మెలకువ రేవు

పగలంతా
సముద్రం మింగిన
నా పాదముద్రల కోసం
ఈతకొడుతూనే ఉన్నాను
రాత్రి కొమ్మకు పూసిన పూలను
అక్కడే వదిలేశాను
ఇవన్నీ గాజు కళ్ళు
కలలు కనే కళ్ళు
రాత్రి దేహంపై అతికించబడ్డాయి
నన్ను నేను మర్చిపోతాను
ఎవరో తట్టి లేపుతారు
దేహం లేచి పరిగెడుతుంది
కాలాన్ని సెకండ్ల చొప్పున తింటుంది

చీకటి చినుకులు మొదలవగానే
దుప్పట్లను కౌగిలించుకున్నాను
అర్థరాత్రి చీకటి తుఫానులో
ఆకాశం వరకు ఎగిరాను
అక్కడ కలలన్ని తెంపి కళ్ళలో పోగేసాను
సముద్రం మింగిన నా పాదముద్రలు
అక్కడ మెరుస్తూ దేనికో దారి చూపిస్తూ
నన్నలా లాక్కెళ్తూ…

ఎవరో లోకాన్ని కదిపారు
ఎలాగైనా కలలను
నిదుర నది దాటించాలి.

దోర్నాదుల‍ సిద్ధార్థ

స్వస్థలం: చిత్తూరు జిల్లా , పలమనేరు. వృత్తి: పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. 30కి పైగా కవితలు, వ్యాసాలు ప్రచురించారు..ఆకాశవాణి, తిరుపతి కేంద్రం నుండి కథలు కవిత్వం ప్రసారమయ్యాయి. రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుడు. ఎక్సరే సాహితీ పురస్కారం వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ పురస్కారం మరికొన్ని అందుకున్నారు.

19 comments

 • సిద్దూ ఇంకాసేపు కలలతో ఉండాలనిపించింది. తొందరగా మెలకువ తెప్పించావు. అయినా సరే. థ్యాంక్యూ. ఇంత బాగా రాస్తూ, ఆ సైలెన్సేమిటి మిత్రుడా ? ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రం యూ…

  • ఖచ్చితంగా మరిన్ని రాయడానికి ప్రయత్నిస్తాను సార్.

 • ఇన్నాళ్లకు మేల్కొన్నావ్
  రాయ్ నాయనా రాయ్
  కలలను దాటిద్దాం

 • మనసున మెదిలిన ఆలోచనలకు
  అక్షర రూపం ఆపాదించే
  మరుగునపడిన ఆప్యాయతలను
  అప్పుడప్పుడూ గురుతెడిన మనిషి
  మా సిద్బావ.దోర్నాదుల.

 • చాలా బాగుంది సిద్దు…మిమ్మల్ని ప్రపంచానికి మరింత గొప్పగా అంతే ఘనంగా పరిచయం చేసే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది మీ ఈ కవితా నైపుణ్యాలను చూస్తుంటే..మరుగున పడిపోతున్న మన భాషకు మీలాంటి వారే సంరక్షకులు…

 • నిన్ను ఇలానే చూడాలని మా కోరిక.
  కవిత్వం పొంగనీయవోయ్

 • ని ఊహాలోకం నచ్చింది మిత్రమా,.. మరి ఎన్నో అద్బుతమైన కవితలు రాయాలని కోరుకుంటూ ని స్నేహితుడు,.. మోహన్ కరమల.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.