ఒక ఉచిత సలహా…

హాయ్ రా…

ఒకసారి ఏమయిందంటే-

నాకు జ్వరం వచ్చింది. తల్చుకుంటే ఇప్పుడూ జ్వరం వచ్చేలా వుంది.

జ్వరం వచ్చిందని మా మావయ్య నన్ను డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళాడు. అక్కడ నర్సింగ్ హోం నిండా జనం వున్నారు. సీజనట. అందరూ పెసెంట్లే. డాక్టరు కూడా పెసేంటే- అయిపోతాడు ఇంతమందిని చూస్తే.

టోకెన్ నెంబర్ ప్రకారమే పంపిస్తున్నారు. ‘అయినా రేప్పొద్దిటికల్లా మనల్ని చూసేస్తాడ్రా’ మావయ్య నవ్వుతాలుగా అన్నా ఏడుపు ముఖం పెట్టాడు. మేమలాగే వున్నాం. కొంతమంది ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మాకంటే వెనకొచ్చి ముందు వెళ్ళిపోతున్నారు. ‘ఈ జ్వరమేదో చెప్పి రావచ్చుగా?’ మావయ్య జ్వరం వచ్చినట్టే పేలుతున్నాడు.

మధ్యమధ్యలో మెడికల్ రిప్రజెంట్లు వచ్చి డాక్టరుకు పాఠాలు చెప్పి పోతున్నారు. ‘డాక్టరు దగ్గరకు వెళ్ళడం కోసమైనా నువ్వు మెడికల్ రిప్రజెంటు అవ్వాలిరా’ మావయ్య నా భుజం తట్టాడు. ‘లైఫ్ టార్గెట్ గా తీసుకో… ఆ…’ అన్నాడు. చెప్పాను కదా, జ్వరం నాకు. పేలాపణలు మావయ్యకు.

మేం వచ్చి రెండు గంటలయ్యింది. డాక్టరు పిలవలేదు. కొంతమంది వచ్చి డైరెక్టుగా డాక్టరు దగ్గరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డాక్టరుగారి బంధువులట. ‘మామా.. నువ్వు నాకు అల్లుడు అయినా కాకపోయినా పర్లేదు, మాంచి డాక్టరుకు అల్లుడైపో’ మావయ్య సలహా. నన్ను నవ్విసున్నాడని అనుకుంటున్నాడేమో కాని బాగా ఏడిపిస్తున్నాడు.

పాపం మావయ్యకూ బోరు కొడుతోంది. గంటలు గంటలు వెయిట్ చెయ్యడం కష్టం కదా? మావయ్య మెదడ్లో బల్బు వెలిగింది. మావయ్య ముఖంలో లైటింగ్.

మావయ్య నాకు దగ్గరగా వచ్చి నా చెవిలో నోరు పెట్టి గుసగుసమని చెప్పాడు. ‘అల్లుడువి కదా.. నీకు ఫ్రీ’ అన్నాడు. ‘వైద్యం ఉచితం కాదు, కనీసం సలహా అయినా’ అన్నాడు. నావంక చూసి ‘కమాన్.. రెడీ వాన్ టూ త్రీ..’ అన్నట్టు మాట రాకుండా పెదాలు కదిలాయి.

దాంతో నాకు కడుపునొప్పి మొదలయింది. అప్పటికప్పుడే. తెగ నులుచుకు పోయాను. కడుపునొప్పితో చుట్టుకుపోయాను. ఏమయింది… అన్నట్టు అందరూ చూస్తున్నారు. ‘ఏమయిందిరా?’ మావయ్య ఆందోళన పడ్డాడు. ‘కడుపు నొప్పి’ చెప్పలేక చెప్పాను. చూసిన నర్సు పరుగున వెళ్ళి డాక్టరుకు చెప్పినట్టుంది. డాక్టరే మమ్మల్ని లోపలకు రమ్మని పిలిచారు. మావయ్య ముఖం వెలిగింది.

లోపలకు వెళ్ళాక టోకెన్ నెంబరు అడక్కుండానే డాక్టరుగారు నా పొట్ట నొక్కారు. మావయ్య వంక చూసారు. ‘ఎప్పటి నుంచి?’ అని అడిగారు. మావయ్య నీళ్ళు నమిలాడు. నేను గుటకలు మింగాను. బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు. నొక్కి చూసారు. ఏం తిన్నావని డాక్టరు అడిగారు. నేనొకటి చెపితే మావయ్యోకటి చెప్పాడు. ‘అపండిసైటిస్ అని అనుమానంగా వుంది, ఆపరేషన్ చెయ్యాలి…’ డాక్టరు చెప్పడం పూర్తి కాలేదు. నేను బెడ్ మీదనుండి బంతిలా గెంతి ‘తగ్గిపోయింది’ అన్నాను.

డాక్టరు నావంక మావయ్యవంక ఓసారి చూసాడు.

