యాత్ర

చాల కాలం తరువాత ఒక సినిమా చూస్తూ నన్ను నేను ఆపుకోలేనంతగా ఏడ్చాను.

పబ్లిక్ థియేటర్.

పక్కన ఎవరో చూస్తారని సందేహించకుండా ఏడ్చాను.

సంతలో షావుకారు మొన్న ఇరవై రూపాయలకు అమ్మిన టొమాటో పళ్ళను ఇవాళ రూపాయిన్నరకు అడిగినప్పుడు, ‘ఆటో  కిరాయి కూడా కట్టలేం నాన్నా’ అని పక్కన కొడుకు గుర్తు చేస్తున్నప్పుడు, కిరాయి ఇచ్చే వరకు కొడుకును తన దగ్గరుంచుకుంటానని ఆటో అతడు అనడమే గాక, వుంచేసుకున్నప్పుడు, ఇక వురేసుకోడం తప్ప రైతుకు మరో దారి కనిపించనప్పుడు… పట్టరానంత నొప్పితో ఏడ్చాను.

ఎందుకంటే… ఇప్పుడు బ్రతికి లేరు గాని, ఆ రైతు ఎవరో కాదు, మా అమ్మా నాన్నే. అంత నిస్సహాయంగానే, అంత దుఃఖంగానే జీవించారు వాళ్లు. ‘సంజి రెడ్డి బాకీలు కట్ట ల్యాక సిన్న కొడుకుని అమ్ముకున్న్యాడంట’ అని మా నాన్న గురించి పుట్టిన పుకారు, పెద్దల నాటి మూడంఖణాల ఇల్లు అమ్మేసి ఎవరిదో ఇంట్లో తల దాచుకోడం… ఇవి నా బాల్యం మీద చెరగని ముద్రలు. నా వంటి రాయలసీమ రైతు పిల్లలందరి బాల్యమూ అదే. అందుకే సినిమాలో ఆ దృశ్యాలు చూసి నా నిగ్రహమంతా కరిగిపోయి, ఏడ్చాను.

చిన్న పాప గుండెలో రంధ్రం వుండి… ఆపరేషన్ చేయనందువల్ల… అంటే, మెడికల్ గా నయం చేయదగిన జబ్బయ్యుండీ…. సకాలానికి డబ్బుల్లేకపోవడం వల్ల… పాప ఆసుపత్రిలో చనిపోయినప్పుడు, పాపను దక్కించుకోడానికి చివరి ప్రయత్నంగా కన్న తల్లి తన మరో బిడ్డను ఎవరో ముక్కు మొగం తెలియని అమెరికా సంపన్నులకు అమ్మేసుకున్నప్పుడు…  ఆ దృశ్యాలు చూసి ఏడ్చాను.

ఎందుకంటే, నా సావాస కాడు శివరామిరెడ్డికి తేలు కుట్టి… మాకు దగ్గర్లో ఆసుపత్రి లేకపోవడం అనే ఒకే కారణం వల్ల …. రాత్రంతా ఏడ్చి ఏడ్చి నీల్గి నీల్గి చనిపోవడం… నాకు ఒక కథ కాదు, కళ్ళారా చూసిన వాస్తవ జీవితం.

యాత్ర సినిమా…

కథనంలో కాస్త కల్పన వుండొచ్చు. కొన్ని ఘటనల మూలాలు తెర మీద చూపినవి కాకపోవచ్చు. కళ కు ఆ మాత్రం స్వేచ్చ వుంటుంది.

అదర్వైజ్, ఎక్కడా ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా నిజ జీవితం కళ్ళ ముందు కదిలినట్లుంది.

ఇలా, ఇంతగా… ఒక వాణిజ్యాత్మక సినిమాను ఇష్టపడ్డం సరైందేనా? ఈ సినిమా ఒక ప్రేక్షకుడిగా నాకేం చేసిందో, అదే లోకానికి చేస్తుంది కదా… రాజకీయంగా కొందరి మీద సానుభూతిని పెంచుతుంది గదా, ఆ ప్రభావం సమర్థనీయమేనా?

