నిర్భయం వల్ల జయం నిశ్చయం!

‘ఒకసారి మన మీద మనకు నమ్మకం ఏర్పడితే మనలోని కుతూహలాన్ని, ఆశ్చర్యాన్ని, తక్షణ ఆనందాన్ని, ఆ మాటకొస్తే మనిషిలోని అంతర్గత శక్తిని మేల్కొలిపే ఏ అనుభవాన్నైనా తిరస్కరించవచ్చు.’
-ఇ.ఇ.కమ్మింగ్స్

ఎన్నో ఏళ్ళుగా నా కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించకుండా వాయిదా చేస్తూ వచ్చాను. దానికి కారణం అపజయ భయం. ప్రతి పనిలో విఫలమవుతానేమోనని భయం. ఆ భయాన్ని అధిగమించడానికి తగిన ఆత్మవిశ్వాసం ఏ మాత్రం లేకపోవడం. మనందరిలో ఈ భయం ఉంటుంది. కీలకమైన ప్రశ్న ఏమిటంటంటే ఈ భయాన్ని ఎలా జయించడం?

ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఈ భయాన్ని సునాయాసంగా జయించవచ్చు. నిజానికి వైఫల్య భయాన్ని (Fear of Failure) జయించడానికి చెప్పే చిట్కాలన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి చెప్పే సూత్రాలే. ఆత్మన్యూనతతో, ఆత్మగౌరవ లేమితో కలల్ని నిజం చేసుకునే ప్రయత్నాలు ఏ మాత్రం సత్ఫలితాలనివ్వవు.

ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి చాల సున్నితమైన తేడా ఉంది. ఎదుటివారి నుండి గౌరవాన్ని పొందే అర్హత మీలో ఉందని నమ్మడం ఆత్మ గౌరవం అయితే, మిమ్మల్ని మీరు నమ్మడం ఆత్మవిశ్వాసం. నిజానికి ఈ రెండు ఒకటే. జీవితంలో విజయం సాధించడానికి అమృతంలా పనిచేసే ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా సాధించాలి? దీనికోసం ఏ లక్షణాలను మనం అలవరచుకోవా?.

ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోడానికి మానవ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేసి పాతిక సూత్రాలను అందించారు.
మీ ఆత్మవిశ్వాసం మీ చేతుల్లో:

మీ ఆత్మవిశ్వాసం మీద మీకు నియంత్రణ ఉందా? అది మీ చేతుల్లోనే ఉందా? మీ చేతల్లోనే ఉందా? అలా లేకపోతే మాత్రం మీరు ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతున్నట్టే. నేను సమర్ధుణ్ణి కాదు, నేను స్మార్ట్ గా లేను, అందంగా లేను అని మీరు ఫీల్ అవుతుంటే ఆ భావనలను ఆత్మవిశ్వాసంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు గౌరవానికి అర్హత సంపాదించుకోవచ్చు; మీ చుట్టూ తిరస్కార వాదులు (ప్రతి ఆలోచనను తిరస్కరించేవారు) ఎంతమంది ఉన్నా మీరు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని, మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీ కలలను నిజం చేసుకునే ప్రయత్నాలను అలవోకగా ప్రారంభించవచ్చు. ఈ క్రింద సూచించిన పాతిక సూత్రాలలో మీకు తగినవి, మీరింతవరకు పాటించడానికి ప్రయత్నించనివి వున్నాయేమో ఒకసారి చూడండి

1. చూసే కళ్ళకు మనసయ్యేలా: అవును. చూసే వాళ్ళ కళ్ళకు ‘వీడు నడిచే సక్సెస్ రా’ అనిపించేలా ఆకర్షణీయంగా తయారు కావాలి. చక్కగా గడ్డం చేసుకోవాలి. పిల్లి గడ్డాలు, పీచు గడ్డాలూ నిషేధం. సినిమా హీరోల గడ్డాలు, కేశాలంకరణ ఆ సినిమాకే పరిమితం. వాటిని అనుకరించడం అంటే మీ విజయ పరంపరకు మీరే పురిట్లో సంధి కొట్టడం.

2. వస్త్రధారణతో విజయాకర్షణ: మీ వస్త్రధారణ మీలోని ఆత్మ విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. ఖరీదైన వస్త్రాలే ధరించాలని నియమమేమీ లేదు. తీరైన దుస్తులు ధరిస్తే చాలు. అప్పుడు మీరే ఆత్మవిశ్వాసానికి ఆనవాలు.

