మధ్య తరగతి శల్యపరీక్ష ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌’

‘ఏక్‌ దిన్‌’ అంటే ‘ఒకరోజు’, ‘ప్రతిదిన్‌’ అంటే ‘ప్రతిరోజు’. మొన్న, నిన్న, నేడు, రేపు, ఎల్లుండి విడివిడిగా అన్నీ ‘ఒకరోజు’లే. కలిపి చెబితే ‘ప్రతిరోజు’. ‘ప్రతిరోజు’లోని ‘ఒకానొక రోజు’కి ప్రత్యేకత వుంటే ఉండొచ్చు గాక, అయితే ఆ ‘ఒకరోజు’కి రోజుల ప్రవాహాన్ని ఆపే శక్తి లేదు అని చెప్పడమే ఈ సినిమా ధ్యేయం. రోజూ కనిపించే మొహాలు ఓ రోజు తమ నిజస్వరూపాన్నీ, అంతరంగాన్నీ బహిర్గత పరుచుకునే సందర్భం రావచ్చు. అలాంటి అర్ధమిచ్చే కథ ‘అభిరత చెనాముఖ్‌’ (పరిచిత మొహాల ప్రవాహం). బెంగాలీలో అమలేందు చక్రవర్తి రాసిన కథ ప్రేరణతో ఈ సినిమా తీశాడు ఇటీవల కన్నుమూసిన జగద్విఖ్యాత దర్శకుడు మృణాల్ సేన్.
ఇబ్సన్‌ నాటకాల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ఎన్నో ముఖ్యమైన ఇతర విషయాల మూల్యాంకనకు దారితీస్తుంది. ఆ తరహాలో వుంటాయి ‘ఏక్‌దిన్‌, ప్రతిదిన్‌’, ‘ఏక్‌దిన్‌ అచానక్‌’ వంటి సినిమాలు. ‘కలకత్తా ట్రిలాజీ’ (ఇంటర్వ్యూ – కలకత్తా 71 – పదాతిక్) తర్వాత, ‘ఒక ఊరికథ’, ‘పరశురాం’ వరకు తీసిన సినిమాల్లో సేన్‌లోని తిరుగుబాటుతత్వం కనిపిస్తుంది. ‘ఇంతవరకూ బయటి శతృవును చూపడం జరిగింది, ఇప్పుడు నాలోని నా శత్రువును గుర్తించాల్సిన సమయం వచ్చింది’ ` అని సేన్‌ చెబుతాడు. ఆ విధంగానే బెంగాలీ ‘భద్రలోక్‌’ (మర్యాదస్తుల) మనస్తత్వాన్ని శల్యపరీక్ష చేస్తాడు ఈ సినిమాలో, ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో. ఈ సినిమా నుంచి వచ్చిన సినిమాల్ని ‘ఆత్మపరిశీన దశ’ సినిమాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో రాజకీయాలు లేవా అంటే బేషుగ్గా వున్నాయనే జవాబొస్తుంది సినిమాని విశ్లేషిస్తే.
కథలో ఏముంది? ఉద్యోగానికి వెళ్ళిన పెద్దకూతురు రావాల్సిన సమయానికి ఇంటికి రాదు. రాత్రంతా వెదుకులాట సాగుతుంది. వేకువజామున అమ్మాయి ఇంటికి వస్తుంది. ‘కొట్టె-కట్టె-తెచ్చె’ – ఇంతేగా అన్నట్టుంటుంది. కానీ, ఈ మూడు ముక్కల్లోనే ఎంతో కథ సాగుతుంది.
