వైవిధ్య భరిత కథా రచయిత గీ ద మోపస

నాటక రచయితకు, నవలా రచయితకు లేని పరిమితులు కథారచయితకు చాలా ఉంటాయి. తక్కువ వ్యవధిలో జీవితాన్ని చిత్రీకరించాల్సిన కష్టమైన బాధ్యత నాటక రచయితదైతే, తక్కువ నిడివిలో జీవితాన్ని రసవంతంగా చిత్రించడం కథా రచయిత బాధ్యత. దీనిలో పాత్రలను, సంభాషణలను, పటిష్టమైన కథను, ఇతివృత్తాన్ని, సన్నివేశాలను లొసుగు లేకుండా, విసుగు రాకుండా పరిపుష్టంగా నిర్మించాలి. ఇలాంటి రచన చేయగలిగిన గొప్ప కథకుడు మోపస (1850-1893).
1850 ఆగస్టు 5న ఫ్రాన్స్ లోని నార్మండీ లో జన్మించిన గీ ద మోపస, చిన్నతనం నుంచి స్వతంత్ర నిర్ణయాలు గల తన తల్లి లాలి పోతువాన్ ప్రభావంతో పెరిగాడు. స్త్రీ లోలుడైన భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత తన పిల్లల్ని బోర్డింగ్ స్కూల్ లో చేర్చింది. కానీ మోపసకు మత సంబంధమైన విషయాలు నచ్చలేదు. ఒక చిన్న తప్పు చేసి తనంత తానే ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్లాడు. 1869 లో ‘లా’ చదవడం మొదలు పెట్టాడు. కానీ ఫ్రాన్స్ – జర్మనీ యుద్ధం మొదలయ్యేసరికి దాన్ని వదిలి వేయాల్సి వచ్చింది. సాహిత్యం పట్ల మక్కువ తల్లి స్నేహితుడైన గిస్తావ్ ఫ్లాబే ద్వారా కలిగింది.
తన తండ్రి సహాయంతో ఆర్మీ లో కొంతకాలం పనిచేసిన అనుభవం అతని కథలకు కొంత మూల వస్తువును సమకూర్చింది. 1871 నుంచి మళ్లీ ప్యారిస్ లో తన న్యాయవాద ప్రాక్టీస్ కొనసాగించాడు మోపస. చిన్నతనం నుంచి బ్యూరోక్రసీ అంటే ఇష్టం లేదు. తల్లి తన స్నేహితుడైన గిస్తావ్ ఫ్లాబే ను పరిచయం చేసింది. అదే సమయంలో ప్రముఖ రచయితలు ఎమిలీ జోలా, ఇవాన్ తుర్జనేవ్, హెన్రీ జేమ్స్, కన్కర్ట్ వంటి వారినందరినీ కలిశాడు. ఫ్లాబే స్ఫూర్తితో రచయితగా మారాడు. 1880లో అతని మరణం మోపస ను వ్యక్తిగతంగా కుంగదీసింది.
మోపస చాలా ఉత్సాహవంతుడైన వ్యక్తి. ఈత పట్ల చాలా మక్కువ. యవ్వన దశలో ఎక్కువగా స్త్రీలతో తిరిగేవాడు. వారిలో ఎక్కువ మంది వేశ్యలే. ఇలాంటి అనుభవాలతో వ్రాసినదే తనకు ఎక్కువ ఖ్యాతి తెచ్చిన మొదటి కథ ‘బాల్ ఆఫ్ ఫాట్’. 1880 నుంచి 1890 వరకు మోపస చాలా విస్తృతంగా రచనలు చేశాడు. మూడు వందల కథలు, ఆరు నవలలు, రెండు వందల వ్యాసాలు, రెండు నాటకాలు, మూడు యాత్రా పుస్తకాలు, ఒక కవితా సంపుటి, అనేక పత్రికలకు సంపాదకత్వం – వీటితో అతని పేరు విశ్వవిఖ్యాత మైంది. బయటకి చూడడానికి చాలా దృఢంగా, ఆరోగ్యంగా కనిపించినా స్వేచ్ఛా సంచారంతో వచ్చిన సిఫిలిస్ వ్యాధి వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తమ్ముని మరణం కూడా అతన్ని బాగా కుంగదీసింది. 1892లో తీవ్ర మానసిక సంఘర్షణలో గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. 43 వ పుట్టిన రోజుకి ఒక్క నెల ముందు మరణించాడు. మార్లో జాన్స్టన్ చాలా కష్టపడి వ్రాసిన ఇతని జీవిత చరిత్ర ఎన్నో విషయాలను తెలియ చేస్తుంది.