3. మీ వ్యక్తిత్వ ఊహా చిత్రం: ప్రతి వ్యక్తికి తనదైన ఒక ఇమేజ్ ఉంటుంది. అది మన కంటే ముందు మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోతుంది. మన ఇమేజ్ మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. దాన్ని కాపాడుకోవడమే మన ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికి హామీ. మీ ఇమేజ్ పడిపోయే పనులు చేస్తే మీ ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. అటువంటి పనులకు దూరంగా ఉండటం మీ గౌరవాన్ని పెంచుతుంది.

4. సానుకూల దృక్పథం: ప్రతికూల ఆలోచనలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలి. నా ఆలోచనలను ఏ విధంగా మార్చుకోవాలి; తద్వారా ఏ విధంగా అనుకున్నది సాధించాలి? ఈ చిన్న నైపుణ్యంతో మీరు ఎంతటి గొప్ప విజయాన్నైనా సాధించవచ్చు.

5. ప్రతికూల ఆలోచనల అంతమే మీ పంతం: సానుకూల ఆలోచనలను పెంపొందించుకుంటూ, ప్రతికూల ఆలోచనలను ఆదిలోనే అంతం చేయాలి. ఎప్పటికప్పుడు మీ ఆత్మ సంభాషణను (సెల్ఫ్ టాక్) పరిశీలించుకోవాలి. మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేం చేస్తున్నారు? మీ గురించి మీకు ప్రతికూల ఆలోచనలు వస్తున్నట్లయితే; అంటే ‘ఇది నేను చేయలేను’ అని అనిపిస్తే, తక్షణం ఆ ఆలోచనలను సానుకూల ఆలోచనలతో నింపండి. సానుకూల దృక్పథం ఉన్నవారితోనే తిరగండి. వారితోనే స్నేహం చేయండి. ఈ అభ్యాసం మీ ఆత్మవిశ్వాసానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

6. నిన్ను నీవు తెలుసుకో: ‘మిమ్మల్ని మీరు తెలుసుకుంటే అన్ని యుద్ధాలు జయించవచ్చు’ అంటారు సన్ జు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తెలివైన సేనాని శతృవుల బలాబలాలను తెలుసుకుని మరీ వెళతాడు. శతృవు గురించి తెలుసుకోకుండా అతణ్ణి ఓడించలేము. ప్రతికూల వ్యక్తిగత ప్రతిష్ఠ స్థానంలో ఆత్మ విశ్వాసాన్ని నింపే ప్రయత్నంలో నీకు నీవే శతృవు. నిన్ను నీవు తెలుసుకోవడానికి, నీ ఆలోచనల్లో వచ్చే మార్పును అవగాహన చేసుకోడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ నీవు చేసిన మంచి పనులను, గతంలో నీవు సాధించిన చిన్న చిన్న విజయాలను పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అవి మళ్ళీ మళ్ళీ చేసేందుకు ప్రయత్నించాలి. మంచితనం మీద, మనుషుల మీద నమ్మకం కోల్పోకుండా అనితరసాధ్యమైన పట్టుదలతో ఆత్మవిశ్వాస వికాసానికి కృషి చేయాలి.

7. సానుకూల ఆచరణ: సానుకూలంగా ఆలోచించడమే కాకుండా, సానుకూల ఆచరణకు కూడా ప్రయత్నించాలి. అది చేస్తా, ఇది చేస్తా అని కబుర్లతో కాలం వెళ్ళబుచ్చడం ఏ మాత్రం విజయానికి దోహదం చేయదు. తక్షణ ఆచరణే సత్వర ఫలితాలనిస్తుంది. ఆచరణాత్మక వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసంతో సమాజానికి మార్గదర్శి అవుతుంది.

8. దయ, కరుణ: ఈ లక్షణాలు మీ ఇమేజ్ పెరగడానికి దోహదం చేస్తాయి. మీ తోటివారి పట్ల దయతో ప్రవర్తించడం, మీ సమయాన్ని, మీ దగ్గరున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఎటువంటి భేషజాలు లేకుండా ప్రవర్తించడం మీ ఇమేజ్ ని పదింతలు చేస్తుంది. మీ గురించి మీరు అద్భుతంగా ఫీల్ అవుతున్నప్పుడు అది మీ ఆత్మవిశ్వాసాన్ని వంద రెట్లు పెంచుతుంది. మీ సానుకూల ప్రవర్తనతో ఈ ప్రపంచాన్ని ఆకర్షించే అమోఘమైన శక్తిని సముపార్జించుకుంటారు. ‘విజయానికి విత్తనం నిస్సందేహంగా ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసానికి మూలం సంసిద్ధత’ అంటాడు ఆర్థర్ ఆషే.

