పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ – కాపిటలిస్ట్ కోణం

కొంతకాలం క్రితం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో దర్శనమిచ్చాయి. తెలుగు లో కూడా వీటి హల్చల్ కొంతకాలం కనబడింది. ఈ పుస్తకాలు గత వందేళ్ళుగా అమెరికన్ మార్కెట్ లో అడపదడపా కనిపిస్తున్నా 1970 నుండి మొదలుకొని 2000 సంవత్సరం వరకు అవి మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన జోనర్ గా నిలబడి బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా ఒక వెలుగు వెలిగాయి. ఈ ముప్పై సంవత్సరాల కాలంలో కేవలం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలే మొత్తం పుస్తక ప్రపంచంలో దాదాపు మూడు శాతం ఆక్రమించేశాయంటే వాటి క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ మన దేశంలో కాస్త తరువాత మొదలైనా అమెరికా లో ఆ ముప్పై సంవత్సరాల కాలంలోనే ఎందుకు అంతగా ఈ పుస్తకాలు పుట్టుకొచ్చాయో అర్థం చేసుకుంటే అమెరికన్ ఎకనామిక్ చరిత్ర కూడా అర్థం ఔతుంది. అది అర్థమౌతే 2008 లో రిసెషన్ ఎందుకు వచ్చిందో తెలియడమే కాక, persuit of happyness సినిమా కూడా అర్థమౌతుంది. క్రిస్ గార్డ్నర్ అనే ఒక ఆఫ్రికన్ అమెరికన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. క్రిస్ గార్డ్నర్ గా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల ప్రకారం ఐతే జీవితంలో విజయం సాధించడమంటే ఒక ఉద్యోగాన్ని సంపాదించడమే. అందుకే ఈ సినిమా కూడా క్రిస్ గార్డ్నర్ ఉద్యోగాణ్వేషణలో పడే కష్టాలను చూపుతూ చివరికి అతడొక ఉద్యోగం సంపాదించటంతో ముగుస్తుంది. మనిషి ఆనందం ఉద్యోగంలోనే ఉందనేది ఈ సినిమా సారాంశం. మోటివేషనల్ సినిమాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఈ సినిమా ఉంటుందంటే అతిశయోక్తి కాదు, కానీ అదే లెక్కన ఈ సినిమా క్యాపిటలిస్ట్ సమాజపు విలువలను చాలా జాగ్రత్తగా మోసపూరితంగా మనలో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంది‌.

