అరణ్యరోదన

ప్రభుత్వం చేసిన చట్టం.

ప్రజల హక్కులను కాపాడడం కోసం పుట్టిన చట్టం.

కోర్టు నిండోలగంలో మొన్న చిత్తు కాగితంలా చిరిగిపోయింది. అది పనికొచ్చే కాగితమని, ఆ చట్టాన్ని అమలు చేయాలని వాదించడానికి అక్కడెవరూ లేరు. ఎవరైనా ఉన్నా, లేనట్టున్నారు,

అచ్చం ధృతరాష్ట్ర సభలో ద్రౌపది వలువలూడ్చినట్టే.

ధృతరాష్ట్రునికే కాదు న్యాయానికి కూడా కళ్ళుండవు. ఉన్నా, గాంధారి వలె న్యాయం కళ్ళకు నల్ల గుడ్డ కట్టుకుంటుంది. అంధత్వాన్ని అరువు తెచ్చుకుంటుంది. వాదోపవాదాల్ని సాక్ష్యాల్ని వింటుందేగాని, జీవితాన్ని చూడదు.

గిరిజనుల వంటి నిస్సహాయులకు అండగా నిలబడాల్సినప్పుడు నల్ల గుడ్డ మరీ మందమవుతుంది.

గత ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు… ఆడివి ప్రజల సాంప్రదాయిక హక్కులను పక్కన పెట్టి, వారిని అడివి భూముల నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో ఈ చట్టం కింద గిరిజనులు చేసుకున్న క్లెయిములేవీ… వాటిని సమర్థించే లాయర్లు హాజరు కాలేదు గనుక… చెల్లవంది.

సమర్థించాల్సిన వాళ్లు రాలేదని అప్పటికి కేసును వాయిదా వెయ్యొచ్చుగా?

సుప్రీం కోర్టు అలా చేయలేదు.

గిరిజనులను అడివి నుంచి వెళ్ళగొట్టాల్సిన్స మహా కర్తవ్యాన్ని… అలాంటి అదును కోసమే ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది. 16 రాష్త్రాలలో సుమారు ఇరవై లక్షల మంది గిరిజనులనూ, అనూచానంగా అడివిలో జీవిస్తున్న ఇతరులనూ ఆడివి నుంచి వెళ్ళగొట్టడం ఇపుడిక అత్యంత న్యాయబద్ధం.

ఇది ప్రజా స్వామ్యం కాదు. మరెవరిదో స్వామ్యం. ప్రజాస్వామ్యమైతే, సుప్రీం కోర్టులో ప్రజల ప్రతినిధులేమయ్యారు? ఆ పని చేయాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు అక్కడ లేరెందుకు?

తమ స్వాములెవరో, కోర్టులో గైరుహాజరైన న్యాయవాదులకు తెలుసు. తన చట్టాన్ని సమర్థించుకునే బాధ్యతను తానై పట్టుదలగా విస్మరించిన ప్రభుత్వానికీ తెలుసు.

సుప్రీం కోర్టు సాక్షిగా సాగిన ప్రహసనం వినోద భరితం కాదు. పెను విషాదం.

చాల విచిత్రం. ఈ మహా యజ్ఞంలో కొందరు ‘అడివి ప్రాణుల’ (వైల్డ్ లైఫ్) పరిరక్షకులు, పర్యావరణ వాదులు, మాజీ ఫారెస్ట్ అధికారులు సగర్వ భాగస్వాములు.  

ఆదివాసులు సైతం ప్రాణులేనని, ఆదివాసులు లేని అడివి జీవితం (వైల్డ్ లైఫ్) ‘అమానుష’మని పర్యావరణ వాదులకు తట్ట లేదు.

తల్లి నుంచి బిడ్డలను, బిడ్డల నుంచి తల్లిని విడదీయడం ఎవరి పరిరక్షణ కోసం?

గిరిజనులు, సాంప్రదాయికంగా అడివిలో బతికే ఇతరులు ఆడివిని నాశనం చేస్తున్నారని, వాళ్ళ నుంచి అడివిని కాపాడాలని కొన్ని ‘వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్’ బృందాలు వేసిన కేసు పర్యవసానం ఈ సుప్రీం కోర్టు ఆదేశం.

