నిజమైన భూమి పుత్రిక స్మెడ్లీ

“భూమి పుత్రిక ” వాస్తవ సంఘటనలతో, పరిస్థితులతో గుండెను తడిచేసే నవల. స్మెడ్లి తన జీవిత చరిత్రను తానే లిఖించుకున్నది.ఈ నవలలో స్మెడ్లీ, మేరీ రోజర్స్ గా కనబడుతుంది. దీనిని తెలుగులోకి 1985 లో ఓల్గా అనువదించారు.
స్మెడ్లీ 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో, అమెరికాలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కటిక దరిద్రులు. 30 సంవత్సరాల జీవితంలో ఎన్నో విషాదాల కన్నీళ్లను తాగి, చేదు జీవితాన్ని సంతోషంగా, ధైర్యంగా అనుభవించింది. చీకటి రాత్రి లాంటిది ఆమె జీవితం. రెక్కలు ముక్కలు చేసుకుని ఎంత కష్టపడినా అందని సంపదల కోసం, ఆనందాల కోసం అన్వేషిస్తూ జీవితాన్ని సాగించిన కుటుంబం వారిది. తండ్రి తను పడుతున్న కష్టానికి ప్రతిఫలం లేక విరక్తితో తాగుడుకు బానిసైపోతే పిల్లలను పెంచడానికై తల్లి ఒంచిన ఒళ్లు ఎత్తకుండ, దుఃఖం నిండిన ఎర్రని కళ్లతో, అడుగడుగునా భర్త పెట్టే హింసను భరిస్తూ, నీలపు ఆకాశంలో ఆ తెల్లని మబ్బుతునకలేవో కథల్ని మోససుకుపోతున్నట్లుగా ఎన్నో విషాదపు ఛాయల్ని తన కండ్లలో నింపుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ అస్వస్థతకు గురయ్యి చివరకు లోకం చెట్టు నుండి రాలిపోతుంది.
తన తల్లి పడ్డ కష్టాలను, తండ్రి పెట్టిన హింసలను ప్రత్యక్షంగా చూసిన స్మెడ్లీ, తన జీవితంలో ప్రేమకీ పెళ్ళికీ స్థానమివ్వకూడదని ధృడంగా నిర్ణయించుకుంటది. పెళ్లాడిన స్త్రీల గౌరవం వాళ్ల బానిసత్వంలో ఉంటుందన్నది స్మెడ్లీ నమ్మకం. మగవాళ్లకు స్వేచ్ఛా ప్రియులైన, తెలివైన ఆడవాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆడవాళ్ళు తిండి, గుడ్డ కోసం మగవాళ్ల మీద ఆధారపడి బతకాలి‌…ఒకవేళ ఆధారపడకపోతే ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా వుండొచ్చనుకునేది. ఏడ్చే భార్యల కంటే ఘోరమైనదేముంటది ఈ ప్రపంచంలో….!? ఈ ప్రపంచం వివాహ వ్యవస్థలో బానిసలుగా పడిఉండి,మగవారి మీద ప్రేమతో నడుస్తున్న ఆడవాళ్ళతో నిండిపోయింది…!! స్త్రీల స్వతంత్రాన్ని ఆటంకపరిచే ప్రేమను,మగాడి కాళ్ళ దగ్గర పడేసి, అస్థిత్వాన్ని పోగొట్టే పెళ్ళి…ఈ రెండూ తనకొద్దని బలంగా నిర్ణయించుకుంటది స్మెడ్లీ.
బతుకుదెరువు కోసం ఎన్నో కష్టాలతో సహజీవనం చేస్తూ ఇద్దరు తమ్ములను, చెల్లిని పెంచడానికి ఆకలితో…అవమానాలతో…ఒంటరితనంతో…ఆడదాని మీద పట్ల అవకాశం తీసుకునే క్రూర మగాళ్ల దౌర్జన్యాలను ఒక సవాలుగా ఎదుర్కొంటూ.. తన చదువుకు ప్రాముఖ్యతను ఇస్తూ…తనని చుట్టుముట్టిన సమస్యలన్నింటితో సాహసోపేతంగా పోరాడింది స్మెడ్లీ.
20వ శతాబ్దపు మొదటి రోజుల్లో అమెరికా దేశపు శ్రామిక స్త్రీల జీవితం, జైళ్ల పరిస్థితి, స్త్రీ విముక్తి ఉద్యమ భావాలు ఎలా… ఎందుకు మొదలైందో…. అమెరికాలో భారత జాతీయోద్యమం ఎలా సాగిందో …ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చును. ఇతర శవాల మీద సంస్కృతిని, ఆనందాలను నిర్మించుకునే అమెరికన్ల కంటే… ప్రాణాలను లెక్కచేయకుండ తమ జీవితాలను మాతృభూమి స్వతంత్రానికై… దేశభక్తితో జాతీయోద్యమాన్ని ప్రేమించి నడిపించే భారతీయుల మీద గాఢమైన ఇష్టాన్ని పెంచుకుంటుంది. అప్పటి వరకు ఆకలి కొరకు పోరాటం చేసిన స్మెడ్లీ… ఒక నమ్మకాన్ని బతికించడం కోసం భారతీయులకు తన వంతు సేవలందించడానికి నిస్వార్థమైన ఆలోచనలతో కృషి చేసింది. భారతీయ కళలు, కావ్యాలన్ననూ‌‌‌…బుద్ధుని సాంఘిక విప్లవమన్ననూ… అమాయకమైన భారతీయ ప్రజలన్ననూ స్మెడ్లీకి ఎంతో ఇష్టం. ఈ నవలలో మేరీ గురువుగా పరిచయమయ్యే రంజిత్ సింగ్ భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పంజాబ్ కేసరిగా పిలువబడే లాలా లజపతిరాయ్.