9. సంసిద్ధత: ‘ఈ పని నేను చేయగలను అనుకోవడం; ఈ పని నేను చేయలేను అనుకోవడం. రెండూ నిజమే’ అంటాడు హెన్రీ ఫోర్డ్. రెండూ మీరే అనుకుంటున్నారు కదా! అంటే ఏ పని చేయడానికైనా మానసిక సంసిద్ధత ఎంతైనా అవసరం. అదే ఆత్మవిశ్వాసానికి అద్భుత బీజం అవుతుంది. జీవితం ఒక పరీక్ష అయితే, దాన్ని ఎదుర్కోడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.

10. నియమాల పట్ల నిబద్ధత: మీ జీవితాన్ని ఏ నియమాలతో, విలువలతో జీవిస్తున్నారు? ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వాటికి కట్టుబడి ఉంటున్నారా? ఈ విషయంలో మీకు స్పష్టత లేకపోతే మీ జీవితం అగమ్యంగా ఉందన్నమాట. మీ నియమాలు, విలువలను కేవలం ఆలోచిస్తున్నారా? అవి మీకు తెలుసా? అయితే వాటిని ఆచరిస్తూ జీవించండి. అది మీ ఆత్మవిశ్వాసానికి టానిక్ లా, ప్రొటిన్ లా పని చేస్తుంది.

11. నెమ్మదిగా మాట్లాడండి: ఇంత చిన్న విషయమా అని కొట్టి పారేయకండి. ఇది పాటిస్తే ఎదుటివారు మిమ్మల్ని గౌరవించే తీరులోనే మార్పు వస్తుంది. అధికారంలో ఉన్నవారు అధికార స్వరంతో మెల్లగా మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? అది వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ చిన్న లక్షణం మీరూ అలవరచుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి.

12. నిటారుగా నిలబడండి: నడుం వంచి నిలబడటం, విచిత్ర భంగిమల్లో నిలబడటం మీ ఆత్మన్యూనతకు గుర్తు. నిటారుగా పైనుంచి మిమ్మల్నెవరో తాడుపెట్టి లాగుతున్నట్టుగా ఆత్మవిశ్వాసంతో నిలబడండి. చూసేవారికి మీ ఆత్మవిశ్వాసం ముచ్చట గొలుపుతుంది.

13. మీ సామర్ధ్యాలను పెంచుకోండి: మీరు మరింత సమర్ధంగా ఎప్పుడు కనిపిస్తారు? మరిన్ని సామర్ధ్యాలను పెంచుకున్నప్పుడే! ఉదాహరణకు మీరో రచయిత అనుకుందాం. పత్రికల్లో రాయడం, బ్లాగులు రాయడం, చిన్న కథలు రాయడం ద్వారా మీ నైపుణ్యానికి, సామర్ధ్యానికి మరింత పదును పెట్టుకోవాలి. మరింత సాధన చేయాలి.

14. చిన్న లక్ష్యం పెట్టుకుని సాధించండి: ఇలా చేస్తే మీ ఆత్మవిశ్వాసం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఒక్కసారిగా చంద్రుణ్ణి అందుకోవాలని లక్ష్యం పెట్టుకోకూడదు. చతికిలబడతాం. చిన్న లక్ష్యం పెట్టుకుని, దాన్ని పట్టుదలతో సాధిస్తే అది పెద్ద లక్ష్యాల సాధనకు స్ఫూర్తిగా, ఇంధనంలా ఉపయోగపడుతుంది.

15. అలవాట్లను మార్చుకోండి: పెద్ద అలవాట్లు కాదు; పొగ తాగడం మానేయడం వంటి చిన్న అలవాట్లు వదిలేయడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలు రాసుకోవడం, పది నిముషాలు ముందు నిద్ర లేవడం, నిద్ర లేవగానే మంచినీళ్ళు తాగడం వంటి మంచి అలవాట్లు చేసుకోవాలి. ఒక నెల రోజులపాటు చేస్తే మీకు కోట్లు సంపాదించినంత ఆనందం సొంతమవుతుంది.