2006 లో కాంగ్రెస్ ఏలుబడిలో వొచ్చిన ‘ఆడివి హక్కుల చట్టం’ (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) గిరిజన ప్రజలకు ఇచ్చిన హక్కులు అడివికి నష్టకరమని, అలాంటి హక్కులు వుండొద్దని వీరి వాదం. అడివి భూముల మీద తమకు పట్టాల వంటి హక్కులున్నట్లు అక్కడి ప్రజలు నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోడానికి వాళ్లు పెట్టుకున్న క్లెయిములను రకరకాల సాకులతో కొట్టేశారు.

హక్కులు లేవు గనుక ఇక గిరిజనులను వాళ్ళ భూముల నుంచి వెళ్ళగొట్టాలి. ఆ అమానుషమే ఇప్పుడు అమలు కానుంది. గిరుల నుండి గిరిజనులను వెళ్లగొట్టే పనిని జులై 27 లోగా పూర్తి చేసి, ప్రభుత్వాలు తమకు నివేదించాలని సుప్రీం ఆదేశం.

గిరులను, అడివిని వొదిలేశాక గిరిజనులు గిరిజనులుగా వునికిలో వుండరు. జనారణ్య వాసం మినహా వారికి దారి లేదు.

ఆడివి బతుకు నుంచి మైదాన జీవితానికి… అంటే, అడివిలో తమకు కావలసినవి స్వేచ్చగా తీసుకుని, ఎక్కడంటే అక్కడ నేల దున్ని సేద్యం చేసి, వేటాడి గడిపే జీవితం నుంచి… స్థిర వ్యవసాయానికి… సహజ హక్కుల నుంచి చట్టబద్ధ హక్కులకు… జరుగుతున్న సమాజ పరివర్తనలో ఇది చివరి అంకం.

సో కాల్డ్ జన జీవన స్రవంతిలో కలుస్తున్న వారిలో చివరి వాళ్ళు గిరిజనులు.

నిజానికిది జరగాల్సిన పరిణామమే, గిరిజన జీవితాల గురించిన రొమాంటిక్ వూహలతో ఈ పరిణామాన్ని వ్యతిరేకించడం అచారిత్రకమే. కాని ఆ పని స్వచ్చందంగా జరగాలి. స్వేచ్చగా జరగాలి. బలవంతంగా కాదు.

ఉదాహరణకు… మనుషులు గ్రామీణ ‘వ్యావసాయిక శ్రమ’ మీద ఆధారపడ్డం బాగా తగ్గిపోయి నాగరిక ‘పరిశ్రమల’కు మారక పోయి వుంటే ఆధునిక జీవితం అనేదే లేదు. అలా జరగకపోతే, మునుపటి జమీందారీ ఫ్యూడల్ నిరంకుశానికి చరమగీతం పాడే వాళ్ళం కాదు ఎప్పటికీ.

కాకపోతే; ఆ పరిణామం జరగాల్సింది బలవంతంగా కాదు.

రక రకాల బలవంతాల కారణంగానే పారిశ్రామిక యుగారంభం శ్రామిక జన రక్తసిక్తమయ్యింది. పల్లెలను వొదిలేసిన వాళ్ళను నగరాలు ఆదరించి ఇముడ్చుకోడం మొదలయ్యాకే విధ్వంస కాండ తగ్గింది. శాంతియుత పరిణామం సుగమమయ్యింది.

ఇప్పుడు ఇండియా వంటి దేశాల్లోని ఆదివాసులు మిగతా పూరోగామి సాంఘిక శక్తులతో కలిసిపోవడం కూడా అలాగే జరగాలి. క్యాపిటలిజం మొదటి రోజుల విధ్వంసాన్ని, దానికి మూలమైన బలవంతపు తరలింపులను నివారించాలి. ప్రజలను సాంప్రదాయిక ఆవాసాల నుంచి బలిమిని వెళ్ళగొట్టే వైఖరి వినాశకరం. అది విధ్వంసానికి, రక్తపాతానికి దోహదకరం.  

