చదరంగం

రోజులు వారాలు నెలలు
సంవత్సరాల నుండి
యుగాల్లో కి
లాక్కోబడిన కాలం

పునరావాసం దొరకక
కూలిన మానవత్వపు పునాదులపై
చిరునామా వెతుక్కుంటోంది

హక్కులు అరాచకాలపై తిరగబడిన
ఎర్రని రంగు తడి ఇంకా ఆరనే లేదు
గుండెలలిసేలా పరుగులు తీసిన సమానత్వం
అవినీతి గండ్ర గొడ్డళ్ల మాటున
కులం నెత్తుటి మరకలతో మైలపడిపోయింది

అథిష్ఠానాల పెనుగులాటల్లో
నలుదిక్కులనూ ఆక్రమించిన డబ్బు వాసన
రుతువులను క్రతువులు చేసి
ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది

క్షేత్ర స్థాయిలో ఆడిన ప్రైవేటీకరణ చదరంగంలో
పావులైన పేదవాడి ఆకలి కేకలు
వినేవాడెవ్వడు
మారుతున్న క్యాలెండర్ల మాయలో
నేనూ నాదనే స్వార్థం.

 

వైష్ణవి శ్రీ

8977237345

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.