‘అమెజాన్’ కు అడ్డుకట్ట

ఈ మధ్య హైదరాబాదు వెళ్లినప్పుడు, ‘నవోదయ’లో బుక్స్ కొన్నాక, ఇంగ్లీష్ బుక్ షాపుల అడ్రస్ అడిగాను. అమెజాన్ ధాటికి అవి మూతపడ్డాయని, ఆన్ లైన్లోనే తెప్పించుకోవాలని, తెలుగు బుక్ షాప్ వాళ్లం కూడా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి ఆన్ లైన్లో ఆర్డర్లు వస్తే పంపుకుంటున్నామని కోటేశ్వర రావు చెప్పారు. అమెజాన్ వల్ల  ప్రపంచంలోని అన్ని ముఖ్య నగరాల్లోని బుక్ షాపులే కాదు, అన్ని రకాల వస్తువుల్ని అమ్మే చిన్నా పెద్దా రిటైల్ షాపులు కూడా మూతపడుతున్నాయి. దీని పేరులోనే వుంది అందర్నీ మాయపుచ్చే లోగో. AMAZON… టైటిల్ కింద A నుంచి Z వరకు (అన్ని రకాల వస్తువులు దొరుకుతాయని అర్థం వచ్చేట్టు) నవ్వులాంటి ఒక బాణం గుర్తు వుంటుంది.  అమెజాన్ యజమాని, సి ఇ ఓ జెఫ్ బెజోస్ ప్రజల నవ్వుల్ని దోచుకుంటూ ప్రపంచంలోనే సంపన్నుడిగా నమోదయ్యాడు.

అమెజాన్ ప్రపంచంలో ఎక్కడ ఒక గిడ్డంగి (ware house) ఏర్పాటు చేయాలనుకున్నా అక్కడంతా చిన్నా పెద్దా రాజకీయ నాయకులు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నారు. అమెజాన్ కు మాత్రమే కాదు ఏ కార్పొరేట్ కంపెనీలకయినా సబ్సిడీలు, పన్ను రాయితీలు, స్థలాలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. గత 20, 30 ఏళ్ళుగా అన్ని దేశాల్లో ప్రభుత్వాలు సంస్కరణల పేరిట సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చి నిధులన్నీ కార్పొరేట్ సంక్షేమానికి మళ్లిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు తమ దేశానికి రావాలని, అందులోనూ తమ రాష్ట్రానికే రావాలని ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. తాయిలాలు ఎర జూపుతున్నాయి.

న్యూయార్క్ లో ఎదురు దెబ్బ

అమెజాన్ తన రెండో హెడ్ ఆఫీస్ ను న్యూయార్క్ లోని క్వీన్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంది. మొదటి ఆఫీసు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ లో వుంది. రెండో హెడ్ ఆఫీసుని ఏర్పాటు చేయాలనుకోగానే ఆయా రాష్ట్రాల గవర్నర్లు స్వాగతం పలకటానికి పోటీ పడ్డారు. న్యూయార్క్ గవర్నర్  3 బిలియన్ డాలర్లు సబ్సిడీ ఇస్తామని, హెలీపాడ్ ను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. అమెజాన్ వల్ల 25 వేల ఉద్యో గాలు వస్తాయని అందుకోసం ఇది చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల నెల జీతాల మీద  పన్నులు వేసి, వసూలు చేసిన డబ్బును రోడ్లు, పాఠశాలలు వంటి ప్రజా సంక్షేమ పథకాలకే ఉపయోగించాలని, సెకన్ కు మూడున్నర వేల డాలర్లు సంపాదించే ప్రపంచ సంపన్నుడికి ఆ డబ్బు ఇవ్వడానికి వీల్లేదని క్వీన్ ప్రాంతం నుంచి కాంగ్రెస్ కు ఎన్నికైన అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, స్టేట్ అసెంబ్లీకి ఎన్నికైన రాన్ కిమ్ వంటి యువ నాయకులు ప్రకటించారు. ‘ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి, అది గవర్నర్ సొమ్ము కాదు, దాన్ని అలా ప్రపంచ సంపన్నుడికి ఇవ్వడాన్ని అంగీకరించం’ అని స్వయంగా అడ్వకేట్ అయిన రాన్ కిమ్ ధ్వజమెత్తారు.