‘ఆదివాసులు’ అనే మాట ఎంత అందమో అంత మోసకారి. విదేశాల నుంచి వొచ్చి వుండిపోయిన కొద్దిమంది ‘స్థానికేతరులు’ కాకుండా మిగిలిన అందరం ఆదివాసులమే,  మూలవాసులమే… మనం వున్న ప్రదేశాలకు.

గ్రామాల్లో, పట్టణాల్లో జీవించే మనల్ని మనం అలా అనుకోం ఎందుకని? ఎందుకంటే, ఇప్పుడు మనం ‘ఆదివాసం’లో లేం. మన ఆది-వాసమైన అడివిలో ఇవాళ లేం.

మనలో ఇప్పటికీ మిగిలిన టోటెమ్ లు (కొందరికి మేక పవిత్రం, మరికొందరికి ఒక పువ్వు పవిత్రం, అవి టోటెమ్ లే), పశుల కాపరులుగా, వేటగాళ్ళుగా మన సమీప గతాలు, అడుగడుగున మనల్ని పట్టి పీడిస్తున్న కులాలు… ఇవి చాలు… మనందరం ఆదివాసులమేననీ, కాకపోతే ఇప్పుడు ‘ఆదివాసం’లో (అడివిలో) లేమనీ తెలుసుకోడానికి. తెలుసుకుని, నష్టకరమైనవి వొదులుకుని మసలుకోడానికి.

అడవుల నుంచి ముందుగా మైదానాలకు వొచ్చాం కాబట్టి, ముందుగా నిలకడ వ్యవసాయం మొదలెట్టాం కాబట్టి వెనక మిగిలిపోయిన వాళ్ళ వుసురు తీసుకుందామా? ‘డెవిల్ టేక్ ది హైండ్ మోస్ట్’ అనేద్దామా? అనడం ప్రగతికి అవసరమా?

అభివృద్ధిలో వెనుకా ముందులే గాని అందరం ఒక తాను గుడ్డలమే. అందరం ఒక సూక్ష్మాణువు ముక్కలమే. ‘అభివృద్ధి’లో వెనకా ముందూ అంతే. జంతువులలో జంతువులమై బతికిన పాశవిక (పశుప్రాయ) యుగాలలో సరే. ఇన్ని తెలిసియున్న ఆధునిక యుగంలో కూడా అదే హెయిరార్కీని (మైదానానికి ముందొచ్చిన వాడిదే అధికారం అనే న్యాయాన్ని) పాటిద్దామా?

కాస్త రెక్కలు రాగానే అమ్మనాన్నలను, అవ్వ తాతలను వారి మానాన వారిని వొదిలేసే సంతానాన్ని కోప్పడతాం. ఆ కోపం మంచిదే. ఇప్పుడు ఆదివాసులకు మనం ఇస్తున్న అగౌరవం అలాంటిదవునో కాదో… కాసేపు ఆధునిక చర్మాల నుంచి బయటికొచ్చి చూడ్డం అవసరం.

చట్టబద్ధ న్యాయం అనేది సహజ న్యాయం నుంచి మరీ దూరమయిపోతే, ఇక చట్టమే బతుకును శాసిస్తుంది. చట్టమే జీవితం అయిపోతుంది. చట్టాల చేతులున్న ప్రభువులదే సమస్త పెత్తనం అవుతుంది. నిరంకుశత్వమే సుపరిపాలన అవుతుంది.

ఇవాళ జరుగుతున్నది అదే.   

ఇంగ్లీషు అంకెల్లో రమారమి రెండు మిలియన్లు… అచ్చ తెలుగులో సుమారు ఇరవై లక్షల మంది అడివి బిడ్డలకు, అనూచానంగా అడివిని నమ్ముకుని బ్రతికే గిరిజనేతరులకు సుప్రీం కోర్టు ఆదేశం ప్రాణాంతకమవుతుంది.

కోర్టు ఆదేశం వల్ల తమ తమ నెలవులు దప్పిన వారు ఆ తరువాతెలా బతకాలో…  ఎఫ్ ఆర్ ఏ చట్టాన్ని (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని) పక్కన పెట్టిన న్యాయాధీశులు చెప్పలేదు. గైరుహాజరైన ప్రభు వాదులూ చెప్పలేదు. గిరిజనులను వారున్న చోట్లనుంచి వెళగొట్టాలని (ఎవిక్ట్ చేయాలని) ఆజ్ఞాపించారంతే.