నార్త్త్‌ కలకత్తాలో నవీన్‌ మల్లిక్‌ వీధి, అందులో సిపాయి తిరుగుబాటు సమయంలో నవీన్‌ మల్లిక్‌ కట్టించిన మూడంతస్తు భవనం. ఈస్టిండియా కంపెనీ నుండి విక్టోరియా రాణి, బెంగాల్‌ విభజన నుండి దేశవిభజన, ఎన్నో ఉద్యమాలు, ర్యాలీలు, రక్తపాతం, ఆ చరిత్రంతా చూసిన భవనం. (షుటింగు జరిగిన శ్యాంబజార్‌ ఫరియాపుకుర్‌లోని ఆ భవనం మరో ఆధునిక భవనం కోసం బలైంది) ప్రస్తుతం ద్వారకా మల్లిక్‌ లేక దారిక్‌ బాబు ఆధీనంలో ఉంది ఆ పాత భవనం. మూడో అంతస్తులో దారిక్‌ బాబు ఉంటాడు. మిగతా రెండంతస్తుల్లో అద్దెకొంపలు. ఒకటో అంతస్తులోని ముగ్గురు కిరాయిదారుల్లో ఒకరు రిషికేశ్‌ సేన్‌గుప్తా (సత్య బెనర్జీ) పరివారం. రిటైరైన ఆయనకు వచ్చే పెన్సన్‌ ఏ మాత్రం సరిపోదు. పెద్దమ్మాయి చిన్మయి లేక చినూ (మమతాశంకర్‌) జీతమే ఆ పరివరానికి ఆధారం. తల్లి (గీతా సేన్‌, మృణాల్‌ సేన్‌ భార్య), పెద్దబ్బాయి టొపూ, చిన్నమ్మాయి మినూ, ఆ తర్వాత మరో అమ్మాయితో పాటు అందర్లోకీ చిన్నబ్బాయి పొల్టు. ఆ భవనంలోని కొంపన్నిటికీ ఒకటే ముఖద్వారం, ఒకే వరండా, కామన్‌గా ఒకటే నీళ్ళ తొట్టె. అక్కడి పరివారాల మధ్య దాపరికాలూ, రహస్యాలూ వుండే వీల్లేని పరిస్థితి. లైట్లార్పేయండంటూ, నీళ్ళు తక్కువగా వాడండంటూ ఇంటి యజమాని ఆ భవనానికి రాజులా ఆదేశాలు జారీ చేస్తుంటాడు.
సినిమా అంతా ఒక రాత్రిపూట జరిగే కథే. కేవలం టైటిల్స్‌ వేయడానికిముందు మాత్రమే ఆ ఉదయం వీధిలో పిల్లల ఫుట్‌బాల్‌ ఆట, అందులో చిన్నవాడు పోల్టూకి దెబ్బతగడం, వాడికి దగ్గర్లోని మెడికల్‌ షాపులో కుట్లేయించి కట్టుకట్టించడాన్ని చూస్తాం. అవసర సందర్భంలో లోకల్‌ టెలిఫోన్‌ బూత్‌గా ఉపయోగపడుతుంటుంది ఆ మందుల షాపు.
సాయంత్రం ఏడు, ఏడున్నర, ఎనిమిదౌతున్నా ఇంటికి రావడం లేదు చినూ. ఏమయ్యుంటుంది? ఆఫీసులో ఓవర్‌ టైమా? చుట్టాలింటికి వెళ్ళి ఉంటుందా? ఇంట్లోని తర్జనభర్జన వాసనను కనిపెట్టేస్తాయి పక్కిళ్ళు. ఆడపిల్ల వేళకు తిరిగి రాకపోవడం సామాన్యమైన సంగతా? గుసగుసలు మొదలు. మినూ మందుల షాపుకెళ్ళి ఆఫీసుకు ఫోనుచేసి కనుక్కుంటే, అక్కడలేదని తెలుస్తుంది. అక్కడ కూర్చుని వున్న ఇంటి యజమాని తనవంతు ప్రశ్నలు సంధిస్తాడు ఒకింత అధికారదర్పంతోనే. అర్థరాత్రి బస్టాండు వద్ద తచ్చాడుతున్న సేన్‌గుప్తాకు వారి పైవాటాలో వుంటున్న శ్యామల్‌బాబు తారసపడతాడు. ఇక్కడేం చేస్తున్నారంటే ‘ఊరకనే’ అని బదులిస్తాడు ఆయన. ఎంత దాయాలన్నా దాగదు చినూ ఇంటికి రాని సంగతి. అర్థరాత్రికి గాని ఇంటికి రాని పెద్ద కొడుకొస్తాడు. తన స్నేహితుడితో పోలీసు స్టేషనుకీ, మార్గుకీ వెళ్లి వాకబుచేస్తాడు. ఇరుగుపొరుగువారికి కుతూహలం పెరిగిపోతుంది. నేరుగా ఒకరిద్దరు వారింటికే వచ్చేస్తారు, సానుభూతి పేరుతో వాకబు చేయడానికి!