ఈ సోషలిస్టు డెమోక్రాట్లు అమెజాన్ కు ఎరజూపిన  సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రకటనలు విడుదల చేసి కూర్చోలేదు, ప్రజల్ని సమీకరించి ప్రదర్శనలు నిర్వహించారు.  కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న తాయిలాలను, రాయితీలను ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని చర్చ మొదలెట్టి పలు రాష్ట్రాల్లో ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. సామాన్య ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన ఈ యువతరం రాజకీయ నాయకులను, ఈ నాయకుల వెంట నడుస్తున్న ప్రజలను చూసి అమెజాన్ న్యూయార్క్ నుంచి బిచాణా ఎత్తివేసుకుంటున్నట్లు ఈ ఫిబ్రవరిలో ప్రకటించింది. ఆమెజాన్ కు సబ్సిడీ గా ఇస్తామన్న డబ్బు ప్రజలదని, న్యూయార్క్  కు చెందిన కాలేజీ విద్యార్థుల లోన్స్ కు జమ చేసి విద్యార్థులకు ఊరట కల్పించాలని ఈ యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అమెజాన్ రిటైల్ షాపుల వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపుతున్నారు కానీ, దీని వల్ల ఎన్నో రకాల చిన్న, మధ్య తరగతి, పెద్ద రిటైల్ షాపులు అనేకం మూతపడుతున్నాయని, ఇద్దరు ఉద్యోగాలు కోల్పోతే ఒకరికి మాత్రమే ఉద్యోగం వచ్చినట్టు అవుతున్నదని, ఆమెజాన్ వల్ల వచ్చే ఉద్యోగాల కన్నా పోయే ఉద్యోగాలే ఎక్కువ అని అంటున్నారు ఫోర్ట్ లాండ్, మైమీ కి చెందిన స్టాచీ మిఛెల్. ఈమె లోకల్ సెల్ఫ్ రిలెయన్స్ అనే సంస్థకు కో-డైరెక్టర్. అంతే కాదు అనేక రిటైల్ షాపులు వుండడం వల్ల కొత్తదనం, సృజనాత్మకత, భిన్నత్వం వుంటాయని, ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాలని ప్రతిబింబించే వస్తువులు వుంటాయని, ఉద్యోగులకు, వినియోగదారులకు మధ్య మాటామంతీ ఉండి ఆలోచనలు కలబోసుకుంటారని, చిన్న, మధ్య తరగతి వారు కూడా వ్యాపారాలు చేసుకునే అవకాశం వుంటుందని, యూనియన్లు వుండడం వల్ల ఉద్యోగస్తుల మధ్య స్నేహ సంబంధాలుంటాయని ఆమె అంటారు. అమెజాన్ ఇప్పటి వరకు మార్కెట్ లో ఒక భాగంగా వుంది గాని, దాని లక్ష్యం అన్నిటినీ మింగేసి, తానే మార్కెట్ గా మారబోతున్నదని ఈమె హెచ్చరించారు..

చాప్లిన్ సినిమాను నిజం చేసిన పని పరిస్థితులు:

అమెజాన్ లో ఉద్యోగులతో పాటు రోబో లు పనిచేస్తుంటాయి. పని వేగాన్ని గుర్తించే యూనిట్లు వుంటాయి. కనీస వేతనాలు ఉండవు.  నెల వేతనం, ఏడాది వేతనం ఇంతా అని ఒక కచ్చితమైన అంకె వుండదు. ప్రతి నిముషం, ప్రతి రోజూ పని వేగాన్ని గుర్తించే యంత్రాల వల్ల ఎన్ని యూనిట్ల పని చేసి వుంటే అంత వేతనం వుంటుంది. టార్గెట్ పూర్తిచేసిన వారికే కనీస వేతనం వుంటుంది. అంటే అమెజాన్ లో పనిచేసే ఉద్యోగులు అధికశాతం   కనీస వేతనాలు పొందడం లేదని, అమెజాన్ ఉద్యోగులు క్యూలో నిలబడి ఫుడ్ స్టాంపుల ద్వారా ఆహారం సమకూర్చుకుంటున్నారని వర్మాంట్ రాష్ట్ర  సెనేటర్ బెర్నీ శాండర్స్ అమెజాన్ ను దుయ్యబట్టారు.

