గేయసదాశివబ్రహ్మం

(ఈ వ్యాసంలో వ్యక్తమయిన ధర్మాధర్మాలకు, ఆలుమగల విలువలకు ‘రస్తా’ ప్రాతినిధ్యం వహించదు. పాట ఇవాల్టి విలువల రీత్యా మగదురహంకారమనే అనిపించుకుంటుంది. పాట లోని కులం ప్రస్తావన తప్పక అవాంఛనీయం. నిజానికి ఆ మేరకు రామాయణ గాథ సాంతం చర్చనీయాంశమే. అయితే, ‘ తెలుగు సినిమాల్లో ‘లవకుశ’ పొందిన  ప్రజాదరణ, పాపులారిటీ రీత్యా ఆ సినిమా, దానిలోని అంశాలు చర్చనీయం అవుతూనే వుంటాయి. అలాంటి అంశాల్లో ఒకటి ఈ పాట. ‘లవకుశ’ సినిమా విజయానికి మిగతా ఇతరులందరితో పాటు పాటలు, మాటల రచయితలు కూడా ముఖ్య కారణమే. వారిలో ఒకరైన సదాశివబ్రహ్మం ఈ పాటను నిర్వహించిన తీరుని ఈ కాలమ్ లో రచయిత చాల నైపుణ్యంతో చర్చించారు. చదివి చర్చించండి.. ఎడిటర్)

సదాశివబ్రహ్మం

చరిత్ర సృష్టించిన ‘లవకుశ’ సినిమాలో పాటలు, పద్యాలు, శ్లోకాలు అధికారిక లెక్కల ప్రకారం 38 ఉన్నాయి.  ఈ పాటలు ఎవరు వ్రాశారో అని ప్రశ్న వేసుకుంటే సముద్రాల పేరు సహజంగానే జ్ఞాపకం వస్తుంది. కొసరాజు పేరు కూడా తట్టవచ్చు. ముఖ్యంగా లవకుశులు గానంచేసే రామాయణ గాథలు ఎంతో ప్రచారం పొందినవి సముద్రాల వారే వ్రాశారు.  కొసరాజు కూడా మూడు పాటలు వ్రాసారు.సింహభాగం, అంటే 18 పాటలు పద్యాలు వ్రాసినవారు ఈ సినిమా కథ, మాటలు వ్రాసిన వెంపటి సదాశివబ్రహ్మం గారేనన్న సంగతి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.  

వీటిలో సినిమా ప్రారంభంలో వచ్చే ‘నవరత్నోజ్జ్వల కాంతివంతమిది’, సీతను అడవిలో విడిచి పెట్టినప్పుడు వచ్చే పద్యాలు, వాల్మీకి పాడే కమనీయమైన ‘ఇదె మన ఆశ్రమంబు’, లవకుశులు పాడిన ‘ఊరకే కన్నీరు నింప’, ‘రామ సుగుణ ధామ’, ముని బాలురు పాడే ‘శ్రీ రామ పరంధామా’, మొదలైన మంచి పద్యాలూ, పాటలూ ఉన్నాయి.  

క్లైమాక్స్ లో వచ్చే ప్రసిద్ధ సంవాద సీస పద్యాలు కూడా వీరు వ్రాసినవే.  

ఇవన్నీగాక ఇందులోని కామెడీపాట ‘ఎందుకేనామీద కోపం’, చాకిరేవు పాట ‘వెయ్యర దెబ్బ’ చూడగానే కొసరాజు పాటలనుకుంటాం. ఇవిగూడా సదాశివబ్రహ్మం గారే వ్రాసి గీత రచయితగా తన వెర్సటైలిటీ చాటుకున్నారు. ఈ కోవలోకే చెందిందీ, మరో కొసరాజు పాట అనిపించేదీ, ఉత్తరరామచరిత్రకు అత్యంత కీలకమైనదీ, సదాశివబ్రహ్మం గారే వ్రాసిందీ, ‘ఒల్లనోరిమామా నీ పిల్లని’ అన్న పాట.