‘ఇప్పుడు కడుపునొప్పి తగ్గింది. జ్వరమే వుంది’ అన్నాను మళ్ళీ.

‘అప్పుడే కడుపునొప్పి పోయింది. ఇట్స్ గాన్. కాసేపు వుంటే జ్వరం కూడా పోతుందేమో?’ డాక్టరు నవ్వారు. నవ్వి ‘కడుపు నొప్పికి కడుపు మీద ఇవ్వాలి ఇంజక్షన్…’ నీడిల్ లోంచి ఎయిర్ పంపించి సిద్ధమైపోయాడు డాక్టరు. మావయ్య వంక నేను చూస్తే, మావయ్య ఎటో చూస్తున్నాడు.

‘అంటే.. అది.. కడుపునొప్పి లేదు, జ్వరం వుంది… ప్రామిస్…’ అన్నాను.

‘మరెందుకలా అబద్దం చెప్పావ్?’ డాక్టరు ముఖంలో కోపం.

‘అలా అయితేనే- ఎమర్జెన్సీ అని… తొందరగా చూస్తారని…’ నే చెప్తుంటే- డాక్టరేదో అనబోతుంటే- ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ‘అలా అబద్దాలు ఆడొచ్చా? తప్పుకదూ? నీకు బుద్ది లేదూ?’ అంటూ మావయ్యే నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. ‘ఇలా ఇంకోసారి అబద్దం చెప్పకుండా నోటి మీదా నాలుక మీదా ఇంజక్షన్ వెయ్యండి డాక్టర్…’ అని సలహా కూడా ఇచ్చాడు. నేను నోరు తెరవకపోయినా మూసుకోమన్నాడు.

‘మావయ్యా…’ అంటే-

‘నోర్ముయ్యి… నిన్నూ’ అని నా మీదకొచ్చి, ‘ఇప్పుడు కాదు, పద… ఇంటికి వెళ్ళాక నీకుంది’ అని నిబాయించుకున్న మావయ్య ‘సారీ డాక్టర్.. ఐ యామ్ వెరీ సారీ’ అని తెగ బాధపడిపోయాడు.

‘ఇట్స్ ఓకె’ అని డాక్టరు సరిపెట్టుకొని మందులు రాసాడు.

తర్వాత జ్వరమూ తగ్గింది.

ఈ పెద్దవాళ్ళు ఏదీ ధైర్యంగా చెప్పలేరు. చేయలేరు. మనల్ని ముందుకు తోసి పెద్దమనుషులుగా ప్రూవ్ చేసుకుంటారు. తరువాతెప్పుడో- మనం ఏడ్చిన ఏడాదికి ఐస్ క్రీమో చాక్లెట్టో కొని పెడతారు. మనకి టోకరా ఇచ్చి డాక్టరుకు టోకరా ఇచ్చినట్టు భుజాలెగరేస్తారు.

అలా జరిగి నాకు ఎప్పుడు జ్వరం వచ్చినా ఈ ట్రీట్మెంటంతా గుర్తుకు వస్తూ వుంటుంది!

-మోహన మురళి,

ఏడవ తరగతి, ‘ఎ’ సెక్షన్, రోల్ నెంబరు 43,

హిందూ పబ్లిక్ స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

2 comments

  • అస్సలు బాగోలేదు.
    పేషంట్లని సరిగ్గా చూసే పద్థతులు లేని పిచ్చి డాక్టరూ, వెర్రి మొర్రి వేషాలు వేసి లోపలికి వెళ్ళి, ఆ డాక్టరు పద్ధతులను సరిగా ప్రశ్నించలేని పిచ్చి మామా, అల్లుళ్ళూ.
    తక్కువ స్థాయిలో వుంది కధనం.

    • అవును, అస్సలు బాగోలేదు. పెద్దల వ్యవహారం. అంతకు మించి డాక్టర్ల వ్యవహారం. మీరెప్పుడూ ఏ ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లలేదని అర్థం అవుతోంది. మీరింతవరకూ పేషెంటు కాలేదని కూడా అర్థమవుతోంది. పద్దతిలేని పద్దతే యిక్కడ ఆసుపత్రుల్లో నడుస్తోంది. ఒక్క డాక్టరు. వందలకొద్దీ పేషెంట్లు. గాంధీకే వెళ్ళండి. నిమ్స్ కే వెళ్ళండి. మరెక్కడికైనా వెళ్ళండి. మీ మాటల్లో చెప్పాలంటే పిచ్చాసుపత్రులే దర్శనమిస్తాయి. అక్కడికి వెళ్లి ప్రశ్నించగలిగే వీలుందో లేదో తెలుసుకోండి. ఏడవ తరగతి మోహన మురళి నుండి ఎక్కువ స్థాయి కథనం ఆశించి భంగపడినందుకు మన్నించగలరు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.