2006 లో సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం 1980 దశకంలోని అమెరికన్ క్యాపిటలిస్ట్ సమాజాన్ని కళ్ళముందు చూపిస్తుంది. ఈ సినిమా నడిచే కాలం 1980 అనేది మనం మరువకూడదు. ఎందుకంటే నిజ జీవితంలో ఆ సమయంలోనే నిరుద్యోగిగా ఉన్న క్రిస్ గార్డ్నర్ ఒక స్టాక్ బ్రోకర్ గా మారి కోటీశ్వరుడవుతాడన్నమాట. ఆ ముప్పై ఏళ్ల కాలంలో ఎంతో మంది అమెరికన్ క్యాపిటలిస్ట్ లు కోటీశ్వరులయ్యారు. అదెలా జరిగిందో తెలియాలంటే మనం అప్పటి ఆర్థిక సామాజిక చరిత్రను తరచి చూడాల్సిందే. 1970 నుంచి 2000 సంవత్సరం వరకు అమెరికన్ ఎకనామిక్ చరిత్ర చాలా ఉత్కృష్టమైనది. ఎందుకంటే అమెరికన్ సమాజంలో ఎప్పటినుంచో వేళ్ళూనుకున్న “శ్రామిక శక్తి కొరత” అనేది మటుమాయమవటం ప్రారంభించింది 1970 నుంచే. ఒకవైపు వర్క్ ఫోర్స్ లోకి ఎందరో చదువుకున్న అమెరికన్ యువతీ యువకులు చేరటం, ఇంకోవైపు యూరోప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలనుండి పెరిగిన వలసలు, మరోవైపు వేగంగా పుంజుకుంటున్న కంప్యూటరీకరణ మొత్తంగా వెరసి “శ్రామిక శక్తి” కొరత తీరిపోవటమే కాక అది చాలా తక్కువ ధరకు దొరకటం ప్రారంభమైంది. దీనికి తగ్గట్టుగానే క్యాపిటలిస్ట్ ల ఉత్పత్తులు సర్ప్లస్ దశకు చేరుకుని విపరీతమైన లాభాలను ఆర్జించి పెట్టి వాళ్ళందరినీ బిలియనీర్లను చేసింది. అంటే నిజానికి అప్పటి ప్రపంచార్థిక పరిస్థితులు, టెక్నలాజికల్ అడ్వాన్స్ మెంట్ వంటి అంశాలే వీళ్ళందరినీ ధనవంతులుగా చేశాయి. అందుకే ఆ సమాజంలో ఒకవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నిరుద్యోగ యువత, మరోవైపు అదనపు విలువలను ఆర్జించి సంపదనంతా పోగేసిన క్యాపిటలిస్టులు. ఈ ఆర్థిక అంతరాలను భర్తీ చేయటానికి, మసి పూసిమారేడు చేయటానికీ, క్యాపిటలిస్ట్ సమాజం మరో అద్భుతమైన మోసాన్ని కనిపెట్టింది. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. “నీవు కలలు కంటే .. నీవు సాధించగలుగుతావు. నీ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ నీ జీవితాన్ని అద్భుతమైన మలుపులు తిప్పి నిన్ను ఒక గొప్ప వాడిగా గొప్ప ధనవంతుడిగా తయారు చేస్తాయి” అని ఊదరగొట్టేదే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిన ఇటువంటి పుస్తకాలు “లా ఆఫ్ అట్రాక్షన్” అనీ, “పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్” అనీ, నీవు గట్టిగా సంకల్పించుకుంటే ప్రపంచమంతా నీకు అనుగుణంగా పని చేస్తుందనీ చెప్పటం మొదలు పెట్టాయి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదివి ఎంతమంది ధనవంతులయ్యారో తెలియదుగానీ ఈ పుస్తకాలు రాసుకుని కోటీశ్వరులైన వాళ్ళున్నారు. దీపక్ చోప్రా, శివ్ ఖేరా, ఆండ్రూ కార్నెగీ, పాలో కొయిలో లాంటి వారు, థియరీ ఆఫ్ ఆబ్జెక్టివిజంతో అయాన్ రాండ్ వంటి వాళ్ళూ కోట్లకు పడగలెత్తారు. “మోటివేషనల్ స్పీకర్” అనే కొత్త ఉద్యోగం అమాయకులైన నిరుద్యోగ యువతను ఉద్యోగాల వైపు ప్రేరేపించడానికి ఆకాశం నుండి ఊడిపడింది. కలగూర గంపలాంటి ఈ పుస్తకాలన్నీ చేసే ఉమ్మడి మోసమేమంటే, అప్పటి సామాజిక ఆర్థిక వాతావరణం వలననే ఈ క్యాపిటలిస్ట్ లు ధనవంతులయ్యారనే విషయాన్ని చెప్పకుండా వీళ్ళలోని పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పాజిటివ్ ఆలోచనలు లేదా ప్రత్యేకమైన క్రియేటివ్ జీనియస్ లేదా ఎంటర్ప్రీనియర్ జీనియస్ వలననే వాళ్ళంతా గొప్పవారి గా తయారయ్యారని చెబుతాయి. “చూశారా.. పలానా వ్యక్తి పలానా విధంగా ఆలోచించటం వలననే కోటీశ్వరుడయ్యాడు, కాబట్టి మీరూ అలాగే ఆలోచించి ధనవంతులు కండి” అని చెబుతుంటాయి. అచ్చు ఈ పుస్తకాలలాగే ఈ సినిమా కూడా క్రిస్ గార్డ్నర్ విజయానికి అతడిలోని పట్టుదల లేదా కష్టపడే మనస్తత్వము లేదా అతడి క్రియేటివ్ జీనియసే కారణమని చెబుతుంది. అందుకే ఇదొక భయంకరమైన మోసపూరితమైన సినిమా అని చెప్పక తప్పదు.