అర్థరాత్రి దాటాక మందుల షాపుకు ఎక్కడ్నుంచో ఫోను వస్తుంది. కానీ నిద్రకు భంగమని క్రెడిల్‌ పక్కన పెట్టేస్త్తాడు నిద్రిస్తున్నాయన. చినూ గైరుహాజరులో ఆమె జీవితానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. ‘అక్కయ్యను తను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోనివ్వాల్సింది’ – అని మినూ అంటే, ‘వాడు పార్టీ పాలిటిక్సంటూ తిరుగుతుంటాడు, అక్కయ్య సంపాదనపై బతకాలనుకున్నాడు’ – బదులిస్తుంది తల్లి. ‘మనం చేస్తున్నదీ అదేగా’ అని మినూ జవాబివ్వగా ఘర్షణ పెరుగుతుంది. కోపగించుకుని ముసలాడ్ని నిందిస్తుంది తల్లి. ఇలా పరాన్నజీవులుగా బతుకుతున్న వారంతా వారిలోవారు తగువులాడుకుంటారు. కెమేరాకు విశ్రాంతి వుండదు. ఒక క్యారెక్టర్ మీంచి మరొకరి మీదికి మారుతూనే వుంటుంది. ‘ఆడపిల్లని అదుపులో పెట్టకపోతే ఇలానే జరుగుతుంది’ – మరో ఇంట్లోని ముసలాడు అంటాడు. ‘మరి ఆడపిల్ల మగాడిలా కష్టపడితే పర్వాలేదా?’ – మనవరాలి జవాబుకి చిర్రెత్తుకొస్తుంది ముసలాడికి. ‘నీ మనవరాలిని అదుపులో పెట్టు, లేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది’ – ముసలమ్మతో అంటాడు.
ఇలా పితృస్వామ్య ద్వంద్వనీతి తన నిజస్వరూపాన్ని నగ్నంగా బహిర్గతపరుచుకుంటుంది ఆ రాత్రిపూట. పోలీసులు వాకబు చేయడానికి ఇంటికొస్తారు. ‘కడుపు (ఎర్లీ ప్రెగ్నెన్సీ)తో వున్న ఓ పాతికేళ్ల యువతి శవం రైలు పట్టాల ప్రక్కన దొరికింది. ఐడెంటిఫై చేయడానికి ఆసుపత్రికి రావాలి’ అని చెబుతారు. సేన్‌గుప్తాకు తోడుగా వెళతాడు శ్యామల్‌బాబు. ఆ భవనంలోని ఒకరిద్దరు సహృదయుల్లో ఆయనొకడు. ఆసుపత్రిలో వీరిలానే ఇంకొందరు. ఒకరి కుమార్తె, వేరొకరి చెల్లాయి,ఒక విడాకులు పొందిన అమ్మాయి – ఇలా! ఈ శవం తమది కాకపోతే చాలు అన్న ఆదుర్దానే అందరిదీ! కానీ ఆ చనిపోయిన యువతి ఎవరికో ఒకరికి చెల్లి లేక కుమార్తె అయ్యుంటుందన్న సానుభూతి కన్పించదు.
