డోంట్ కాల్ మీ బేబీ ఎనీ మోర్

మాకు చిన్నప్పటి నుంచీ రేడియోలో విన్న పాటలని మాకున్న భాషా పరిఙ్ఞానంతో అర్థం చేసుకుని పాడడం ఇష్టం. మా ఇంట్లో తెలుగు పాటలే కానీ పక్కింటీ మామీ గారింట్లో వాళ్ళ పెద్దబ్బాయి హిందీ తప్ప వినే వాడు కాదు. పక్క పక్కనే గడపలున్న మూడు వాటాల ఇల్లు. ఉన్న రెండేసి గదుల్లో వాళ్ళు ఆరుగురు పిల్లలు మేమేడుగురమూ.  ..ఇంట్లో కంటే ఇంటి ముందున్నట్టే ఎక్కుప గుర్తు.

మా పెద్దన్నయ్య పెళ్ళి లో సరదాగా పాడడం కోసం ‘ఏమమ్మో జగడాల వదినమ్మో’ పాట నేర్పించారెవరో నాకూ మా చెల్లికీ.. ఆ పాట నేర్పుతున్నప్పుడు పోగైన గుంపులో     వాళ్ళ వదినలు పెళ్ళవగానే ఎలా విడిపోయిందీ చెప్పుకున్నారు సందర్భానుసారంగా… అవన్నీ 7, 8 ఏళ్ళ వయసులో కాస్త కాస్తే అర్థం అయీ అవకుండా ఉండేవి. ఈలోపు ఫూలోంకా తారోంకా సబ్ కా కెహనా హై.. ఏక్ హజారోమే  మేరీ బెహనా హై.. సారీ ఉమంగ్ హమే సంగ్ రెహనా హై పాట వినిపిస్తుండేది పక్కింట్లో. మేము పాడినప్పుడు అర్థం అయినదేమనగా..” పూలకీ నక్షత్రాలకీ వాటివాటి కష్టాలుంటే ఉంటాయి. నాకు మాత్రం వెయ్యి మంది చెల్లెళ్ళున్నారు. సారీ వుమెన్ (sorry women) నేను వాళ్ళతో కలిసుండాలి.. నీతో రాలేను” . అని. ఎంత చక్కని అన్నగారు!  “విడిగా పోదాము చల్ మోహన రంగా ” అని భార్య అంటే చెల్లెళ్ళనొదిలి రాను పొమ్మన్నాడన్నమాట..

గురు సాక్సాక్ పరబ్రహ్మ… అంటూ తనలా కాకుండా గురూ గారు స్కూలుకెళ్ళేటప్పుడు  రెండేసి సాక్సులు వేసుకుంటాడని టీకా తాత్పర్యాలు చెప్పే మా అక్క కూతురికి ఇన్ని తెలివితేటలెక్కడినుంచొచ్చాయని చుట్టాలన్నప్పుడు మా అక్క నావైపు సీరియస్ గా చూసేదెందకో!!!!..ఒట్టండీ నేను నేర్పలేదు.

నాకు దొరికేవారందరూ ఇంతే… మా అత్త గారింట్లో పిల్లలు (అత్తయ్య గారి సిబ్లింగ్స్) పక్కనే ఉన్న సినిమా హాల్లో  విని పాడిన సినిమా పాట అప్పట్లో చాలా ఫేమస్ ట. పాటేంటంటే ” రాజారావూ ఊఊఊఊ అప్పారావూ ఊఊఊఊ”. గుర్తు పట్టేసారా..ఆవారాహూ ఊఊఊఊ…..

మా ఇల్లు రెండేగదులు కాబట్టి మా పెద్దన్నయ్య కుటుంబం 500 మీటర్ల దూరంలో ఉండేవారు. మా నాన్న పొద్దున్నే ఆఫీసుకి వెళ్లే టప్పుడు పిల్లలని చూసి వెళ్ళేవారు. ఇంటి చుట్టూ పెద్ద నీళ్ళ గుంటలుంటాయి కాబట్టి..  బుజ్జి తల్లిని బయటికి పంపద్దని చెప్పి ఆఫీసుకి బయల్దేరారొకరోజు. 10 నిమిషాలయ్యాక ఎవరూ చూడకుండా ఇంట్లోంచి బయటకొచ్చి ఒక అరమైలు దూరంలో ఉన్న తాతని పిలుస్తూ వెంబడిస్తోంది పాపాయి. అనుకోకుండా వర్షం మొదలయింది. నేను ఇంకో వైపు నించి వస్తూ తాతా తాతా అని పిలుస్తూపోతున్న  పిల్ల ని చాటుగా చూస్తున్నా. కొద్ది దూరం పరుగులాంటి నడకతో ఏడుస్తూ వెంబడించిన రెండేళ్ళ బుజ్జాయి వర్షం పెద్దదవడంతో వెనుదిరిగి… ‘గాలి మానలో మాననీటిలో’ అని విచారంగా సిటువేషనల్ సాంగ్ పాడుతూ పోతుంటే ..ఆ దృశ్యం 30 ఏళ్ళయినా పచ్చబొట్టులా ఉండిపోదూ!!!