క్యాపిటలిస్ట్ సమాజం లో బీదరికమన్నది చాలా దారుణమైన విషయం. క్రిస్ గార్డ్నర్ తన బీదరికాన్ని చూపుకోవటానికి నామోషీగా ఫీలౌతాడు. తనకు ఇల్లు లేదనే విషయాన్ని చెప్పుకోలేక, తనకు కారు లేదనీ చెప్పుకోలేక తన బాస్ కు అబద్ధాలు చెబుతూ ఇబ్బంది పడుతుంటాడు. సోషల్ క్లాస్ వేరే ఐనందువలన అతడు తన బాస్ కంటే తక్కువ వాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆఫీసులో తన పని ఒకవైపు చేస్తూ మరోవైపు బాస్ కు టిఫిన్ లు కాఫీలు అందిస్తూ ఊడిగం చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో చదువుకూ సర్టిఫికెట్ కూ సంబంధం లేకుండా, రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయటం వలన మాత్రమే క్రిస్ లోని జీనియస్ కు విలువ పెరగడం, తద్వారా స్టాక్ బ్రోకర్ ఉద్యోగానికి ఇంటర్న్ గా సెలెక్టవడము జరుగుతుంది. అప్పటికే అమెరికాలో వలసలతో దేశ జనాభా పెరగడం, గవర్నమెంటు పే- రోల్స్ విపరీతంగా పెరగటం వలన నిరుద్యోగం పెరగటం అలాగే ధనవంతులు పెరగటమూ వాళ్ళంతా స్టాక్ మార్కెట్లపై ఆధారపడటం వంటి వాతావరణం లో క్రిస్ స్టాక్ బ్రోకర్ గా ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. యువతుల్లో చదువు పెరగటమే కారణం కావచ్చు లేదా సెకండ్ వేవ్ ఫెమినిజమమే కారణం కావచ్చు కానీ సంపాదన లోకి ‘స్త్రీ’ అనే కొత్త వ్యక్తి కూడా వచ్చి చేరటం మొదలైందప్పుడే. అమ్ముడుపోని మెడికల్ ఎక్విప్మెంట్ తో సంపాదన లేక క్రిస్ ఉంటే, రోజుకు రెండు షిఫ్ట్ లు పని చేస్తూ ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులను కడుతూ ఉంటుంది భార్య లిండా. తన కొడుకు క్రిస్టోఫర్ బాగోగులను క్రిస్ చూసుకోవటం, ఓవర్ టైం వర్క్ చేస్తూ ఇంటి ఖర్చులను సంపాదిస్తున్న లిండా చూసుకోవటము ఆ సమాజంలో మారిన, మారుతున్న జెండర్ రోల్స్ ను పట్టి ఇస్తుంది. సంపాదించలేని భర్తతో , ఉద్యోగం లేని భర్తతో పొరపొచ్చాలొచ్చి లిండా వెళ్ళిపోవటం కాపిటలిస్ట్ సమాజపు కుటుంబ విచ్ఛిన్నతను చూపిస్తుంది. ఇల్లు లేక భార్య లేక చిన్నారి కొడుకుతో అష్టకష్టాలూ పడతాడు క్రిస్. చర్చి వాళ్ళు అందించే ఉచిత షెల్టర్ బంకుల్లో ఎలాగోలా కాసింత జాగా సంపాదించి కొడుకును నిద్రపుచ్చుతాడు. ఇంత ఒడిదుడుకుల సమాజంలో తన కష్టాలను చెప్పుకోవడానికి ఇంకొక వ్యక్తి కూడా లేని సమాజంలో మతం దైవం మనుషుల కష్టాలను కాసేపు ఊరడింపజేస్తుంటుంది. తమ కోసం రక్తాన్ని చిందించిన ప్రభువు, రాబోయే కాలంలోనో, మరణానంతరమో స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాడని నమ్మించి సాంత్వన పరుస్తుంటుంది. ఆరునెలలు సాగే ఇంటర్న్ షిప్ లో జీతమేమీ రాకపోయినా తన బ్యాచ్ లోని ఇరవై మంది తో పోటీపడతాడు క్రిస్. ఇంటర్న్ షిప్ చివర్లో జాబ్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇరవై మందిలో కేవలం ఒక్కరినే జాబ్ వరిస్తుంది. దానికోసం రాత్రింబగళ్ళు కష్టపడుతూ కస్టమర్లతో “మంచి” అనిపించుకుంటూ తనను తాను కోల్పోయి ఏలియెనేట్ అవుతాడు క్రిస్. ఇన్ని కష్టాలలోనూ, ఉన్న డబ్బులతో కొడుకుకి ఫైవ్ స్టార్ చాక్లెట్ కోనివ్వటం భయంకరమైన కన్సూమరిజాన్ని, పాతుకుపోయి విస్తరించిన క్యాపిటలిజాన్నీ చూపుతుంది. చివరికి ఈ ఉద్యోగం కోసం పోటీ పడిన ఇరవై మందిలో తానొక్కడే ఉద్యోగాన్ని సంపాదించ గలుగుతాడు. అందుకే ఇది క్రిస్ కథ. క్యాపిటలిస్ట్ సమాజం గెలుపు గుర్రాల మీదే కథలు వండుతుంది. అంతే కష్టాలు పడి అంతే కలలుకన్న మిగిలిన పంతోమ్మిది మంది కథలను అది చూపించదు. క్రిస్ తన డ్రీం ని బలంగా కోరుకున్నాడు, బలంగా నిలుపుకున్నాడు కాబట్టే లక్ష్యాన్ని చేరుకోగలిగాడని ఈ సినిమా మనల్ని నమ్మిస్తుంది. అందులోనూ ఈ సినిమా తీసిన దర్శకుడు ఒక ఇటాలియన్. “అమెరికన్ డ్రీం” చుట్టూ ఉన్న ఫాంటసీని ఒక యూరోపియన్ కంటితో మనకు చూపిస్తాడు దర్శకుడు. అందుకే ఇది నారికేళ పాకంలాగా కాపిటలిస్ట్ విలువలను స్థిరీకరించే, ఆ విలువలను గొప్పదిగా చూపించే ఒక మోసపూరితమైన సినిమా.