లాలా లజపతి రాయ్ కి, స్మెడ్లీ కి ఉన్న అనుబంధాన్నే ఈ నవలలో మేరీ, రంజిత్ సింగ్ పాత్రల ద్వారా చిత్రించబడ్డది. లాలా ఆలోచనలు, భావాల ద్వారానే భారత జాతీయోద్యమం వైపు ఆకర్షితురాలై జైల్లో ఎన్నో హింసలను ధైర్యంగా ఎదుర్కొంటది. స్మెడ్లీ పుట్టి పెరిగిన పరిస్థితులను అర్థం చేసుకోలేని కొందరు భారతీయులు ఆమెను అవమానించారు, బాధించారు. ఆమె వారిపై కోపం తెచ్చుకున్నదే కానీ జాతీయోద్యమానికి దూరం కాలేదు.
ఆ రోజుల్లోనే భారత జాతీయోద్యమాన్ని నిర్మిస్తూ వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ స్మెడ్లీ కి పరిచయమవుతాడు. ఇతను సరోజిని దేవి సోదరుడు. ఈ నవలలో మేరీకి ఆనంద్ గా పరిచయమవుతాడు. జీవితంలో ఏ పురుషుడిని ప్రేమించకూడదు, పెళ్లాడకూడదు, పిల్లల్ని కనకూడదని గట్టిగా నిర్ణయించుకున్న స్మెడ్లీ…వీరేంద్రనాథ్ ప్రేమలో కరిగిపోయి పెళ్ళి చేసుకొని తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తది. అనుకోకుండా వారిద్దరిలో ఉపద్రవం ప్రవేశించి విడిపోతారు. స్మెడ్లీకి పెళ్ళికి ముందు మరొక భారతీయునితో సంబంధం ఉన్నదని తెలుసుకున్న వీరేంద్రనాథ్, స్మెడ్లీ ని మానసికంగా హింసిస్తూ, శాడిస్టుగా ప్రవర్తిస్తాడు. స్మెడ్లీ తప్పేమి లేకున్నా, ఫలితం స్మెడ్లీ నే అనుభవించాల్సి వస్తుంది. వీరేంద్రనాథ్ మానసిక ప్రవర్తనకు కుంగిపోయి, భారత జాతీయోద్యమంలో వీరేంద్రనాథ్ సేవలు అవసరమని గుర్తించి, తన ప్రేమను బలవంతంగా చంపుకొని ఒంటరిగా వీరేంద్రనాథ్ కి దూరంగా వెళ్లిపోతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న స్మెడ్లీ వీరేంద్రనాథ్ తో ప్రేమ విఫలం కావడం భరించలేక చాల కుంగిపోతుంది.
ఈ పరాజయాన్నుంచి బయటపడి మళ్లీ జీవిత పోరాటంలో ప్రవేశించేందుకు స్మెడ్లీ చేసిన ప్రయత్నాలలో ఒక ప్రయత్నమే ఈ “భూమి పుత్రిక” నవల పుట్టుక.
రాజకీయ హక్కుల కోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం తీవ్రమైన ఆందోళన చేయాల్సిన ఆ రోజుల్లో, మన భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం స్మెడ్లీ చేసిన త్యాగం మనకెంతో ఉత్తేజాన్నిస్తుంది. స్త్రీ విముక్తి, సామాజిక విప్లవం ఈ రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయనే అవగాహన మనకు ఈ నవల వల్ల కలుగుతుంది. స్త్రీ కి ఫలానా వ్యక్తి భార్యగా మాత్రమే గుర్తింపు నిచ్చే ఈ సమాజంలో, స్మెడ్లీ ఒంటరిగా, ధైర్యంగా చేసిన యుద్ధం ప్రతి మహిళకు ధైర్యాన్నిస్తుంది. స్మెడ్లీ ఏ సమస్యలతో యుద్ధం చేసిందో, ఆ సమస్యలు ఇంకా మన దేశంలో తీవ్రంగానే ఉన్నాయి. ఆకలి,దారిద్ర్యం, అజ్ఞానం, నిరుద్యోగం, పురుషాధిపత్యం… వీటన్నింటితో మనమింకా పోరాడుతూనే ఉన్నాం. మనం చేసే పోరాటాలలో స్మెడ్లీ జీవితం మనకెంతో ఉత్తేజాన్నిస్తది.
కార్మికురాలిగా, విద్యార్థిగా, టీచర్‌గా, రచయితగా, రాజకీయ ఉద్యమ కార్యకర్తగా, జర్నలిస్టుగా స్మెడ్లీ జీవితానుభవాలే ఈ ” భూమి పుత్రిక “. భూమికున్నంత ఓర్పు, సహనం, అనుకంపనలు స్మెడ్లీ కున్నవి కాబట్టే స్మెడ్లీ జీవిత కథ “భూమి పుత్రిక” గా మనకు పరిచయమైంది.
ఈ ”భూమి పుత్రిక” నవల నేటి సమాజంలోని ఎందరో భూమి పుత్రికలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

5 comments

  • మంచి పరిచయం, క్లుప్తంగా చెప్పారు. వీలైనంత త్వరలో చదవాలి

  • గుడ్. ఎంత బాగుందని మీ వచనం. ఆద్యంతమూ చదివింపజేసింది. చాలా మంచి కృషి చేశారు. ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.