మనుషుల్లో మంచీ చెడూ

సి.రామారావు, నేలకొండపల్లి.
ప్రశ్న: ప్రతీ మనిషిలోనూ, మంచీ-చెడ్డా ఉంటాయి – అంటారు. ఇది, నిజం అంటారా? లేకపోతే, ఒక మనిషి, పూర్తిగా మంచి వాడి గానూ, ఇంకో మనిషి పూర్తిగా చెడ్డ వాడి గానూ ఉంటారంటారా? ఏది సరైన విషయం అంటారు? రెండూ నిజమే అనిపిస్తోంది, నాకైతే.
అంటే, ఒక మనిషి మంచీ-చెడ్డలతో కలిసి వుండవచ్చు. ఇంకో మనిషి, పూర్తిగా మంచి వాడి గానో, పూర్తిగా చెడ్డ వాడిగానో, ఉండవచ్చు కదా? ఈ రకంగా చూస్తే, రెండూ నిజమే అవుతాయి కదండీ? మీ అభిప్రాయం చెపుతారని ఆశిస్తున్నాను.

జవాబు: అవును, ప్రతీ మనిషిలోనూ మంచీ-చెడ్డా రెండూ వుంటాయని చాలా మంది భావిస్తారు. అయితే, అసలు ‘మంచి’ అంటే ఏమిటి? ‘చెడ్డ’ అంటే ఏమిటి? – ఈ విషయాలు మాత్రం తేల్చి చెప్పరు. మనం, కొన్ని ఉదాహరణలు తీసుకుని ఆలోచించాలి. ఏది తీసుకున్నా, ఉదాహరణల కోసమే తీసుకున్నట్టుగా అనుకోవాలి. ఒక మనిషి పూర్తిగా ‘భక్తి’తో వుంటే, ఇంకో మనిషి పూర్తిగా ‘నాస్తికత్వం’తో వుంటారనుకుందాం. ఈ లక్షణాల్లో ఏది ‘మంచి?’ ఏది ‘చెడ్డ?’ భక్తులందరూ, ‘భక్తి’తో వుండడాన్నే ‘మంచి’ అంటారు. నాస్తికత్వాన్ని ‘చెడ్డ’ అంటారు. అలాగే, నాస్తికులైతే, నాస్తికత్వాన్నే ‘మంచి’ అని, ‘భక్తి’ని ‘చెడ్డ’ అంటారు. ఈ మంచి-చెడ్డలకు, ‘గ్న్యానం-అగ్న్యానం’ అనే పేర్లు పెట్టుకోవచ్చు. భక్తుడికి, భక్తే గ్న్యానం! నాస్తికత్వం అగ్న్యానం! అలాగే, నాస్తికుడికి, అవి తారుమారు అవుతాయి.
అంటే, మంచీ-చెడ్డా అనేవి, భావాల్లో తేడాలు. అవగాహనల్లో తేడాలు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక మనిషి ‘తాగుబోతు’గా వుంటే, ఇంకో మనిషి అటువంటివి ముట్టడు. ఈ రెండో వాడికి, మొదటి వాడు చెడ్డవాడిగానే కనపడతాడు. మొదటి వాడికి, రెండో వాడు చాదస్తుడిగానో, నాగరికత లేని వాడిగానో కనపడతాడు. ‘పరస్పర విరుద్ధం’గా వుండే వేరు వేరు భావాల్ని తీసుకోండి! అవి, కొందరికి ‘మంచి’గానూ, కొందరికి ‘చెడ్డ’గానూ, కనపడతాయి. రెండు ‘విరుద్ధ భావాల’ గురించి, తర్కంతో చూస్తే, నిజంగానే, ఒకటి మంచిదీ, ఒకటి చెడ్డదీ, అవుతాయి. ‘వ్యభిచారం’ వుందనుకుందాం. దానికి అలవాటు పడ్డ వాళ్ళకి అది మంచే. కానీ, ఆ రకం సంబంధాలు ‘చెడ్డవే.’ అవి, ఎందుకు చెడ్డవి అంటే, అవి, స్త్రీల పేదరికం వల్లా, పురుషుడికి వుండే ప్రత్యేక హక్కుల వల్లా, వ్యభిచార గృహాల్ని నడిపే వాళ్ళ డబ్బు సంపాదన దృష్టి వల్లా, భార్యాభర్తల మధ్య ప్రేమ లేని సంబంధాల వల్లా, ఆ తప్పుడు సంబంధాలు వుంటాయి. అది ‘చెడ్డ’ అవడం వల్లే, తమ ప్రవర్తనని రహస్యంగా దాచుకుంటారు గానీ, బహిరంగంగా చెప్పుకోరు. ఇప్పుడు, పెట్టుబడిదారీ విధానంలో, ప్రతీ చెడ్డనీ, నాగరికతగానే భావించే భావాలు పెరుగుతున్నాయి. ఇదంతా, డబ్బు దృష్టి! అసలు, డబ్బు దృష్టి అనేది, తప్పు దృష్టే. అతి నిరుపేదలైన వాళ్ళు, బ్రతుకుదెరువు కోసం దొంగతనాల వంటివి చేస్తే, దాన్ని ‘చెడ్డ’గా భావించనక్కరలేదు. వాళ్ళ అవసరం అది! ‘మంచీ-చెడ్డా’ అన్నప్పుడు, తప్పకుండా ఉదాహరణలు తీసుకుని ఆలోచించాలి. అప్పుడు, కొన్ని భావాలు నిజంగా మంచివీ, కొన్ని భావాలు నిజంగా చెడ్డవీ, అని తేలతాయి. అలా తేలితే, చెడ్డ భావాలన్నిటినీ, వదిలించుకోవలిసిందే. ఒకే మనిషిలో రెండు రకాల భావాలూ వుండవు. ఒకే మనిషిలో, భక్తీ, నాస్తికత్వమూ – రెండూ వుంటాయా? వ్యభిచారమూ, దాని వ్యతిరేకతా, రెండూ వుంటాయా? చర్చించండి మీరు కూడా.

రంగనాయకమ్మ

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.