***

చంద్రబాబు నాయుడు రోగ్, రాజశేఖర రెడ్డి బ్రూట్ అని కె. బాలగోపాల్ అన్నాడు. ఈ భావనతోనే బాలగోపాల్ ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ లో ఒక వ్యాసం రాశాడు. దానికి రాజశేఖర రెడ్డి జవాబిచ్చాడు. జవాబివ్వాల్సినంతగా బాధ్యత ఫీలయ్యాడు.

వయ్యెస్సార్ రాజకీయ మూలాల్లో ముఠా కక్షలున్నాయి. తన తదనంతర రాజకీయ జీవితంలో అవి కొనసాగాయా? బహుశా, ఈ ప్రశ్నకు జవాబుగానే నేమో, ‘యాత్ర’ సినిమా లో ఒక దృశ్యం వుంది.

ఒక వూళ్ళో ప్రత్యర్థి పార్టీకి అనుకూలుడు, స్వతహాగా చాల మంచి వాడూ అయిన ‘రాఘవయ్య’ (సినిమాలో పాత్ర) వయ్యెస్సార్ పాదయాత్రను అడ్డుకుంటాడు. వయ్యెస్సార్ ఒక్కడే నడిచి వెళ్లి ఆయనతో మాట్లాడుతాడు. రాఘవయ్య వ్యతిరేకతను గౌరవించి వెనుదిరిగి వెళ్తాడు.

‘పూర్వపు వయ్యెస్సార్ అలా వెనక్కి వెళ్ళడు, ఇతడు మారాడు’ అంటాడు చాల మెచ్చికోలుగా రాఘవయ్య. ఇది సినిమా డైరెక్టర్ మాటే. కరెక్ట్ కూడా.

వయ్యెస్సార్ రాజకీయ  మూలాలు చర్చనీయాంశం కావొచ్చు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి తను వాటి నుంచి చాల దూరం జరిగాడనేది నిస్సందేహం. ఆ తరువాత కూడా ఆయనపై విమర్శల్లో దాన్నే పట్టుకు వ్రేళ్ళాడ్డం పనికిమాలిన రాజకీయమే.

వయ్యెస్సార్ మీద… ఆయన వంటి రాయలసీమ నాయకుల మీద… ఇంకేం నిందలు మోపలేనప్పుడు… ముఠా కక్షల ముద్దర్లేసి ‘ఇతరులు’ పబ్బం గడుపుకోజూస్తారు. ఇది గర్హనీయం.

రాయలసీమ వారే కాకుండా మిగిలిన వాళ్లూ ఈ దుర్మార్గ వైఖరిని గుర్తించి, గర్హించినప్పుడే మిగిలిన ఆంధ్ర ప్రదేశమయినా ఒకటిగా వుంటుంది. లేకుంటే సొంత లాభం వినా అన్యమెరుగని దుష్ట శక్తులు తెలుగు వాళ్ళను మరోసారి చీల్చి సొమ్ము చేసుకుంటాయి. వాళ్ళకు సొమ్ము మనకు దుమ్ము మిగుల్తాయి.

రాయలసీమ పాలక వర్గ నాయకుల మీద ఆ మచ్చను తుడిచేయడానికి చాల కాన్షియస్ గా ప్రయత్నించిన శ్లాఘనీయ నేతలలో వై ఎస్ రాజశేఖర రెడ్డి ఒకరు. ఆ సత్పరిణామానికి ఒక రోల్ మోడల్ గా నిలబడ్డానికి ఆయన ప్రయత్నించాడు. స్వయంగా తండ్రిని చంపిన వారి మీద కూడా ప్రతీకార యత్నం చేయలేదు. వాళ్ళు చట్టబద్ధంగా యావజ్జీవ శిక్ష పొంది, అనుభవించి, ఇటీవల విడుదలయ్యారని వార్త.

ఔను,

వయ్యెస్సార్ ఒక పాలకవర్గ నాయకుడు. విప్లవ కారుడు కాడు.