ఉద్యోగి పని వేగాన్ని రికార్డు చేసే యంత్రం ఆమె/అతని కళ్ల ముందే వుంటుంది. ఒక్కో ఉద్యోగి నిముషానికి రెండు పాకేజీలు రెడీ చేయాలి, అంటే గంటకు 120 పాకేజీలు రెడీ చేయాలి. అది చేయడం ఆలస్యం అయితే, ఆ వత్తిడి మిగతా పని మీద పడుతుంది. టార్గెట్ ను అందుకోవాలని లేదా టార్గెట్ ను కోల్పోకూడదని ప్రతి క్షణం ప్రమత్తంగా వుంటూ  విపరీతమైన మానసిక వత్తిడికి లోనయి జబ్బు పడుతుంటారు. అంబులెన్స్ లు తరచుగా ఈ కంపెనీలకు రావడం జబ్బు పడ్డవారిని ఆసుపత్రులకు తరలించడం ఒక సాధారణ చర్యగా కొనసాగుతుందని, సిక్ లీవ్ ఒక రోజు ఓ.కే. కానీ డాక్టర్ సర్టిఫికెట్ వున్నా, వరుసగా 6 రోజులు సిక్ లీవ్ పెడితే ఇక ఆ ఉద్యోగం ఉండదు. పని మధ్యలో టాయ్ లెట్ కు వెళ్లితే ఆ మేరకు పని యూనిట్లు కట్ అవుతాయి. టాయ్ లెట్ కు పోకుండా వుండడం కోసం నీళ్లు తాగకుండా పనిచేస్తారట ఉద్యోగులు. మూత్ర విసర్జనకు బాత్ రూం దాకా వెళ్ళే సమయం లేక పని చేస్తున్న చోటే ప్లాస్టిక్ బాటిల్స్ లో కానిస్తున్నారని, 74% వర్కర్లు బాత్ రూం ఉపయోగించుకోడానికి భయపడుతుంటారని  బ్రిటన్ లో  ఒక గిడ్డంగిలో పని చేసిన జర్నలిస్ట్ జేమ్స్ బ్లడ్ వర్త్ దారుణమైన సత్యాల్ని వెల్లడించారు. పని మధ్యలో కొన్ని సెకన్లు కూడా విరామం లేని చోట విసుగు కలిగించే ఒకే రకం పనితోనూ, పని వత్తిడితోనూ ఉద్యోగులు ఉన్మాదులుగా మారుతున్నారని, ఆధునీకరణలో భాగంగా ఫ్యాక్టరీల్లో మెషీన్లలో మర లాగా తయారయ్యే మనిషి విషాదకర జీవితాన్ని చార్లీ చాప్లిన్ “మోడరన్ టైమ్స్” (1936)లో చూపించారు. ఆ సినిమాలో బాత్ రూం కు వెళ్ళడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో ఉద్యోగులు టైం ను పంచ్ చేయడం చూపించారు. బాత్ రూంను ఉపయోగించుకున్న తరువాత కాసేపు సరదాగా సిగరెట్ తాగడానికి కూడా అవకాశం లేదని బాధపడతాడు అందులోని లిటిల్ ట్రాంప్ . అలాగే లంచ్ టైం ను తగ్గించడానికి ఫీడింగ్ మెషీన్ ను ఉద్యోగి ముందు పెడితే ఎలా ఉంటుందని ఒక ప్రయోగాన్ని చేయబోయి వీలుకాదని విరమించుకుంటాడు యజమాని ఆ సినిమా లో. దాదాపు అలాంటి విషాదకర వింతలు అమెజాన్ గిడ్డంగుల్లో జరుగుతున్నాయని యు.కె. జర్నలిస్ట్ మాటలు విన్నాక ఎవరికైనా ‘మోడరన్ టైమ్స్’  అనిపించక మానదు.