తమ అడివిని, అడివి వస్తువులను వొదిలేస్తే ఎట్టా బతకాలో గిరిజనులకు తెలీదు. తమకు కావలసింది తాము ఆడిగి, డిమాండ్ చేసి, గుంజుకుని తీసుకోడం తెలీని అమాయకులు. ఇక ముందు తాము ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీకుండా, తరతరాలుగా బతికిన చెట్టూ పుట్టా వొదిలేసి నాగరిక జనారణ్యం లోనికి వెళ్ళాలిక.

ఎందుకంటే, వాళ్ళు అడివి లో ‘అక్రమం’గా వున్నారట. తాము వున్న అడివి కనీసం 75 ఏండ్ల కిందటిదని నిరూపించే కాగితాలు కావాలట. లేకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలట. ఇలాంటివే ఏవేవో మెలికలు.

డెభ్భయ్యయిదేండ్ల క్రితం..,. అంటే బ్రిటీషోడి కాలంలో… ఏ భూమి ఎవరిదో చెప్పే కాగితాలేవీ పుట్టి వుండవు కదా? పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు స్థిరమైన పట్టా భూమి అనే భావనే (కాన్సెప్టే) వుండదు కదా? ఆ లా పాయింటడగడానికి సభలో ఎవ్వరూ లేరు.

అక్కడ కనీసం ఒక వికర్ణుడైనా లేడు.

అడివి బిడ్డలను వెళ్ళగొట్టాక, ఇక ఆడివి లోనికి మనుషులు వెళ్లకుండా వుంటారా? మానవ జోక్యం లేకుండా ఆడివి ‘సురక్షితంగా’ వుండిపోతుందా? ‘వైల్డ్ లైఫ్’ జనాలు ఆశ పడుతున్నట్టు అడవుల్లో ఇక చిరుతపులులు, కొండెంగలు మాత్రమే వుంటాయా? చెట్టు చేమా అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతాయా?

అదేమీ కాదు. ఇక… ఎవరి నుంచి అడ్డంకులు లేకుండా… అడవుల్లోకి తవ్వకాల కార్పొరేషన్లు పలుగులూ పారలు పుచ్చుకుని వొచ్చేస్తాయి. భూములు పోయినా, హక్కులు పోయినా ఆడివి మీద కాపీనం వొదలక అక్కడే వుండిపోయిన ఆడివి బిడ్డల చవక శ్రమతో లాభాలు పండించుకుంటాయి. అడివికి మైదానానికి తేడా లేని స్థితి దాపురిస్తుంది. తార్రోడ్ల మీద జింకలు, దుప్పుల కళేబరాలు ఇండియాలోనూ కనువిందు చేస్తాయి.

ఇప్పుడు సుప్రీం కోర్టు పక్కన పెట్టేసిన 2006 నాటి ‘అడివి హక్కుల చట్టం’ (ఎఫ్ ఆర్ ఏ)లో ఎన్ని లొసుగులున్నా…  అది గిరిజనులను ఒక మేరకు కాపాడింది. ఉదాహరణకు: 2013 లో ఒడిస్సా రాష్ట్రం, నియమ్ గిరి కొండల్లో తవ్వకాలను డోగ్రీ కోంధ్ తెగ గిరిజనులు అడ్డుకున్నారు. ఈ చట్టం సాయంతోనే బాక్సైట్ మల్టీనేషనల్ జెయింట్ వేదాంత కంపెనీ ని నిలువరించి, తమ భూములను తాము కాపాడుకోగలిగారు. ఇక ముందు గిరిజనులకు అలాంటి ఆండ ఏదీ వుండకపోవచ్చు. వచ్చే జులైలో రివ్యూ కి వొచ్చినప్పుడు అసలీ చట్టాన్నే తీసెయ్యొచ్చునని తెలిసిన వాళ్ళు అంటున్నారు.

