ఎర్ర చారల కలం

ఆమె అడ్రస్  వ్రాస్తున్నంతసేపూ ఆమె చేతిలోని కలాన్నే చూస్తున్నా. ఎర్రచారల కలం. నాకూ అలాటిదే వుండేది. దాదాపు ఇరవై యేళ్ళు వాడాను. చాలా ఇష్టమైనది కూడా. పి.జి కాలేజీలో పనిచేసే రోజుల్లో ఒక స్టూడెంట్ ఇచ్చిన కలమది. ప్రసాద్కంపెనీ చేసిన తెల్లటి మెటల్ మీద ఎర్రటి చారల ఫౌంటన్ పెన్. ఇపుడందరూ రకరకాల కలాలు వాడుతున్నారు కానీ ఫౌంటన్ పెన్ తో వ్రాయడం లోని ఆనందం చాలా తక్కువ మందికే తెలుసు. దాన్ని పోగొట్టుకున్నాను. అది కేవలం కలమే కాదు.బోలెడు ప్రేమతో ఇయ్యబడింది. ఆ విద్యార్ధిని పేరు కరుణ.

పిజీ రెండవ సంవత్సరం పరీక్షలయాక తల్లి దండ్రులతో బెంగళూరు వెళ్ళేముందు వచ్చింది. అప్పటికి నాకింకా పెళ్ళి కాలేదు. సాయంత్రంపూట ఐదింటికి ఇల్లు వెతుక్కుంటూ వస్తే మా అమ్మే తలుపు తీసింది. నేను మంచి నిద్రలో వున్నాను. లేపిచెప్పింది. నేను ముఖం కడుక్కుని హాల్లో కెళుతుండగా అడిగింది. ‘ఎవర్రా ఆ అమ్మాయి?’ అని.

‘మా స్టూడెంట్ అమ్మా’ అని చెప్పి కరుణను పలకరించాను.

ఇలా ఎవరూ మా ఇంటికి రాలేదు. లేచి విష్ చేసింది. కూర్చోమన్నాను. తన పరీక్షలు ఆ రోజే అయ్యాయనీ, బాగా రాశాననీ చెప్పింది.

‘మీ టీచింగ్ బాగుంటుందనీ, చాలా ప్రోత్సహించార’నీ ధన్యవాదాలు చెప్తూ బాగ్ లోంచీ గిఫ్ట్ రాప్ చేసిన ఒక పాకెట్తీసింది.

‘ఎందుకు కరుణా ఇవన్నీ’ అంటుండగా చేతిలో వుంచింది.

‘ప్లీజ్ సర్ కాదనద్దు’ అంది. ఆమె కన్నుల్లో నిజాయితీ. సన్నగా నీళ్ళు తిరుగుతున్నై. సన్నగా చామనచాయలో పెద్దకళ్ళమ్మాయి.

‘నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.’ అంది.

‘అలాగా, చదువు కంటిన్యూ చేయచ్చుగా. యు ఆర్ ఎ బ్రైట్ స్టూడెంట్’. అన్నాను. ఏమీ మాట్లాడలేక సన్నగా బేలగా నవ్వింది.

‘లేదు సర్. వినడంలేదు.’అంది.

‘అయ్యో ఓ సారి మళ్ళీ చెప్పి చూడు’ అంటూనే ‘ఆల్ ద బెస్ట్ అండ్ థాంక్యూ ఫర్ ఆల్ద అఫెక్షన్’ అన్నాను. ఆమెకు మాటలు రావడం లేదు.

‘మీరంటే చాలా ఇష్టం సర్’ అంది. ఏమనాలో తెలీలేదు.’థాంక్యూ’ అన్నాను. కళ్ళనీళ్ళు తిరుగుతుండగా చూసింది.

‘వస్తాను సర్’ అంటూ వెనుతిరిగి వెళ్ళి పోయింది కళ్ళు తుడుచుకుంటూ.మళ్ళీ కరుణను చూడలేదు.

ఆ కలాన్ని చాలా భద్రంగా వాడుతూ వస్తున్నాను. కొన్ని వస్తువుల పట్ల మమకారం అలాగే వుంటుంది. ఇపుడా కలం ఎక్కడో పోయింది. ఎవరికో ఇచ్చిమరిచిపోయాను. బహుశా ఇక్కడే కొరియర్ ఆఫీసులో కావచ్చు.

‘సర్ మీరు కవర్ మీద అడ్రస్ రాయలేదు’ అనడంతో తిరిగి చూశాను. పక్కనే వున్న ఒక లావుపాటామె వ్రాస్తోంది. నా కలం లాగుంది. అలాటిదే కావచ్చు.ఆమె దగ్గర ఎలా వుంటుంది. నా పిచ్చి అనుమానం కాకపోతే. అలవాటుగా జేబు తడుముకుంటేకలం లేదు. ఆమె అడ్రస్ రాశాక ‘సర్ పెన్ను కావాలా’. అంది.

‘అవును. అలాటిదే నాకో పెన్ వుండేది. ఇరవైయేళ్ళు భద్రంగా వాడాను. మా స్టూడెంట్ ఇచ్చిన కలం.‘ అన్నాను. ఆమె కలాన్ని ఇచ్చింది. పట్టుకున్నా కూడా అచ్చు నా కలం లానే వుంది.స్పర్శకు కూడా. పాళీ వాలు కూడా అదే. ఆమెకు దొరికిందేమో అనుకుంటుండగా ‘మీకంతగా ఇష్టమైన యీ కలం ఇచ్చిన స్టూడెంట్ పేరు గుర్తుందా సర్ ?’ అందామె.

‘ఆమ్మాయి పేరు కరుణ’ వెంటనే అన్నాను. బయట స్కూటర్ పైనున్న వ్యక్తిలేటౌతోందన్నట్లు ఒకటే హారన్ కొడుతున్నాడు. ఆమె భర్త కాబోలు.‘మీరు మంచి టీచరే కానీ కొన్ని అర్ధం కావు సర్’ అంది నవ్వుతూ. ‘మీ కలం’ అంటుండగా,‘వుంచండి’ అని వెళ్ళిపోయింది. ఎవరీమె? ఇలా అంటుంది ? ఇంత పరిచయస్తురాలిలా మాట్లాడుతోంది. ఆ కళ్ళెక్కడో చూశాను. ఆ నవ్వు కూడా. అవును ఆమె కరుణే. ఆ కలమూ నేను అక్కడే మరిచిందే. కరుణ ఇక్కడ ఎలా? కలం నా చేతిలో వెచ్చగా ఒదిగిపోతోంది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

7 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.