మనుషులు తిరగబడతారు

గిడ్డంగుల్లో పని పరిస్థితులు దయనీయంగా వున్నాయని, ‘మేం మనుషులం , రోబోలం కాదు.’  ‘రోబోలుగా మమ్మల్ని ట్రీట్ చేయవద్దు’ అంటూ జులైలో “ ఫ్రైం డే” న, నవంబర్లో “బ్లాక్ ఫ్రై డే” న యూరప్ లోని ఇటలీ, జర్మనీ, యు.కె. స్పెయిన్ దేశాల్లో అమెజాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. ప్రతి ఏడాది ఆ రెండు రోజుల్లో విపరీతమైన కొనుగోళ్లు జరుగుతుంటాయి. అదే రోజు ఉద్యోగులు సమ్మె కట్టి అమెజాన్ గిడ్డంగుల ముందు ప్రదర్శనలు నిర్వహించి, అక్కడి పని పరిస్థితులను ప్రపంచానికి వెల్లడించారు.

టెక్నాలజీ పెరిగే కొద్దీ పని చేసే ఉద్యోగుల పని భారం పెరిగిందే కానీ తరగలేదు. మరో పక్క కార్పొరేట్ యజమానుల వద్ద సంపద లెక్కించలేనంతగా పోగుపడుతున్నది. కాలేజీ చదువులు ముగించుకొని ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధమవుతున్న భవిష్యత్ తరాల తలల మీద అప్పుల భారం ఏటికేడాది పెరుగుతున్నది. ఒక్క అమెరికా దేశంలోని విద్యార్థుల మీద వున్న అప్పుల భారం ఒక ట్రిలియన్ డాలర్లు. సామన్య ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన సోషలిస్టు డెమోక్రాట్లయిన అలెగ్జాండ్రియా, కిమ్ వంటి యువ రాజకీయ నాయకులు… కార్పొరేట్ వెల్ ఫేర్ ను నిషేధించి, యూనివర్సిటీ చదువు వరకు అందరికీ ఉచితంగా విద్య అందించాలని కోరుతున్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా కార్పొరేట్ల ను అదుపు చేయాల్సిన సమయం వచ్చింది.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

9 comments

 • కవితా సంపుటాలని పుస్తక విక్రేతలు అమ్మకానికి పెట్టడం లేదట.ఎవరూ కొననిదే వాళ్ళైనా ఏం చేస్తారు మరి.పుస్తకం వెలలో సగం డబ్బు ఇచ్చినా కానీ .ఐతే ఆ విధంగా అమెజాన్ మంచిపని చేసింది.

  ఇక అందులో పనిచేసే కార్మికులంటారా……
  భావజాలాల ముగింపు దశలోనో లేదా ముగిసిన ఈ దశలో ఎవరి ఆక్రందన వాళ్ళే వినిపించుకోవాలి.
  అమెజాన్ కి అభినందనలు.

 • చాల బాగా చెప్పారీ జయమాడంగారు . మాడర్న్ టైమ్స్ కళ్లలో చూపారు.

 • అమానుషం. మంచి వ్యాసానికి అభినందనలు

 • అన్ని దేశాల లోనూ నిరుద్యోగం ఒకేలాగా ఉండదు. పైగా కార్పొరేట్ వ్యవస్థ, ప్రైవేటైజేషన్ అనే విధాన నిర్ణయాలను తొలగించకుండా, అంటే విధానపరమైన మార్పులు చేయకుండా కేవలం ఒక సంస్థ ను ఆపెయ్యడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.

  వినియోగదారులు బైట రిటైల్ ధరల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతున్న సందర్భంలో ఇదేలా వుంటుందో ప్రశ్నార్థకం కాదా?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.