వీరన్న:

ఒల్లనోరిమావా నీ పిల్లనీ
నేనొల్లనోరిమావా నీ పిల్లని
అబ్బా నీ పిల్ల దాని మాటలెల్ల కల్ల
సంసారమంత గుల్ల
నేనొల్లనోరిమావా నీ పిల్లని

లచ్చి:

నన్నొల్లనంతవెందుకు మావయ్య
నావల్ల నేరమేమిర అయ్యయ్యో
దెయ్యాన్ని కొడుదునా దేవతనే కొడుదునా
నూతిలో పడుదునా గోతిలో పడుదునా

వీరన్న:

చమతకారినాయాల వూరుకో
సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను
మారు మాటలాడతావా మాయదారిగుంట
నిను చూస్తే వళ్ళుమంట

పేరయ్య:

నా మాట వినరా బాబూ
అయిందాని కల్లరెందుకల్లుడా
ఓరల్లుడ మేనల్లుడ మా అప్పగారిపిల్లడా
మా అప్పముఖం చూడరా మా అమ్మిని కాపాడరా

అక్క:

తప్పేమి చేసింది తమ్ముడా
ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్పతాగి ఉన్నావు చెప్పుడు మాటిన్నావు
అప్పడగబోయింది అదీ ఒక తప్పా ఏరా

వీరన్న:
అప్పా ఓలప్పా నీ మాటలు నేనొప్ప
ఇక చాలును నీగొప్ప
నా ఆలిగుణము ఎరుగన
నే నేలుకోను తీసుకుపో

లచ్చి:
నీ తాగుబోతు మాటలింకా మానరా
నే సత్యమైన ఇల్లాలిని చూడరా
నేనగ్గిముట్టుకుంట అరచేత పట్టుకుంటా
తలమీద పెట్టుకుంటా

వీరన్న:

ఎర్రిరాముడంటివోణ్ణి కాదులే నేను
గొప్ప శౌర్యమైన ఇంట బుట్టినానులే
చూడు అగ్గిలోనపడ్డ నువు బుగ్గిలోనపడ్డ
పరాయింట వున్న దాన్ని పంచచేరనిస్తానా

అలవోకగా రాసి పారేసినట్టుండే ఈ పాట కొంచెం తరచి చూద్దాం.

‘అబ్బా నీ పిల్ల దానిమాటలెల్ల కల్ల సంసారమంతగుల్ల’, ‘ఓరల్లుడ మేనల్లుడ మా అప్పగారిపిల్లడా’, ‘మారుమాటలాడతావా మాయదారిగుంట నిను చూస్తే వళ్ళుమంట’, ‘అప్పా ఓలప్పా నీ మాటలు నేనొప్ప ఇక చాలును నీగొప్ప’ వంటి పాదాలలోనేకాక, పాట అంతా అందమైన అక్షరశిల్పం ఉంటుంది. 

వీరన్న భార్య లచ్చి సూరిగాడిమీద మనసుపడటం, అతని ఇంట ఉండి రావటం, వీరన్న అగ్గిరాముడై పోయి పెళ్ళాన్ని తన్ని తగలెయ్యటం, అత్తామామా వచ్చి నచ్చజెప్పబోవటం పాట ఇతివృత్తం.  

వల్లనంటే వల్లనని అంటున్న మొగుడితో లచ్చి అన్న మాటలు చూడండి.  లోపల భయంగానే ఉన్నా పైకి ఏమీ ఎరగనట్టు ‘నా నేరమేమిటి’ అనడం, ‘దెయ్యాన్ని కొడుదునా, దేవతనీ కొడుదునా, నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా‘ అనడంలో అతనికి దెయ్యం పట్టిందా అన్న అర్థం – ఇవి పైకి మామూలుగా ఉన్నా ఒక ఎగతాళిని సూచిస్తాయి.  