ఇతని సృజనాత్మక ప్రపంచం చాలా సహజంగా, వాస్తవికంగా ఉంటుంది. ఇతని పాత్రలన్నీ మానవ సంబంధమైన ఆవేశకావేశాలను, సహజ సిద్ధమైన కోరికలను కలిగి ఉంటాయి. అందరూ కూడా విధి చేతిలో వంచితులై పోరాట యోధులై కన్పిస్తారు. జీవితం లోని అతి చిన్న, అనవసరమైన విషయాలను వదిలి పాత్రల స్వభావాన్ని సమర్ధవంతంగా బయటపెట్టగల సంఘటనలను, అంశాలను ఎంచుకోడమే ఈయన గొప్పతనం. సరళమైన భాష, సూటిగా ఉండే చిత్రీకరణ మోపసను గొప్ప కథా రచయితగా నిలబెట్టాయి. ఓ.హెన్రీ , చెఖోవ్ , హెన్రీ జేమ్స్ లాంటి గొప్ప కథకులు ఆయన ద్వారానే స్ఫూర్తి పొందారంటే ఆశ్చర్యం లేదు.
ఇతని కథల నిండా రైతులు, చేపలు పట్టే వారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, సైనికాధికారులు – ఇలా విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయి. దైనందిన జీవితంలో కనిపించే సాధారణ మనుషుల దయనీయ గాధలను చాలా బాధాకరమైన జీవితాలను హృద్యంగా సహజత్వం కోల్పోకుండా చెప్తాడు మోపస. మానవ లక్షణాలను, విలువలను నాశనం చేసే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను బాగా చిత్రీకరిస్తాడు. ఎక్కువ కథలు స్త్రీ-పురుష ప్రేమ సంబంధాల గురించి, భార్యా భర్తలిరువురికీ ఇతర పురుషుల, స్త్రీలతో గల బంధాలు, సంబంధాలు – ఇలాటి ఇతివృత్తాలతో సాగుతాయి. ఎక్కడా రచయిత జోక్యం చేసుకుని ఇది తప్పు, ఇది ఒప్పు అని తీర్పు చెప్పే విధంగా మాట్లాడాడు. ఒక సన్నివేశాన్ని, ఒక జీవిత భాగాన్ని వివరించి దాన్ని చదువరికి వదిలేస్తాడు.
జీవితం పట్ల ఈయన కనబరచిన వేదాంత ధోరణి ఈయన సరళ మైన భాష, వ్యక్తీకరణ కింద మరుగున బడుతుంది. జీవన మౌలిక విషయాలను, ఇతరులను అర్ధం చేసుకు, గౌరవంగా వ్యవహరించాల్సిన మానవత్వపు అవసరాన్నిఎక్కువగా చిత్రీకరిస్తాడు మోపస. అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు క్లుప్తత, ఇంకా ఆసక్తికరమైన ముగింపులు.ఇవి మరో గొప్ప రచయిత హెమింగ్ వే ను ప్రభావితం చేసాయి. అయితే మోపస వ్రాసిన పేరొందిన కథలు దీర్ఘమైనవే.
అది వ్యంగ్యం కావచ్చు(టు ఫ్రెండ్స్), హాస్యం కావచ్చు(ద మేసన్ టేల్లియర్), విషాదం కావచ్చు(ద పీస్ ఆఫ్ స్ట్రింగ్), భయానకం కావచ్చు(లే హోర్ల), – తనదైన శైలిలో చాలా సరళంగా చెప్పుకుని వెళ్లి పోతాడు. ఇలా చెప్పడంతో తన వేదాంత ధోరణి ఈ సరళత, కథనం కింద మరుగునపడిపోయింది. ప్రతి కధా వైవిధ్యంగా చాలా కొత్తగా అనిపిస్తుంది.
టు ఫ్రెండ్స్ (ఇద్దరు మిత్రులు)
కొన్ని సంవత్సరాల తరువాత, యుద్ధ కాలంలో తిరిగి కలుసుకున్న ఇద్దరు మిత్రులు, వారిని స్నేహితులుగా మార్చిన, వారికి ఎంతో ఇష్టమైన, ‘చేపల వేట కోరిక’ తీర్చుకునే క్రమంలో దుర్మార్గులైన వారిని అమాయకంగా నమ్మి ఎలా వారి జీవితాలనే కోల్పోతారో తెలిపే కథ యిది .
ఒక జనవరి నెల ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుకోకుండా ఎన్నో సంవత్సరాల క్రితం దూరమైన స్నేహితులు ఓ నగర వీధులలో కలుస్తారు. ఆ కలయిక వారిని తమకు ఇష్టమైన చేపల వేట జ్ఞాపకాలలోకి నెడుతుంది. వారి స్నేహం ఒక చెరువు వద్ద చేపలు పట్టే కాలక్షేపం దగ్గర మొదలవుతుంది. పెద్దగా మాట్లాడుకోకపోయినా, ఆ కలయిక వారిరువురి అంతరంగాలను ఒకరికొకరికి దగ్గరగా చేస్తుంది. ఒకరి సమక్షంలో ఒకరు చాలా సంతోషంగా తృప్తికరంగా ఉంటారు. అలాంటి వారు క్లిష్టమైన యుద్ధ సమయంలో కలిసినప్పుడు, ‘ఆ పాత రోజులు ఎంత బావుండేవి, చేపలవేట జ్ఞాపకాలు ఎంత మధురమైనవి’ అని అనుకోవడమే కాక, ఆ అనుభూతులు తిరిగి పొందాలని, తమ చేపల వేట సామాగ్రిని తీసుకువచ్చి, తమకు పరిచయమున్న ఒక సైనిక అధికారి నుంచి ఆక్రమిత ప్రాంతంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళడానికి అనుమతి పొందుతారు.