చివరికి వేకువ జామున టాక్సీలో ఇంటికొస్తుంది చినూ. చాలా పెద్ద ఊరట! కానీ అంతా నిశ్శబ్దం. ఏమైందని ప్రశ్నించారు. ఎవరూ సరిగా మాట్లాడరు. ఈ మౌనానికి అర్థం ఏమిటవ్వొచ్చో వివరించింది సోమా చటర్జీ అనే విశ్లేషకురాలు – 1) వచ్చేసింది, అదే చాలు, 2) ఇంటి జీతగత్తెతో తగువు పడడం మంచిది కాదు, 3) తమకు ఇష్టం కానిదేమైనా చెబితే వినాల్సి వస్తుందేమో, 4) ఆ మాటన్నీ ప్రక్కవాళ్ళు వింటే పరువు పోతుందేమో, 5) వాస్తవం నుండి పలాయనం చేస్తూ అంతా మామూలుగానే సాగుతోందని (ఏక్‌దిన్‌, ప్రతిదిన్‌ వ్యవహారంలానే వుందని) కూడబలికే నటనేమో! ‘నాపై మీకు నమ్మకం లేదా? మందుల షాపుకి ఫోను చేస్తే ఎవరూ ఫోనెత్తలేదు’ అని నొచ్చుకుంటుంది చినూ. ‘మీ వ్యవహారం సరిగా లేదు, ఇది మర్యాదస్తుండే ఇల్లు, మీరు మీ వాటా ఖాళీ చేసెయ్యండి’ అని ఇంటి యజామాని వార్నింగిస్తే కొట్టినంత పనిచేస్తాడు పెద్దాడు టోపూ. పళ్ళు తోముకోడాలూ, పొయ్యి రాజెయ్యడాలూ, నీళ్ళు తోడుకొడాలతో మరో రోజు యధావిధిగా మొదలౌతుంది.
ఆమ్మాయికేమైందన్నది సినిమా ప్రకారం రహస్యమే! డిగ్రీ చదివీ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటి పట్టున వుండకుండా తిరుగుళ్ళు తిరుగుతూ అర్ధరాత్రికో ఇంటికొచ్చే పెద్దాడిని ఎవరేమీ అనరు. ఇంటి యజమానికీ ప్రశ్నరాదు. తలపగిలేలా చిన్నవాడు రోడ్డుమీద అటలాడినా పర్వాలేదు. ‘ఈ మాత్రం దెబ్బలు మామూలే’ అని కట్టుకట్టే డాక్టరంటాడు. పెళ్ళీడు మించిపోతున్న ఆడపిల్లను వూర్లోకి పంపి ఆమె సంపాదనా పొందాలి కాని ఆమె దినచర్యపై నిఘా కూడా వుంచాలి. ‘ఒరేయ్ అన్నయ్యా! నువ్వు మోర్గ్ దగ్గర వాంతి చేసుకున్నావట!’ అన్న మాటలో మగవాడివి కాబట్టి అంత సున్నితంగా వుండకూడదు అన్న భావన కన్పిస్తుంది. ఇలా సమాజంలో, ఇంటిలో మగవారికొక నీతి, ఆడవారికొక నీతి! అసలు రాత్రి ఇంటికి రాకపోయినది మగవాడయ్యుంటే ఇంత సినిమా వుండేదే కాదు.
అన్నట్టు ఆ అమ్మాయికేమైందో రచయిత చెప్పనేలేదు’ అని సత్యజిత్‌ రే కూడా వ్యాఖ్యానించాడట! ‘నాకు తెలిసుంటే చూపేవాణ్ణిగా!’ – అని బదులిచ్చాడట మృణాల్‌ సేన్‌. ‘ఆ సంగతి మనకెందుకు? అది ఆవిడ వ్యక్తిగత విషయం?’ అని కూడా అన్నాడట.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.