ఇందిరా గాంధీలా, చరణ్ సింగ్ లా, వీళ్ళందరి కంటె ముందు జవహర్లాల్ నెహ్రూ లా వయ్యెస్సార్ ఒక పాలక వర్గ నాయకుడు.

తానేం చేస్తున్నాడో తెలిసి చేసిన నాయకుడు. తాను వున్న చోటు నుంచి… అంటే, పాలక వర్గ నాయకుని స్థానం నుంచి… ప్రజల కోసం ఏమి చెయ్యొచ్చునో అది, ఎంత చెయ్యొచ్చునో అంత చేయడానికి శాయశక్తులా ప్రయత్నించిన నాయకుడు. నక్సలైట్లతో సంభాషణలు మొదలు ఆరోగ్యశ్రీ వరకు ప్రతి పనిలో అలాంటి సదుద్దేశమే కనిపిస్తుంది. ఆ సదుద్దేశాల పూర్వ రంగాన్ని చాల సజీవంగా తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’.

ఇందిరా గాంధీని ఇప్పటికీ ఇండియాలో పేదలు మరిచిపోరు. దానిక్కారణం టాటా బిర్లాలకు ఆమె చేసిన సేవలు కాదు, వారికి కల్పించిన వెసులుబాట్లు కాదు. ఎంత అమలు జరిగాయో ఏమో గాని ఆమె తెచ్చిన భూసంస్కరణలు, రాజభరణాల రద్దు వంటి భూస్వామ్య వ్యతిరేక చర్యలు, ప్రైవేటు పెట్టుబడికి అంతగా రుచించని బ్యాంకుల జాతీయీకరణ వంటి సంస్కరణలు, ఒక్క మాటలో ‘రోటీ కపడా ఔర్ మకాన్’ నినాదం, చాల సందర్భాల్లో అమెరికా యుక్తుల నెదిరించిన అలీన విదేశాంగ విధానం… ఇవి ఇందిరా గాంధీ మీద పేదల ప్రేమకు కారణం.

యెస్, ఇవన్నీ ఒక ‘బూర్జువా ప్రభుత్వం’ చేయాల్సిన పనులే. దానికి మించినవి కావు. వాటిని చేయించుకోడం కోసమే చరిత్రలో భారత బూర్జువా వ్యవస్థ ఇందిరా గాంధీ అనే నాయకురాలిని ఎంపిక చేసుకుంది.

ఇందిరా గాంధీ కాలంలో మన ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన పెను సంక్షోభం చిన్నా చితకది కాదు. అది ఒక పక్క నక్సలైటు వుద్యమం, అఖిల భారత రైల్వే సమ్మె, జేపీ టోటల్ రెవల్యూషన్ లకు, మరో పక్క ఇందిరా గాంధీ సంక్షేమ సంస్కరణలకు బాట వేసింది. ఈ రెండు ధోరణుల మధ్య వైరుధ్యమే ‘ఎమర్జెన్సీ’ నిరంకుశానికి దారి తీసింది.

ఎమర్జెన్సీ కారాగారాల్లో తీవ్ర వాద లెఫ్టిస్టులు, తీవ్ర వాద రైటిస్టుల సహజీవనం కాకతాళీయం కాదు. ఆ నాటి స్థితికది సహేతుక ప్రతిబింబం. ఇండియాలో సెంట్రిజం (మధ్యేవాదం) తనను తాను స్టిరపరుచుకున్న (అసెర్ట్ చేసుకున్న) వైనమది. ‘తీవ్రత’లను బ్యాలెన్స్ చేయకుండా ఏ సమాజమూ ఒక స్థిరత్వాన్ని సాధించలేదు, ఆ స్థిరత్వం ఎంత తాత్కాలికమైనా.

తరువాత్తరువాత ఏ కాస్త ప్రజా మన్నన పొందిన పాలకవర్గ నాయకుడైనా అలాంటి సంక్షేమ చర్యలు లేకుండా వునికి లోనికి రాలేదు.

రెండు రూపాయలక్కిలో బియ్యం, ఆ తరువాత మద్య నిషేధం అనే ప్రజానుకూల విధానాలు లేకుండా పొలిటికల్ ఎంటీయార్ లేడు. ఆయనకున్న మంచి పేరూ లేదు.

