పంటభూములు కాంక్రీట్ అడవులైతే గాని రాష్ట్రం వర్ధిల్లదా?

ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న నూతన రాజధాని గురించి ఇది ‘జన రాజధానా? ధన రాజధానా?’ అని అందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారని ప్రభుత్వం ప్రతి వేదికలోనూ చెప్పుకుంటోంది. ఒకరిద్దరు రైతుల్ని మీడియా ముందు నిలబెట్టి వారితో ‘ తాము పూర్తి అంగీకారంతో, గర్వపడుతూ నూతన రాజధాని నిర్మాణానికి భూములిస్తున్నామ’ని ప్రకటనలు ఇప్పించి వాటినే అందరు రైతులకు ఆపాదిస్తోంది. ఇంతకన్న బాగా రాజధానికి తగిన ప్రాంతాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్కడే కట్టడం వల్ల ఇంత మేలు ఉంది అని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు. ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.

నవ్యాంధ్ర లోని రాయలసీమ ప్రజలు ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ‘శ్రీబాగ్ ఒప్పందం’ ప్రకారం తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో అలా మాట్లాడుతున్నారనుకోవచ్చు. దానికి కోస్తా ప్రజలు కూడా విముఖంగా ఉన్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? అసలు, రాజధాని ఎంపికలో ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరిగింది ?. కనీసం పునర్విభజన చట్టం సెక్షన్ 6 కు అనుగుణంగా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలయినా విన్నారా? ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ అభ్యంతరాలు పెట్టినప్పుడు ప్రజలకెందుకు అనుమానాలు రాకూడదు? అసలీ రాజధాని కడుతున్నది ఎవరి కోసం? చట్టబద్ధమైన నిపుణుల కమిటీ తమ ఏకపక్ష నిర్ణయానికి అనుగుణంగా పనిచేయదని తెలిసే టీడీపీ పెద్దలు మంత్రివర్గంతో మరో కమిటీ వేసుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతాన్ని సూచించిందన్నది విననైనా వినకుండా, వాళ్ళు నివేదిక సమర్పించక ముందే ఇంకో కమిటీ వేసుకోవడం దేనికి? అది కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైన మంత్రులు ఎం.పి లతో, ఇంకొంత మంది పారిశ్రామికవేత్తలతో. శివరామకృష్ణన్ ఏదో సాదా సీదా వ్యక్తి కాదు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి. మిగిలిన సభ్యులు కూడా అనుభవజ్ఞులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ల మాఠకు వలువ యి వ్వలేదంటేనే అర్థమవ్వాలి ఇది వ్యాపారుల రాజధానా, లేక ప్రజా రాజధానా అనే ప్రశ్న ఎందుకు ముందుకొస్తున్నదో.

గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలెందుకు ?.

కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని సారవంతమైన భూముల్లో కృష్ణా నది ఒడ్డున రాజధాని నిర్మిస్తే , వరద ప్రమాదం ఉంటుంది కాబట్టి నిర్మాణాన్ని ఆపేసి, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేలా అదేశాలిమ్మని కొందరు రైతు నాయకులు ఎన్జీటీ ని ఆశ్రయించగా ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. దానికి ప్రభుత్వ నుంచి స్పందన లేదు.
శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో అధికార వికేంద్రీకరణ పద్ధతిని సూచించింది. నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో అమరావతి లేనేలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శివరామకృష్ణన్ నివేదికలోని అంశాలలో ‘అభిప్రాయ సేకరణ లో ఎక్కువమంది విజయవాడ ప్రాంతాన్ని సూచించార’నే పాయింటును హైలెట్ చేసి సెప్టెంబర్ 4 , 2014 నాడు శాసనసభలో అమరావతి ప్రాంతమే రాజధాని అని ప్రకటించేసుకున్నాడు. ఇదేం లెక్క? కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే అన్నింటి గురించి ఆలోచించాలి. అలా కాకుండా తనకు నచ్చిన అంశాన్ని మాత్రమే పట్టుకుని మిగతా ముఖ్యమైన అంశాలను వదిలేసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లనే యీ వ్యతిరేకత.