దీనికి ముందు వచ్చే ‘వెయ్యరదెబ్బ’ పాటలో లచ్చి సూరిగాణ్ణి చూసి నవ్వటం ఇద్దరూ సంజ్ఞలు చేసుకోవటం, వీరన్న చూస్తే గతుక్కుమనటం, వీరన్న ‘ఆటేపు సూత్తవ్ చిటికలు యాత్తవ్  అటెవ్వరున్నారే పిల్లా‘ అని అడగటం, అప్పుడు లచ్చి ‘నేనగ్గి లాటి ఇల్లాలిని … పదే పదే నన్ననుమానిస్తే పలకను నీతో పోపోవోయ్’ అని బెదిరించడం, అతను మళ్ళీ కాళ్ళ బేరానికి రావటం, ఇవన్నీ జరుగుతాయి.  

ఇక్కడ కూడా అదే అధికారం, ఎత్తిపొడుపు ఉంటాయి ఆమె మాటల్లో.  అందుకే అతను ‘చమతకారినాయాలా ఊరుకో’ అనేది. అతను ముద్దు చేసినంతకాలం ఆమె గడుసు మాటలు చమత్కారాలు గానే కనబడేవి అతనికి.  విషయం తెలిసిపోయిందని ‘సూరిగాడి ఇంటికాడ చూడలేదటే … మాయదారి గుంట …. చూస్తేనే ఒళ్ళుమంట’ అని తిడతాడు.

మామ ‘ఓరల్లుడ మేనల్లుడ మా అప్పగారి పిల్లడా’ అనడంలో రెండు తరాల ఆడపిల్లలు వారి మేనమామల్ని పెళ్ళాడిన కథ దాగి ఉంది.  వీరన్న భార్య లచ్చి స్వయానా అక్కకూతురు. లచ్చి భర్తను మావయ్యా అని సంబోధిస్తుంది. అంతేగాగ వీరన్న మామ పేరయ్య కూడా అక్కకూతురినే చేసుకుంటాడు. పేరయ్యకు భార్య, అల్లుడు స్వంత అక్క సంతానమే. అందుకే ‘ఓరల్లుడా మేనల్లుడా మా అప్పగారిపిల్లడా’ అనీ ‘మీ అప్ప మొహం చూడరా’ అనీ అంటాడు.  ఈ కథ అంతా తేలిక మాటల్లో పాటలో అల్లుకు పోయి ఉంటుంది. పాటకు నిజంగా అవసరం లేని విషయాలే అయినా ఈ కుటుంబ నేపథ్య చిత్రణ వల్ల పాత్రల పోషణ, తద్వారా పాట ఎలివేట్ అయ్యాయి.

అత్తకూడా అయిన అక్క తమ్ముణ్ణీ ‘తప్పతాగి ఉన్నావో’ అని మందలించడంలో ఉన్న చనువు, కూతురి సంసారాన్ని నిలబెట్టటానికి అప్పడగబోయింది అని సర్ది చెప్పడం, ఆ మాటలకు అతను ‘అప్పా ఓలప్ప నీ మాటలు నేనొప్ప ఇక చాలును నీ గొప్ప’ అనడంలో నీ కూతురిసంగతి నాకు తెలుసులే అన్న ధ్వని, ‘నా ఆలి గుణము ఎరగన’ లో అదే భావం తేటతెల్లం అవ్వడం ….

అత్త మామ ఇద్దరూ సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఇద్దరి పద్ధతులలో తేడా గమనించండి.  అక్క తన కూతుర్ని వెనకేసుకొచ్చి తమ్ముణ్ణే తాగి ఉన్నావా అంటుంది. మామ అయిందేదో అయిపోయిందని, అల్లరి వద్దు అని కూతురి ని కాపాడమని బ్రతిమాలతాడు.  