2006 లో ఈ చట్టం రాక ముందు గిరిజన భూములెన్నో అన్యాక్రాంతమయ్యాయి. చట్టం వొచ్చాక ఆక్రమణలను… పూర్తిగా కాకున్నా… ఒక మేరకు నిలువరించగలిగారు. ఇప్పుడు ఇతరులు తమ భూములు కాజేయకుండా నిలువరించడం సంగతేమో గాని, గిరిజనులు తమ భూముల మీద తమ హక్కులను ప్రత్యేకించి నిరూపించుకోవాలి. లేదా వొదిలెయ్యాలి. సహజ సిద్ధంగా, అనూచానంగా వచ్చే హక్కులు, గ్రామ సభల నిర్ధారణతో వొచ్చే హక్కులు… ఏమీ వుండవు.

గిరులకు గిరిజనులే ఇతరులు. ఇతరులే యజమానులు. అదీ ఈ పరిణామాల  సారాంశం.

ఇక, వేదాంత తరహా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడే గిరిజనులకు చట్టబద్ధమైన అండ ఏమీ వుండదు.

అడివి ఇక ముందు కొమ్ములు లేని ఎద్దు అవుతుంది, కోరలు లేని చిరుత అవుతుంది. తనను తాను కాపాడుకోలేని నిస్సహాయ అవుతుంది.

కోర్టు బయట వినిపిస్తున్న ధిక్కార స్వరాలే ఇక ఆడివి బిడ్డల హక్కులకు అండగా నిలబడాలి.

ఆదివాసుల కోసం గొంతు విప్పే సుధా భరద్వాజ్ వంటి కొద్ది మంది లాయర్ల కోసం జైళ్లు నోళ్ళు తెరుస్తూనే వుంటాయి, అయినా…

25-2-2019  

హెచ్చార్కె

21 comments

 • ఏ పత్రికైనా ఈ అన్యాయం మీద గొంతెత్తిందో లేదో గానీ, మీరు ప్రస్తావించడం అభినందనీయం. ఎవరో కొందరు ముఠాగా ఏర్పడి గిరిజనులను అడవి నుండి తరిమేయడానికి కంకణం కట్టుకుంటే సుప్రీం కోర్టు సమర్ధించడం గర్హనీయం.

 • ఎన్నో పత్రికలూ, ముఖ్యంగా వైర్ అనే అంతర్జాల పత్రిక అలాంటివే ఎన్నో ఈ విషయం మీద రాశాయి. ఈ తీర్పులో అక్కడ ఖనిజ సంపత్తును , ఈ గిరిజనులకు ఇంకో ఆసరా కల్పించకుండా , పెట్టుబడిదారులకు అప్పగించడం కోసం చేసే ప్రయత్నాలలో ఇదొకటి.

  • థాంక్స్ సుబ్రహ్మణ్యం గారు. ఔనండి, ఆసరా కల్పించకుండా వున్నచోటు నుంచి వెళ్ళగొట్టడం అమానుషం.

 • అమాయక గిరిజనులను వెల్లగొట్టడం ఈ సోకాల్డ్ వన్యప్రాణుల సంరక్షులకు ఈజీ. వాళ్ళు గెంటబడ్డాక కాలు పెట్టే, కార్పోరేట్ భూతాన్ని ఏమీ చేయలేరు.

  కాబట్టి వనవాసులు వనాల్లో ఉండటమే వనానికి రక్ష

 • మీరు చెప్పేదాకా ఈ విషయమే తెలీదు..
  ఎంత ఘోరం..
  ఇక్కడి మీడియా ఎంత హేయంగా పనిచేస్తుందో.

  • థాంక్స్ రాజశేఖర్ గారు. నిజమే, ఏవో కొన్ని ప్రజా పక్ష పత్రికల్లో తప్ప ప్రధాన మీడియా కు ఇంత పెద్ద విషయం వార్త కూడా కాకపోయింది.

 • అరణ్యరోదనే! ఎవరి మీద యుద్దం చేయాలీ అరణ్యపుత్రులు? ఎవరి దగ్గర చెప్పుకోవాలి తమ గోడు!!
  మిడిల్, అప్పర్ మిడిల్ మరియు ఉన్నత వర్గాల వారు నడిపే ఈ ప్రజాస్వామ్యంలో భూమి పుత్రుల మాటకు విలువుందా? వినేవాళ్ళున్నారా? వినిపించేవాళ్ళున్నారా?