ఎంపిక చేసిన భూముల్ని సర్వే చేయకుండా, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయించకుండా ఏసీ గదుల్లో కూర్చుని నచ్చిన వ్యాపారవేత్తలతో చర్చించుకోవడంగానే జరుగుతోంది వ్యవహారం మొత్తం. గత చరిత్ర తిరగేస్తే ప్రపంచంలో ఎక్కడా ఇంత వ్యాపార ధోరణిలో రాజధాని ఎంపిక జరిగుండదు. మూడు మండలాల్లోని 21 గ్రామాలతో రాజధాని రాబోతోందని ప్రకటన అయింతర్వాత ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా భూసేకరణ ఉంటుందని చెప్పారు. దీన్ని కూడా శివరామకృష్ణన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి గారికి రాజధాని ప్రాంత ఏర్పాటుకు, నూతన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించడానికి పునర్విభజన చట్టం చాలా సమయమే కేటాయించింది. కానీ ఆయన అస్ టైమంతా భూముల సేకరణకే వాడుకుంటున్నాడు అంటారాయన .
కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పరచిన కమిటీ వ్యవసాయ భూముల జోలికి వెళ్ళొద్దని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ గుంటూరు , మంగళగిరి , విజయవాడ ప్రాంతాలన్నీ ముక్కారు పంటలు పండే భూములు. ముప్పై రెండు వేల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని కాంక్రీటు జంగిల్ గా మార్చడం వల్ల కలిగే ఆహార ధాన్యాల లోటును ఏ విధంగా పూరిస్తారో ముఖ్యమంత్రి గారికే తెలియాలి.

ఇదంతా ఒక ఎత్తయితే భూసేకరణ మరో ఎత్తు. ఇష్టానుసారంగా రాజధాని ప్రాంత సరిహద్దులను మార్చడం ప్రభుత్వ, పార్టీ ముఖ్య నేతల, వారి అనుచర గణాల భూములకు ఆమడ దూరంలో రాజధాని సరిహద్దులు వచ్చి ఆగడం; నెలకొకసారి భూముల సంఖ్య పెరుగుతూ పోవడం వంటి చేష్టలు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
వాస్తవానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే నూతన రాజధాని కోసం స్థల పరిశీలన జరపమని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. ఆయన తన పరిశీలన తర్వాత దొనకొండ, నూజివీడు, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నగరాల్లో ప్రభుత్వ భూములు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి కనుక ఆ ప్రాంతాలు ఆలోచించదగినవి అని రాశాడు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో సుమారు యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. నూతనంగా ఏర్పడబోయే రాజధాని కోస్తా, రాయలసీమ ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి మద్యే మార్గంగా దొనకొండ బాగానే ఉంటుంది. కానీ అక్కడ అస్మదీయుల పట్టా భూములు వుండాలి కదా పాపం! నీటి వసతి లేదనే సాకుతో దాన్ని పక్కన పెట్టేసారు. నిజానికి 2014 మే ఎలక్షన్లకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిగా దొనకొండను అంగీకరించడానికి మొగ్గు చూపినా ఎలక్షన్ల తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి.

ఇక, అమరావతి ప్రాంతంపై వ్యతిరేకత రాకుండా రాష్ట్రవ్యాప్తంగా మూడు మహానగరాలు , 16 స్మార్ట్ సిటీలు అనే తాయిలాలు ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఆ స్మార్ట్ సిటీలు ఎంత స్మార్ట్ గా తయారవుతున్నాయో అక్కడకు పోయి చూస్తే కానీ అర్థం కాదు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని తమకే దక్కాలని రాయలసీమవాదులు పట్టుబట్టినా, లాభం లేకపోయింది.
చివరకు యీ ఐదేళ్ల టర్మ్ పూర్తయ్యేసరికి ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మాణం కాకపోవడం కొసమెరుపు. తాత్కాలిక నిర్మాణాలకే ఇన్నివేల కోట్ల ప్రజాధనం ఖర్చైపోతే ఇక పూర్తి స్థాయిలో రాజధాని శాశ్వత భవనాలు కట్టడానికి ప్రజలెంత లూటీ కావాలో!

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

2 comments

  • అమరావతి వ్యాపారస్తుల రాజధాని. ప్రజలది కాదు. NGT వాళ్ళు ముందు stay ఇవ్వలేదు. ఆఖరున తీర్పు ఇస్తూ, అక్కడ రాజధాని కట్టడం సరి కాదు అంటూనే, ‘మొదట stay ఇవ్వలేదు కాబట్టి, రాజధాని నిర్మాణపు పనులలో చాలా దూరం పోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం’ అనే నిస్సహాయత ప్రకటించి, కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉరుకున్నారు. రాజదానిని అమరావతి లో నిర్మించడం ఒకదుర్మార్గమైన చర్య. ఎప్పడికైనా రాష్ర్టం మూడు ముక్కలవడానికి పునాది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.