నవ్వించే మాట విజయానికి బాట

‘ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, చాల పని భారం ఉన్నా చక్కగా నవ్వగలిగే ఉద్యోగి ఆరోగ్యవంతుడే కాదు; దీర్ఘకాలంలో ఎంతో ఉత్పాదకత, పనితనాన్ని కూడా చూపిస్తాడు. ‘

-రండాల్ ఒస్బోర్నే

సైకాలజీ ప్రొఫెసర్  

జీవితంలో తమదైన విజయం సాధించడానికి, తాము అనుకున్న విజయ తీరాలు చేరడానికి, తాము నిర్వచించుకున్న సాఫల్య శిఖరాలు అధిరోహించడానికి ఎవరి మెట్లు వారు వేసుకోవాల్సిందే! ఎవరి నిచ్చెనలు వారు తయారు చేసుకోవలసిందే! వైరుధ్యాల సముద్రంలాంటి సమాజంలో, ఏ నిర్ణయంతో విజయానికి మనం  దగ్గరవుతామో తెలియని అయోమయంలో, మన గురించి మనకే తెలియని సందిగ్ధంలో, మన ఆత్మ శక్తి మనకే తెలియని అవగాహనా రాహిత్యంలో, నిత్య సంఘర్షణల్లో… ఒకింత హాస్య చతురత మనల్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. సమయోచిత స్పందన, సరస సంభాషణ, సమయ స్ఫూర్తి లక్ష్య సిద్ధికి, లక్ష్య శుద్ధికి దోహదం చేస్తాయి. సమయ స్ఫూర్తితో స్పందించే లక్షణం లక్ష్యం వైపు మన సుదీర్ఘ ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. మాటలు తూటాల్లా కాకుండా, మల్లెల్లా వాక్యాల్లో పేర్చి వదిలితే ప్రపంచమంతా మీతో స్నేహానికి అర్రులు చాస్తుంది. పని చేసే ప్రదేశంలో సంభాషణా చాతుర్యం మిమ్మల్ని  స్నేహితులలో, సహోద్యోగులలో, సమాన స్థాయిగల వారిలో హాట్ ఫేవరేట్ గా చేస్తుంది. ఇదంతా అసంభవమేమీ కాదు. క్షణ క్షణం తీవ్రమవుతున్న పోటీ ప్రపంచంలో మాటే విజయానికి రాచబాట. మీ మాటల్లో తొంగి చూసే హాస్య చతురత మీ ఉద్యోగంలో సఫలతకు చక్కని జత అవుతుంది. మనం మాట్లాడే మాటకు అంతగా విలువ ఇవ్వం. మాటలను తేలికగా వాడతాం. ఎదుటివారు కూడా మన మాటలను తేలికగా తీసుకుంటారని భావిస్తాము. ఎదుటివారిని మన మాటలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయన్న అంశాన్ని మనం పట్టించుకోం. మీ వైఫల్యంలో, మీరు ఉపయోగించే మాటల పాత్ర అంచనాలకు మించి ఉంటుంది.

ప్రపంచంలో సాఫల్య శిఖరాలు అధిరోహించిన వారిని గమనిస్తే, 90 శాతం మంది తమ మాటలను  ఆయుధాలుగా చేసుకుని కొన్ని తరాలను ప్రభావితం చేశారు. ప్రముఖ కవి ఆరుద్ర బాపు బొమ్మల గురించి చెబుతూ ‘కొంటె బొమ్మల బాపు; కొన్ని తరముల సేపు; గుండె ఊయల లూపు; ఓ కూనలమ్మ’ అంటారు. ఈ కూనలమ్మ పదాన్నే మనం ‘కొంటె మాటల ఊట, చాల గెలుపుల కోట, బతుకు పూవుల బాట; ఓ కూనలమ్మ’ అని పాడుకోవచ్చు. మాట మనిషికి చిరునామా. మాట మనిషిని పట్టిస్తుంది. అన్నం అంతా  చూడక్కరలేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే ఒక మనిషి ఉపన్యాసాలు వినక్కరలేదు. ఒక్క మాట వింటే చాలు. వ్యక్తిత్వం, వ్యక్తి తత్త్వం తెలిసిపోతుంది. మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రు, విన్స్టన్ చర్చిల్, అడాల్ఫ్ హిట్లర్, మార్క్ ట్వెయిన్ – ఇంకా ఎందరో కొన్ని తరాలను మంచికో చెడుకో ప్రభావితం చేసి, చరిత్ర మీద చెరగని ముద్ర వేశారు. వారు తమ ఉపన్యాసాలను అరుదైన పదాలతో పేర్చి, సందర్భ శుద్ధితో, లక్ష్య శుద్ధితో అశేష ప్రజానీకాన్ని ఆకర్షించారు.

ఒకసారి విన్స్టన్ చర్చిల్ పార్లమెంటులో మాట్లాడుతూ ‘పార్లమెంటులో సగం మంది సభ్యులు మూర్ఖులు’ అన్నాడు. ఈ మాటలకు పార్లమెంటు సభ్యులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చిల్ మాత్రం ఎంతో ప్రశాంతంగా లేచి నిలబడి  ‘నేనూ అంగీకరిస్తున్నాను. పార్లమెంటులో సగం మంది మూర్ఖులు కారు’ అని కూర్చున్నాడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఎంతో తెలివిగా చెప్పకనే చెప్పాడు చర్చిల్. మాటలకు పంచదార పూతలా, హాస్య చాతుర్యాన్ని రంగరించి తాను చెప్పదలచుకున్నది మాత్రం చెప్పేశాడు చర్చిల్.  