  • థాంక్స్ ప్రసాద్ గారు, అరణ్యాల రక్షణ, గిరిజనుల సమస్యలు కేవలం గిరిజనులకు వారితో పని చేసే కొద్ది మందికి పరిమితం కావడం, అడవులు నాశనమైతే పర్యావరణం పాడయి మనక్కూడా బతుకులుండవని పట్నవాసులకు అర్థం కాకపోవడమే అసలు విషాదం.

 • ఎంత బాగ చెప్పారు. మనం మూలవాసులమే. మనమూ అడవి మనుషులమే. రాజ్యం సరే న్యాయమూ ఎందుకిలా ప్రవర్తిస్తుంది. గిరిపుత్రుల హక్కులపై పోరడేవాడే లేకుండాపోవడంలో ని మర్మం చాలా బాగా బోధపడేలా సవివరంగా, నొప్పివడి రాశారు.

  ఎప్పటిలా మీ సంపాదకీయం మీ మార్కు భాషా, భావాన్వయాలతో చదివింపజేసింది. థ్యాంక్యూ.

  • థాంక్స్ శ్రీరామ్, నిన్న మొన్నటి వరకు మనందరం ఆదివాసులమే అనడానికి మన పెద్దవాళ్ళనడిగితే చెప్పే కథలు తార్కాణాలు. ఉదాహరణకు మా వాళ్ళ ఆవులు పోతే అవెక్కడున్నాయో చెప్పన ఆంజనేయస్వామి గురించి కథ వుంది, అందుకే మా ఇళ్ళలో (నా వలె) ప్రత్రి తొచిచూలు పిల్లాడు లేదా పిల్లకు అంజనేయుని పేరు పెడతారు. కథ సంగతి సరే, సమీప గతం వరకు మేము పశులు కాసుకున్న వాళ్ళమే అనగా గిరిజనులమే, 🙂

 • ఇంకేమి మిగిలింది, అడవిని సమూలంగా సర్వమ్ దోపిడీ చేయడానికి అడ్డుగా మిగిలిన ఒకే ఒక చట్టాన్ని తొలగించి, ఆదివాసులను ఒక పథకం ప్రకారం కుట్రతో తమ స్వంత భూమినుంచి పారదోలే కుట్రలో అందరూ బాగస్వాములే, మీ వైపు నుంచి సరైన సమయంలో ఒక సరైన ఆర్టికల్ రావడం కొంత ఊరట

 • ఇండియా ఒక్కో మెట్టు ఎక్కుతోందా లేదా దిగుతోందా

 • భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలనుకుంటూ తన అస్థిత్వాన్ని వెనక్కి నడుపుకుంటూ ఉంది. జనాలకు చివరి ఆశ ఐన కోర్టులే అటువంటి తీర్పులు ఇస్తే ఇంకేముంటుంది .

 • అడవులకు ఆదివాసులే పరాయివారైపోవడం మనసును కలచివేస్తుంది దీనికి చట్టాలు సైతం సమర్దించడం కళ్లుండి చూడలేని ధృతరాష్ట్రుడి పాలనను తలపిస్తుంది.. ఏదిఏమైనా మీ విమర్శ స్పష్టంగా సూటిగా చాలా బాగుంది…అడవి బిడ్డలకు జరిగే అన్యాయాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది ధన్యవాదాలు సర్

 • అడవిలో నిక్షేపాలు ఎవడికి కావాలనుకుంటే వాడి చుట్టంగా మలిచే పాలకులు
  అడవి అంటే చరిత్రలో ఓ పాఠంగా చేసే కుట్ర బయల్దేరింది
  గుట్టలు చెట్లు రాళ్ళూ రప్పలు అన్నీ పెట్టుబడికి ధారాదత్తం
  సంపాదకీయం రావాల్సిన సమయమిదే . కృతజ్ఞతలు

  • థాంక్స్ గిరిప్రసాద్ గారు, ఔను మీరన్నది నిజం. అడివి ఒక పురావస్తువయిపోయే ప్రమాదం వుంది. మనమిక ప్లాస్టిక్ గాలి పీల్చి ప్లాస్టిక్ నీళ్లు తాగి బతకాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.