ఆ అధికారి, వారు ఆ చెరువు వద్దకు వెళ్లి రావడానికి అవసరమైన ఒక పాస్వర్డ్ చెప్తాడు. అక్కడకు చేరి తన్మయత్వంలో చేపల వేట లో మునిగీ పోతారు. వారికి కొంత సమయం తరువాత తాము శత్రు సైనికులచే చుట్టుముట్టబడి ప్రమాదంలో ఉన్నామని గమనిస్తారు. శత్రు సైన్యాధికారి వారిని తనపై ఉపయోగించబడిన గూఢచారులనే అభియోగంతో వారిని నిర్బంధించి, వారి పాస్వర్డ్ తనకు చెప్పాలని, అలాగైతేనే వారిని విడిచి పెడతామని బెదిరిస్తాడు. ఒకరికి తెలియకుండా ఒకరు తనకు రహస్యంగా పాస్వర్డ్ చెప్పి తప్పించుకోవచ్చని లాభాపేక్ష చూపినా, వారిద్దరూ పాస్వర్డ్ చెప్పరు.
ఆ అధికారులు వారిద్దరినీ చంపి వేస్తారు. వారు చేపల వేటలో పట్టిన చేపలను వంట వాడికి ఇచ్చి ఆ అధికారి చాలా నిర్లిప్తంగా, ఏమీ జరగనట్లుగా ‘వాటిని బ్రతికి ఉండగానే వేపుడు చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది’ అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
మానవుడు తన సాటి మనుషుల ప్రాణాలను హరించి కూడా ఏమీ పట్టనట్లు, తన దైనందిన వ్యవహారమైన తిండి పట్ల తోటి మనుషుల ప్రాణాల కన్నా ఎంత శ్రద్ధ వహిస్తాడో, మోపస చాలా వ్యంగ్యంగా ముగింపు వాక్యాలలో చెప్తాడు, కథ మొత్తం ‘యుద్ధం మనుషులను అమానుషంగా చేస్తుంద’ని చూపిస్తుంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలు,అలాటి సంభాషణలు, ఎంత విలువైనవో పరోక్షంగా చూపుతాడు.
ఇలాటిదే మరో కథ ‘లవ్’. ఈ కథలో ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్తాడు. ఇరువురు సోదరులు బాతుల వేటకెళ్తారు. చివరగా ఒక ఎగిరే పక్షిని కాలుస్తారు. అది కింద పడిపోతుంది. అది ఆడపక్షి. వారిలో ఒకడు ‘దీనికోసం మగపక్షి తప్పక వస్తుంద’ని చెప్తాడు. వారిద్దరూ వేచి ఉండి కాసేపటికి ఆ ఆడపక్షికై నేలకు వాలిన ఆ మగ పక్షినీ మట్టుపెడతారు.
ప్రేమ ఎలా జీవుల్ని బంధిస్తుంది,దాన్ని మనుషులు తమ స్వార్ధానికి ఎలా వాడుకుంటారనేది కధా ఇతివృత్తం. సహజంగా జరిగే ఓ దైనందిన ఘటన ఇది. దాన్నెలా కథగా ఎంచుకున్నాడో చూడండి. మోపస వైవిధ్యమేమంటే ఏ కధా ప్రయత్నపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నించడు. కథ అలా అప్రయత్న ప్రవాహంలా సాగిపోతుందంతే.
ఎక్కువ కథలలో యుద్ధం యొక్క క్రూరత్వం గురించి, మనుషుల మోసపూరిత నైజం గురించి చెప్తాడు. మానవ స్వభావం తప్పులు చేస్తూనే ఉంటుందని, ఎవరూ దీనికి అతీతులు కారని తెలియచేస్తాడు. స్త్రీల పట్ల సానుభూతిని వ్యక్తపరుస్తాడు. స్త్రీలను ఉపయోగించుకోడంలో మగవారు ఎలాటి తెలివిని ప్రదర్శిస్తారో పలు విధాలుగా చూపుతాడు. వేశ్యలను సమాజానికి పట్టిన చీడలుగా చూసేందుకు ఒప్పుకోడు. నైతికంగా వారిని తక్కువగా చూడడం తప్పని చెప్తాడు. ‘బాల్ ఆఫ్ ఫాట్’ (మెత్తని బంతి) కథలో ఒక వేశ్యను తోటి ప్రయాణీకులు తమస్వార్ధంకోసం వాడుకుని ఎలా అవమానిస్తారో వివరిస్తాడు.