ఒకసారి మార్క్ ట్వెయిన్ తన ఉపన్యాస యాత్రల్లో భాగంగా ఒక ఊరికెళ్ళాడు. ఉదయాన్నే గడ్డం చేయించుకోవడానికి క్షురకుడి దగ్గరికి వెళ్ళాడు. ‘మీరు ఊరికి కొత్తలా ఉన్నారు. మార్క్ ట్వెయిన్ ఉపన్యాసం వినడానికి వచ్చారా ఏమిటి?’ అని అడిగాడతడు. ‘అవును ఏం?’ అన్నాడు మార్క్ ట్వెయిన్. ‘టిక్కెట్లన్నీ అయిపోయాయి. మీరు నిలబడి వినాల్సిందే’ అన్నాడతడు. ‘అవును, వాడు మాట్లాడేటప్పుడు నేనెప్పుడూ నిలబడి వినాల్సిందే’ అన్నాడు మార్క్ ట్వెయిన్ నిట్టూరుస్తూ.

ఐన్స్టీన్ ని అందరూ  అతని సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించమని అడిగేవారట. ‘నీ చేతిని ఒక వేడి స్టవ్ మీద పెట్టు. ఒక గంట పెట్టినట్టు అనిపిస్తుంది. అదే ఒక అందమైన అమ్మాయితో ఒక గంట గడిపితే, ఒక నిముషంలా అనిపిస్తుంది’ అని సమాధానమిచ్చాడు ఐన్స్టీన్.

    ‘జీవితంలో హాస్య చతురత ఉండాలంటారా?’ అని ఎవరో గాంధీజీని అడిగారు. ‘ఆ హాస్యప్రియత్వమే లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకునే వాణ్ణి’ అన్నారు గాంధీజీ.

భావ వ్యక్తీకరణలో సమయోచితంగా హాస్యాన్ని పంచితే మిత్రుల మధ్య మీరు సూపర్ హిట్. ప్రతి విషయాన్ని సీరియస్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియస్ విషయాలను కూడా అందరికీ అర్ధమయ్యేలా హాస్యంతో జోడించి చెప్పడం అపురూపమైన కళ. చార్లీ చాప్లిన్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా ఈ కళను తన చిత్రాల్లో ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎదుటివారిని బాధపెట్టకుండా ఒక విషయాన్ని చెప్పడానికి హాస్యాన్ని రక్షణ కవచంలా ఉపయోగించడం అభ్యసించాలి.  

ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలలో, కార్యాలయాల్లో కూడా ‘చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్’ అనే పదవి సృష్టించారు. ఈ ఆఫీసర్ పని ఉద్యోగులందరినీ సంతోషంగా ఉంచడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం. తన బృందంతో కలసి ఉద్యోగులకు మధ్యాహ్న భోజన సమయంలో జోకులు చెప్పడం, చిన్న చిన్న హాస్య నాటికలు ప్రదర్శించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ఇతని పని. అంతెందుకు? మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘సంతోష మంత్రిత్వ శాఖ’ ను ప్రకటించింది. వివిధ శాఖలతో, సమన్వయం చేస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా లేదా, వారి సంతోషానికి మరింతగా ఏం చేయాలి అన్న విషయాలలో  ఈ మంత్రిత్వ శాఖ సలహాలిస్తుంది. పర్యవేక్షిస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలి అన్న విషయంలో ప్రజలకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పించడం కూడా ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలలో ముఖ్యమైనది. మరి ప్రజలకు చేసిన వాగ్దానాలు మర్చిపోవడానికి మైకుల్లో జోకులు వినిపిస్తారా అన్న విషయం మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయలేదు.

‘సంతోషం సగం బలం’, ‘ఎదుటివారి సంతోషం అందరికీ బలం’ అని తెలుసుకోవాలి.  మన చుట్టూ ఉన్నవారిని మన హాస్య ప్రియత్వంతో, సంభాషణా చాతురితో సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తే, మనం కూడా సంతోషంగా ఉంటాం. ‘ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్’  అంటారు గురజాడ. హాస్య ప్రియత్వమే లేకపోతే సమాజం నీరసంగా తయారవుతుంది. సరసం లేని జీవితం విరసానికి విత్తనమవుతుంది. విసుగు పుట్టిస్తుంది. విసుగుకు విసుగు పుట్టించాలంటే ఒకింత హాస్యప్రియత్వమే అసలైన ఔషధం.    

మీరు మేనేజర్ అయినా, బాస్ అయినా, సహచరుడైనా, సహోద్యోగి అయినా, ధనికుడైనా, పేదవాడైనా అయినా ఎదుటివారిని ఆకర్షించి మీ పనులు జరిపించుకోవడానికి హాస్యప్రియత్వం అద్భుతమైన ఆయుధం, విజయ సాధనం. మీరు చెప్పే విషయాన్ని ఎదుటివారు ఆసక్తిగా వినాలంటే ఎంత సీరియస్ విషయమైనా మంచి ముచ్చటలా చెప్పాలి. అందరినీ నవ్వించాలి. నవ్వుతూ బతకాలి. నవ్వుల పాలు కాకూడదు. ఎదుటివారి ఇబ్బందుల లోంచి, అంగ వైకల్యంలోంచి హాస్యాన్ని సృష్టించ కూడదు. మీ సునిశిత, సున్నిత  హాస్య ప్రియత్వం మీ నాయకత్వ లక్షణాలకు వన్నె తెస్తుంది. మీ బృందం మీ మాటలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చెప్పిన పని చేయడానికి ఆనందంగా, సిద్ధంగా ఉంటుంది. హాస్యానంద సిద్ధిరస్తు!

***

 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.