊ.. చింటూగాడడిగితే..?’ నేనడక్కముందే-
‘నువ్వు యివ్వకు’ అమ్మ కొంచెం కోపంగా చెప్తుంది.
‘వాడిస్తే?’-
‘నువ్వు యివ్వకు.. వాడే రెండ్రోజులు చూసి.. వాడిది వాడు తింటాడు. నీది నువ్వు తింటావు’ అమ్మ చెప్తూనే- పది గంటల ఇంటర్వెల్ కు ఓ స్నాక్స్ బాక్సూ- మధ్యాన్నానికి లంచ్ బాక్సూ- ఈవినింగ్ స్టడీ అవర్స్ కు ముందు టిఫిన్ బాక్సూ- వాటర్ బాటిలూ- అన్నీ నా బేగులో పెట్టింది.
‘ఈ బాక్సులన్నీ మొయ్యడానికైనా నువ్వీ బాక్సులన్నీ వదలకుండా తినాలిరా..’ మావయ్య స్కూలుకు దిగబెట్టడానికి రెడీగా వుండి నవ్వుతూ అంటాడు.
‘జాంగ్రీ నీకిష్టమని పెట్టాను’ అమ్మ చెప్పింది.
‘జాంగ్రీ సిద్దూకీ యిష్టమే..’ చెప్పానో లేదో-
‘కొంపదీసి వాడికిచ్చేస్తావా యేమి?’ అమ్మ గుండాగిపోయినట్టు చూస్తుంది.
‘నీకిష్టమని కడితే.. యెవరికో యిష్టమంటావు..’ అర్థంకానట్టు చూస్తుంది అమ్మమ్మ.
‘వీడికి యెలా చెపితే అర్థమవుతుందో’నని బాధ పడుతుంది అమ్మ.
‘ఓ పని చెయ్యి’ అని అమ్మమ్మ నా ముఖమ్మీదికి వంగి ‘కిటుకు’ చెప్పింది.
‘నీకు కట్టినవన్నీ ముందే.. ఏంటి.. బాక్సు విప్పగానే నాలుకతో చప్పరించి పెట్టేయ్.. యింక యెవడూ యెంగిలి తినడు.. అడగడు.. అర్థమయ్యిందా?’ అమ్మమ్మ.
నేను తలూపలేదు.
‘చెప్పింది చెవికెక్కిందా?’ అంది అమ్మ.
నేనలానే చూస్తే-
‘ఏంటిరా మాట్లాడవ్?’ అంది అమ్మ.
‘చెప్పినమాట వింటే యెప్పుడో బాగుపడేవాడు..’ నిట్టూర్చింది అమ్మమ్మ.
‘మాట్లాడవేరా?’ అమ్మ నన్ను కుదిపేసింది.
‘బంటిగాడు ముందే యెంగిలి చేసేస్తాడు’ చెప్పాను.
‘చూసావా.. చూసావా?’ అంది అమ్మమ్మ.
‘చూసయినా నేర్చుకో’ అంది అమ్మ.
‘బంటిగాడు నా బాక్సులోవి తీసి యెంగిలి చేసేస్తాడు..’ అన్నాను.
‘అదేం బుద్దిరా?’ మావయ్య అడిగాడు, ఆశ్చర్యంగా చూసాడు.
‘అప్పుడెప్పుడో- వాడొచ్చినప్పుడు- అమ్మమ్మే ఈ కిటుకు చెప్పింది కదా?, నేను రెండ్రోజులు యెంగిలి చేస్తే- వాడూ అదే పని చేసాడు- నాకన్నా ముందు..’ జరిగిందే చెప్పాను.
అమ్మా అమ్మమ్మా మావయ్యా ముఖాముఖాలు చూసుకున్నారు.
‘పిల్లలు కాదు, పిశాచాలు..’ అని తిట్టింది అమ్మమ్మ.
ఏమ్మాట్లాడాలో తెలీనట్టు వూరుకుండిపోయింది అమ్మ.
‘ఎన్ని సదుపాయాలు చేసినా యిలాగైతే యింతే..’ యేమీ చెయ్యలేమన్నట్టు చేతులెత్తేసింది అమ్మమ్మ.
‘స్కూలుకు టైం అయిపోయింది’ మావయ్య గుర్తు చేసాడు. బయల్దేరాం. వెళ్ళాం. బెల్లయింది.
ఎందుకో స్నాక్స్ ఒకరికొకరం ఎక్సుచేంజ్ చేసుకుంటే బాగుంటుంది. రాజుగాడు రోజూ జంతికలే తెస్తాడు. వాళ్ళ నాయినమ్మ రెండు డబ్బాల జంతికలు చేసిందట. అవి అయ్యేవరకు వాడికవే స్నాక్స్. సిద్ధూగాడు రోజూ క్యారెట్ ముక్కలూ దోసకాయ ముక్కలే తెస్తాడు. వాళ్ళమ్మకు ఆరోగ్యమ్మీద శ్రద్ధ యెక్కువ. పొద్దున్నే వాడికి పచ్చి కూరగాయల జ్యూస్ తాగిస్తుందట. బంటిగాడయితే రోజూ బిస్కెట్లే తెస్తాడు. తెచ్చి ‘ఒరే.. ఈ కుక్క బిస్కెట్లు ఎవడిక్కావాలిరా?’ అని అరిచి అడిగి అందరికీ యిస్తాడు. ఇచ్చి తిన్నవాళ్ళని ‘కుక్కబిస్కెట్లు బాగున్నాయా?’ అని అడుగుతాడు. ‘కుక్కలాగే నీకు బోలెడు విశ్వాసం వస్తుందిరా’ అని నవ్వుతాడు. మరి నేనో? వారమంతా ఒకటే. బేకరీ ఐటమ్స్. నాన్న తెచ్చేది అదేగా?