మెత్తని /లావు బంతి
ఆక్రమణకు గురైన యుద్ధ కాలంలో ఉన్న ఒక ఫ్రెంచ్ నగరంలో ప్రారంభం అయ్యే కథ ఇది. పరాయి సేనల ఆక్రమణకు గురి అయ్యే క్రమంలో ఏ ప్రాంత పౌరులైనా, సైనికులైనా ఏ విధంగా ప్రవర్తిస్తారు, తెచ్చిపెట్టుకున్న నాయక లక్షణాలు ప్రదర్శిస్తారనే అంశాలను చూపిస్తుంది. యుద్ధ వాతావరణ సమయంలోని పౌరుల, సైనికుల మనస్తత్వాన్ని, ప్రవర్తనను తెలియచేస్తుంది.మోపస రచనల లోని అత్యుత్తమ కథ గా చెప్పబడే కథ ఇది. మానవుల స్వార్ధాన్ని క్రూరత్వాన్ని సాటి మనుషుల పట్ల కనీస జాలి చూపలేని తనాన్ని అద్దం పట్టినట్లు చూపిస్తుంది.
పరాయి సేనల ఆక్రమణలో ఉన్న ఆ నగర గ్రామ పౌరులలో ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానాలలో ఉన్న ముగ్గురు పెద్ద మనుషులు తమ భార్యలతో కలిసి ఆ ఆక్రమిత ప్రాంతం నుంచి వేరొక పట్టణానికి వెళ్ళడానికి, ఆక్రమణదారులయిన ప్రషియన్ సైనిక అధికారి నుంచి అనుమతి పొంది ప్రయాణమవుతారు. ప్రయాణం ప్రారంభమైన కొద్ది సమయానికి వారు తమ సహప్రయాణికుల లో ఇద్దరు సన్యాసినులు, ఒక వేశ్య ఉన్నట్లు గమనిస్తారు. అధికార పరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలలో ఉన్న ఆ ముగ్గురు పెద్ద మనుషులు, వారి భార్యలు, ఆమె తమతోకలిసి ప్రయాణించడం సహించలేకపోతారు కానీ దానిని బయటికి వ్యక్త పరచరు. కానీ వారి మాటతీరు, ప్రవర్తన, ఆమె పట్ల వారికిగల చులకన భావాన్ని తెలియ చేస్తూనే ఉంటుంది.
తీవ్రమైన చలి కాలంలో మంచులో వారి ప్రయాణం అనుకున్న దానికంటే చాలా సమయం తీసుకుంటుంది. మార్గమధ్యంలో వారికి ఎలాంటి భోజన వసతి కల ప్రదేశాలూ కనిపించవు. ఆకలితో ఆ ధనవంతులు, వారి భార్యలు సతమతమవుతున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణాన్ని ముందే ఊహించినట్టు, ఆ వేశ్య, తన వెంట తెచ్చిన ఆహారపు బుట్ట నుంచి ఆహారాన్ని తీసుకు తింటూంటుంది. వారు ఆమెను అడగలేక, ఆకలికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ లోపల ధనవంతుల భార్యలలో ఒకరు ఆకలితో స్పృహ తప్పుతారు. ‘లావైన బంతి’గా పిలవబడే ఆ వేశ్య తనతో తెచ్చిన ఆహారాన్ని వారందరితో పంచుకుంటుంది. ఆమె పట్ల ఎలాంటి భావనను వ్యక్తపరచని సన్యాసినులు కూడా ఆమె ఇచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అప్పటివరకూ ఆమెను తక్కువగా చూసిన ఆ ధనవంతులు ఆమె కరుణను, దయా హృదయాన్ని పొగుడుతారు. ఇంతలో ఒక ఊరు చేరిన వారిని ఆ ప్రాంత సైనికాధికారి, ముందుకెళ్ళేందుకు వారికి అనుమతి ఉన్నా కూడా వారిని అక్కడ వసతి గృహములో ఆనాటికి ఉండవలసిందేనని నిర్బంధిస్తాడు.