క్రిస్ గార్డ్నర్ గా విల్ స్మిత్ నటన గానీ, కొడుకు క్రిస్టోఫర్ గా నటించిన విల్ స్మిత్ అబ్బాయి జాడెన్ స్మిత్ నటనగానీ అద్భుతంగా ఉంటుంది. తండ్రీకొడుకులిద్దరూ సినిమాలో కూడా అదే కెమిస్ట్రీ ని పండించారు. సినిమా లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిన తీరు గొప్పగా ఉంటుంది. కథను చాలా గ్రిప్పింగ్ గా చెబుతూ కథలోకి ఆ ఎమోషన్ లోకి వీక్షకుల ను తీసికెళ్ళటంలో దర్శకుడు గేబ్రియల్ ముసినో సఫలమయ్యాడు. ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఛాయలు కనిపిస్తాయి. చివరి సీన్ లో విల్ స్మిత్ నటన ఒక ఎపిక్ అని చెప్పాలి. కథతో లీనమైపోయిన వాళ్ళంతా ఆ సీన్ లో తెలీకుండానే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆనందమో బాధో తెలియని ఒక ఉద్వేగానికి లోనౌతారు. పరిగెత్తుతూ వచ్చి తన కొడుకును గుండెలకు హత్తుకునే సీన్లో తడిసి ముద్దవని వారెవరూ ఉండరేమో. ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. Best actor nominations for Oscar award లో విల్ స్మిత్ కూడా ఉన్నా, 2007 సంవత్సరం లో విల్ స్మిత్ కి ఆ అవార్డ్ రాకపోవటం ఒకింత బాధ కలిగిస్తుంది. నటనా పరంగా సాంకేతిక విలువల పరంగా కళాకారులకూ, దర్శకులకూ ఒక “టెక్స్ట్ బుక్” లాంటి సినిమా అనటంలో సందేహమే లేదు. ఎటొచ్చీ ఇప్పటికీ ఈ సినిమాను బెస్ట్ మోటివేషనల్ సినిమా గా ప్రమోట్ చేస్తూ యువతను పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సూడో ఐడియల్స్ తో నింపడానికి ఉపయోగించటమే బాధాకరం… క్యాపిటలిస్ట్ సమాజం కోరుకునే white collor slavery కోసం యువతను సంసిద్ధం చేయడమే ఇటువంటి రైట్ వింగ్ భావజాల సినిమాల పని. అమెరికాలోని సంపదంతా ఒక శాతం ఉండే ధనవంతుల చేతిలో ఉండగా, బీదవాళ్ళకు, యువతకూ కష్టపడితే ధనవంతులైపోతారని చెప్పే భావజాలం ఒకటి తయారై, వారిని మరింత అమానవీయత వైపు నెట్టేసింది. ఎందుకంటే కేవలం కలలు కన్నంతమాత్రాన, కష్టపడినంత మాత్రాన అనుకున్నది సాధించటం జరగదు అనేది నగ్న సత్యం. ధనవంతులవటం అనేది ఒక సామాజిక పరిస్థితికనుగుణంగా జరుగుతుందేమో తప్ప, మోటివేషనల్ స్పీకర్ ల స్పీచ్ లు విని లేదా ఇటువంటి మోటివేషనల్ సినిమాలు చూసి ఉబ్బిపోవటం వలన జరగదనే విషయాన్ని తెలుసుకుని చూడవలసిన సినిమా. Happyness స్పెలింగ్ లో y కాదు i ఉండాలని క్రిస్ గార్డ్నర్ చెప్పినా…సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా అర్థం చేసుకోవాల్సిన సినిమా.