రెండ్రూపాయలక్కిలో బియ్యం అనేది అప్పటికి కోస్తా వాళ్ళు మాత్రమే పండిస్తున్న/ తింటున్న వరి పంటకు గిరాకీ పెంచడానికేనని, మద్య నిషేధం ‘ఈనాడు’కు ప్రత్యర్థి అయిన ‘ఉదయం’ యజమాని మాగుంట సుబ్బరామిరెడ్డి (మద్య) వ్యాపారం మీద దెబ్బ కొట్టడానికేనని వొచ్చిన విమర్శలు తేలిగ్గా కొట్టేయదగినవి కాదు.

ఆ రెండు ‘రాజకీయ అవసరాలు’ తీరగానే ఆ రెండు పథకాలూ మూలన పడడం, వాటిని అమలు చేసిన ‘కథానాయకుడు’ బలవంతాన… చాల ఇగ్నోమినస్ గా… తెరమరుగైపోవడం, అప్పటి వరకు ‘దశమ గ్రహం’ అనిపించుకున్న నాయకుడు ఎంచక్కా వేదిక నలంకరించడం… చూస్తే ఆ విమర్శలు నిజమే అనిపిస్తుంది.

కార్పొరేట్ అనుకూలత అనేది వయ్యెస్సార్ మీద వొచ్చిన విమర్శ. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియెంబర్స్మెంట్ పద్ధతే వున్నది. అది విద్య ప్రైవెటీకరణను మొదలెట్ట లేదు గాని, దానికి మరింత వూతమిచ్చేది. ప్రైవేటు ఆసుపత్రులలో ‘ఖరీదై’న వైద్యాన్ని పేదలకు అందుబాటు లోనికి తెచ్చే ‘ఆరోగ్యశ్రీ’ పథకం మెడికల్ కార్పొరేటైజేషన్ని మొదలెట్టలేదు గాని, దానికి మరింత వూతమిచ్చేదే.

వయ్యెస్సార్ సంక్షేమ పథకాల మీద ఈ విమర్శ సరైనదే.

సరిగ్గా ఈ కారణం చేతనే,,, వాటిలో ఇన్ బిల్ట్ గా వున్న కార్పొరేట్ అనుకూలత కారణంగానే… అవి… ప్రభుత్వ ధనం మీద మోయరాని భారమయి విఫలమయ్యే అవకాశం వుండింది.

వయెస్సార్ ఆ ‘వైఫల్యాన్ని’ ఎలా ఎదుర్కొనే వాడో, దాన్ని తనదైన శైలిలో ఎలా పరిష్కరించేవాడో చూసే అవకాశం మనకు లేకపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు రాజశేఖర రెడ్డి మరణించాల్సిన సమయంలో మరణించాడా? ఉండవల్లి మాట కరెక్ట్ అనుకోనవసరం లేదు.

దానికి వయ్యెస్సార్ పరిష్కారం ఎలా వుండేదో మనకు తెలీదు గాని, ఒక పరిష్కారం మాత్రం వుంది.

తెల్ల ఏనుగులుగా, అదృష్టాలు పండి ఉద్యోగాలు సంపాదించిన కొద్ది మంది సోమరి కొలువులకు ఆలవాలమై ‘వొద్దొద్దు కొడుకో సర్కారు దవాఖానకు’ అని అనిపించుకున్న  పబ్లిక్ సెక్టార్ ను … అంటే ప్రభుత్వాసుపత్రులను, ప్రభుత్వ బడులను… ప్రజల వొత్తిడి కింద బాగు చేసుకోడమే నిజమైన పరిష్కారం.