ఆ ప్రష్యన్ సైనిక అధికారి ఆ వేశ్యపైగల తన కోరికను ఆమెతో వ్యక్తపరుస్తాడు. ఆమె నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది. దాంతో ఆ అధికారి వారందరికీ ఆ ప్రాంతం విడిచి వెళ్లడానికి అనుమతిని ఇవ్వడు. మిగతా వారందరికీ ఆ నిర్బంధం వెనుక కారణం ఎలిజబెత్ రోసా (ఆ వేశ్య) ఆ ప్రష్యన్ అధికారి కోరికను మన్నించక పోవడమే అని తెలుస్తుంది. ఆ విధంగా వారు రెండు మూడు రోజులు నిర్బంధంలోనే ఉంటారు. ఇక భరించలేక ధనవంతులు, వారి భార్యలు ఎలిజబెత్ కి స్త్రీ హృదయం త్యాగమాయమని, వారందరి మేలుకోరి ఆమె ప్రష్యన్ సైనిక అధికారి యొక్క కోరిక తీర్చ వలసిందే నని చెప్తారు. సన్యాసినులు ఏ అభిప్రాయాన్ని తెలియచేయక నిర్లిప్తంగా ఉంటారు. గత్యంతరంలేక ఎలిజబెత్ ప్రష్యన్ అధికారి కోరికను మన్నిస్తుంది.
మరునాడు వారందరి ప్రయాణం తిరిగి ప్రారంభం అవుతుంది. కానీ వారందరూ ఎలిజబెత్ ను అంటరానిదానిలా చూస్తారు. ఆమెకు దూరంగా జరిగి ఆమెను అవమానకరంగా మాట్లాడుతారు. ఆమె నిర్ఘాంత పోతుంది. కొంత ప్రయాణం గడిచిన తరువాత వారందరూ ఏదో ఒక ఆహారాన్ని తింటూ ఉంటారు. సన్యాసినులతో సహా ఏ ఒక్కరూ ఆమెకి ఆహారాన్ని ఇవ్వరు. దుఃఖిస్తూ ఉన్న ఆమెను పట్టించుకోరు. దీనితో కథ ముగుస్తుంది.
మోపస కథ మొత్తంలో ఒక్కసారి కూడా ధనవంతులు గానీ సన్యాసినులు గానీ ఈ విధమైన మనస్తత్వం కలవారు, మానవత్వం లేని వారు అని చెప్పడు. కానీ వారి చర్యలను, మాటల ద్వారా వారి అమానవీయతను చాలా సూటిగా ప్రకటిస్తాడు. సమాజంలో ఏ వర్గమూ కూడా ‘ఈలాటి లక్షణాలకు (స్వార్ధపరత్వం, అమానుషత్వంకు) అతీతులు కారు’ అంటూ వర్తకుల పాత్ర, జమీందారు పాత్ర ద్వారా మాత్రమే కాక, సన్యాసినుల నిర్లిప్తత ద్వారా కూడా తెలియచేస్తాడు. అదేవిధంగా సైనికులు ఏ దేశం వారైనా, సామాన్యులు మాత్రం ఒకే విధంగా కష్టపడతాడని రుజువు చేస్తాడు. యుద్ధ కాలంలో తమ దేశ సైనికులైనా, ఆక్రమణ చేసే సైనికులయినా, పౌరుల పట్ల ఒకే విధమైన దాష్టీకం చేస్తారని ఈ కథ ద్వారా అభిప్రాయపడతాడు.
ఇలాటి యుద్ధ నైపధ్యంలో జరిగే మరొక గొప్ప కథ ‘మదర్ సావేజ్’.
యుద్ధం మానవ ప్రవర్తన నెలా ప్రభావితం చేస్తుందనే ఇతివృత్తంతో సాగే కథ ‘మదర్ సావేజ్’. కథకుడు 15 సంవత్సరముల తరువాత తన స్నేహితుని కలిసి అతని గ్రామంలో వేటకు వెళ్ళినప్పుడు 15 సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు అతనిని వెంటాడతాయి. ఆ గ్రామంలో దూరంగా విసిరేసినట్లు ఒక గుడిసె, అందులో ఒక మహిళ,ఆమె కుమారుడు ఉంటూ ఉంటారు. ఆమె భర్తను జర్మన్ పోలీసులు చంపేస్తారు. ఆమె కుమారుడు చావెజ్ ఫ్రెంచ్ ఆర్మీలో చేరి యుద్ధంలో పోరాడటానికి వెళతాడు. ఆమె ధనికురాలు కాబట్టి ఆమె ఒంటరి తనం గురించి గ్రామస్తులెవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ కథకుడు ఆ గుడిసెను పాడుబడిన స్థితిలో చూసి ‘ఆ కుటుంబం ఏమైంద’ని తన స్నేహితుడిని అడుగుతాడు. తన కుమారుడు తనను విడిచి యుద్ధానికి వెళ్ళిన తరువాత ఆమె ఎవరితో పెద్దగా కలవడం లేదనీ, వారానికి ఒకసారి గ్రామంలో దుకాణం నుంచి బ్రెడ్, కొంచెం మాంసము ఖరీదు చేయడానికి మాత్రం బయటికి వచ్చేదని చెప్తాడు.
