కొండమీది బంగ్లా

దయ్యాలు ఉన్నాయా? చిన్నప్పుడు కథలు వినేటప్పుడు ఉన్నాయి అనిపించేది. ఇప్పుడు అలా అనిపించదు. చీకట్లో గజ్జెల చప్పుడు,కనిపించని అడుగులు పరిగెత్తడం, ఇలాంటివి తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలేజీ చదివే రోజుల్లో చీకట్లో పది పదిహేనుకిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వంటరిగా వెళ్లేటప్పుడు పాటలు పాడుకుంటూ పోవడం బహుశా ఇలాంటి భయాన్ని ఎదిరించడానికికావచ్చు. రైల్వే ట్రాక్ దగ్గర దయ్యాల గురించి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విన్నాను గానీ, ఎప్పుడూ చూడలేదు. 65సంవత్సరాల క్రితం జ్యూట్ మిల్ ప్రాంతంలో చెట్లలో కొరివి దెయ్యాలు తిరిగే వని మా స్నేహితుడి తండ్రి చెప్పే మాటలు ఇప్పటికీ గుర్తే. ఒంగోలు దగ్గర రైలు ప్రమాదం తర్వాత 300 మంది ప్రయాణికుల ఆర్తనాదాలు కేకలు ఐదారు నెలల పాటు వినిపించేవని ఆయన చెప్పేవాడు. నేనప్పటికి పుట్టలేదు అనుకోండి.
కానీ, నేను ఒక సంఘటన మీతో పంచుకొని తీరాలి.
కళాశాలల పనితీరు పర్యవేక్షించడానికో, సెమినార్లలో ప్రసంగించడానికో, నేను దూరప్రాంత కళాశాలలకు వెళ్లవలసి వచ్చేది. ఒకసారి అలాగేఒక కళాశాలకు వెళ్లాను. చేరుకునే సరికి బాగా చీకటి పడింది. బస్టాండ్ కు వచ్చి నన్ను వెంట పెట్టుకుని కొండ మీద ఉన్న చిన్న బంగ్లాకు తీసుకెళ్లాడు.అది బాగా ఊరి చివర అనుకుంటా. సన్నగా తుపర కూడా మొదలైంది. కొమ్మల మధ్య నుంచి వీస్తున్న గాలి పెద్దగా వూళలువేస్తున్నట్లుగా ఉంది. కారు కావడంతో చలి గాని, తడవడం గాని లేదు. రైల్వే గేటు దాటాక కొండమీదకి తిరిగింది కారు. మిత్రులు చాలాసార్లు
చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తోంది. ఎక్కడికైనా వెళ్ళు కానీ ఆ కొండమీద బంగ్లాకు మాత్రం వెళ్లొద్దని.
‘పవర్ కట్ ఉందా?’అని అడిగాను. ‘లేదండి. సాధారణంగా పోదు.’అన్నాడాయన. దయ్యాల కన్నా దోమలకు భయపడేవాడిని
కావడంతోముందు జాగ్రత్తగా దోమల నెదిరించే సాధనాలన్నీ తెచ్చుకున్నాను. బంగ్లా దగ్గరగా కారు ఆపాడు. ఆ చిన్న బంగ్లా చుట్టూ దట్టంగా నల్లగానిల్చుని ఉన్న చెట్లు.
రగ్గు కప్పుకొని ఉన్న బంట్రోతు దగ్గరికి వచ్చి నమస్కరించి బ్యాగ్ అందుకున్నాడు. ‘అంజి మీకు సప్పర్ తెచ్చి పెడతాడు’అన్నాడాయన. ఎనిమిది గంటలు అవుతోంది. గదిలోకి
వెళ్ళి చుట్టూ పరిశీలించాను. పాతకాలం గది అది. చాలా రోజులు మూసి ఉన్నవాసన. మంచం మీద దుప్పట్లు కొంచెం పాత పడినట్లుగా ఉన్నాయి. అంజి ని పిలిచి అడిగాను ‘ఇక్కడికి ఎవరు రారా?’ అని. ‘అప్పుడప్పుడు వస్తారు సార్’ అన్నాడు. ‘ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు?’అని అడిగాను. ‘పదేళ్ళ నుంచి అండి’ అని వినయంగాచెప్పాడు. ‘ఇక్కడికి కాలేజీ, ఊరు ఎంత దూరం?’అని అడిగాను. ‘మూడు నాలుగు కిలోమీటర్లు. పొద్దున్నే వచ్చి సార్ మిమ్మల్నితీసుకెళ్తారు’ అన్నాడు.