అసందర్భం అనిపించొచ్చు గాని దీనికి ఒక మంచి ఉదాహరణ: శాంతా సిన్హా నేతృత్వంలో… ‘ఎంవీఎఫ్’ అధ్వర్యంలో… పని చేసిన బ్రిడ్జి స్కూళ్ళు. ఎంవీఎఫ్ వాళ్ళు ప్రభుత్వ బడులను, ప్రభుత్వ టీచర్లను దుయ్యబడుతూ కూర్చోలేదు. వాటిని బలపరుస్తూ, ప్రభుత్వం బడుల్లో ఎక్కడ మంచి కనిపించినా ప్రోత్సహిస్తూ, పని చేయని వారి మీద ప్రజల వైపు నుంచి వొత్తిడి తీసుకువస్తూ, బోధన విషయమై సాంకేతిక సలహాలూ సహాయం అందిస్తూ… మంచి ఫలితాలు సాధించారు.

పాలకులు ఉద్యోగులను తమ ఇంటి పనివాళ్ళుగా చూడకుండా, బాసిస్టు గొంతుకలతో రంకెలు వేయకుండా… ప్రభుత్వ సంస్థల్లో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఉండేట్టు చూసి, ఆపైన ప్రజా వొత్తిడి కింద పని చేయించడమే సరైన పరిష్కారం.

‘రూపాయి డాక్టరు’ గా జీవితం ప్రారంభించిన వయ్యెస్సార్ బతికి వుంటే ఆ మార్గం అనుసరించే వాడేమో.

ఏమో.

చరిత్రలో ఇఫ్ లకి, బట్ లకి స్థానం లేదు. ఏం జరిగిందో అదే జరిగింది.

వాస్తవంగా ఏం జరిగిందో అదే మనుషుల నిజాయితీ నిర్ధారణకు కూడా గీటురాయి. మన ఊహలు, కోరికలు కాదు.

ఇందిరా గాంధీ, అన్నా దురై, ఎంటీయార్ వంటి పాలకవర్గ నాయకులు ‘కూడు, గుడ్డ, గూడు’ సమస్యలను ఎఫెక్టివ్ గా అజెండా మీదికి తెచ్చారు. ఇక వాటిని ప్రజా సంతృప్తి మేరకు పరిష్కరించకుండా ఈ వ్యవస్థ బతికి బట్ట కట్ట లేదు.

వయ్యెస్ రాజశేఖర రెడ్డి ఆ మూడింటికి తోడుగా, అంతే ముఖ్యమైన విద్య, వైద్యాలను అజెండా మీదికి తెచ్చాడు. ఊరక… ఒక ఆందోళన కారుడిగా… వాటిని చర్చనీయాంశం చేయడం కాదు, పాలకుడిగా, వాటిని ఆచరణీయాంశం చేశాడు. ఇక అద్యతన పాలకులు ఎన్ని మాయమాటలు చెప్పినా… ప్రజల నిత్యావసరాలుగా, ఆచరణీయాంశాలుగా మారిన విద్య, వైద్య సమస్యలను పక్కన పెట్టడం కుదరదు.

పక్కన పెట్టడానికి ప్రయత్నించే కొద్దీ అవి మేమున్నామని పాలకుల చెవుల్లో జోరీగలై రొద పెడుతూనే వుంటాయి.

ఆ రొదే ఇపుడు ‘యాత్ర’ను, ‘యాత్రి’కుడిని మన గుండెలకు చేరువ చేస్తున్న ఫినామినన్.

సినిమా చూస్తూ పట్టరాని దుఃఖంతో కదిలిపోవడానికి, కదిలి ఏమైనా చెయ్యాలని అనిపించడానికి కూడా బహుశా అదే కారణం.

 

12-2-2019  

హెచ్చార్కె

28 comments

 • సార్ మంచి విశ్లేషణ అందించారు చరిత్రలోని కొన్ని సాక్షాలను జోడించి … యాత్ర మీద నాకు నచ్చిన రివ్యూ

 • ప్రియమైన మిత్రమా శుభోదయం
  హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు మిత్రమా
  చాలా చాలా బాగుంది మిత్రమా
  మీ అభిప్రాయం
  నేను కూడా ఏడవకుండా ఉండలేక పోయాను
  మిత్రమా
  Heart touching సీనులు
  గొప్పగా ఉన్నాయి మిత్రమా
  మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను మిత్రమా

  • థాంక్సెలాట్, రఘు గారు. సినిమా కల్పించిన ఏడుపు ఆలోచనకు, కార్యాచరణకు దారి తీసే ఏడుపు, అందుకనే మనకు అంత ఇష్టమైంది.