శత్రు సైన్యం గ్రామాన్ని ఆక్రమించినప్పుడు సైనికులకు నివాసాన్నీ, ఆహారాన్నీ ఇచ్చే ఏర్పాటు గ్రామస్తుల శక్తి సంపదల కొద్దీ జరుగుతుంది. మదర్ చావెజ్ ఆర్థిక స్థితి తెలిసి, ఆమెకు నలుగురు యువకులు కేటాయింప పడతారు. ఆమె ముసలి వయస్సు చూసి ఆ నలుగురు సైనికులు కూడా బాగానే ఉంటారు. ఆమెకు ఇంటి, వంట పనులలో సహాయం చేస్తారు. ఆమె వారికి తమ తల్లిని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆమె కూడా వారికి తల్లి లాగా వండి పెడుతూ ఉంటుంది. ‘తన కొడుకు ఫలానా అని, అతని ఆచూకీ ఏమైనా వారికి తెలుసా’ అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది.
ఇలా ఇరువర్గాలు సానుకూలమైన భావాలతో ఉన్న సమయంలో, ఆమెకు ఒకరోజు తన కొడుకు శత్రువు చేతిలో చనిపోయినట్లు, అతని శరీరము కూడా గుర్తించలేనంతగా ముక్కలు గావించబడినట్లు ఉత్తరం వస్తుంది. ఒక తల్లిగా పుత్రశోకం ఆమెను కుదిపివేసినా, యువ సైనికులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి గుండెదిటవు చేసుకుంటుంది. ఏమీ జరగనట్లు వారిని పలకరించి భోజనం పెడుతూ వారి ఊరు పేరు తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంటుంది. చాలా చల్లగా ఉండడం వలన వారికి ఒత్తయిన ఎండుగడ్డితో పడకలు ఏర్పాటు చేస్తుంది. ఆమె ప్రేమకు ఆశ్చర్యపడుతూ చాలా ఎత్తుగా ఎండుగడ్డి పడకలు ఏర్పాటు చేయడంలో ఆ సైనికులు కూడా ఆమెకు సహాయం చేస్తారు. లోపలకు వెళ్లి చలి లోపలకు రాకుండా ఉండడానికి ఒక తలుపును కూడా మూసి పడుకుంటారు.
బాగా రాత్రి గడిచిన తరువాత. వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తన ఇంటికి నిప్పు పెడుతుంది మదర్. ఆ మంట వ్యాపించి ఆ గడ్డి పడకను కూడా అంటుకుని ఆ మంటల్లో ఆ నలుగురు యువకులు కూడా కాలి మరణిస్తారు. గ్రామస్తులు, ఇతర సైనికులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తారు, కానీ ఆమె తానే వారిని చంపానని చెప్తుంది. ఆమె ‘మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడుతోంద’ని ప్రజలు అనుకుంటారు. ఆమె తన కుమారుని మరణం తెలిపే ఉత్తరం, ఆ యువ సైనికుల పేర్లు, చిరునామాలు ఉన్న కాగితాలు వారికి అందించి, ‘వారి కుటుంబాలకు వారి మరణ సమాచారం చేరవేయమని, మదర్ చావెజ్ చంపినట్లు రాయమ’ని, అనగానే సైనికాధికారులు ఆశ్చర్యపోతారు’ అక్కడే ఆమెను తుపాకీతో కాల్చి చంపుతారు.
యుద్ధం ఎంతటి సాధువునైనా క్రూరంగా ఎలా మార్చగలదో తెలుపుతుంది. గ్రామస్తులకి సైన్యము పట్ల, సైన్యానికి గ్రామస్తులు పట్ల గల అభిప్రాయాలను, ప్రవర్తనను నిష్పక్షపాతంగా చెప్తాడు. ‘దేశ భక్తి సంబంధిత ద్వేషము’ రైతులకు చేతకాదని, అది ఉన్నత వర్గాలకు చెందినదని అభిప్రాయపడతాడు. కానీ యుద్ధ కారక భావోద్వేగాలు సామాన్య రైతు మహిళను ఎంత క్రూరంగా స్పందించేలా చేశాయో చూపుతాడు. ‘ఉద్వేగ క్షణాలలో మనుషుల స్పందలనను, ప్రతిస్పందనలను ఊహించలేమ’ని నిరూపిస్తాడు.
యుద్ధ నేపధ్యం లో సాగే కథలకన్నా భిన్నంగా కొన్ని కథలు మానవ నైజాన్ని అద్దం పడతాయి. స్త్రీ పురుషుల మనస్తత్వాలను పోల్చి చూపుతూ స్త్రీలను, వారి స్థానాన్ని సమర్ధిస్తాడు మోపస. ‘ద మదర్ అండ్ ద సన్’, ‘ద ఫాదర్’, ‘అ వెడింగ్ గిఫ్ట్’ – లాటి కథలు స్త్రీల సంక్లిష్ట మనస్తత్వంపట్ల అతని సానుభూతిని తెలియచేస్తాయి. ‘ ద రెక్’, ‘ద లాగ్’, ‘ద పీస్ ఆఫ్ స్ట్రింగ్’ ‘డేడ్ వుమన్స్ సీక్రెట్’ లాటి కథలు కూడా ఇలాటి సున్నితమైన విషయాలను తాకేవే.