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

17 comments

 • సినిమా గార్నర్ ఉద్యోగం సంపాదించడంతో కాక, ఉద్యోగాలివ్వడంతో పూర్తవుతుంది. ఒక కంపెనీ స్థాపించి, దాన్ని పెంచి లాభాలకు అమ్ముకోవడంతో ( రైతులాగే) పూర్తవుతుంది.

  మన జీవనవిధానం మన తల్లిదండ్రులు, పెంపకం, పరిసరాలు, చదువు, జీన్స్ లాంటి సవాలక్ష కారణాలతో ప్రభావితమౌతుందని విజ్ఞులైన మీకు తెలియంది కాదు.

  ఈ పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు ఇడ్లీపచ్చడిలో వేసిన తిరగమోత లాంటివి. లేకపోయినా నష్టం లేదు. ఉంటే రుచి ఎక్కువ.

  వీలైతే థామస్ స్టాన్లీ రాసిన The Millionaire Mind చదివి దానిమీద కూడా ఇక్కడే సమీక్ష రాయండి.

 • అబ్బా, ఈ సినిమా ని ఈ angle లో వ్యతిరేకించేవాడిని నేనొక్కడినే అనుకున్నాను ఇన్నిరోజులు 😊. చాలా బాగుంది మీ రాత. ఇందులోని ప్రతి పాయింట్ ఒప్పుకొంటాను. 👍

 • ఇందులో రెండు కామెంట్స్ పెట్టాను..అవి కనిపించటం లేదండి. మోడరేషన్ కోసం ఆగి ఉన్నాయా?.

 • Wonderful review. చాలామందికి తెలియని కోణాన్ని అర్ధమయ్యేట్టు వివరించారు.