16. పరిష్కారాల మీద దృష్టి పెట్టండి: ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తుంటారా? సమస్యల మీదే దృష్టి పెడతారా? తక్షణం మీ దృష్టి మార్చుకోండి. పరిష్కారాలు వెదికే దృష్టిని అలవరచుకోండి. మీ ఆత్మవిశ్వాసానికి, మీ ఉద్యోగంలో విజయాలకు, ఆత్మవిశ్వాసానికి ఈ లక్షణం ఎంతగానో దోహదం చేస్తుంది. మీరు అతి బరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నన్ను నేను సంసిద్ధం చేసుకోలేను! నాకు స్ఫూర్తి లేదు! మరి సమస్యకు పరిష్కారం? మీ చేతుల్లోనే ఉంది. ప్రయత్నించండి. కృషితో న్నాస్తి దుర్భిక్షం!

17. చిరునవ్వు : విజయం సాధించే నిచ్చెన మెట్లలో చిరునవ్వు మరో చక్కని, తీయని ఆయుధం. ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. ఏడుపు మొహం పెట్టుకుని తిరిగే వాళ్ళ వైపు విజయం కన్నెత్తయినా చూడదు. మీ సమయాన్ని, శక్తిని చిరునవ్వును అభ్యాసం చేయడానికి వెచ్చించండి. ఇంతకు మించి మీ ఆత్మవిశ్వాసానికి బలవర్ధక ఆహారం మరొకటి ఉండదు. చిరునవ్వుతో మిమ్మల్ని చూసినవాళ్ళు కూడా ‘శక్తిమాన్ ‘ లా ఫీలవుతారు.

18. స్వఛ్చంద సేవ: అవకాశం కల్పించుకుని స్వఛ్చంద సేవ చేయండి. అనాధాశ్రమానికి, వృద్ధాశ్రమానికి, వికలాంగుల, అంధుల ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి. వాళ్ళతో ఒక రోజు గడపండి. వారి జీవితాల్లో ఒక్క రోజైనా వెలుగు నింపడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని అనూహ్య స్థాయికి తీసుకెళుతుంది.

19. కృతజ్ఞతలోనే విజ్ఞత: దేవుడిచ్చినదానికి, ఇతరులు చేసిన సాయానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. వినయంగా, తలెగరేయకుండా ఉండటం మీ ఇమేజ్ ని మరింత పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసానికి ‘కృతజ్ఞత చూపే లక్షణం’ మరింత వన్నె తెస్తుంది.

20. వ్యాయామం: మెదడు, దేహం, ఆత్మ చురుగ్గా పని చేయడానికి వ్యాయామం ఎంతగానో దోహదం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం అద్భుత సాధనం.

21. జ్ఞాన సముపార్జన: ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం, నలుగురూ మీవైపు చూసేలా సాధికారిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఆత్మవిశ్వాసానికి ఆయువుపట్టు. అది మీలో నాయకుణ్ణి, నాయకత్వ లక్షణాలని నిద్ర లేపుతుంది.

22. వాయిదా వేస్తున్న పని ఇప్పుడే చెయ్యండి: ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న పని , అపోహలు, అనుమానాలు పక్కన పెట్టి తక్షణం చెయ్యండి. దీనితో మీ ఆత్మవిశ్వాసం రాకెట్ లా దూసుకుపోతుంది.

23. చురుగ్గా ఉండండి: నిష్క్రియా పరత్వం నిస్పృహను పెంచుతుంది. ఎప్పుడూ చురుగ్గా, చైతన్యవంతంగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఉండండి.

24. ఒకేసారి పెద్ద ప్రాజెక్టులు వద్దు: చిన్న చిన్న పనులు చేస్తే అవి ఇచ్చే ఫలితాలు స్ఫూర్తినిస్తాయి. ముందుగానే పెద్ద ప్రాజెక్టులు చేపట్టి తిప్పలు పడకూడదు.

25. మీ డెస్క్ : మీ డెస్క్ పనికిరాని కాగితాలతో నిండిపోయిందా? ముందు దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆత్మవిశ్వాసం పదింతలవుతుంది.

వజ్రాల్లాంటి వాల్ట్ డిస్నీ మాటలతో ఈ వ్యాసం ముగిద్దాం. ‘కలల్ని నిజం చేసుకునే రహస్యాలు తెలిసినవాడు చేరలేని శిఖరాలున్నాయంటే నేను నమ్మలేను. ఒక ప్రత్యేక రహస్య సారాంశాన్ని నాలుగు ‘C’ లుగా చెబుతాను. కుతూహలం (Curiosity), ఆత్మవిశ్వాసం(Confidence), ధైర్యం(Courage), నిలకడ (Constancy). వీటిలో అన్నింటికన్నా మిన్న ఆత్మవిశ్వాసం (Confidence).

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.