‘ద మదర్ అండ్ ద సన్’
ఒక న్యాయవాది ఓ చనిపోతున్న స్త్రీ ఇంటికి వెళ్తాడు. ఆమె తన మరణం తర్వాత తన కుమారుని వెతకమని చెబుతుంది. ఆ మహిళకు పెళ్లికి ముందే ఒక ప్రేమికుడితో సంబంధం ఉంటుంది. వేరొక వ్యక్తితో పెళ్ళయ్యాక పిల్లవాడు కలిగాక భర్త మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు కూడా వేరొక స్త్రీ ని పెళ్లాడతాడు. కానీ అకస్మాత్తుగా ఈమెను కలుస్తాడు. వీరి బంధం మళ్ళా వికసిస్తుంది. పిల్లవాడుకూడా అతన్ని చాలా ఇష్టపడతాడు. అయితే అతనికి యుక్తవయసు వచ్చాక వీరి బంధం గురించి తెలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. మానసికంగా కుంగిపోయి తనను మళ్లీ ఆ పిల్లవాడిని తెచ్చిందాకా రావద్దని, కలవద్దని చెబుతుంది. క్రమంగా కుంగి పోయి మరణిస్తుంది. ఒక స్త్రీకి గల సంక్లిష్టమైన లక్షణాలు చెప్తాడు ఈ కథలో మోపస. ఒక వైపు తన కోరికలు, మరోవైపు తన కుమారునిపై ప్రేమ, ఒక స్త్రీ గా ఆమె పడే ఆవేదన అద్భుతంగా వర్ణిస్తాడు.
అయితే మోపస స్త్రీలలోని తప్పులను ఎత్తిచూపడంలో కూడా వెనుకాడడు. ‘ద డైమండ్ నెక్లెస్’, ‘ద పర్షియన్ ఎఫైర్’, ‘మతిల్డ’ వంటి కథలు సాధారణ మానవులలా కొందరు స్త్రీలలోని వ్యామోహ లక్షణాలనూ చూపుతాయి.
‘ద పర్శియన్ అఫైర్’ అనే కథ ప్రారంభం లో ఒక స్త్రీ నిజంగా తను గనక తలుచుకుంటే, కోరుకుంటే ఆ కోరికను సాధించుకోడానికి ఏమి చేయగలదో వివరిస్తాడు. “ పురుషునికి స్త్రీకి గల ఆసక్తి గురించి ఏమైనా తెలుసా? తన ఊహలో కలిగే దాన్ని సాధించుకోడంకోసం , తను సంతోష పడడం కోసం, పొందడంకోసం,చేయనిదేమీ లేదు. ఎ తప్పునైనా చేయడానికి సిద్ధ పడుతుంది, దేన్నైనా దాటి వెడుతుంది. నేను నిజంగా స్త్రీలా ఉండే స్త్రీ గురించి చెప్తున్నాను. పైకి తనకు సంబంధించనట్లు, తార్కికంగా కన్పించినా, ఆమె మూడు ఆయుధాలను సిద్ధం చేసికుంటుంది. మొదటిది, తన చుట్టూ జరిగే విషయాల పట్ల జాగరూకతతో ఉండడం, రెండవది మర్యాద అనే ముసుగు తొలగకుండా ప్రవర్తించడం, మూడవది మోసంచేసేందుకు సర్వశక్తులూ కలిగి ఉండడం. ఈమె కోసం మగవారు వారి సర్వాన్నీ వీరి పాదాల విడిచి,తనువు చాలించేందుకు సైతం సిద్ధపడతారు.” (‘ద పర్శియన్ అఫైర్’)
ఈ కథలో పారిస్ నగరం గురించి విని, స్వర్గ సుఖాల కలలు కనీ, ఊహించిన ఒక గృహిణి తన భర్తను విడిచి తీరని సుఖాల వెంపర్లాటలో పారిస్ పోయి ఎలాటి అనుభవాలను పొందిందో చెప్తాడు. కథ ఆసాంతం మనలను కట్టిపడేస్తుంది.
ఇదిలా ఉంటే, ‘ద లాస్టింగ్ లవ్’ అనే కథలో ‘ప్రేమించడం స్త్రీకి మాత్రమే తెలుసనే’ విషయాన్ని ఒక బీదరాలి ప్రేమ కథ ద్వారా తెలియచేస్తాడు. పురుషులలోని స్వార్ధాన్ని కాపట్యాన్ని చూపిస్తాడు. మోపస కథలలో ఒక తెలియని, హృదయాన్ని సూటిగా మంద్రంగా తాకగల సున్నితత్వమొకటి ఉంటుంది. అది అనితరసాధ్యం.