అందుకని అందరం ఎక్సుచేంజ్ చేసుకుంటాం. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటాం. సిద్ధూగాడు కేరట్లు వదలకుండా తింటాడు. వాళ్ళమ్మ ఒట్టు వేయించుకుంది మరి. పాపం కోపంతో కసాబిసా నములుతాడు.
ఎవరం ఏం తిన్నా ఇంటర్వెల్లో ఆయా పట్టించుకోదు.
లంచ్ టైంలో మాత్రం ఆయా కేకలు వేస్తుంది. ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేస్తానంటుంది. ‘ఎవరిది వాళ్ళే తినండి..’ అని అరుస్తుంది. ‘మీ అమ్మా బాబులు మామీద కంప్లైంట్లు చేస్తున్నారు’ అనీ అంటుంది.
మేము ఆయా చూడకుండా చూసి పంచుకుంటాం.
నవ్వుకుంటాం.
అన్నట్టు మాకు జలుబో దగ్గో వస్తుంది కదా?!, అమ్మ వెంటనే అంటుంది.. ‘ఎవరికి నీ వాటర్ బాటిల్ యిచ్చావ్?’ అని.
నేను లేదంటాను.
‘లేదు.. లేదు.. నువ్వు యెవరికో యేదో యిచ్చావ్.. యెవరిచ్చింది యేదో తిన్నావ్.. అందుకే ఆ జబ్బులన్నీ నీకొస్తున్నాయ్..’ అని ఆగక నాన్నకి చెప్తుంది. ‘రేపు వీడికి జ్వరంతో బాటు యే టీబీయో వస్తుంది..’ అని కూడా భయపెడుతుంది.
మంచినీళ్ళు కూడా యెవరికీ యివ్వనని ప్రామిస్ చెయ్యమంటుంది అమ్మ.
నే చెయ్యకపోతే ‘చూసారా.. చూసారా..’ అని గగ్గోలు చేస్తుంది.
అమ్మకి ఒట్టేసాను.
అడిగిన వాళ్ళకి నీళ్ళిచ్చాను.
బంటిగాడు చికెన్ కూర, చపాతి తెచ్చుకుంటే, లంచ్ బెల్లు కాకుండానే ఆఖరి పిరియడ్లో తినేస్తాడు. ఆగలేడు. పైగా ఆకలి వేసిందంటాడు. వాళ్ళమ్మ చెప్పిందంటాడు. తర్వాత చెప్పాడు. వాళ్ళమ్మ కూడా యెవరికీ యివ్వొద్దని ఒట్టు వేయించుకుందట. అందుకే అలా చేసాడట. సారీ కూడా చెప్పాడు.
అదే విషయం అమ్మకి చెప్తే- తలమీద వొక్కటి మొట్టి మరీ- ‘చూసి నేర్చుకో’ అంది. నాన్న కూడా నన్ను ‘బ్రెయిన్ లెస్ ఫెలో’ అనేసారు. ‘జడ్డెదవ’ అని నాయనమ్మ తిట్టేసింది. బుర్రలేదని మావయ్య కూడా అనేసాడు.
అందరి చేతా చీవాట్లూ తిట్లూ తిన్నాను.
అందుకే అమ్మ కట్టిన బాక్సులన్నీ తిన్నాను.. ఎవరికీ యివ్వకుండా.
తినలేక తినలేక తింటున్నాను.
తినబుద్ది వెయ్యడం లేదు.
ఆయా మీద కంప్లైంట్ వచ్చిందేమో స్ట్రిక్ట్ అయిపోయింది. మమ్మల్నందర్నీ దూరం దూరంగా కూర్చోబెడుతోంది.
ఎవరిది వాళ్ళమే తింటున్నాం.
పాపం రాజుగాడి యింట్లో వంట కాలేదట. వాడికి డాడీ లేడు. వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది. ఇంట్లో చూస్తుంది. ఆంటీకి వంట్లో బాలేనప్పుడు రాజుగాడు పెరుగన్నమే తెచ్చుకుంటాడు. అన్నం వాడే వండాడట. మెత్తగా పేస్టయిపోయింది. తినలేక తిన్నాడు. కర్రీ యిద్దామంటే ఆయా అమ్మావాళ్ళకు చెప్పేస్తుంది. ఒత్తి అన్నం తినలేక వాంతి చేసుకున్నాడు.
ఎక్కువయి తినలేక తిని.. పారేస్తే వొప్పుకోరని తినలేక తిని.. నాకూ వాంతి వచ్చింది.
ఇద్దరం వాంతి చేసుకున్నాం.
ఫుడ్డు పాయిజనయి వుంటుందని అన్నారందరూ. మమ్మల్ని ఇంటికి పంపేసారు.
అమ్మానాన్నా డాక్టరుకు చూపించారు.
డాక్టరు కంగారు లేదన్నాడు. ఏవో మందులిచ్చాడు. మింగాను.
మళ్ళీ మామూలే.
ఈసారి నేనే కాదు, రాజుగాడే కాదు, సిద్దూ.. బంటీ.. చింటూ అందరం వంతుల వారీగా (ఈ మాట టీచరందిలే) వాంతులు చేసుకుంటున్నాం.. రోజుకొకరం.. యిద్దరం..
వాంతులు చేసుకుంటూనే వున్నాం..
ఫుడ్డు పొల్యూషనన్నారు.
వాటర్ పొల్యూషనన్నారు.
క్లయిమేట్ పొల్యూషనన్నారు.
ఇంతకీ పొల్యూషనేదో.. పోయిజనేదో మీకయినా తెలుసా?
నిఝoగా మీకయినా తెలుసా?
-శేఖర్,
ఆరవ తరగతి,
గౌతమ్ మోడల్ స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.