  • ఇప్పటికీ నాకు అర్ధం కాని విషయం ఈ మోటివేషన్ పుస్తకాలు చదవడం అంటే మన దగ్గర గురు చరిత్ర పారాయణం లాగా అనిపిస్తుంది. ఇలాంటివి చదవడమో, చూడడమో చేసేప్పుడు అరచేతిలో వైకుంఠం కనిపిస్తుంది అదే చదవడం ఆపేశాక అంతా చీకటే అనిపిస్తుంది. మన దగ్గర అంటుంటారు ఎంత కష్టపడ్డా సుఖపడాలంటే కొంచెమైనా సుడి ఉండాలంటారు. అది లేకుండా ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివినా, షోలు చూసినా, క్లాసులు అటెండ్ అయినా ఉపయోగం లేదు.

 • ఈ మోటివేషన్ ఉదాహరణలకు ఒక ఇకో సిస్టం ఉంటుంది, చాలా వరకు ఆ ప్రాంతంలో ఆసమయంలో ఉపయౌగ పడవచ్చు . పుస్తకం చదివి బాగైపోతే ప్రపంచంలో అధిక శాతం మంది ధనికులు కోన్నిదేశాలు , కోన్ని రకాల వ్యాపారాలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతారు? .
  Long term సమాజ property కి కావలవసినది Relevency and Right Growth

 • మంచి విశ్లేషణ చాలా చక్కగా విశదీకరించారు 💐💐💐

 • గ్రేబ్ రివ్యూ సర్ – న్యూ యాంగిల్ ఎలివేట్ చేశావు అన్నయ్య . ఎప్పుడో అందరికి తెలవాల్సిన మూవీ గురించి పూనుకొని సమీక్షించారు . సూపర్బ్

 • ఈ సినిమా సార్లూ చూసాను సర్, విల్స్మిత్ నిజంగా చాలా బాగా చేసాడు.తండ్రి కొడుకుల సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయి. కానీ మీరంటున్నా కోణం నుంచి ఎప్పుడూ ఆలోచించలేదు. మీరన్నట్టు బుక్స్ చదివి కలలు కన్నంత మాత్రాన అనుకున్నది సాధిస్తాం అన్నది మాత్రం నిజం కాదు.

 • పరుగెత్తి పాలు తాగమని ప్రేరేపించే సమాజంగా మారిపోయాము. ఆనందం “మనం” లోంచి “నేను”, “నాది” లోకి మార్చేసింది ఆ దశకమే. మీరన్నది అక్షరాలా నిజమే.
  అప్పుడు పరుగులు తీస్తూ కుటుంబ విలువలని తనకు వెసలుబాటుగా మార్చేసుకుని ఇప్పుడు “న్యూక్లియర్ ” ఫామిలీ కష్టనష్టాలని ఏకరువు పెడుతూ ఏడుస్తున్న తరమూ ఆ 80ల తరమే….

  చాలా బాగా చెప్పారండీ.

 • విశ్లేషణ చాలా బావుంది.
  పెట్టుబడీ దారీ సమాజాన్ని అనుసరిస్తున్న కళారంగం గూర్చి విశదీకరించి తీరు ఫలించింది.

 • మామూలుగానే చాలా ఓపికగా చదిపాను
  చాలా బాగా రాసారు

 • పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి చెప్తున్నారేమో కొత్తగా అనుకున్నా

  ఓహ్‌ సినిమానా అనుకునేలోపే.. పర్స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ అని కనపడింది.

  మొదలుపెడితే ఆపడం కష్టం అయ్యే రాత.. మొత్తం చదివేదాకా ఒదల్లేదు

  అమెరికన్‌ ఎకనామిక్‌ చరిత్ర ఆల్మోస్ట్‌ అంతా వచ్చినట్లే అనుకుంటాను

  కంప్యూటరైజేషన్‌ కూడా!

  పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌, పాజిటివ్‌ యాట్టిట్యూడ్‌, మోటివేషనల్‌ స్పీకింగ్‌.. ఓహ్‌ ఇందులో చాలా ఉన్నాయి.. సినిమా చూసి తీరాలనే బలీయమైన కోరిక పుట్టేలా రాసిన రివ్యూ!

  చాలా చాలా బాగా రాశారు! చాలా బాగా వచ్చింది డాక్టర్జీ..

 • వండర్ఫుల్ రివ్యూ సర్. మేడిపండు వలిచి చూపించారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.