లోపలికి వెళ్లి గడియవేసి బ్రీఫ్ కేసు నుంచి కావలసిన బట్టలు తీసుకున్నాను. మర్నాటికి కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకున్నాను.స్నానం చేద్దామని బాత్రూం లోకి వెళ్లాను. స్నానానికి దుస్తుల మార్పిడికి రెండుగా కట్టిన పాత పాతకాలపు గది అది. టవల్ పెట్టుకునేందుకు ఏమీ లేకపోవడంతో తలుపు మీద టవల్ వేసి తలుపు దగ్గరగా నొక్కి స్నానం చేస్తుండగా కరెంటు పోయింది. బయటవర్షం,గాలి పెరిగినట్లుగా ఉంది. స్నానం ముగించి టవల్ను లాగాను. రాలేదు. మళ్లీ లాగాను.ఎవరో అవతలనుంచి గుంజు తున్నట్లుగాఉంది. గట్టిగా లాగాను మళ్ళీ. అయినా రాలేదు. తలుపు తీసి చూద్దామని మరీ గట్టిగా లాగితే తలుపు కూడా రావడం లేదు. బయటబాత్రూంలోకి వెలుగు రావడానికి పెట్టిన కిటికీ తలుపులు టపటప కొట్టుకుంటున్నాయి. గబ్బిలం ఒకటి లోపలికి వచ్చి తిరిగిపోతోంది.కరెంటు వస్తూ పోతూ ఉంది. ఇంతలో గది లోపల ఎవరో పరిగెత్తినట్లు గా అనిపించింది. అలాగే గజ్జెల చప్పుడు కూడా. ‘అంజి, అంజి’అనిపిలిచాను. అతగాడి ఆచూకీ లేదు.
హఠాత్తుగా మిత్రులు చెప్పిన మాట మళ్ళీ గుర్తొచ్చింది ఎక్కడికైనా వెళ్ళు కానీ ఆ బంగ్లాకు మాత్రం పోవద్దని చెప్పారు. అక్కడెవరో ఉరిపోసుకున్నారని, రాత్రిపూట అడుగులు వినిపిస్తాయని.వీటిని నమ్మని నేను కూడా ఎందుకో కొంచెం నమ్మాల్సి వచ్చినట్లుగా అనిపిస్తుంది.సన్నగా భయం మొదలైంది. అసలు నన్ను ఇక్కడికి తెచ్చింది మనిషేనా? గదిలో గజ్జెల చప్పుడు ఆగడం లేదు. తలుపు అవతల నుంచిఎవరో లాగుతున్నట్లుగా రావడం లేదు. కొంచెం తలుపుని కుడివైపుకు లాగి మళ్ళీ తీశాను. తలుపు వచ్చింది. బయట గడియ కొంచెంముందుకు జరగడంతోతలుపు పడినట్లుగా అయింది.
ఒళ్ళు తుడుచుకుని బయటకు వచ్చాను. ఇంకా గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంది. కరెంటు లేదు. తలుపు తీసుకుని గదిలోకి వచ్చాను.చీకటి. సెల్ఫోన్ ప్యాంట్ జేబులో ఉన్నట్లుంది. ‘అంజి’ అని పిలిచాను. మెల్లగా గోడ పట్టుకొని నడుస్తూ పాంట్ తగిలించిన అలమర వైపువెళ్లాను. లోపల చెయ్యి తో తడిమాను. మెత్తగా జుట్టుతో చేతికి తగిలింది. పాత రగ్గు. గజ్జల చప్పుడు ఆగడం లేదు. తలుపు మీద ఎవరోకొడుతున్నారు. ‘అంజి అంజి’ అని పిలిచాను. సమాధానం లేదు. తలుపు మాత్రం చప్పుడు అవుతోంది. వచ్చింది అంజేనా? మనిషికాకపోతే? తెలియకుండా మళ్ళీ భయం మొదలైంది. సెల్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసి తలుపు తీసి చూశాను. బయట ఎవరూ లేరు గజ్జెలచప్పుడు కూడా ఆగిపోయింది. ‘అంజి అంజి’అని అరిచాను చాలా పెద్దగా. వళ్ళంతా చెమటలు పడుతోంది. అంజి వరండా పక్కనుంచీవచ్చాడు. అంజి చేతిలో నల్ల పిల్లి. దాని మెళ్ళో గజ్జెల దండ.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.