ఇక మోపస కథలలో భయాన్ని కలిగించే కొన్ని కథలు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. ‘మేజికల్ రియలిజం’ ను పోలి ఉండే ఇవి అసహజంగా, ఎబ్బెట్టుగా కాక ఉత్కంఠను కలిగించేవిగా ఉంటాయి.అలాంటి ఒక కథ ‘చెయ్యి’.
ఒక నేర పరిశోధనకు సంబంధించి తన నిర్ణయాన్ని వ్యక్త పరుస్తూ ఒక న్యాయమూర్తి ‘ఇలాంటి కేసులను తాను అతీంద్రియమైనదిగా పరిగణింపననీ, వివరణకు అతీతమైనదిగా, క్లిష్టమైనదిగా తీసుకుంటానని’ చెప్తాడు. గతంలో తాను న్యాయమూర్తిగా వేరొక ఊరిలో ఎదుర్కొన్న అనుభవాన్ని న్యాయస్థాన శ్రోతలకు చెబుతాడు.
తాను న్యాయమూర్తిగా పనిచేసిన ఆ నగర శివార్లలో ఒక ఇంగ్లీషు పెద్దమనిషి నివాసం ఏర్పరుచుకుని ఉండేవాడు. అందరికీ దూరంగా ఉండే అతని అలవాట్ల గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుని, అతనిని అనుమానాస్పదంగా ఒక చేతబడి చేసే వాడిగా చూసేవారు. అతని గురించి రకరకాల పుకార్లు విన్న న్యాయమూర్తి తానే స్వయంగా పరిశోధించి నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సర్ జాన్ అనే ఆ పెద్ద మనిషి తో ఏర్పడిన పరిచయం స్నేహానికి దారితీసి, వారింటికి రాకపోకలు కూడా జరుగుతాయి.
అలా వెళ్లినప్పుడు ఆ ఇంటిలో రకరకాల వస్తువులు, తుపాకులు మరియు ఇతర ఆయుధాలతో పాటు మణికట్టు దాటి నరకబడి, మణికట్టు వద్ద ఇనుప గొలుసులతో బంధించ బడిన ఒక మనిషి చేయి అక్కడ ప్రదర్శింపబడివుంటాయి. అక్కడి ఒక మేకుకు అది గట్టిగా బంధింపబడి ఉంటుంది. జడ్జి గారికి పూర్తి వివరాలు చెప్పకుండా ఆ చేయి తన గతం తాలూకు ఒక జ్ఞాపకం మాత్రమే కాక తనను హత మార్చడానికి ప్రయత్నం చేసే ఆయుధం అని చెప్తాడు సర్ జాన్. దాని నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడం తనకు దిన దిన గండం అని మాత్రం చెప్తాడు.
ఇది జరిగిన కొన్ని నెలలకు సర్ జాన్ హత్య గావించబడతాడు. పోలీసులకు పరిశోధనలో నేరస్తుడు ఎవరనేది ఎంతకూ అంతుచిక్కదు. ఆ ఇంటి కాపలా వాడు కూడా ఏమాత్రం చెప్పలేకపోతాడు. కానీ విచిత్రంగా సర్ జాన్ హత్య చేయబడిన రోజు నుంచి గోడకు గొలుసుతో బంధింపబడిన చేయి కనిపించకుండా పోతుంది. సర్ జాన్ భయపడినట్లు కాపలావాడు, నగరవాసులు అతనిని హత్య చేసింది ఆ చేయేనని నమ్ముతారు. న్యాయస్థానంలో శ్రోతలు జడ్జి గారిని ఈ విషయంపై అతని అభిప్రాయం అడిగినప్పుడు అతను ‘ఆ హత్య చేసింది ఆ చేయే అని నమ్మన’ని, ‘సర్ జాన్ చనిపోయేటప్పుడు అతని పళ్ళ మధ్య ఒక వేలు చిక్కుకుపోయింద’నీ , ‘ఆ చేయి యజమాని బ్రతికే ఉండి, సర్ జాన్ ను హత్యచేసి, దాని ఆనవాలు లేకుండా చేసి ఉంటాడని తన అభిప్రాయం’ అని చెప్తాడు. అయితే సాధారణంగా అనూహ్య విషయాలు కోరుకుని ఇష్టపడే శ్రోతలు దాన్ని నమ్మరు. నిజాన్ని ఎవరూ అంగీకరించరనే సత్యాన్ని ఈ కథలో చెప్తాడు మోపస.
ఇలా పలు రకాల అంశాలను ఆసక్తికరంగా కథా రూపంలో చెప్పడం మోపసాకే చెల్లింది.ఈయన నుంచీ స్ఫూర్తి పొంది కథను ఎందరో తరువాతి తరాల రచయితలుఅనేక కోణాల్లో, పద్ధతుల్లో వైవిధ్యభరితంగా ప్రయోగాత్మకంగా రచించినా, కథా ప్రపంచంలో ‘మొపాసా’ స్థానం ఎప్పటికీ మొదటిదే, అజరామరమైనదే!

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.