 • చాలా బాగా విశ్లేషణ చేశారు సర్
  మీ అనుభవాన్ని రంగరించి చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు.

 • విశ్లేషణాత్మక రివ్యూ సర్…యాత్ర సినిమా చూడలేదు కానీ ఆ సినిమా మీకు కంట తడి పెట్టిస్తే… మీ రివ్యూ మా మనసును తడి చేసింది..మీ మనసు మాటలు ఆలోచింపచేస్తున్నాయి..సర్ thanK యు

 • MGR and NTR brought about popular schemes for acquiring popularity and votes. Chandra Babu also continued the trend, but restricted the no of beneficiaries in a given village. For example, if four are getting the old age pension in the village, a new applicant had to wait until the death of any one of the beneficiaries. YSR removed those restrictions and by dispensing one or two thousand rupees, he bought more votes utilising public money and also shut the mouths of people so that they wouldn’t question his land grabbing in many districts and acquiring a lakh crores through quid pro quo operations.

  In the Health and education fronts also, he almost killed government schools, colleges and hospitals by syphonning off thousands of crores to the corporates. Health and education – which should not be commercialised were commercialised and also got corporatised. YSR still strengthened the corporates. He had already done the worst damage and there is no need to speculate about his possible solution.

  Rayalaseema factionalists in the process of becoming billionaires, eschewed factionalism as that form is no longer needed.

  Sorry, I don’t have any soft corner towards either YSR or any other ruling class leaders!

 • మిమ్మల్ని కదిలించిన (ఏడిపించిన)అంశాలు రాయలసీమ పరిస్థితులు లేక రైతు పరిస్థితులు కావటం సహజమే, అంతేగాక పుట్టి పెరిగినప్పటి నుంచి మనం చూస్చున్న వాస్తవ పరిస్థితులు, పేపర్, టివిలలో రైతు ఆత్మహత్యలు తదితర కారణాలన్ని ఈ సినిమాతో మమేకం(కనెక్ట్) చేసుంటాయి..సినిమా వరకూ నాకూ కొంతైనా నచ్చొచ్చు(నేనింకా కథానాయకుడు గాని యాత్ర గానీ ఇంకా చూడలేదు)

 • And I don’t subscribe to “Centrism”. One more point I would like to emphasise. YSR might have “spared” his father’s killers. But inviting Naxalites to talks, ending the talks without reaching any conclusion on atleast a few points and bumping off almost all the participants by geo-tagging them — speaks a lot about his nature!

 • సినిమా అత్యద్భుతం. వ్యాసం balanced గా ఉంది. అభినందనలు.

 • యాత్ర వైస్సార్ పార్టీ ప్రచార చిత్రం.సినిమాగా మీరు చెప్పినంత గొప్ప సినిమా ఏమి కాదు.వైస్సార్ పథకాలు ,ఫీజ్ రీయంబ్రాసి కానీ,ఆరోగ్య శ్రీ కానీ ప్రజలకు మేలు చేసిన గొప్ప పథకాలు.అవి చూపించినంత మాత్రాన సినిమా గొప్ప దైపోదు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తెలుగు దేశం ప్రచార చిత్రం.యాత్ర వైస్సార్ పార్టీ ప్రచార చిత్రం.అంతే…

  • మీ అభిప్రాయం చెప్పినందుకు చాల థాంక్సండీ. మీ వ్యాఖ్యలో ఒక వాక్యం తీసేశాను. అది అబ్యూజ్ అని భావించాను.

 • Very good analysis.Me too experienced the same feelings.I wept many times.Whether people believe it or not my handkerchief almost became wet.No words to reveal regarding yatra ,a cinema seen after decades.
  Pssr Advocate.

 • మీరు హిట్లర్ మీద సినిమా చూసి ఏం రాస్తారో అని ఆసక్తిగా ఉంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.