మాబుజ్జిది  తాను LKG చదువుతోంది కాబట్టి  బినాపాయెల్కేజీ( LKG) భజే గుంఘురూ అని పాడినప్పుడు మది అరలో  ఎప్పటికీ ఆ ఎల్కేజీ మువ్వలు గలగలమంటూ ఉండిపోవూ!!

“దూరానదూరాన సారాదీపమనీ”…”.నీయానతే లేకున్నచో విడలేను ఓ పిరికోడా” అనీ.. “ఆరనిజ్వాలాల దాహము సుడిగాలిలోన నా గాయము” అనీ “తానే మారెనా నాన్నే మారెనా” అనీ… “.చెలియా దక్కమ్మా బంద్ హై మోటర్కార్” అనీ  “పగలే వెన్నెల జగమే ఊయల మదిలో ఊయలకే కన్నులుంటే “అనీ….. మనకొచ్చిన పదాలు పెట్టేసి స్నేహితులతో కలిసి చేసిన బృందగానాలకి ఎల్లలేవీ!!!.

ఇక్కడకొచ్చిన కొత్తల్లో  పనిచేసిన చోట జోయాన్ అనే కొలీగ్ విడాకులు తీసుకున్నప్పుడు పాప బాధ్యత తండ్రికిచ్చిందిట కోర్టు… నిర్దేశించిన సమయాల్లో తప్ప పాపని చూడ్డానికీ మాట్లాడడానికీ అవకాశంలేదుట. ఒకసారి ఉండలేక పాప తల్లికి ఫోన్ చేస్తే పాప తండ్రి ఫోన్ లాక్కుని  ఇంకోసారి పాపని ఫోన్ చెయ్యమంటే పోలీస్ కి కంప్లయింట్ చేస్తా అన్నాడని ఏడుస్తూ చెప్పింది. ఆ అమ్మాయి చెపుతుంటే కన్నీరాగలేదసలు.

ఆ తరువాత నేను ఆఫీస్ మారాను. స్టాఫ్ చాలా కొద్ది మంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. మాటామంతీ ఉండదు. ఫోన్ కంపెనీ వినిపించే పాటలు వస్తూ ఉంటాయి సన్నగా.. అదిగో అప్పుడు  విన్న పాట dont call me baby anymore…పల్లవి మాత్రమే తెలుసు నాకు. జోయాన్ ని తలచుకుంటూ, తల్లీబిడ్డల కథ అన్వయించుకుంటూ దుఖంతో వింటూ ఉండేదాన్ని ఆ పాట వచ్చినప్పుడల్లా!. ఒకరోజు ఆ పాట పాడుతూ  పనులుచేసుకుంటున్న నన్ను చూసి పిల్లలు..”అమ్మా ఈ పాటెలా తెలుసు నీకు” అని ఆశ్చర్యపోయాను. ఆఫీసు లో వస్తున్నప్పుడు పల్లవి మాత్రం క్యాచ్ చేశాననీ ఈ పాట చాలా నచ్చేసిన కారణం వెనకున్న రెబెక్కా..జోయాన్ ల కథ చెప్పేశా బాధ పడుతూ. అది విని పడి పడి నవ్వుతున్న పిల్లలిద్దరినీ గద్దించాను…బాధ విలువ తెలియట్లేదని. వాళ్ళు నవ్వాపుకుంటూ “అమ్మా అది పాప కోసం కాదు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం పాడుకునే పాట” అని అన్నారు పకపకలాడుతూ!… “మరి బేబీ అంటుందెవరినీ” అంటున్న నా అమాయకమైన మొహం చూసి “ఇంక నవ్వలేము బాబోయ్” అంటూ బయటకెళ్ళారు సాకర్ బాల్ తన్నుకుంటూ …..

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

7 comments

  • పాటల దారుల వెంట చిన్నపిల్లల్లా పరిగెత్తించారు కదా… జ్ఞాపకాలు ఏరిస్తూ..
    మీకే ప్రత్యేక మైన శైలిలో ఆహ్లాదకరమైన రైటప్ ..
    ఒకింత హృద్యంగా..

  • అమ్మొ ఎన్ని పాటలని కొత్తగా మార్చేశారు ఎంత తెలివితేటలు

  • అసలు పాటలన్నీ పోయి యేవేవో పాటలు పాడుకుంటూ.. మళ్ళీ యిదేంటి .. అని పకపక నవ్వేసుకుంటూ.. భలే…

    ధన్యవాదాలు హాయిగా నవ్వుకునేలా చేసినందుకు.

  • హహహ! డోంట్ కాల్ మీ బేబీ….. చాలా బాగుంది. నిజమే తెలిసీ తెలియని లిరిక్స్, వినీ వినిపించకుండా విన్నప్పుడు డిజాస్టర్స్ అన్నీ ఇన్నీ కాదు. నేను చిన్నప్పుడు మా అక్క పడిపోతే భలే భలే అని అర్చేదాన్ని. అది అమ్మా అని మా అమ్మను పిలవగానే భలే భలే అందాలూ సృష్టించావూ …. అనే పాట ఎత్తుకునేదాన్ని. చితకకొట్టేది. అది వేరే సంగతి

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.