మునుపటి తన ఎత్తులిక పారవు అని లచ్చి నిజంగా వదిలేస్తాడని భయంతో తల్లి మాటలను దొరకబుచ్చుకుని ‘నీ తాగుబోతు మాటలింక మానరా నే సత్యమైన ఇల్లాలిని చూడరా అగ్గిముట్టుకుంట అరచేత పట్టుకుంటా తలమీద పెట్టుకుంటా’ ననీ  ప్రమాణాలు చేస్తుంది.

ఇంతకుముందు అడిగినప్పుడు కూడా అగ్గిలాంటి ఇల్లాలిని అనీ, నీవి తాగుబోతు మాటలు అనీ అనటం అతనికి గుర్తు ఉండే ఉంటుంది. మళ్ళీ అదే జవాబు విని అతనికి అరికాలిమంట నెత్తికెక్కి, ఒళ్ళు మర్చిపోయి ‘ఎర్రి రాముడంటివోణ్ణి కాదులే గొప్ప శౌర్యమైన ఇంటబుట్టినానులే’ అనీ అమెను పంచజేరనివ్వననీ తెగేసి చెప్తాడు.  

ఇలా వివిధ భిన్న మనస్తత్వాలను చిన్న మాటలలో నిర్దిష్టంగా చిత్రించిన కవికి భాషమీద, మాండలికంమీద మంచి పట్టుతో పాటు, కథ, పాత్రలమీద కూడా స్పష్టమైన అవగాహన కావాలి.  

సంస్కృతాంధ్రాలు చదివి, బాల్యంలోనే కవిత్వం చెప్పి, అవధానాలు చేసి, స్వతంత్రపోరాటంలో పాల్గొని, హరికథలు చెప్పి, సినిమాల్లో ప్రవేశించిన సదాశివబ్రహ్మంగారిలో కవి, కథకుడు, గాయకుడు ఉన్నాడు. బహుముఖీనమైన ఆయన ప్రజ్ఞ లో కథారచన అనే పార్శ్వాన్ని సినీరంగం ఎక్కువగా ఉపయోగించుకుని ఆప్యాయంగా ఆయనను ‘కథాశివబ్రహ్మం’ అని గౌరవించింది. అయితే ఆయన వ్రాసిన పాటలు రాశిలో తక్కువైనా వాసిలో గొప్పవే అన్న విషయం, చూస్తే మనకు తెలుస్తుంది.  

గొప్ప కళాకారులెందరికో మైలురాయి లాంటి ‘లవకుశ’ సినిమా రచన విషయంలో,  కథపరంగా, మాటలపరంగానేకాక పాటల పరంగా కూడా సదాశివబ్రహ్మంగారిదే అగ్రతాంబూలం!

అన్న విషయం, చూస్తే మనకు తెలుస్తుంది.  

గొప్ప కళాకారులెందరికో మైలురాయి లాంటి ‘లవకుశ’ సినిమా రచన విషయంలో,  కథపరంగా, మాటలపరంగానేకాక పాటల పరంగా కూడా సదాశివబ్రహ్మంగారిదే అగ్రతాంబూలం!

 

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

1 comment

  • 👍👍మీరు చర్చించిన మిగతా అన్ని పాటలకు మళ్లే ఇది కూడా చాలా బాగుంది చంద్రహాస్. మీరు అన్నట్టు ఇది నిజంగా కొసరాజు రచన లాగానే అనిపిస్తుంది. ఈ రెండు పాటల్లోని గొప్పతనం ఏంటంటే ఆ కీలకమైన మలుపుకి సంబంధించిన కథ మొత్తాన్ని క్లుప్తముగా సూటిగా చెప్పెయ్యటము. మరింకే విధముగానైనా ఈ కథను చెప్పి ఉంటే, పైన అనవసరముగా ఉన్న ఆ డిస్క్లలైమర్ మరింత బారుగా ఉండేది. 🙂

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.